విజయ పరంపరల దర్శకుడు… కోడి రామకృష్ణ

ఫిబ్రవరి 22 న కోడి రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం ….

కొందరిని అదృష్టం తలుపు తడుతుంది. ఆ అదృష్ట సంస్థ సాహిత్య సంగీత సమాఖ్యది కావడం నిజమైన అదృష్టం. సాధారణంగా కోడి రామకృష్ణ గారు సంబరాలకు, సభలకు హాజరు కావడం చాలా అరుదు. అయితే మా సభ్యులు, ప్రసిద్ధ సినీ రచయిత శ్రీ పైడిపాటిరాజేంద్రకుమార్ గారిమీద వుండే అభిమానంతో రామకృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అస్వస్థులుగా వున్న రామకృష్ణ గారు హాజరైన చివరి కార్యక్రమం కూడా ఇదే కావడం కాస్త బాధాకరమే అయినా మా సమాఖ్య సిగలో అది ఒక కలికితురాయిగా మిగిలిపోతుంది. శ్రీ కోడి రామకృష్ణ చలనచిత్ర దర్శకునిగా నూట ముప్పైకి పైగా సినిమాలను పూర్తిచేశారు. అయినా ‘’నేను నేర్చుకోవలసింది ఇంకా వుంది’’ అనడం వెనుక ఆయన నిరాడంబరత, సంస్కారం నిండివుంది. ఫిబ్రవరి 22 రామకృష్ణ వర్ధంతి. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ గారిని స్మరించుకుందాం…

తొలిరోజుల్లో…
శ్రీ కోడి రామకృష్ణ గారిది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. రామకృష్ణ తల్లిదండ్రులు చిట్టెమ్మ, నరసింహమూర్తి. నిజానికి నటుడుగా రాణించాలనేది రామకృష్ణ కోరిక. చదువుకునే రోజులనుంచే నాటకాలను డైరెక్ట్ చేస్తూ అందులో నటించేవారు. హైస్కూలు స్థాయిలో నటనకు మంచి బహుమతులు అందుకున్నారు. కాలేజీలో చవుకుంటూ వివిధ ప్రాంతాలనుండి కళాకారులను తీసుకొని వచ్చి నాటక ప్రదర్శనలు ఇప్పించేవారు. రామకృష్ణకు పెయింటింగ్ లో మంచి ప్రావీణ్యముంది. పాలకొల్లులో నాగేశ్వరరావు అనే ఒక ఫోటో స్టూడియో నడిపే వ్యక్తి రామకృష్ణకు పెయింటింగ్ చేయడం నేర్పారు. ఒకవైపు కాలేజీలో చదువుకుంటూనే ‘అజంతా పెయింటర్స్‘ పేరుతో ఒక షాపు కూడా నిర్వహించేవారు. అల్లు రామలింగయ్యది కూడా పాలకొల్లే కావడంతో వారితో కూడా నాటకాలు వేశారు. తొలుత సినిమాల్లో నటించాలనే కోరిక వున్నా, దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారి ‘తాత మనవడు’ సినిమా చూశాక దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నారు. ‘తాత మనవడు’ శతదినోత్సవం పాలకొల్లులో జరిగినప్పుడు వారిని కలిసి దర్శకత్వ శాఖలో చేరాలని వుందని రామకృష్ణ కోరాలనుకున్నారు. అయితే ఇక్కడే ఒక సమస్య రామకృష్ణకు ఎదురైంది. శతదినోత్సవ వేడుకలు జరిగే సినిమా హాలు యజమానికి, ఆవూరి విద్యార్థులకి చిన్నచిన్న గొడవలుండేవి. ఆయనతో గొడవ పెట్టుకునే అవకాశంకోసం విద్యార్థులు చూస్తున్నారు. ఈలోగా ‘తాత మనవడు’ శతదినోత్సవ వేడుక ఆ సినిమాహాలు ప్రాంగణంలో జరగడంతో, విద్యార్థులు పెద్దపెట్టున హాజరయ్యారు. దాసరి నారాయణరావు, నిర్మాత కె. రాఘవవంటి సినీ పెద్దల సమక్షంలో హాలు యజమానితో విద్యార్థులు గొడవకు దిగి కుర్చీలు విరగ్గొట్టి విధ్వంసం సృష్టించడంతో కార్యక్రమం రసాభాసగా మారి రద్దయింది. దాంతో దాసరి నారాయణరావును కలిసి సినిమాలకు పనిచేయాలని వుందని రామకృష్ణ చెప్పలేకపోయారు. అయితే తరవాత వచ్చిన రాఘవ చిత్రం ‘సంసారం సాగరం’ వేడుకకు మరలా దాసరి పాలకొల్లు వచ్చినప్పడు రామకృష్ణ కలిసి తన కోరిక వెలిబుచ్చారు. ‘’ముందు డిగ్రీ పూర్తిచెయ్యి. తరవాత నేనే పిలుస్తాను’’ అని చెప్పడంతో చదువు మీద ధ్యాస పెట్టారు. క్రమం తప్పకుండా దాసరికి వుత్తరాలు రాసేవారు. ‘రాధమ్మ పెళ్లి’ సినిమా షూటింగు కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని తెలిసి రామకృష్ణ వెళ్ళి దాసరిని కలిశారు. అందులో రామకృష్ణకు ఒక చిన్న పాత్ర ఇచ్చి దాసరి రామకృష్ణను నటింపజేశారు. ఈలోగా డిగ్రీ పూర్తయింది. దాసరి వద్దనుంచి టెలిగ్రామ్ రావడంతో రామకృష్ణ 1972 లో మద్రాసు వెళ్ళారు. దాసరి, రామకృష్ణ ను ‘ఎవరికి వారే యమునాతీరే’, ‘స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ సినిమాలకు సహాయ దర్శకునిగా నియమించారు. నిర్మాత రాఘవ గారి చొరవతో ‘చదువు సంస్కారం’ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా రామకృష్ణ నటించారు. దాసరి నిర్మించిన యెన్నో సినిమాలకు రామకృష్ణ ప్రధమ సహాయకులుగా వ్యవహరించారు.

ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో…
‘తూర్పు పడమర’ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చినప్పుడు నిర్మాత రాఘవకు దగ్గరై, రామకృష్ణ ఆయన అభిమానానికి పాత్రులయ్యారు. దానితో రాఘవ చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ (1982)సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. 1982లో ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ హిట్టుగా నిలిచి ఐదు వందల రోజులపాటు ఆడింది. రామకృష్ణకు ఇది తొలి విజయం. ఇక్కడొక విషయాన్ని మీకు గుర్తు చేయాలి. పాలకొల్లుకు దగ్గరలోనే ఈ తొలి సినిమా షూటింగు. చిరంజీవి మీద తొలి షాట్ చిత్రీకరించాలి. అయితే ముహూర్తం సమయానికి చిరంజీవి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అందుకోలేకపోయారు. పూజా కార్యక్రమం పూర్తిచేసి క్లాప్ అయిన తరవాత తొలి షాట్ చిత్రీకరణకు ‘యాక్షన్ ’ చెప్పారు రామకృష్ణ. కెమెరాలో ఫిలిమ్ రోల్ అవుతోంది. షాట్ పూర్తయ్యాక ‘కట్’ చెప్పేశారు. షాట్ బాగా వచ్చిందని అందరూ క్లాప్స్ కొట్టారు. అయితే అసలు విషయం తరవాత తెలిసింది… కెమెరా సహాయకుడు బ్యాటరీ కనక్షన్ ఇవ్వలేదని… షాట్ రికార్డు కాలేదని. ఇదే కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలి అనుభవం. ఇదేదో అపశకునం అన్నట్టు చూశారు ఆయన అభిమానులు. కానీ రామకృష్ణ పెదవులమీద చిరునవ్వు చెరగలేదు. తరవాత దర్శకత్వం వహించిన ‘తరంగిణి’ సినిమా కూడా ఐదు వందల రోజులు ఆడింది. ఇది భారతీయ సినీ చరిత్రలో ఒక పెద్ద రికార్డు. ఆపైన రామకృష్ణ దర్శకత్వం వహించిన నిర్మాత ఎస్. గోపాలరెడ్డి సినిమాలు ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల కృష్ణయ్య’ కూడా 500 రోజులు ఆడాయి. ‘ముద్దుల మామయ్య’, ‘మాపల్లెలో గోపాలుడు’, ‘అంకుశం’ చిత్రాలైతే ఏడాదికి పైగా ఆడాయి. రామకృష్ణ 1983లో ఏకంగా ఆలయశిఖరం, గూఢచారి నం.1, మాయింటికి రండి, ముక్కుపుడక, పోరాటం, రంగులపులి, సింహపురి సింహం వంటి ఏడు సినిమాలకు దర్శకత్వం వహించి అన్ని సినిమాలను హిట్ చేశారు. ఇదొక రికార్డు. అంకుశం సినిమాను ప్రశంసిస్తూ పోలీసు శాఖ వారు రామకృష్ణను సత్కరించి, వెండి లాఠీకర్రను బహూకరించారు. 1991 లో విడుదలైన ‘భారత్ బంద్’ సినిమాలో “క్రికెట్, ఫుట్ బాల్ క్రీడలు టెలికాస్ట్ చెయ్యడం కాదు, అసెంబ్లీ సమావేశాలు టెలికాస్ట్ చెయ్యండి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో చూస్తారు” అనే డైలాగు చెప్పించారు. అన్నట్లుగానే అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి. ఎప్పుడో ఇరవై ఏళ్ళకు ముందే ‘దేవుళ్ళు’ సినిమాలో సెల్ ఫోన్ల పిచ్చి తగ్గించాలని ఉద్బోధించారు. తెలుగులో తొలి గ్రాఫిక్ సినిమా ఆయనే తీశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మన్నెంలో మొనగాడు, తలంబ్రాలు, ఆహుతి, మువ్వ గోపాలుడు, శ్రీనివాస కల్యాణం, అమ్మోరు, రిక్షావోడు, దొంగాట, దేవి, దేవుళ్ళు వంటి మరెన్నో విజయవంతమైన సినిమా పేర్లు చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే తయారవుతుంది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ వంటి సూపర్ స్టార్లు రామకృష్ణ సినిమాలతో రాణించినవారే. ముఖ్యంగా ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మామయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’ వంటి సినిమాలతో సూపర్ స్టార్ స్థాయిని అందుకున్న బాలకృష- రామకృష్ణ లను ‘తెలుగు సినిమాల స్వర్ణజంట’ గా అభివర్ణిస్తూ వుంటారు. 2004లో ‘పుట్టింటికి రా చేల్లీ’ సినిమాను హిట్ చేశాక రామకృష్ణకు ‘అరుంధతి’తో గొప్ప పేరొచ్చింది. తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళ, తమిళ చిత్రాలకు కూడా రామకృష్ణ దర్శకత్వం వహించి విజయవంతం చేశారు. 2012లో ప్రతిష్టాత్మక ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామకృష్ణకు ప్రదానం చేసి సత్కరించింది. రామకృష్ణ దర్శకత్వం వహించిన 10 సినిమాలకు నంది బహుమతులు దక్కాయి. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించినవారు తెలుగులో దాసరి నారాయణరావు తరవాత, కోడి రామకృష్ణ, కె.ఎస్.ఆర్. దాసు మాత్రమే. రామకృష్ణ దర్శకత్వం వహించిన చివరి సినిమా తెలుగు, కన్నడ భాషల్లో సమాంతరంగా నిర్మించిన ‘నాగ భరణ’ సూపర్ హిట్ చిత్రం.

మరిన్ని విశేషాలు…
మన ప్రియతమ సభ్యులు శ్రీ పైడిపాటి రాజేంద్రకుమార్ గారు కోడి రామకృష్ణ గారికి సన్నిహిత మిత్రులు. 2000 సంవత్సరంలో బుట్టాయిగూడెం (ప.గో. జిల్లా) జమీందారు శ్రీ కరాటం రాంబాబు రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించిన ‘దేవుళ్ళు’ సూపర్ హిట్ చిత్రానికి రాజేంద్రకుమార్ గారే సంభాషణలు సమకూర్చడం విశేషం. రవీంద్రభారతిలో సాహిత్య సంగీత సమాఖ్య నిర్వహించిన కార్యక్రమానికి సూత్రధారులు రాజేంద్రకుమార్ గారే. వారి కోరికమేరకే కోడి రామకృష్ణ గారు ఆ పుస్తక ఆవిష్కరణ వేడుకకు విచ్చేయడం జరిగింది. డాక్టర్ వుటుకూరి వెంకట సత్యనారాయణ (సిడ్నీ, ఆస్ట్రేలియా) గారు రచించిన ‘తెలుగు సినీ దర్శకుల దర్శని’ పుస్తకాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఆ పుస్తకానికి ముందుమాట రామకృష్ణ గారు రాయడం, ఆ పుస్తకాన్నికి ప్రకాశకులుగా సాహిత్య సంగీత సమాఖ్య వ్యవహరించడం ముదావహం.
రామకృష్ణ చిన్నతనంలో ఒక పెద్ద నీటి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కోడి రామకృష్ణను గుర్తించడం చాలా సులువు. నుదుట ఒక పెద్ద గుడ్డ స్కార్ఫ్ తో కనబడడం రామకృష్ణకు అలవాటు. ఒకసారి కోవెలమ్ బీచ్ వద్ద షూటింగ్ జరుపుతున్నప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ మోకా రామారావు రామకృష్ణను నుదుట గుడ్డ బ్యాండ్ ధరించమని సలహాయిచ్చాడు. అంతే కాకుండా ఒక తెల్లగుడ్డతో బ్యాండ్ తయారుచేసి రామకృష్ణ నుదుటికి అలంకరించారు. రామకృష్ణ నుదురు చాలా పెద్దది కావడంతో షూటింగులో పాల్గొంటున్నప్పుడు ఎండకు తట్టుకోలేరనే మోకా రామారావు ఈ సలహా ఇవ్వడం జరిగింది. అదే అలవాటును రామకృష్ణ జీవితాంతం కొనసాగించారు.

కొన్ని విషయాలు తెలుపుతుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ రామకృష్ణకు దర్శకుడిగా తొలి అవకాశమనే విషయం తెలిసిందే. ఆ సినిమాకు రామకృష్ణ అందుకున్న పారితోషికం కేవలం వంద రూపాయలంటే నమ్ముతారా! కానీ ఇది నిజం!! సినిమా షూటింగులు జరిగినన్ని నెలలు రామకృష్ణకు కావలసిన వసతి సౌఖర్యాలు (తిండి, బట్ట తో సహా) ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ భరించింది. కొత్త దర్శకుడు కావడంతో చిరంజీవి ఈ సినిమాలో నటించేందుకు తొలుత వెనక్కి తగ్గారు. కథాబలం గొప్పగా వుండడంతో చిరంజీవి ఈ చిత్రంలో నటించారు. సినిమాకు ఎంత పేరొచ్చిందో చెప్పాల్సిన పనిలేదు.

1983లో ‘రంగులపులి’ సినిమా షూటింగులో గొల్లపూడి మారుతీరావు కూతురుగా నటించిన క్యారక్టర్ నటిని పెద్దల అంగీకారంతో రామకృష్ణ వివాహమాడారు. రామకృష్ణ కు హాలీవుడ్ చిత్రాలు చూడడమంటే ఇష్టం. అలా నచ్చిన ఒక సినిమా కథ ఆధారంగా బాలకృష్ణను హీరోగా పెట్టి ‘విక్రమసింహ’ అనే సినిమాను ప్రారంభించి సగానికి పైగా చిత్రీకరణ జరిపారు. కానీ అనివార్య కారణాలవలన ఆ సినిమా నిర్మాణం ఆగిపోయింది. అందుకు గల కారణాలను ఏనాడూ రామకృష్ణ బయటపెట్టలేదు. తన వృత్తి ధర్మాన్ని తు.చ తప్పక ఆచరించిన ఉత్తమ దర్శకులలో రామకృష్ణ పేరును కూడా చేర్చాలి. వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో కొద్దిరోజులుగా అనారోగ్యంతో వుంటూ 22 ఫిబ్రవరి 2019న రామకృష్ణ హైదారాబాద్ లో అశువులుబాశారు.

ఆచారం షణ్ముఖాచారి

Share via
Copy link
Powered by Social Snap