సిక రాజు గారు మెచ్చుకున్న కార్టూనిస్ట్ ‘రామారావు ‘

“రామారావ్” పేరుతో కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు కొడాలి సీతారామారావు. నేను ఏ.పి.ఎస్ఆర్.టీ.సీ. లో అక్కౌంట్స్ ఆఫీసరుగా 2011లో పదవీ విరమణ చేశాను. ప్రస్తుతం విజయనగరంలో వుంటున్నాను. పుట్టిన వూరు బందరు.
నాకు ఏడేళ్ళ వయసునించీ పుస్తకాలు చదవటం అలవాటయింది. మా ఇంటికి ఆంధ్రపత్రిక వారపత్రిక వచ్చేది. మా నాన్నగారు ఆఫీసు నుంచి ప్రజామత, ఆంధ్రప్రభ, చందమామ లాంటి పత్రికలు తెచ్చేవారు. నాకు అర్ధం కాకపోయినా కార్టూన్లు చదివేవాడిని. వాటి అర్ధాలు మా అమ్మ గారు చెపితే నవ్వు వచ్చేది. అప్పుడే సత్యమూర్తి, జయదేవ్, బాబుగార్ల సంతకాలు గుర్తున్నాయి.

స్ఫూర్తి: నేను 11వ తరగతి చదివేటప్పుడు కార్టూన్లు వేస్తుండేవాడిని. నాకు స్పూర్తి శ్రీ జయదేవ్, శ్రీ బాబు గారలే. నాకు బొమ్మలు వేయటం అసలు రాదు. అందువల్లే నా కార్టూన్లలో నా శైలి అంటూ ఏర్పరుచుకోలేకపోయాను. నా బొమ్మల్లో వారిద్దరి ఛాయలు ఎక్కువ కనిపిస్తాయి. అప్పట్లో పంపిన కార్టూన్లు తిరిగొచ్చాయి.

Kodali Sita Ramarao cartoon

మొదటి కార్టూన్: నేను 1975 నవంబరులో వుద్యోగంలో చేరాక జనవరిలో శ్రీ జయదేవ్ గారికి వుత్తరం రాశాను నా కార్టూన్లు పంపుతూ. వెంటనే వారు వుత్తరం రాశారు కొన్ని సూచనలు చేస్తూ. ఏ సైజులో వేయాలో కూడా తెలియచేసారు. ఆ తర్వాత కూడా చాలా సార్లు వుత్తరాలు రాశారు. అలా పంపిన నా మొదటి కార్టూన్ 1976లో విజయ మాసపత్రికలో ప్రచురించబడింది కొన్ని చేర్పులతో. అప్పుడు అర్ధం అయింది కార్టూన్లలో పరిసరాలు కూడా వేయాలి అని.

ఆంధ్రజ్యోతి, వనితాజ్యోతి, ఆంధ్రప్రభ, స్వాతి, నది, స్నేహ, హాస్యానందం, గో తెలుగు.కామ్, కౌముది. నెట్, మా సంస్థ నిర్వహించే ప్రస్థానంలాంటి అనేక పత్రికలలో ప్రచురించబడినాయి. మొదటి నుంచీ విరివిగా వేయలేదు ఉద్యోగ బాధ్యతలవల్లా, ఆర్ధిక ఇబ్బందులవల్లా. “కొడాలి సీతారామారావు, కె.ఎస్. రామారావు, కె. సీతారామారావు, కొడాలి (జయదేవ్ గారి స్టైల్లో ఇంగ్లీషులో), రారా, రావ్” పేర్లతో కార్టూన్లు వేశాను.

Kodali Sita Ramarao cartoon

బహుమతులు: ఆంధ్రభూమి మాసపత్రికలో పేజీ కార్టూన్లు చాలా వేశాను. వారు నిర్వహించిన పేజి కార్టూన్ పోటీలలో నాకు కన్సోలేషన్ బహుమతి లభించింది. రచన మాసపత్రిక నిర్వహించిన కార్టూన్ పోటీలలో కూడా బహుమతి వచ్చింది. ఆంధ్రజ్యోతి –న్యూజెర్సీ నిర్వహించిన పోటీలలో కూడా నా కార్టూన్ ఎంపిక అయ్యింది.
1992లో ఆంధ్రభూమి సంపాదకులు కనకాంబరరాజు గారిని కలవటం గొప్ప అనుభూతి. వారిని కలవాలని ఫోన్ చేస్తే ఉదయం రమ్మన్నారు. అయితే నేను సాయంత్రం కలుస్తానంటే సరేననటం కళాకారుల పట్ల వారికి వున్న గౌరవం. అలా కలిసినప్పుడు నా కార్టూన్లు చూస్తూ మెచ్చుకున్నారు. ఎదురుగా వున్న వారికి కూడా చూపించారు. కొన్ని కార్టూన్లు తీసుకుని ఎక్కువగా పంపించమన్నారు. అలా ఆంధ్రభూమి వారపత్రికలో కూడా నా కార్టూన్లు ఎక్కువగానే వచ్చాయి. అంతే కాక వారి స్టాఫ్ ఆర్టిస్టుని పిలిచి వాళ్ళు బొమ్మలు వేయటానికి వాడే పెన్ను, ఇంకు గురించి చెప్పమన్నారు. అవి ఫ్లాట్ నిబ్ పెన్, ఫౌంట్ ఇంక్. ఆ రోజే విద్యార్ధి బుక్ స్టోర్, సికింద్రాబాద్ లో కొనుక్కున్నాను.

మధ్యలో దరిదాపు ఒక దశాబ్దం పాటు కార్టూన్లకి దూరంగా వున్నాను.
శ్రీ జయదేవ్ గారిని, శ్రీ బాపుగారిని వ్యక్తిగతంగా కలుసుకోటం మరపురాని అనుభవం.
నేను కధలు కూడా రాశాను. నా కధలు ఆంధ్రజ్యోతి, నవ్య, ఆంధ్రభూమి, నది,స్నేహ, గో తెలుగు.కామ్ లలో వచ్చాయి.

కార్టూనిస్టుల పరిచయం: హాస్యానందంలో నా ఫోన్ నెంబరు చూసి బాచి గారు నిర్వహించిన ఒక కార్టూనిస్టుల సమావేశానికి ఆహ్వానించారు. అలా మోదటి సారి కార్టూనిస్టులని ప్రత్యక్షంగా చూశాను. ప్రముఖ కార్టూనిస్టు చక్రవర్తిగారు నన్ను కార్టూనిస్టుల గ్రూపులో చేర్చారు.శ్రీమతి సునీలగారు నిర్వహించిన హార్టూనిస్ట్స్ వాట్సాప్ గ్రూపులో చేర్చటం, 2017లో బెంగుళూరులో జరిగిన తెలుగు కార్టూనోత్సవంలో నా కార్టూన్ ప్రదర్శించబడటం, నేను ప్రత్యక్షంగా పాల్గొనటం ఒక మధురానుభూతి. చాలామంది కార్టూనిస్టులతో అయిన పరిచయం, ఇప్పుడు కూడా కొనసాగుతూ వుంది. కార్టూనిస్టుల మధ్య వున్న అనురాగం, అభిమానం చూశాను. విశాఖపట్నంలో నిర్వహించిన విశాఖోత్సవంలో, బందరులో ప్రముఖ కార్టూనిస్ట్ కిరణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శనలో, విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర కార్టూనిస్టుల ఫోరం తరఫున నిర్వహించిన కార్టూన్ ప్రదర్శనలలో నా కార్టూన్లు వున్నాయి.
ప్రస్తుతం కార్టూనిస్టులని నా ఫేస్బుక్ లో పరిచయం చేస్తున్నాను. వ్యక్తిగతంగా వారితో సంభాషించి. వారందరికీ ధన్యవాదాలు. నేనెవరో తెలియకపోయినా వారి గురించి మనసు విప్పిమాట్లాడారు.

కార్టూనిస్టులని తన 64 కళల ద్వారా లోకానికి పరిచయం చేస్తున్న కళాసాగర్ గారి ప్రయత్నం అభినందించదగ్గది. వారికి నా ధన్యవాదాలు.
-సీతారామారావు

Kodali Ramarao cartoons
cartoons
SA:

View Comments (3)

  • మీ గురించి 64కళలు ద్వారా పరిచయం కావడం సంతోషంగా ఉంది. పరిచయం కలిగించిన 64కళలు వారికి ధన్యవాదాలు. మీకు శుభాకాంక్షలు

  • సీతారామ రావు గారు గురించి చాలా తెలియని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. సీతారామారావు గారికి నా అభినందనలు