తెలుగు కథకు పెద్దదిక్కు కేతు విశ్వనాథ రెడ్డి

కేతు విశ్వనాథ రెడ్డిగారు (22-05-23) భౌతికంగా మన నుంచి దూరమయ్యారు. ఒక ఆకు రాలినట్టు తన స్థానానికి సంబంధించిన స్పష్టమైన గుర్తును వదిలిపెడుతూ చప్పుడు చేయకుండా ప్రశాంతంగా వెళ్లిపోయాడు. ఎన్నో చిగురుటాకులకు మార్గదర్శకంగా నిలిచినవాడు, ఒక సంక్లిష్టమైన ప్రాంతీయతను సాహిత్యం చేసినవాడు నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. కరువులు తాండవించే నేలల మీదుగా, కక్షల సుడిగాలులు చెలరేగే గ్రామాల వీధుల మీదుగా పయనించి కథావస్తువుల్ని ఏరుకొన్న వాడు చెప్పాపెట్టకుండా దాటుకొన్నాడు. అపోహలకు, అపార్థాలకు గురై, దగాపడిన ఈ సీమనేల మట్టి గుండెల చప్పుళ్లను నిజాయితీగా వినిపించినవాడు, ఎవరూ పట్టించుకోని దృశ్యాల్ని కూడేసుకొని, ఎవరూ వినేందుకు ఇష్టపడని మూలుగుల్ని గొంతుకలో మోసుకొని కథలుగా చెప్పినవాడు వెనుదిరిగి చూడ కుండా కనుమరుగయ్యాడు.

ఏమి మనిషని ఆయన – ఎండిన కొమ్మల్ని తాళ్లుగానినవాడు, పొడి మట్టితో పూలను చేసినవాడు. నెత్తురూ కన్నీళ్లను కలిపి వాక్యాల్ని చేసినవాడు, ఆకలీ ఆవేశాల్ని కలిపి సంఘటనలు కూర్చినవాడు. కాసిన్ని నవ్వులు మరి కొన్ని ఏడుపులు ఇంకొన్ని ఆవేశాలు చాలేన్ని చెమట చుక్కలు కలిపి కథలను వండినవాడు. మన చుట్టూ ఉండే మనుషుల్నే పాత్రలుగా మార్చి మన గుండెల్లో ప్రతిష్టించి వెళ్లినవాడు.
కథలంటే అవేవో బ్రహ్మ పదార్థాలనుకునేవాళ్లం. చిన్నచిన్న వ్యవసాయ కష్టాలు, కొట్లాటలు, రోజూ చూసే పార్టీల గొడవలు కథలుగా రాసి చూపించాడు. ఆయన కథలు చదివిన తర్వాత ఎవరికైనా సరే తమ చుట్టూ వున్న పరిసరాలని కథలుగా మలచుకొనే రహస్యం ఏదో తెలిసిపోతుంది. సింగమనేని, కే. సభా, పి.రామకృష్ణ, మధురాంతకం రాజారాం, పులికంటి, వైసివి లాంటి వాళ్లతో కలిసి సీమ ప్రాంతాన్నంతా కథా సాహిత్యంగా మార్చివేశాడు.

మా తరంవాళ్లకు కేతు విశ్వనాథ రెడ్డిగారు సాహిత్య గురువు. మా దారిదీపం. ఆత్మీయ నేస్తం. తప్పుదారులు నడవకుండా హెచ్చరించే చూపుడువేలు. అక్షరాలను ఆలంబనగా చేసుకుని పయనించిన కథక ఋషి. సాహిత్య విమర్శకుడు. వివిధ కథాసంకలనాల, పత్రికల సంపాదకుడు. పాఠ్యపుస్తకాల ప్రణాళికా కర్త. ఉపన్యాసకుడు. ఆయన మరణం సాహిత్యలోకానికి తీరని లోటు. రాయలసీమ ఆధునిక సాహిత్య వట వృక్షాలు ఇద్దరు- సింగమనేని నారాయణగారు రెండేళ్ల క్రితం, కేతు విశ్వనాథరెడ్డిగారు ఇప్పుడు రాలిపోవడం సాహిత్యలోకం చేసుకున్న దురదృష్టం.
నాకు చెరోవైపు నిల్చొని వీపు తట్టి ప్రోత్సాహిం చిన వారు ఇద్దరూ. నా కథల సంపుటాలకు ఒకరు ముందుమాట రాస్తే మరొకరు వెనక అట్ట మీద రాసి నాపట్ల తమ ఆప్యాయతను చాటుకొన్నారు. ఇద్దరితో కలిసి లెక్కలేనన్ని సభలు, సమావేశాల్లో పాల్గొన్నాను. ఎన్నో రాత్రిళ్లు సాహిత్య చర్చల్లో కూచున్నాను. రాయలసీమ పల్లెమట్టి పొత్తిళ్లలో కళ్లు తెరిచిన వాడు. ఆ మట్టి వేదనల్ని అక్షరాలకెత్తి భవిష్యత్తరానికి కథల పాతర్లు నింపినవాడు. అచ్చమైన కడప మాండ లికాల్ని సాహిత్యపు గాదెలకు పోసినవాడు. కర్కశమైన పల్లె జీవితాల్లోని ఎగుడుదిగుడుల్ని పుస్తకాల గరిసె లకు ఎత్తినవాడు. అంతటి నిపుణుడైన సాహిత్య కృషీ వలుడు ఇకపై కడపలో కనిపించడనే విషయం భరించరానిదిగా ఉంది.

ఆయన గొప్ప సాహిత్యకారుడైనా, ఉపన్యాసకు డైనా నాకెప్పుడూ పల్లె జీవితాల్ని గొంతెత్తి పాడే జానపద కళాకారుడిలాగే కనిపించేవాడు. గ్రామ నామాల గుట్టు బైటబెట్టిన అరుదైన పరి శోధకుడైనా, విద్యార్థుల తల వెలిగేలా పాఠ్యపుస్తకాల్ని నిర్మాణం చేసిన భాషా శాస్త్రవేత్త అయినా నాకెప్పుడూ ఒక మాండలిక పదాల కుప్పలా కనిపించేవాడు. సంకోచపడని అదే యాస, అదే పలుకుబడి.

రాయలసీమ జీవితాల్ని ఇన్ని కోణాల్లో ఒడిసిపట్టి కథలుగా మలిచిన సాహిత్యకారుడు మరొకడు లేడనటం అతిశయోక్తి కాదు. సీమ జీవితం చాలా సంక్లిష్టమైంది. మూడు నాలుగేళ్లు వరసగా కరువులు వాలి, తినడానికి తిండి, తాగడానికి నీళ్లు దొరక్క వరి టించి వరిటించి మొద్దు చింతమానుల్లాగా మొదళ్లలో పానాలు నిలుపుకొని, ఒక్క వాన కురిస్తే చాలు ఒళ్లంతా చివురులు తొడిగి బతికిపోవడం వాళ్లకే తెలుసు. అంతటి కరువుల్లో కూడా ఆధిపత్యం కోసం మీసాలు మెలేసి గుంపును వెంటేసుకొని ఒకరినొకరు నరుక్కోవడం కూడా వాళ్లకే తెలుసు. బాటసారులు రాత్రిళ్లు అరుగుల మీద కనిపిస్తే, గంప చేతబట్టుకుని ఇల్లిల్లూ తిరిగి అన్నం ముద్దలు సేకరించి వాళ్ల ఆకలి తీర్చటం, మాట పట్టింపు వస్తే కసి పెంచుకొని జీవితాంతం పగలు ప్రతీకారాలతో రగిలిపోవటం వాళ్లకే తెలుసు. ఇంతటి సంక్లిష్టమైన జీవితాల్ని ప్రాంతీయ అవగాహనతో అర్థం చేసుకొని కథల్లోకి తీసుకురావడం అంత సులభమైన విషయమేమీ కాదు. వాళ్ల ప్రవర్తనే కథయితే అదొక గొప్ప వైఫల్యం. దాని వెనక ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాలను విశ్లేషించి నప్పుడే గొప్ప కథవుతుంది. కేతుగారు అందులో సఫలమయ్యారు కాబట్టే గొప్ప కథకులు కాగలిగారు. ముడి విప్పలేని సంక్లిష్ట విషయాల్ని సైతం అలవోకగా కథలుగా మార్చిన నైపుణ్యం ఆయనది. మేమంతా సులభంగా నడిచేందుకు దారులు ఏర్పరిచిన మార్గదర్శకుల్లో అగ్రగణ్యులు ఆయన. మా పెద్దాయన కోపగించుకుని మాట్లాడటం నేనెప్పుడూ చూడలేదు. హాస్య చతురత ఆయన స్వంతం. ఎంతటి గంభీరమైన వాతావరణాన్నైనా ఒక చతురు మాటతోనో, ఒక నవ్వు సంఘటనతోనో తేలిక పరిచేవాడు. ప్రతి మనిషిని గుండె లోతులు స్పృశించేలా పలక రించేవాడు. నన్నందరూ ‘సన్నపు రెడ్డి’ అని పిలిచినా, ఆయన మాత్రం ‘వెంకట్రామ్’ అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని వీపు తట్టేవాడు. రచయితగా నా గమనాన్ని సునిశితంగా పరిశీలించి సలహాలిచ్చేవాడు. పొగడ్తలకు పొంగ కుండా, తెగడ్తలకు కుంగకుండా నా పని నేను చేసుకుపోయే స్థితప్రజ్ఞత సింగమనేనిగారు, కేతుగారి వల్లనే నాకబ్బింది.

రాయలసీమకు సంబంధించిన అన్ని సమస్యల మూలాల్ని వెదకి పరిష్కారాల్ని సూచించిన నిఖార్సైన ప్రాంతీయ కథకులు కేతు విశ్వనాథరెడ్డి. ప్రాంతీయ జీవితాన్ని చిత్రిస్తూనే, ప్రాంతాలకు అతీతమైన సంస్కారాన్ని చైతన్యస్ఫూర్తిని భావోద్వేగాలని రగిలిస్తూ మానవ స్వభావాల్ని సమర్థవంతంగా ఆవిష్కరించిన అరుదైన కథకులు.
ఆయన మన నుంచి దూరమైన సందర్భంగా అశ్రునయనాలతో అంజలి ఘటిస్తున్నాను.

నన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి
(Courtesy : TANA patrika)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap