‘కారుమూరి సీతారామయ్య’ ఆత్మకథ

‘ఈ జీవితానికి ఇది చాలు’ అన్న కారుమూరి సీతారామయ్య గారి ‘ఆత్మకథ’ పుస్తకం ద్వారా వారి పరిచయం.

సీతారామయ్య గారు నాటి బాపట్ల తాలూకా పర్చూరు గ్రామంలో 1936లో జన్మించారు. తల్లిదండ్రులు కారుమూరి వెంకయ్య వెంకటమ్మ గార్లు అయితే వీరు పినతల్లి నీలకంఠం మహాలక్ష్మి గారి దత్తపుత్రుడుగా పెరిగారు. ఆమె ఒక కార్మికురాలిగా ఉంటూ ఏ లోటు రాకుండా సీతారామ రామయ్య గారిని పెంచి పెద్ద చేసి చదువులు చదివించి తన మిగిలిన ఆస్తిపాస్తులు సీతారామయ్యగారికే అప్పగించారు. పరుచూరు చీరాలలో వీరి ఉన్నత విద్యాభ్యాసం జరిగింది. కళాశాల విద్యాభ్యాసం ముగిసిన తర్వాత లైబ్రరీ సైన్స్ సర్టిఫికెట్ కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఉద్యమ భాగస్వామ్యం యువజన ఉద్యమాలతో సంబంధం కలిగి కమ్యూనిస్టు భావాలతో ఉండేవారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీస్ కమిషన్ ద్వారా వీరు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రిజిస్ట్రార్ వారి కార్యాలయంలో ఎల్డీసీగా 1959లో ఉద్యోగంలో చేరారు. 1960లో వీరి వివాహం జరిగింది. అమరావతి పుణ్యక్షేత్రంలో అమరావతి గ్రామస్తులు దార్ల నరసింహం అన్నపూర్ణమ్మ గార్ల ప్రథమ పుత్రిక అంజమ్మతో వివాహం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ గా సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసి 1983లో సబ్ రిజిస్ట్రార్ గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 1994 ఏప్రిల్ నెలాఖరులో సత్తెనపల్లిలో ఉద్యోగ విరమణ చేశారు.

చిన్నప్పటి నుంచే కళారంగంతో సంబంధం అనుబంధం కలిగిన వీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఆ ఆసక్తిని వదిలిపెట్టలేదు.1962లో తిరుపతి శ్రీ వేంకటేశ్వర కళాపరిషత్ నిర్వహించిన పోటీల్లో ఉత్తమ నటుడి బహుమతి పొందారు. ఎస్వీ రంగారావు అవార్డు రాజమండ్రి లలిత కళానికేతన్ వారు నిర్వహించిన ఒకేనాటిక పోటీలో పాల్గొని ప్రధమ ప్రదర్శన బహుమతి పొందడం ద్వారా ఆ అవార్డు లభించింది. ఉద్యోగ విరమణ తర్వాత సామాజిక కార్యక్రమాలతో పాటు నాటక రంగంలో గుణనిర్ణేతగా సమర్థవంతంగా వ్యవహరించారు

వీరి రంగస్థలం మిత్రులు ఇప్పుడు మనం చెప్పుకునే చాలా సుప్రసిద్ధ ఆనాటి రంగస్థల కళాకారులు దర్శకులు నటులు ఆ లిస్ట్ చాలా పెద్దది. తాను చూసిన ప్రసిద్ధ నాటకాలు గురించి కూడా ఒక శీర్షికన వివరంగా తెలియజేశారు. తాను చూసిన వాటిలో సృజనాత్మక ప్రదర్శనలుగా ధారా రామనాథ శాస్త్రి నాట్యావధానం డిఎస్ వేణుగోపాల్ పావురం డేగ నృత్యం, నాజర్ బుర్రకథ సంపత్ కుమార్ జాలరి నృత్యం, కోరాడ నరసింహారావు భరతనాట్యం కళా కృష్ణ నృత్యాలు నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రి కోట సచ్చిదానంద శాస్త్రి హరికథ సుత్తి కొడవలి నృత్యం- ఇది ఉంగుటూరు వారి ప్రదర్శన. వెంపటాపు సత్యం ఒగ్గు కథ అమృతయ్య ఏసుదాసుల డప్పు నృత్యం. ఇంకా పలువురు ప్రముఖుల నృత్యాలు నాదస్వర కచేరీలు హరికథ గానాలు కోలాటాలు తోలుబొమ్మలాటలు వీరు వీక్షించడం వీరి కళాభిరుచికి నిదర్శనం. ఇవే వీరికి మిగిలిన తీపి గుర్తులు. ఆనాటి ప్రముఖ రంగస్థలంతో తనకు పరిచయం ఉండడం ఎంతో గర్వంగా భావిస్తారు.

తాను నటించిన కొన్ని నాటకాలు నాటికల విషయానికొస్తే.. అన్నా చెల్లెలు పల్లెపడుచు ఎన్జీవో పునర్జన్మ తెరలో తెర నిజరూపాలు, పోటీ నాటకం, యధా ప్రజా తథా రాజా, ఈ రోడ్డు ఎక్కడికి? లేపాక్షి, భయం దొంగ వీరడు మట్టి బొమ్మలు సంతప్తులు పూల దోసిళ్ళు చిల్లర కొట్టు చిట్టెమ్మ ధర్మకాటా మానవుడు ఉత్తమ పంచాయతీ జాతీయ జ్యోతి కృష్ణదేవరాయలు లోకం పోకడ ఇదేనా లోకం? అల్లరి సూర్యం, గొడ్డకాడ, వాపస్ తుఫాను బంగారు సంకెళ్ళు ఈరోజు బ్రాకెట్, శాంతి (ఇందులో మూకాభినయం చేస్తూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు) నయనదాత (చారిత్రక నాటికలో మహామంత్రి తిమ్మరసు పాత్రను) పోషించారు. రైలు ప్రమాదం ఆడది పెళ్లిచూపులు అక్షింతలు కళాకార్, సాక్షి, విధి వంశం ఉలిపికట్టే సమిధ మానవుడు ఎవరు దొంగ శాంతి సందేశం.. ఇలా ఎన్నో ఎన్నదగిన పాత్రలు పోషించినట్లుగా గుర్తు చేసుకుంటారు. ఒక సందర్భంలో మయసభ ఏకపాత్రాభినయం కూడా చేశారు.

బహుమతులు సత్కారాలు అవార్డులు చాలానే వీరిని వివరించాయి తన జీవితంలో మధురస్మృతులుగా తన 80వ జన్మదినోత్సవ సందర్భంగా “గ్రామీణ నేపథ్యంలో ఆధునిక తెలుగు నాటక రచన” కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్ ద్వారా రచించిన గ్రంథాన్ని ఆవిష్కరించుకోవడం, వీరికి తన సహనటులు పిన్నమనేని పాములయ్య గారు సింధువు నాటికను తనకు అంకితం ఇవ్వడం కూడా మర్చిపోలేని విషయంగా చెప్తారు. పద్మశ్రీ వనజీవి రామయ్య గారి సన్మాన సభకు తనను అధ్యక్షత వహించమని కోరడం కూడా గొప్ప వరంగా గుర్తు చేసుకుంటారు.

సీతారామయ్య గారు అనేక సందర్భాల్లో కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విహారయాత్రలు పుణ్యతీర్ధాలు క్షేత్రాలు దర్శించారు. అలాగే తన నట జీవితంలో ఒక క్షురకుని పాత్ర, అలాగే డప్పు వాద్యకారునిగా వేషం ధరించవలసి వచ్చినప్పుడు ఆ వృత్తిలోని పేరుపొందిన వారి దగ్గర శిక్షణ తీసుకొని సాధన చేసి మరీ ఆయా నాటికలను రక్తి కట్టించారు.

వీరి కళారంగా జీవిత విశేషాలతో కూడిన “కళావని కారుమూరి” అనే పుస్తకాన్ని రచించడం కూడా మరొక తీపి గుర్తు. వీరు నటులే కాదు రచయిత కూడాను. వివిధ పత్రికలకు వ్యాసాలు రాశారు. 1953 లోనే ఉన్నత పాఠశాల విద్యార్థిగా వార్షికోత్సవ వ్యాసరచన పోటీలో ‘ఐక్యరాజ్యసమితి’ వ్యాసానికి ప్రథమ బహుమతిని పొందారు. ఆకాశవాణిలో కూడా 13 వారాలు ప్రసారమైన అల్లూరి సీతారామరాజు ధారావాహికలో పడాల్ పాత్ర పోషించారు.

ఇక తన 80వ ఏట నుంచి ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, తనకు వీలైనంతగా అర్హులకు ఆర్థిక సహాయం కూడా చేస్తూ వస్తున్నారు. ఈ 90 సంవత్సరాల జీవన యాత్రలో 34 సంవత్సరాల ఉద్యోగం, 31 సంవత్సరాల విశ్రాంతి పర్వం ప్రశాంతంగా సాగింది, సాగుతోంది.. అంటూ కళా రంగంలో 1963లో రాజమండ్రి లలిత కళానికేతన్ వారి ఎస్వీ రంగారావు అవార్డుతో మొదలై 2023 శక పురుషుడు ఎన్టీఆర్ రంగస్థలం పురస్కారం వరకు అనేక అవార్డులు రివార్డులు పొందారు 1972లో సింగరాజు నాగభూషణం స్మారక నాటక పోటీల్లో ప్రథముడిగా సన్మానింపబడ్డారు. 2025లో అద్దంకి జానపద కళా పీఠం వారి సన్మానం సత్కారాలు అందుకున్నారు. 1972 లో బాపట్ల నుండి 2017 లో ఖమ్మం జిల్లా చర్ల వరకు అనేక పరిషత్తులలో గుణ నిర్ణేతగా వ్యవహరించారు. 90 సంవత్సరాలు జీవనయానంలో 75 సంవత్సరాలు పాటు కళా రంగ యానం నిర్విఘ్నంగా కొనసాగించారు. ఇప్పుడు ఈ 90వ వేట “కారుమూరి కళా మిత్ర” అనే పేరుతో,15 వేల రూపాయల పురస్కారాన్ని ప్రారంభించారు.

నేను ‘నేడు నిరాశ దురాశలకు దూరంగా సంతృప్తిగా సుఖంగా ఉన్నాను. ఈ జీవితానికి ఇది చాలు” అన్న సంతృప్తికరమైన వ్యాఖ్యలతో ఈ జీవితానికి ఇది చాలు అన్న తన ఆత్మకథని ముగిస్తారు సీతారామయ్య గారు.

ఈ పుస్తకం చివరిలో వారి గత స్మృతులు తీపి గుర్తులు ప్రతిష్టాత్మక సన్మానాలు సత్కారాలు అవార్డుల ఛాయాచిత్రాలు కూడా పొందుపరిచారు.
ఈ పుస్తకం కావలసినవారు సీతారామయ్యగారి ఫోన్ నెంబర్: 9490729268 ని సంప్రదించవచ్చు.

ఈ ఆత్మకథకు సీతారామయ్య గారి సజీవ చిత్రంగా కవర్ పేజ్ చిత్రించారు కళాసాగర్ విజయవాడ.

మల్లేశ్వరరావు ఆకుల
79818 72655

Share via
Copy link
Powered by Social Snap