యూటూబ్లో తెలుగు టాక్ షో లలో ఆయనే టాప్

ఆయన గాయకుడు అయి ఉంటే మరో బాల సుబ్రహ్మణ్యం అయి ఉండేవారేమో. గాంధర్వ గాత్రం.. సినిమా దర్శకుడు అయితే మరో రాజమౌళి అయి ఉండేవారేమో. అత్యద్భుత కథనం…హీరోలకి డబ్బింగ్ చెప్తే ఉత్తమ గాత్రధారిగా నందులు అందుకునేవారేమో. సిరివెన్నెలలా కలం పట్టుకుని ఉంటే అచ్చ తెలుగు పాటలకి ప్రాణం పోసి ఉండేవారేమో. నవలలు రాసి ఉంటే యండమూరిని మించిపోయేవారేమో. తెలుగు పత్రికను నడిపి ఉంటే మరో రామోజీ అయి ఉండేవారేమో. పిల్లలకు ఉత్తమ ఆత్మీయ తెలుగు అధ్యాపకులు అయి ఉండే వారేమో. కోచింగ్ వ్యాపారం పెట్టుకుని ఉంటే ఉత్తమ స్ఫూర్తిదాయక వక్త (మోటివేషనల్ స్పీకర్) అయి ఉండేవారేమో.

ఆంధ్రాలో ఒక కుగ్రామంలో జన్మించిన ఒక వ్యక్తి ఎన్నో ఏళ్ళ క్రితం సముద్రాలు దాటి అమెరికా వెళ్ళి పూర్తిగా స్థిరపడ్డాక అతని వేషభాషలు, మాట తీరు ఎలా ఉంటాయి. ఆయన రేడియో ప్రసంగాలు వింటూంటే…ఈయన 25 ఏళ్ళుగా విదేశాల్లో ఉంటున్నారా?…అయినా ఇంత అచ్చమైన తేట తెలుగు తేనె మాటలు ఎలా పలుకుతున్నారు అని ఆశ్చర్యం కలుగక మానదు.

విదేశాల్లో ఉన్న మన తెలుగు వారికి ఆయన సుపరిచరితులే. ఆయన ఒక్కో టాక్ షో ఒక ఆణిముత్యం, ఒక ఉత్ప్రేరకం, ఒక జీవితచరిత్ర, ఒక అచ్చ తెనుగు కథ, ఒక అద్భుతమైన కథనం, మాట్లాడే చలనచిత్రం, మనుసుకి ఉల్లాసాన్నిచ్చే మత్తుమందు, ఒక అమోఘమైన విశ్లేషణ, ఒక తెలుగు నిఘంటువు, ఒక గ్రంధాలయం, చిన్న పిల్లలకు చందమామ కథ, యువతకు స్పూర్తి ప్రదాత, రోగగ్రస్తులకి దివ్యౌషధం, జీవిత చరమాంకంలో ఉన్నవారికి అమృత గుళికలు…ఇలా చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.

మహానటి సినిమాకి ఆయన టాక్ షోనే ప్రేరణ, ఎన్టీఆర్ మీద అత్యధికంగా 18 గంటల ధారాళమైన ప్రసంగం చేసి సృష్టించిన రికార్డు, ఎన్నో రాత్రులు, ఎన్నో గంటలు పరిశోధన చేసి మన కళ్ళ ముందు ఆవిష్కరించే జీవిత చరిత్రలు, ఆయన అమోఘమైన స్క్రిప్ట్, అనర్గళమైన ప్రసంగం…అమృత స్వరం, స్పష్టమైన తేనెలొలికే తెలుగు సంభాషణ…ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు. ఆయన ఒక్క షో విన్నా మీరు కచ్చితంగా ఆ స్వరానికి బానిస అయిపోతారు.

ఒక జీవిత చరిత్ర లేదా ఒక పుస్తకం చదవడానికి మనకి నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఒక జీవిత చరిత్రని ఆ పుస్తక ఆత్మకథ నుండి క్షుణ్ణంగా చదివి, సేకరించి, ఆ చరిత్రకి సంబంధించిన విషయాలు పాత పేపర్స్లో, పాత పుస్తకాల్లో శోధించి, సంబంధిత కుటుంబ సభ్యుల, ఊరి ప్రజల సూచనలు కూడా మేళవించి, సమాచారం ఏమి దొరకకుండా ఉంటే ఆ రోజుల్లో ఉన్న ప్రముఖుల గురించి తెలుసుకుని, వారిని సంప్రదించి, వీలైనంత మొత్తం సమాచారాన్ని సేకరించి ఒక 30-40 నిముషాల కార్యక్రమంగా భూతద్దం పట్టుకుని వెతికినా తప్పులు దొర్లని విధంగా రికార్డు చేసి క్రమం తప్పకుండా ప్రతీ వారం ఒక టాక్ షోగా ప్రసారం చేయడం, విదేశాల్లో ఉండి కూడా ఇవన్నీ నిర్వహించడం మామూలు విషయం ఎంత మాత్రం కాదు.

జీవిత చరిత్రలు ఆయన చెప్తున్న తీరు ఆ చరిత్రలో నిలిచిన ప్రతీ పాత్రకు పునర్జన్మ అందిస్తాయి. మనల్ని ఆయా వ్యక్తులతో ఆయా సంఘటనలతో ప్రయాణం చేయిస్తాయి. వందల ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తాయి. అప్పటి పరిస్థితులు మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. పాతతరం వారు సాధించిన ఎన్నో విజయాలు, సామాజిక నిస్వార్ధ సేవ, ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ ఆధునిక సమాజంలో ఏమీ సాధించలేని మన చేతకానితనాన్ని వెక్కిరిస్తాయి. మన జీవిత ఉనికిని ప్రశ్నిస్తాయి. కొన్ని చరిత్రలు గుండె తడి చేస్తాయి. కొన్ని జీవితంలో కచ్చితంగా ఏదయినా సాధించి తీరాలి అని ప్రేరణ అందిస్తాయి.

సావిత్రమ్మ దాతృత్వం, పాము కరిచినా షూటింగ్ ఆపకుండా నటించిన యుగపురుషుడు ఎన్టీఆర్ మొండి పట్టుదల, నాటకాల నుండి మొదలైన అక్కినేని, ఎస్వీఆర్ లాంటి ఎంతో మంది గొప్ప కళాకారుల నట ప్రస్థానం, ముళ్ళపూడి రమణ గారి బాల్యంలో అమ్మతో కలసి పంచుకున్న కష్టాలు, రూపాయి సంపాదన కూడా లేకుండా కందుకూరి, గురజాడ, చిలకమర్తి, దుర్గాబాయి దేశముఖ్ గారి నిస్వార్ధ సమాజ సేవ, స్వాతంత్ర సమర యోధుల త్యాగం, గడిపిన దుర్భర జైలు జీవితం, నటించడం మానినా జీవితంలో ఎంతో నేర్చుకోవచ్చు, ఎన్నో సాధించవచ్చని చెప్పే ఎల్ విజయలక్ష్మి జీవితం, టీ కొట్టుతో మొదలైన ప్రధాని మోడీ ప్రయాణం, నాగిరెడ్డి, కేసరి,ఎల్వీ ప్రసాద్, ఆనందీ జోషి, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో మహానుభావుల అత్యంత స్ఫూర్తిదాయక జీవితగాధలు, ఇళయరాజా, రెహ్మాన్, బాలు గారి సంగీత ప్రస్థానంలో ఎదుర్కొన్న కష్టాలు, అపజయాలు ఎన్ని ఎదురైనా విజయం సాధించే వరకు శ్రమించిన మణిరత్నం, కవి సామ్రాట్ విశ్వనాథ వారి సమగ్ర చరితపై 25 భాగాలు, 10 భాగాలుగా వేయిపడగలు నవల అద్భుతమైన విశ్లేషణ, చలం గారిపై 22 భాగాలు, చార్లీ చాప్లిన్ చరిత్రపై 10 భాగాలు, అమితాబ్ పై 16 భాగాలు, కార్ల్ మార్క్స్ పై 12 భాగాలు, శతాబ్దాల తెలుగు పత్రికల గురించి ఎక్కడా లభించని అరుదయిన సమాచారం, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ ఇలాంటి ఎన్నో పాత బంగారు చిత్రాల విశేషాలు కళ్ళకు కట్టించినట్లు చూపించడం ఒక్క కిరణ్ ప్రభ గారికే సాధ్యం. తెలుగు వాడైన ప్రతీ వ్యక్తి తప్పకుండా వినాల్సినవి, తమ పిల్లలకి వినిపించాల్సినవి కిరణ్ గారి టాక్ షో లు.

చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం…స్థిరమైన జీవితం…కానీ ఆయన అక్కడితో ఆగిపోలేదు..ప్రవాసాంధ్ర లో రేడియో ప్రవక్తగా మొదలు పెట్టి ఇప్పుడు సొంతంగా టాక్ షోలు నిర్వహిస్తున్నారు. ఎన్నో వందల మంది ప్రముఖుల జీవిత చరిత్రలు, పాత సినిమాలు, ఎన్నో మంచి పుస్తకాలపై విశ్లేషణ, ఆడియో వీక్లీలు, ఇప్పటికి దాదాపుగా 700 పైగా టాక్ షోలు ఆయన సొంతం. ఇవి కాకుండా గత 14 ఏళ్ళుగా శ్రీమతి కాంతికిరణ్ గారితో కలసి కౌముది అనే 450 పుటల అంతర్జాల మాస పత్రికను నిర్విరామంగా ఒక్క నెల, ఒక్క మాసం క్రమం తప్పకుండా నిర్వహించడం అసామాన్యం.
విదేశాల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటూ కూడా చేసే పనిపై ప్రేమ, క్రమశిక్షణ, అంకిత భావంతో ఇవన్నీ నిర్వహించడం సాధ్యమే అని ఆయన నిరూపిస్తున్నారు. ఆయనే కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ, కవి, రచయిత, పత్రికా సంపాదకులు, పదేళ్ళకు పైగా లాభాపేక్ష లేని అంతర్జాల పత్రిక కౌముది.నెట్ నిర్వాహకులు, సాహితీవేత్త, ప్రముఖ రేడియో ప్రవక్త కిరణ్ ప్రభ (#Kiranprabha) గారు…మీరు మరెన్నో వందల జీవిత చరిత్రలకి, ఎన్నో మంచి తెలుగు పుస్తకాలకి గాత్ర(ప్రాణ)ధారణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

కిరణ్ ప్రభ గారు జన్మించింది (నవంబర్ 21) కృష్ణాజిల్లాలో పాపవినాశనం అనే అందమైన పల్లెటూరులో. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. నాన్న పూర్ణచంద్రరావు గారు, అమ్మ వెంకటసుబ్బమ్మ గారు. కృష్ణానది ఏటి ఒడ్డు, ఇసుక తిన్నెలు, పంట కాలువలు, పచ్చటి మాగాణి పొలాలు, చెరువులో తామర పూలు, చెరువు ఒడ్డున నిద్రగన్నేరు చెట్టు ఇవే ఆయన చిన్ననాటి నేస్తాలు.

ప్రభుత్వ పాఠశాలలో చదువు…ఆ రోజుల్లో టీవీలు లేవు కనక..ఎక్కువగా ఊరి గ్రంధాలయంలో గడిపేవారు. ఆ అలవాటే ఆయనకి తెలుగు భాషపై పట్టుని, మమకారాన్ని, సాహిత్యాభిలాషని పెంచి పోషించింది. కళాశాల రోజుల్లో చిన్నగా కవితలు రాయడం, వక్తృత్వ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం చేస్తుండేవారు. ఎన్నో కవితలు కిరణ్ ప్రభ కలం పేరిట పత్రికల్లో వస్తూ ఉండేవి. అమెరికాలో ఉంటూ సాహిత్య సంస్థ సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపక నిర్వాహకులుగా తమ సేవలు అందించారు. అమెరికా వెళ్ళిన సాహితీ ప్రముఖులు వీరి ఇంట ఆతిధ్యం స్వీకరిస్తూ చర్చాగోష్ఠి జరుపుతూ ఉంటారు. స్వర్గీయ గొల్లపూడి మారుతీరావు గారు వీరికి ఆప్తులు, వీరి మ్యాగజైన్స్ కి ఎన్నో వ్యాసాలు అందించారు. ఇంకా ఎందరో ప్రముఖ తెలుగు రచయితలు కౌముదికి తమ సేవలు అందిస్తున్నారు.
పుస్తకాలు ఎక్కువగా చదివేవారు, మాతృభాషలో చదువుకున్నవారు, వృత్తిపై ఆరాధన, క్రమశిక్షణ, ఒక జీవితలక్ష్యం ఉన్నవారు కచ్చితంగా గొప్పవారు అవుతారు..అందుకు ఈయన జీవితమే ఆదర్శం.

విదేశాల్లో ఉంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది తెలుగు వారికి తమ టాక్ షోలతో స్పూర్తిప్రదాతగా నిలిచి, కౌముది.నెట్ పత్రిక ద్వారా తెలుగుకి జీవం పోస్తూ, తెలుగు సాహితీ వేత్తలని ఎందరినో ప్రోత్సహిస్తూ, తెలుగు ఖ్యాతిని ఖండాతరాలు దాటినా విశ్వమంతా విస్తరిస్తూ తెలుగు సాహితీ సేవకు తమ జీవితాన్ని అంకితం చేస్తున్న కిరణ్ ప్రభ గారికి, వారి సతీమణి కాంతికిరణ్ గారికి హృదయ పూర్వక నమస్సులు మీ టాక్ షో లు ఆ చంద్ర తారార్కం, అజరామరం.
-శాంతి
కిరన్ ప్రభ గారి టాక్ షో లు ఇక్కడ వినవచ్చు …
https://www.youtube.com/user/MrKiranprabha

1 thought on “యూటూబ్లో తెలుగు టాక్ షో లలో ఆయనే టాప్

  1. నిజంగా ఆయన మాటలు ఒకసారి వింటే మాయలో పడిపోతాం శ్రీకృష్ణుడి మురళీ
    రవానికి గోపికలు వెంటపడి పోయినట్టు మళ్లీ
    మళ్ళీ ఆయన మాటలు వినాలనిపిస్తుంది.ఎంత పనివున్నా వినకుండా ఉండలేం. ఎంత సమాచారం అందిస్తారు. దాని వెనక ఎన్ని రోజుల శ్రమ ! అది ఆయనకి ఇష్టం ! ఆ గొంతు మనందరికీ ఇష్టం !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap