మహిళల జీవన నేపథ్యాలే ‘కిషన్’ చిత్రాలు

కప్పరి కిషన్ కుంచె నుండి జాలువారే చిత్రాలు తెలంగాణ జీవితంను ప్రతిబింబిస్తాయి. కిషన్ చిత్ర’కథా రచనలో ప్రధాన భూమికగా తెలంగాణ స్త్రీ గోచరిస్తుంది. హైద్రాబాద్ నగరంలో జన్మించిన కిషన్ చిన్నప్పటి నుంచే అందమైన దృశ్యాలు, చిత్రాలు చూసి చిత్రకళ పట్ల అభిరుచి పెంచుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మ పండుగ, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పండుగలను చూసి చిత్ర రచనకు ప్రేరణ పొందారు. ప్రముఖ చిత్రకారుడు వైకుంఠం తనకు ఆదర్శమంటాడు కిషన్.

తెలంగాణ పడచుల అందాలను గీయటమే కాదు, వాటి వెనుక ఆ మహిళ జీవన నేపథ్యాలను, వాతావరణాన్ని హృద్యంగా, సహజంగా చిత్రించడంలో కిషన్ నేర్పరి. ‘స్టేట్ జవహర్ బాల్ భవన్’లో సీనియర్ ఆర్ట్ టీచర్ ఉద్యోగం చేస్తూ ఎందరో చిన్నారులకు డ్రాయింగ్, పెయింటింగ్ లలో శిక్షణ ఇచ్చి, వారిని అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్లు తెచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

కిషన్ చిత్రాలలో కేవలం తెలంగాణ జీవన నేపథ్యమూ, పల్లెపడుచుల మనోభావాలు, వారి కట్టు బొట్టు, కేశాలంకరణలు… ప్రాకృతిక సౌందర్యం, శాంతి, సామరస్యం పెంపొందించే బుద్ధుని జీవనమూ కన్పిస్తుంది. కిషన్ చిత్రరచనకు ఓ కొత్త మాధ్యమాన్ని, పద్ధతులను ఎంచుకొని చక్కగా ప్రెజెంట్ చేసే చిత్ర కథకుడు కూడా! కొత్తగా చెక్క మీద పెయింటింగ్స్ చేస్తున్నాడు, మామూలుగా చెక్కల పై చిత్రాలు గీయడం కొత్తేమీ కాదు. ఆ చెక్కకు వున్న అన్ని కోణాల్లోనూ (3డి) చిత్రాన్ని చిత్రించడం వీరి ప్రత్యేకత. ఒకే చిత్రాన్ని త్రిడైమన్షన్లో చూడటం ఈ చెక్క చిత్రాల ప్రత్యేకత.

తన చిత్రాలతో స్వదేశంలోని పలు నగరాలలోనే కాకుండా దుబాయి, సింగపూర్, అమెరికా వంటి విదేశాల్లో కూడా పలు ప్రదర్శనలు నిర్వహించాడు. FCCI ఇంటర్నేషనల్ ఆర్ట్ ప్రో- డిల్లీ లో తన చిత్రాలను ప్రదర్శించాడు. 1995లో నేషనల్ ఫెలోషిప్ అవార్డు, తెలుగు యూనివర్సిటి గోల్డ్ మెడల్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ, ప్రతిమ ఆర్ట్ అకాడమీ అవార్డులు అందుకున్నాడు.

-కళాసాగర్ యల్లపు  

 

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link