గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!

రంగస్థల దర్పణం – 3

కన్యాశుల్కం నాటకసాహిత్యములోను, ప్రయోగములోను వివాదాస్పద విషయాలలో “గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!” అనేదొక అతిముఖ్యమైన విషయం. కథానాయకుడన్నవారూ వున్నారు. ప్రతినాయకుడన్న వారూ వున్నారు. ఐతే దీనికిగల ప్రధాన కారణం – ‘గిరీశం కథానాయకుడనో లేక ప్రతినాయకుడనో’ అని రచయిత ఆధారాలు స్పష్టంగా ఇచ్చిన దాఖలాలు లేవు. ఫలితంగా గత శతాబ్దకాలముగ పలువురు చదువరులు, వీక్షకులు, విమర్శకులు, ప్రయోక్తలు తాము దర్శించిన కోణంలోనే తమ బుద్ధికి తోచిన అభిప్రాయాన్ని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చిరపరచిత వైయక్తికకోణంలోనే కాక దానికి వస్తుగత, చారిత్రక కోణములను జత పర్చి గిరీశం స్వరూప స్వభావాలను విశ్లేషించుకుంటూ అతనెవరో నిర్ధారించే ప్రయత్నం చేద్దాం.

గిరీశం అప్పుడే సమాజంలో పుట్టి పెరుగుతున్న ఆధునిక ఆషాడభూతులకు విత్తనరూపము. ‘అపర్ట్యునిస్ట్’కి అచ్చమైన తెలుగు నుడికారమే ‘ఆషాడభూతి’ అన్నమాట. ఐతే కన్యాశుల్కంలోని గిరీశం, రావప్పపంతులులా కాలం చెల్లిపోతున్న అవకాశవాది కాడు. రావప్పపంతులు పోయేకాలం అవకాశవాదయితే – గిరీశం వచ్చేకాలం అవకాశవాది. ఆధునిక మార్కెట్ జీవితం ఎన్ని విధాల, ఎన్ని రూపాల ‘రూపాంతరం’ చెందగలుగుతుందో అన్ని రూపాంతరాలు చెంది – చుట్టూ వున్న ప్రజలను, ప్రపంచాన్ని నమ్మించి మోసం చేయగల వంచానాశిల్పాన్ని గిరీశం ఆమూలాగ్రం వంటపట్టించుకున్నవాడు. అంచేత ‘అమ్మడం – కొనడం’ అన్న ఆధునిక వ్యాపారపునాదిమీద మానవజీవితం కొనసాగుతున్నంత కాలం గిరీశానిది వచ్చేకాలమే. వాడి కత్తికి ఎదురులేదు. అంటే కత్తిలాంటి వాడి బుద్ధికి ఎదురులేదుగాక లేదు. ఈ ‘విత్తన’ రూపాన్నే గురజాడవారు ‘గిర్రడు’ అనబడే గిరీశంగ చిత్రించారు. ఇంకా చెప్పాలంటే అత్యంత ఆకర్షణీయమైన, మంచితనమనే మేలిరూపంలో వంచనామయమైన ‘తత్త్వసారాన్ని’ నింపి ఆ పాత్రను రూపొందించారు. అయితే ఆ పాత్ర విత్తనరూపంలో సహజంగా వుండే ‘అమాయకత్వాన్ని చూసి సాహిత్యాన్ని జీవితాన్ని తరిచి చూసిన మేధావులే భ్రమసి వాడి మాయలోపడి మోసపోయారు. సమయానికి మధురవాణి సాయమంది సౌజన్యరావు – ఆ మధురవాణిని, ఈ సౌజన్యరావుని సృష్టించి చివరకి ‘చెడులో వున్న మంచిని – మంచిలో వున్న చెడుని’ కళ్లకు కట్టించిన గురజాడ అప్పారావూ మోసపోనందుకు కవిగా (రచయితగా) గురజాడ మేధో చైతన్యానికి తెలుగుజాతి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంక భ్రమసి మోసపోయిన సాహితీవేత్తలు, నటప్రయోక్తలు గిరీశంపట్ల తీసుకున్న వైఖరి గిరీశాన్ని కథానాయకుడిగా భావించేందుకు దోహదపడింది. ఇందుకు ప్రధానంగా రెండు కోణాల్లో ఉదాహరణలు పరిశీలిస్తే చాలు.

తొలుత సాహితీ విమర్శకుల దృష్టిని పరిశీలిద్దాం- ప్రముఖ సాహితీవేత్త ఆర్.యస్.సుదర్శనం ‘గిరీశం పారిస్ విప్లవం నుండి పుట్టిన స్వేచ్ఛ’కి ప్రతీకగ భావించారు. ఈ భావనతో ఏకీభవించే సాహితీ విమర్శకులూ చాలామంది వున్నారు. ఐతే చారిత్రక దృక్కోణం, వస్తుగత కోణంలనుంచి చూస్తే ఈ భావన అర్ధసత్యమనే విషయం మనకు స్పష్టంగ అవగతమవుతుంది. ఎలాగో విశ్లేషించుకుందాం – గిరీశాన్ని స్వేచ్ఛకి ప్రతీకగా భావిస్తున్న వారందరూ చారిత్రకంగా చూడలేకపోతున్నది ఏమిటంటే – పారిస్ విప్లవానికి నేతృత్వ మొహించిన బూర్జువావర్గం ప్రతిపా దించిన ‘స్వేచ్ఛా-సమానత్వ-సౌభ్రాత్రుత్వాల్లో రానురాను ప్రపంచ కార్మికవర్గం పుట్టి పెరిగే క్రమంలో- స్వేచ్ఛని మార్కెట్ కి తగలించి, సమానత్వ, సౌభ్రాత్రుత్వాల్ని పూర్తిగా విస్మరించినది. ఇది ప్రపంచ బూర్జువా – ధనికవర్గ స్వభావంలో అవాంఛనీయమైన, అసంగతమైన మార్పుల్ని తెచ్చింది. ఆ స్వభావానికి ‘దాసోహం’ అంటూ వలసల్లో పెరుగుతున్న పెట్టుబడివర్గానికి అనివార్యంగా దళారీతత్తమబ్బుతోంది. ఈ విషయాన్ని వందేళ్లకి ముందే ‘విత్తన దశ’ లోనే మనగురజాడ గుర్తించగల్గినారు. ఊడలు దిగుతున్న కాలంలో వందేళ్ల తరువాతకూడా మనలో అత్యధికులు గుర్తించలేకపోవటమనేది నిజంగా విషాదమే.

పుట్టిన వెంటనే ఈ చరాచరాజగత్తులో ‘గాడిదపిల్ల కోమలం’ అన్న సామెత చందాన ఏ ప్రాణిఐనా అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది. ఇక విత్తన దశలో వున్న ఈ తత్త్వం యొక్క సారంలో ప్రమాదం దాగివున్నా, రూపంలో ఎంత అందంగా ఆకర్షణీయంగా వుంటుందో అదంతా గిరీశం పాత్ర చిత్రణలోకి వచ్చేసరికి విజ్ఞులుకూడా వివసులై దాని మోహంలో పడిపోతున్నారు. ఇదో చిరు విషాదం. ఇక రెండో ఉదాహరణ నటప్రయోక్తల పరంగా చూద్దాం. కన్యాశుల్కాన్ని తరచి చూచిన నటప్రయోక్త శ్రీనివాస చక్రవర్తి’ గిరీశంలోని దుర్లక్షణాన్ని గుర్తించాడు. కాని వాళ్ల వీళ్ల కొంపలార్పి మేడలు మిద్దెలు కట్టే ఆలోచన అతనిలో వున్నట్లు కనబడ లేదన్నారు. ఈ పాత్రలో కీలకాంశం ‘సగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’ అన్నారు. గిరీశంను బపూన్ కిందో, రోగ్ కిందో జమ కట్టేస్తే ‘అప్పారావు’గారి ఆశయమే దెబ్బతిని – ఆ పాత్ర బజారుమనిషియి పోయే ప్రమాదం వుందన్నారు’. ఇక గిరీశం పాత్రపోషణలో అపార అనుభవంకల్గి అద్వితీయ పతిభాప్రదర్శనం చేసినవారిలో అత్యంత లబ్దప్రతిష్ఠులగు ‘డ గోవిందరాజుల సుబ్బారావు’ ఒకానొక సందర్భంలో గిరీశం పాత్ర గురించి పేర్కొన్న వ్యాసంలో ‘మొదట్లో గిరీశం బొంకులదిబ్బ మీద ప్రవేశించి – ‘సాయం కాలమైంది’ అన్న స్వగతంతో ఉపక్రమించేవరకు ఒకరకం వ్యక్తి – దాని తరువాత మరొకరకం వ్యక్తి – కేవలం చట్కారీగా తిరిగే సోమరి మాత్రంగాడు ఎప్పటికి కూడా – ఒక దారితప్పిన యువకుడిగాను అందువల్ల తెలివితేటలన్నిటిన్నీ స్వప్రయోజనానికి ఉపయోగించుకునే ఒక వ్యక్తి అని మొదట్నించీ నావుద్దేశ్యం. ఇక అవ్యక్తమో లేక సువ్యక్తమో అయిన గమ్య స్థానం చేరాలని జీవితాన్ని అటూ ఇటూ పసగలిపి నెట్టుకొస్తున్నాడు’ అని ఆద్యంతం ఆపాత్ర మార్చిన రంగుల్ని నిశితంగా, వివరంగా విశ్లేషించి మరీ చూపించారు. గిరీశం పాత్ర పరిశీలనకు సంబంధించి నటప్రయోక్తలు, విమర్శకులు ఒకటికి వందసార్లు అధ్యయనం చేయాల్సిన వ్యాసమది.

ఐతే శ్రీనివాసచక్రవర్తిగారి వ్యాసంగాని -డా. గోవిందరాజులగారి వ్యాసంగాని కేవలం వైయక్తికకోణం మాత్రమేనని మనమే దశలోనూ మర్చిపోరాదు. కనుక ఇదే పరిశీలనకు వస్తుగత -చారిత్రక కోణములుకూడా జతపరిచి చూడగల్గితేనే గిరీశం పాత్ర చిత్రణ సంపూర్ణంగా స్ఫూరిస్తుంది. ఎందుకంటే గురజాడవారు ఈ నాటకాన్ని బుర్జువా – ధనికవర్గ దృక్పథం నుంచి రాసినా దానికి మరింత నిశతమైన చూపుని జోడించగల చారిత్రక దృక్కోణాన్ని జోడించి రాశారు. కాబట్టి రచయితగా గురజాడ విశిష్ట దృక్పథాన్ని వీక్షించలేనివారు వీక్షించదల్చు కోనివారు కేవలం వైయక్తిక కోణంనకు పరిమితమై ఎంత పరిశీలించినా అర్థ సత్యాన్నే చూడగల్గుతున్నారుగానీ సంపూర్ణ సత్యాన్ని దర్శించలేకపోతున్నారు. అంతేకాదు చూసిచెబుతున్న వారి వాదాన్ని ఆమోదించలేకపోతు న్నారు. ఇక్కడ సంపూర్ణ సత్యమంటే నిశ్చల నిశ్చితమైనది కాదు. నిరంతర చలనశీలమైనదని మనం గ్రహించాలి. కనుక ‘సంపూర్ణ సత్యం’ దర్శించే దిశలో శ్రీనివాసచక్రవర్తి, డా. గోవిందరాజులగార్ల పరిశీలనకి వస్తుగత – చారిత్రక దృక్కోణాల్ని జోడించి చూస్తే – నాటకప్రారంభంలో బొంకులదిబ్బమీద ప్రవేశించి ‘సాయం కాలమైంది” అనే నాటక నాంది వాక్యం పలికిన గిరీశం ఏ రంగూ రుచి, వాసన వ్యక్తం కాని వ్యక్తి. అయితే అతనామాట అంటున్నప్పుడు వెనకున్న శిధిలమైన కోటని జత చేసుకుని ఆలోచిస్తే ‘కాలసూచన’తోపాటు రాచరికానికి సాయంకాలమైందని – మరో నూతన జీవనవిధానానికి ఉదయం కాబోతున్నదనే సత్యమవగతమౌతుంది. ఇలా వ్యాఖ్యాతగా తనను పరిచయం చేసూకంటూ కన్పించిన గిరీశం తుది సన్నివేశములో తన నైజం ప్రజాస్వామ్యానికి ప్రతీకయైన ‘సౌజన్యరావు పంతులు’ ముందు ‘మధురవాణి’ ద్వారా బట్టబయలు కావటముతో ‘డామిట్ కథ అడ్డంగా తిరిగింది’ అంటూ నాటకానికి భరతవాక్యం పలుకూతూ తన స్వరూప – స్వభావాల గురించి ఎడతెగని చర్చలకు ఆస్కారమిస్తూ నిష్క్రమిస్తాడు. ప్రాక్-పశ్చిమ నాటక రచనా నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన గురజాడవారు పాత్రల స్వభావ చిత్రణకి స్వగతాల్ని సమర్ధవంతంగా వినియోగిం చుకున్నారు. అక్కడితో ఆగకుండా సంవిధానం – పాత్రల సంభాషణలలో కూడా స్వభావ వ్యక్తీకరణకు సంబంధించి ‘క్లూస్’ని నేరుగా క్రమానుగతంగా, సందర్భానుసారంగా కొండుకచో ప్రతీకాత్మకంగా వెదజల్లుతూ వచ్చారు. గిరీశం తన స్వభావాన్ని చాలావరకు తొలి స్వగతంలో తానే బయట పెట్టుకున్నాడు అంటే- గోవిందరాజులవారి దారి తప్పిన యువకుడు అన్నది స్పష్టమైపోతుంది. అక్కణ్ణించి ఆరంగం చివరిదాకా అతగాడు మార్చిన రంగు మార్చకుండా మార్చిన రంగులు చిన్నా, పెద్దా అందరినీ మోసం చేసినట్టు తెలియకుండా మోసం చేయగల వంచనా శిల్పనైపుణ్యం అతని సొంతమని నిరూపితమైపోయింది. ఈ రంగం ముగిసేముందు ‘మేక్ హే వైల్ ది సన్ షైన్స్’ అంటూ గిరీశం చెప్పిన మాట అంటే సమాజంలో అప్పుడే రూపొందుతున్న ‘దళారీ ధనికవర్గ తత్త్వానికి’ తననో ప్రతీకగా ప్రకటించుకున్నాడన్నమాట వ్యాఖ్యాతకూడా ఐనా గిరీశం. ఇక్కడ మనం విశ్లేషించు కోవాల్సిన లోతు ఏమేమిటంటే ” చీలదీసి పాలించాల్సిన అగత్యం వున్న పాలకులకే మోసం చేసే చైతన్యం అబ్బుతుంది. వేల సంవత్సరాలుగ ఆ లౌక్యం ఈ దేశంలో వేళ్లూనుకుని ఆధునిక కాలంలో అది దొరికిన దొంగైపోయింది. ఐతే చీలదీసి పాలించడములో తెలివి మీరిన వలస ప్రభువుల విశ్వవిద్యాలయాల తర్ఫీదులో అది దొరకని దొంగగా రూపాంతరం చెందుతోందని చెప్పకుండా చెప్పించారు గిరీశంచేత’ – గురజాడవారు. ఈ విధంగా గిరీశం కొత్త పాతల ‘కీడు’ కలయికని చెప్పకుండా చెప్పినట్టేగదా.

ఇక నాటకరచనా నైపుణ్యానికి, గిరీశం పాత్ర చిత్రణ కౌశలానికి మలి దృశ్యం ముంజేతికంకణమై నిలుస్తుంది. గురజాడ సంవిధాన వ్యూహ దక్షతకి సాదృశ్య సాక్ష్యాలు గిరీశం మధురవాణులు. గిరీశం స్త్రీ పునర్వివాహ సమస్యని పరిష్కరించే సంస్కర్తగా ‘కృష్ణరాయపుర అగ్రహారం’లో పాగా వేస్తే – మధురవాణి బాల్య వివాహ సమస్య దుర్యవసానాన్ని తెలియజెప్పే సూత్రధారై ‘రామచంద్ర పురం అగ్రహారం’లో అంతర్నాటకంను నడిపించినది. ఇద్దరూ ఆయా పన్లు స్వప్రయోజనం కోసం ఒకరు – పరమార్ధకోసం మరొకరు చేస్తూనే నాటకాన్ని చెరువుగట్టు సీన్ దాకా నడిపించారు. ఇంతవరకు నడిచిన నాటక దృశ్యాల్లో సందర్భానుసారంగా, అవసరానుగుణంగా గిరీశమెత్తిన అవతారాల్లో ‘మధురవాణి ప్రియుడు – వెంకటేశం ట్యూటర్ – బుచ్చిమ్మ లవర్ – అగ్నిహోత్రావధాన్లు లీగల్ ఎడ్వైజర్ – లుబ్ధావధాన్లు తమ్ముడు’ ఇత్యాదులు ఎన్నదగినవిగ నిలుస్తాయి. అయితే అన్నిచోట్ల గిరీశం మార్చిన రంగులు, వేసిన ఎత్తులు, పన్నిన వ్యూహాలు వెతుక్కోన్కర్లేకుండా స్పష్టంగానే కన్పిస్తాయి. అన్నిచోట్ల అతని ప్రధాన ప్రాధాన్యం ధనమేగాని మనస్సుగాదు. ప్రాణం కాదుగాక కాదు. నూతిలో దూకిన వెంకమ్మని రక్షించడంకూడా స్వపయోజన వ్యూహంలో భాగమే. చివరకి విజ్ఞులనుకూడా మాయచేసి సమ్మోహపరిచి బుట్టలో వేసుకోగల్గిన ‘బేరీజు’ సారంకూడా బుచ్చిమ్మ మనస్సుకన్నా అతనికి ధనమే ప్రధానమని నిరూపిస్తుంది. ఇక పెళ్ళికి తరలివెళ్ళే ముందు బుచ్చిమ్మ జీవితానికి – సుబ్బి పెళ్ళికి తెలివిగా లంకె పెట్టి – ఓవిధంగా ‘బ్లాక్ మెయిల్’ చేసి బలవంతంగా తన ప్రయోజనం నెరవేర్చుకునేందుకు కూడా వెనుకాడని మనిషినని నిరూపించుకున్న ‘కుహనాసంస్కర్త’ గిరీశం.

ఇలా రెండు పాయిలుగచీలి అటు గిరీశం- ఇటు మధురవాణి నడిపించగ నడిచిన జీవితం (నాటకం) చెరువుగట్టు చేరేసరికి సమకాలీన సమాజపు జీవితసారాన్ని సూచిస్తూ ముగుస్తుంది. నాటక పరిభాషలో చెప్పాలంటే ఒక క్లయిమాక్స్ కి వచ్చింది. మిగిలిన కథ యాంటీ క్లయిమాక్స్ తో నడిచిముగుస్తుంది. సాధారణ రచనా ప్రయోగ నిర్మాణ సూత్రరీత్యా నాటకమారోహణక్రమంలో నడిచి యాంటీ క్లయిమాక్స్ తరువాత క్లయిమాక్స్ వస్తుంది. కానీ ఇక్కడ ముందు క్లయిమాక్స వచ్చి తరువాత యాంటీ క్లయిమాక్స్ వచ్చింది.

దీనికిగల కారణం కన్యాశుల్కం నాటకంకాదు జీవితం. జీవితంలో కడలికెరటాల్లా ఎన్నో క్లయిమాక్సులూ, యాంటీ క్లయిమాక్సులు వుంటాయి. ఈ చారిత్రక సత్యాన్ని గుర్తించినారు కనకనే గురజాడవారు – ‘పెరిగి విరిగితి విరిగి పెరిగితి – కష్ట సుఖముల పారమెరిగితి’ అన్నారు. అంతేగాదు జీవితమంత నాటకం రాసైనా కష్టసుఖాల పారాన్ని తెలియజేయాలనే తపనతో తన జీవితకాలమంతా పనిచేసి ‘కన్యాశుల్కం’ నాటకం రాశారు. ఈ భావనకూడా మనం దృష్టిలో వుంచుకోవాలి. చెరువుగట్టుదాకా వ్యక్తుల మధ్య సంఘర్షణతో నడిచిన నాటకం. వ్యక్తుల వ్యక్తిత్వాల్లోని వెలుగునీడల్ని – గుణదోషాల్ని – విడదీసి చూపించి ఎవరేమిటో విశ్లేషించింది. వీరందరిలో ఒక్క ‘మధురవాణి’ మినహా మరెవరూ తమని తాము సంస్కరించుకుని మంచికి మారాలనే ప్రయత్నం చేయక పోవడం గమనార్హం. అలాగే మరోవైపు మంచికి మనుషుల్ని మార్చే సంస్కరణాభిలాషిగా తనను తాను ప్రకటించు కుంటూ వస్తున్న గిరీశంలో కుహనాసంస్కర్త లక్షణాలు ప్రస్ఫుటం కావడం కూడా గుర్తించాల్సిన విషయమే. ఇక సంస్కరణ ఉద్యమప్రతినిధి – ప్రజాస్వామ్య ప్రతీకయైన ‘సౌజన్యరావు’ నడిపించిన విశాఖ దృశ్యాల సారాంశ మేమిటంటే ‘మంచికైనా, చెడుకైనా వ్యక్తుల్ని ఎప్పుడూ ప్రభావితం చేసే రాజ్యంగ వ్యవస్థల స్వభావాల్ని కళ్ళుకు కట్టించే ప్రయత్నం చేయడమే’. సౌజన్యరావు, గిరీశంలతో ప్రారంభమైన పతాక సన్నివేశం ప్రారంభమైన కొద్ది సేపటికే ‘కొత్త మనిషి(మధురవాణి)’ రాగానే ‘గిరీశం’ గతుక్కుమని- తన మాస్కు ఎక్కడ జారిపోతుందోనని జడుసుకుని అతితెలివిగా ‘నమస్కారం, మీరు బ్రాహ్మలా అంటే’- ‘కాదు’ అని కొత్త మనిషంటే – ‘అయితే దాసోహమ్ టు ది అన్నోన్’ అని నా గుట్టురట్టు చేయకన్నట్టు ప్రాధేయపడుతూ నిష్క్రమించి – మేలిముసుగులో దాగిన అతనిలోని చెడుని బయట పెట్టి సౌజన్యరావుకి ఆ క్రమంలో ‘ప్రేక్షకులకి – విమర్శకులకి’ మధురవాణి కనువిప్పు కల్గించిన తరువాత పునఃప్రవేశం చేసిన ‘గిరీశం’ పరిస్థితులు ఎదురుతిరగటంతో చేసేదిలేక ‘డామిట్ కథ అడ్డంగా తిరిగింది’ – అంటూ నాటకానికి భరతవాక్యం పలుకుతూ నిష్క్రమించటంతో తెరపడుతుంది. ఏతావాతా ‘చారిత్రక, వస్తుగత కోణములను వైయక్తిక కోణమునకు జతపరిచి చూడగ’ మనకు స్ఫురిస్తున్న సత్యమేమిటంటే ‘గిరీశం’ నాయకుని ముసుగులో వున్న ప్రతినాయకుడు – ప్రతినాయక లక్షణాలు ప్రబలంగా కలిగి వున్న నాయకుడు.
-మన్నె శ్రీనివాసరావు

1 thought on “గిరీశం నాయకుడా ?! ప్రతినాయకుడా ?!

  1. Enjoyed reading it. In fact, it’s very critically analysed to arrive at the conclusion..!! My appreciation to the Writer ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap