కోనసీమ ‘కళా ‘ సంక్రాంతి

జనవరి 19న కోనసీమలో కన్నులపండుగా జరుగనున్న కే.సి.పి. మూడవ దశాబ్ది వేడుకలు
భారత చిత్రకళారత్న అవార్డ్ ను (రూ. 25000/-) అందుకోనున్న కొండా శ్రీనివాస్, హైదరాబాద్
మరో 9 మందికి అమరావతి చిత్రకళారత్న (రూ. 10000/-) అవార్డులు

కోనసీమ అనగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తుకు వొచ్చేవి కొబ్బరాకులు. ఆ కొబ్బరాకులతో పరుచుకున్న పూరి గుడిసెలు. దట్టంగా అంతటా పచ్చదనాన్ని నింపుకున్న నిండైన ప్రకృతి., వెండిలా మెరిసిపోయే ఆ చల్లని పండు వెన్నెలలో నిండుగా పరవళ్ళు త్రొక్కే గోదావరి. ఆ ప్రవాహ గోదావరిలో ఉరకలు వేసే పడవ ప్రయాణం. మదినిండా హాయి గొలుపుతూ ఆహ్లాదం కలిగించే చల్ల చల్లని వాతావరణం. కోనసీమ పేరు చెప్పగానే వెంటనే ఎవ్వరికైనా గుర్తుకు వొచ్చేదృశ్య మాలిక ఇది. ఇంతే కాదు కోనసీమ పేరు చెప్పగానే యాదాలాపంగా ఒక వ్యక్తి మరియు సంస్థ పేరు కూడా గుర్తుకొస్తుంది. అదే కోనసీమ చిత్రకళాపరిషత్, దాన్ని మూడు దశాబ్దాలుగా నిర్విరామంగా నిర్వహించే కోరసాల సీతారామస్వామి. ప్రతి ఏటా జనవరి నెలలో అక్కడ ఆయన నిర్వహించే రంగుల పండుగకు రాష్ట్ర వ్యాప్తంగానే గాక దేశ వ్యాప్తంగా వున్న వివిధ కళాకారులు అక్కడకు యేతెంచి వారి యొక్క సృజనాత్మకతకు ప్రతిబింబాలుగా రూపొందిన చిత్రాలతో మూడు దశాబ్దాలుగా ఆయన నిర్వహిస్తున్నరంగుల పండుగ, జాతీయ చిత్రకళా పోటీలు నిజంగా నభూతో నభవిష్యత్ అని చెప్పాలి . ఇప్పటికే 29 వార్షిక పోటీలు నిర్వహించి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నూతన దశాబ్ది ప్రారంభమైన ఈ 2020 జనవరి 19 న అమలాపురంలో నిర్వహించబోతున్న 30 వ వార్షిక పోటీలకు ఆహ్వానం పలుకుతుంది నేడు కోనసీమ చిత్రకళాపరిషత్.

వృత్తి రీత్యా చిత్రకారుడు మరియు చిత్ర కళా ఉపాధ్యాయుడైన కోరసాల సీతారామస్వామి గారి ఆలోచనలకు ప్రతిరూపంగా ఆవిర్భవించిన సంస్థ ఈ కోనసీమ చిత్రకళా పరిషత్. 1989లో చిత్ర కళా ఉపాధ్యాయుడిగా వున్న కాలంలో ఆయన సి.సి. ఆర్.టి. వారి డబ్బై రోజుల పప్పెట్రీ ట్రైనింగ్ నిమిత్తం డిల్లి వెల్లడం జరిగిందని అక్కడ లలితకళా అకాడమి వారు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం, అక్కడ గాలరీలలోని వివిధ ప్రఖ్యాత చిత్రకారుల చిత్ర ప్రదర్శనలు చూసిన తదుపరి తాను కూడా తన జన్మభూమిలో అలాంటి ఒక కళా సంస్థను స్థాపించాలి అనే ఆలోచన తనలో రావడం ద్వారా కోనసీమ చిత్రకళా పరిషత్ కు అక్కడే బీజం పడిందని చెప్తారు శ్రీ కొరసాల. అంతే డిల్లి నుండి వొచ్చిన వెంటనే ఆ ఆలోచనకు కార్య రూపం ఇవ్వడంలో బాగంగా 1989లో ఉగాది రోజున అమలాపురంలో తొలిసారిగా ప్రఖ్యాత చిత్రకారులు కళా విమర్శకులు రాజమండ్రి దామెర్ల రామారావు స్మారక చిత్రకళాశాల ప్రిన్సిపాల్ మరియు తన గురువులలో ఒకరైన కీర్తి శేషులు మాదేటి రాజాజీ గారు, రామచంద్రపురం నందలి ప్రముఖ పారిశ్రామికవేత్త చిత్రకారులు శ్రీ అడ్డూరి పద్మనాభ రాజు గారు, మాజీ లోక్ సభ స్పీకర్ శ్రీ జి ఏం.సి.బాలయోగి, మరియు మాజీ రాష్ట్ర విద్యాశాఖా మంత్రివర్యులు డాక్టర్ మెట్ల సత్యనారాయణ తదితురులు మరియు ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల సమక్షంలో కోనసీమ చిత్రకళా పరిషత్ ను ప్రారంబించి మొదటిసారిగా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి సంస్థకు అంకురార్పణ చేయడంజరిగింది , ఆ తర్వాత దానిని రాష్ట్ర స్థాయికి, ఆపై జాతీయ స్థాయికి పెంచడమే కాకుండా నేడు జరగనున్న మూడవ దశాబ్ది వేడుకలలో దానిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళడం నిజంగా గొప్ప విషయం .

ఒక చిన్న కార్యక్రమ నిర్వాహణకే ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనయ్యే మనము ఎందరో వ్యక్తులు, మరెందరో చిత్రకారులు,శిల్పులు, కళాకారులు కళా విమర్శకులు, ఇంకా ఎంతో మంది సహృదయ కళాస్వాదకులతో ముడి పడి ఉన్న ఈ కార్యక్రమ నిర్వాహణ మరెంత క్లిష్టతరమో ఊహించుకుంటేనే మనకు అర్ధ మౌతుంది. కారణం దేశవ్యాప్తంగా వున్న వివిధ కళాకారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలి, వారి వారి చిత్రాలు పోటీకి ఆహ్వానించాలి. వాటిని జాగ్రత్తగా భద్రపరిచి సరైన కళా న్యాయ నిర్నేతలతో పరిశీలన చేయించాలి. ప్రేక్షకులచే ఎలాంటి విమర్శలు రాకుండా అవార్డులు ప్రకటించి ఆ అవార్డులు కార్యక్రమాన్ని కన్నులపండుగలా ప్రతి ఏటా నిర్వహించాలి. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని క్రమం తప్పకుండ ప్రతిఏటా నిర్వహించడం ఒకఎత్తైతే దానిని అన్నీ తానై దాదాపు ఒకే వ్యక్తి నిర్వహించడం, మరల యే ఏడాది కా యేడాది దానిస్థాయిని విస్త్రుత పరుచుకుంటూ దిగ్విజయంగా సంస్థను ముందుకు తీసుకు వెళ్ళడం అన్నది కేవలం ఆర్ధిక వనరులతోనే ముడిపడి వున్న సమస్య కాదు. దానికి ఎంతో తపన కళారాదన పట్ల భక్తి, విశ్వాసం, నిర్వాహణపై గొప్ప అవగాహన మరియు ఎంతో ఓపిక మొదలైన వాటితో ముడిపడి వున్నటువంటి సమస్య. ఇవన్ని ఆ వ్యక్తిలో వున్నవి కనుకనే కోనసీమ చిత్రకళా పరిషద్ ను దిగ్విజయంగా మూడవ దశాబ్ది వైపు నడిపించగలుగుతున్నారు. అలాంటి గొప్ప కళాకారుడు కార్యనివాహణాదక్షుడే ఈ కళాపరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ కోరసాల సీతారామ స్వామీ గారు.
నేడు కోనసీమ చిత్రకళా పరిషత్ నుండి అవార్డ్ తీసుకోని చిత్రకారుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉండడు అని చెప్పినా అతిశయోక్తి కాదని అనిపిస్తుంది. అంతలా ఈ సంస్థ ప్రతి ఏటా కళాకారులను ప్రోత్సహించి వారిని సముచితరీతిలో సన్మానించడం గొప్ప విశేషం.నేడు రాష్ట్రంలోనే గాక జాతీయ స్థాయిలో ప్రముఖ చిత్రకారులుగా పేరు గడించిన తోటవైకుంటం గారు గాని లక్స్మాగౌడ్, పి టి రెడ్డి, కొండపల్లి శేషగిరిరావు, బి ఏ రెడ్డి,సుభాష్ బాబు,కాపు రాజయ్య,ఉదయ్ కుమార్, గిరిధర్ గౌడ్ , ఇంకా ఈ సంస్థ నుండి తొలి బంగారు పథకం అందుకున్న ఏలే లక్ష్మణ్, రేఖా చిత్రకారులు బాపు , బాలి,మోహాన్, చంద్ర, సాక్షి శంకర్ తదితరులంతా ఈ సంస్థచే సత్కారాలను అందుకున్నవారే. అంతే గాక 2010లో జరిగిన కోనసీమ చిత్రకళా పరిషత్ ద్విదశాబ్ది వేడుకలలో బాగంగా 100 మంది చిత్రకారుల పరిచయంతో చిత్రకళా వైజయంతి అనే పేరుతో ఒక మంచి గ్రంధాన్ని వేలువరించడమే గాకా 100 మంది చిత్రకారులను ఒకే రోజు ఒకే వేదికపై చిత్రకళా వైజయంతి పురస్కారాలాతో సన్మానించి లిమ్కాబుక్ , గ్లోబల్ మరియు ఇండియా బుక్ అఫ్ రికార్డు లాంటి మూడు జాతీయ రికార్డులను సాదించిన సంస్థ ఈ కోనసీమ చిత్రకళా పరిషత్ అంతే గాక నేడు రాష్ట్రంలో వివిధ కళా సంస్థలైన రాజోలు చిత్రకళా పరిషద్, అజంతా కళారామం,తెనాలి, అమీర్ ఆర్ట్ అకాడమి నెల్లూరు, వపా బాపు ఆర్ట్ అకాడమి పాలకొల్లు, భగీరధి ఆర్ట్ ఫౌండేషన్ రాజమండ్రి ,డ్రీం చిల్ద్రెన్ ఆర్ట్ అకాడమి విజయవాడ, కాళీపట్నం రాం ప్రతాప్ ఆర్ట్ అకాడమి హైదరాబాద్ లాంటి మరెన్నో చిత్రకళా సంస్థలకు ఈ కోనసీమ చిత్రకళా పరిషత్ స్పూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు.

ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో కొరసాల గారు స్థాపించిన ఈ కోనసీమ చిత్రకళా పరిషత్ తన ఆశయాల కనుగుణంగా ఎందరో చిత్రకారుల ఊహలకు రెక్కలు తొడిగి ఆ రెక్కలతో స్వేచ్చగా ఎగిరేలా ఎదిగేందుకు తన వంతు కృషి చేస్తున్న సంస్థలలో నేడు ముందున్నది అని చెప్పవచ్చు. ముప్పయ్య వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన ఈ సంస్థ మరిన్ని విజయాలతో స్వర్ణోత్సవ దిశగా కూడా ముందుకు సాగి చిత్రకళా సేవలో ఒక ధ్రువతారలా మెరవాలని ఆశిద్దాం.

విజేతలందరికీ 64కళలు.కాం తరపున అభినందనలు. ఈ కళా ఉత్సవంలో 30వ అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శన మరియు బహుమతి ప్రదానోత్సవం తో పాటు, ‘చిత్రకళ-స్పందన ‘ అంశం పై చిత్రకళా విమర్శకుల సదస్సు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయి.

-వెంటపల్లి సత్యనారాయణ

9 thoughts on “కోనసీమ ‘కళా ‘ సంక్రాంతి

  1. కోనసీమ చిత్రకళా పరిషత్ తృతీయ దశాబ్ది వేడుకల గురించి తగిన సమయంలో తగిన విధంగా స్పందించిన కలానికి, పత్రికకి హృదయపూర్వక అభినందనలు.
    శ్రీ సీతారామస్వామి గారి కళా కృషి అమేయం.. అనితర సాధ్యం. అజరామరం.
    ఎందరికో స్ఫూర్తిదాయకం. ముందు ముందు కూడా ఇంకా ఎన్నో కొత్త ఆలోచనలతో సగబోయే ఈ సంస్థకు శుభాభినందనలు.

  2. అద్భుతమైన విశ్లేషణ సర్… కంగ్రాట్స్ సర్..

  3. ఒక చిత్ర కళాకారుడిగా ఒక కోనసీమ చిత్రకళా పరిషత్ సంస్థను స్థాపించి అనేక మంది తోటి చిత్రకారులను గుర్తించి ప్రోత్సహిస్తూ గౌరవిస్తూ నిర్వహిస్తున్న సీత రామ స్వామి గారికి మరియు 64 కళలు డాట్కాం వారికి కృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap