ప్రతిరోజు మనం చేసే పనులను కర్మలంటారని మనకు తెలుసు.. మంచి కర్మలు సత్ఫలితాలను, చెడు కర్మలు దుష్ఫలితాలను అందిస్తాయని కూడా మనకు తెలుసు.. అయినా సరే మనం అనుకున్న పనినే చేయడానికి ఇష్టపడతాం.. అలాంటప్పుడు వచ్చిన ఫలితాన్ని కూడా స్వీకరించాలి కదా! కానీ సత్ఫలితాలను ఆనందంగా స్వీకరించి, దుష్ఫలితాలను స్వీకరించేటప్పుడు బాధపడుతూ ‘నేనేమి తప్పు చేశానని భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడని’ నిందించడం చేస్తారు.. ఏ జన్మకు సంబంధించిన కర్మ ఫలితాలు ఆ జన్మకే వర్తించవు.. గతజన్మ పాపకర్మలు ఈ జన్మలో శిక్షలు కావచ్చు.. సత్ఫలితాలు లభించినప్పుడు ‘ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో’ అనేమాట ఎవరి నోటా అంత త్వరగా రాదు.
పాపకర్మల ఫలితాలను పొందినప్పుడు గుర్తుకు వచ్చే భగవంతుడు సత్కర్మ ఫలితాలు పొందేటప్పుడు గుర్తుకురాడు.. దుర్మార్గులైన వ్యక్తులు భోగభాగ్యాలతో సుఖంగా ఉండడం కనిపిస్తే ‘ఇంకెక్కడి భగవంతుడు! న్యాయం,ధర్మం లేవు పాపిష్టి వాళ్ళ పనే బాగుంది’ అనేయడం పరిపాటి.. కానీ ఆ ఫలితాలు గత జన్మవని ఎందుకు ఆలోచించరు.. ఒక జీవి యొక్క కర్మ ఫలాలు ఆ జీవి ఎత్తే అన్ని జన్మలకు సర్దుబడి ఉంటుందనేది గ్రహించాలి.. సన్మార్గులకు వెంటనే సుఖాలు కలగాలని, దుర్మార్గులకు తక్షణం శిక్షలు పడిపోవాలని ఆవేశంతో భావించడం సాధారణ మానవుల లక్షణం.
దేవతలు రాక్షసులకు విరివిగా వరాలు ఇవ్వడం, మరలా వారిని అంతం చేసేందుకు అవతారాలు ఎత్తడం జరుగుతుంది.. దీనికి ప్రధాన కారణం వారి భక్తిఫలం.. ఎంతటి పాపాత్ముడైన పవిత్రమైన పుణ్యకర్మ చేశాడంటే అతనికి తప్పక పుణ్యఫలం వచ్చి తీరుతుంది.. అతడు చేసే పాపకర్మలకు తప్పక శిక్ష అనుభవించక తప్పదు.. ఇది భగవంతుడు ఏర్పరిచిన సమన్యాయం.. రాక్షసులు తపస్సుతో సాధించిన పుణ్యఫలం మిగిలి ఉన్నంతవరకు వారు చేసే దుష్కర్మలను భగవంతుడు సాగనిస్తాడు.. ఆ పుణ్యఫలం తరిగిపోయిన మరుక్షణం వారిని కర్మఫలం వెంటాడుతుంది.. అప్పుడు భగవంతుడు ఏదో ఒక అవతారంలో వారికి తగిన శిక్ష విధిస్తాడు.. సృష్టిలో ఇది ఒక సమన్యాయ అద్భుతం.
కర్మఫలం ద్వారా పుణ్యఫలం, పాపఫలం లభిస్తాయి.. కానీ భక్తిఫలం ద్వారా ఎక్కువ శాతం పుణ్యఫలం లభిస్తుందనేది నమ్మకం.. ఈ రెండింటిలో ఉండేటటువంటి కర్మల ఆధారంగానే ఫలం లభిస్తుందనేది వాస్తవం.
ఎన్.బి.యస్. శ్రీనివాస్ పోలిశెట్టి
(9989646639)
