బాల్యం అందమైన అనుభూతుల నందనవనం, బాల్యాన్ని చక్కటి మార్గ నిర్దేశనంతో నడిపిస్తే నేటి బాలలు రేపటి ఉత్తమ పౌరులుగా నేటి సమాజానికి ఆయువు పట్టుగా మారతారు, ‘బాల్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అస్తవ్యస్తమైన ‘పతంగి దారంలా’ చిక్కుల్లో చిక్కుకొని కృశించిపోతారు’ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులు పిల్లల వద్ద వుండి, మంచి చెడులు చెప్పే తీరిక లేకుండా బీజీబిజీగా తయారై పిల్లల రెక్కల్ని విరిచేస్తున్నారు. ‘స్మార్ట్ఫోన్ మంచికన్నా చెడుకే వినియోగింప పడుతున్నది’ అన్నది నగ్నసత్యం.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బాల్య సాహిత్యకారులు ఆరోగ్య వంతమైన బాల్యం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. అలాంటి ఉత్తమ రచయితల్లో ‘కార్వేటి నగరం కథలు’ పుస్తక రచయిత ఆర్.సి. కృష్ణస్వామిరాజు గారు ప్రముఖులు. సమాజానికి ఉపయోగపడే పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దే క్రమాన్ని చాలా చక్కగా కథల రూపంలో చెప్పడంలో ఆయన నేర్పరి.
రాజు గారు మొత్తం నాలుగు బాలల కథల బొమ్మల పుస్తకాలు వెలువరించారు, ప్రతి పుస్తకం తనదైన శైలిలో విభిన్నమైన శీర్షికతో అలరించడం, చక్కటి సామాజిక స్పృహ కలిగి ఉండటం వీరి ప్రత్యేకత. ఈ పుస్తకం ‘కార్వేటి నగరం కథలు’ బాలలకు ఒక ‘మంచి కానుక’ అని చెప్పవచ్చు, ఈ పుస్తకం చదవడం ద్వారా పిల్లలకు నైతిక విలు వలు, మంచి నడవడిక, అలవాట్లు పెంపొందుతాయి.
దీనిలోని ప్రతి కథ దేనికదే ప్రత్యేకం. ఈ పుస్తకంలోని 30 కథలు పిల్లల వికాసాన్ని పెంచే విశిష్ట భావాలను ప్రతిబింబిస్తాయి, కథలు నవ్వులు పంచడంతో పాటు జ్ఞానాన్ని అందిస్తాయి. పిల్లల్లో సామాజిక స్పృహను పెంపొందిస్తాయి. ఉత్సాహభరితమైన ప్రారంభం, ఆలోచింపజేసే ముగింపు ఈ కథల్లో చూడవచ్చు. తద్వారా పిల్లలు ఆలోచన శక్తిని పెంపొందించుకుంటారు మరియు చక్కటి అలవాట్లను అనుసరిస్తారు.
కథల్లోకి తొంగిచూస్తే ‘గాడిద చూపిన బాట’ అనే కథలో, సృష్టిలో ప్రతి జీవి నుంచి ఎంతో కొంత మనం నేర్చుకోవాల్సిన వుంటుంది అనే సారాన్ని చెబుతూ, యువరాజుకి పర్వతారోహణ శిక్షణ కోసం గాడిద నేర్పరితనాన్ని ఉదాహరణగా చూపిన తీరు ఎంతో హృద్యంగా వుంది.
‘సిసలైన పెళ్ళి కానుక’ కథలో ఆడబిడ్డకి ఆత్మవిశ్వాసం కానుకగా ఇవ్వడంతో పాటు తల్లిదండ్రుల భరోసా కొండంత అండగా నిలుస్తుం దని చక్కగా చెప్పారు. ‘ఆలస్యం ఇడ్లీ అమృతం’ కథలో వ్యాపార నైపుణ్యాలు, వైద్యుల పై నమ్మకం వుండాలని చెప్పే కథ ‘వైద్య పరీక్ష’, చాలా బాగున్నాయి.
కథల్లో జాతీయాలు, చక్కటి ఉదాహరణలతో కథలు నడిపించే తీరు చాలా గొప్పగా వుంటుంది.
‘ఊరి పేరు’ కథలో చమత్కారి అయిన రాజు “మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?” అని అడిగితే “సద్ది కూడు తింటున్నాము మహా రాజా” అంటారు ప్రజలు. అయితే మీ ఊరి పేరు ‘సద్ది కూళ్ళపల్లి’ అని ఊరికి పెట్టడంతో హాస్యాన్ని పండించారు.
విద్యార్థులను ఆలోచింపజేసే కథ ‘ఉప్పు కాగితం’. ఉప్పు కాగి తంతో గీకపడితే కానీ కొయ్యల్లో మెరుపు రాదు, మరియు దానిపైన మురికి పోదు. ‘ఉప్పు కాగితంతో గీకేదెట్లా?’ అని మనం గమ్మున వుంటే మెరుగైన కొయ్యలు తయారు కావు. అలాగే… బాధ భరిస్తేనే, ఆ కష్టం నుంచి ప్రతిభ బయటపడుతుందని చెబుతారు. గురువు కొట్టినా తిట్టినా విద్యార్థుల మంచి కోసమని, భవిష్యత్ ఫలాలు ఆనందిం చేది విద్యార్థులు మాత్రమే అంటూ ఈ కథ ద్వారా చక్కగా తెలిపారు. ‘నడిచే బిడ్డలు పుట్టారు కదా!’ అనే కథలో పిల్లలకు ఉపయోగపడే ‘ఎల్.ఎస్.ఆర్. డబ్ల్యు’ స్కిల్స్ ని చక్కగా తెలిపారు. కథలు మొత్తం రకరకాల సామెతలు, జాతీయాలతో చాలా బాగా సాగుతాయి.
‘చెరపకురా చెడెదవు, చూసే కళ్ళు, తనదాకా వస్తే…, కాకి తెలివి, బల్లి నేర్పిన పాఠం…లాంటి వినూత్నమైన శీర్షికలతో వున్న కథలు పిల్లలకు చాలా ఉపయోగపడతాయి. పిల్లలకు చాలామందికి అన్నం విలువ తెలీదు. అలాంటి అన్నం విలువను తెలియజేసే విధంగా ‘అన్నం మెతుకు’ అనే కథను చక్కగా తీర్చిదిద్దారు.
కార్వేటి నగరం కథలు పిల్లలకు, పెద్దలకు ఆత్మీయ నేస్తాలుగా ఎంతో ఉపయోగకరంగా వున్నాయని తెలియజేయడంలో ఎటువంటి సందేహం లేదు, రచయిత ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు మరెన్నో రాసి బాలలకు బహుమతిగా ఇవ్వాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ మరో మారు రాజు గారికి శుభాకాంక్షలు. ఈ పుస్తకానికి ఇటీవలే శివేగారి దేవమ్మ పురస్కారం లభించింది.
–వినాయకం ప్రకాష్, 8142512219