విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 27
తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగులో మొదటి స్వీయచరిత్ర, తొలి సాంఘిక నవల, తొలి ప్రహసనం నడిపిన ఆదర్శ అభ్యుదయ పురుషుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి పిల్లలకు పాఠాలతోపాటు సాంఘిక దురాచారాల పట్ల అవగాహన కల్పించి, భావిభారత ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దిన అభ్యుదయ వాది కందుకూరి. సంఘాన్ని ఉద్దరించడానికి సాహిత్యాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకుని వివేకవర్ధిని పత్రికను స్థాపించి దాని ద్వారా ప్రభుత్వ లంచగొండి తనం, సామాజిక దురాచారాలైనటువంటి బాల్య వివాహం, వేశ్యావృత్తి వంటి వాటిని దుయ్యబట్టి వాటి నిర్మూలన సాధించాడీయన. స్త్రీ విద్యకై ఉద్యమించి బాలబాలికల కొరకు సహవిద్య విధానంతో పాఠశాలలు స్థాపించి, నడిపించాడు. ఆనాడే అన్ని కులాలవారి కొరకు పాఠశాలలు స్థాపించి, వాటిలో ఉచిత విద్యా విధానాన్ని ప్రారంభించిన లౌకికవాది వీరేశలింగం పంతులు. హితకారిణి అనే సామాజిక ధర్మ సంస్థను స్థాపించి దానికి తన యావదాస్తినీ దానం చేసిన అపర దానకర్ణుడు వీరేశలింగం. వ్యావహారిక భాషలో రచన సాగించిన ప్రముఖులలో వీరేశలింగం ఒకడు. తెలుగులో 130 పైగా గ్రంథాలు, 190 వ్యాసాలు, నీతికథామంజరి అనే 158 చిన్న కథా సంకలనము, బడిపిల్లలకు వాచకాలు రచించాడు. ఈయన రచనలలో రాజశేఖర చరిత్రము అనే తొలి సాంఘిక నవల ప్రముఖమైనది. రచయిత, పాత్రికేయుడు, అభినవాంధ్ర సాహిత్య బ్రహ్మశ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు నేటికీ మన ధృవతార.
( కందుకూరి వీరేశలింగం జన్మదినం 16 ఏప్రిల్ 1848)