విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 28
యావత్ భారతదేశం గర్వించదగిన కన్నడ సినీ నటుడు రాజ్ కుమార్ అసలు పేరు ముత్తురాజు, తన 8వ ఏటనే రంగస్థల నటుడైన తండ్రి దగ్గర నటనలో, గాత్రంలో ఓనమాలు దిద్దుకుని అచిర కాలంలోనే కన్నడ సినిమాకు క్రొత్త సొబగులద్దే స్థాయికి ఎదిగాడు. కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఇంటా ఓ దైవంగా కొలవబడే రాజ్ కుమార్‌ను అందరూ ఆప్యాయంగా ‘అన్నవరు’ అంటూ ఓ అన్నలా గౌరవిస్తారు. కాళహస్తి మహాత్యం అనే ఒకే ఒక్క తెలుగు సినిమా తప్ప 200కు పైగా కేవలం కన్నడ సినిమా లలోనే నటించిన ఏకైక మాతృభాషాభిమాని రాజ్ కుమార్. బెదరకన్నప్ప అనే తన తొలి సినిమాతోనే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించాడీ దాదా ఫాల్కే అవార్డు గ్రహీత. వజేశ్వరి ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి దాక్షాయణి కంబైన్స్ బేనర్ పేరిట కవిరత్న కాళిదాసు, శంకర గురు, శబ్దవేది వంటి సినిమాలలో నటించి నిర్మించాడు. ఒకే ఒక్క సంవత్సరంలో 14 సినిమాలలో రెండు పర్యాయాలు నటించిన మేటి నటరాజు రాజ్ కుమార్, జీవనచైత్ర అనే సినిమాలో రాజ్ కుమార్ పాడిన నాద మయ అనే పాట జాతీయ అవార్డు అందుకొన్నది. తన అద్వితీయ నటనతో 95 శాతం విజయాలను చవిచూసిన భారతీయ నటులలో ద్వితీయ నటుడు రాజకుమార్ స్ఫురద్రూపి, కన్నడ ప్రజానీకానికి అపరదైవమైన కర్ణాటక రత్న, కన్నడ కంఠీరవ, పద్మభూషణ్ డా॥ రాజ్ కుమార్ నేటికీ మన ధృవతార!
( రాజ్ కుమార్ జన్మదినం 24 ఏప్రిల్ 1929)