-తెలంగాణా ప్రభుత్వం తరపున మొగిలయ్య కు గౌరవ వేతనం…
2022 సంవత్సరం భారత ప్రభుత్వం “పద్మశ్రీ” ప్రకటించిన మొగిలయ్య కు అదృష్టం టైం రెండూ కలసి వచ్చేశాయి! “పద్మశ్రీ ” కి డబ్బులు ఇవ్వరటగా! నేనేం చేసుకుంటా! ఎక్కడ పెట్టుకుంటా” అని ఒక ఇంటర్ వ్యూ లో ఆవేదన వ్యక్తం చేసిన మొగిలయ్య కు 24 గంటలు గడవక ముందే ముఖ్యమంత్రి కెసిఆర్ వరాల జల్లు కురిపించేసారు.
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు.
పద్మశ్రీ అవార్డు పొందిన 12 కిన్నెర మెట్ల కళాకారుడుదర్శనం మొగిలయ్య ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎం కెసిఆర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.
ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని నెలకు పది వేల రూపాయల గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. కెసిఆర్ స్పందించిన తీరును పలువురు అభినందిస్తూనే, “పద్మశ్రీ ” అందుకున్న మరో డోలువాద్య గాయకుడు రామచంద్రయ్యకు కూడా ఇస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-కళాసాగర్