‘కోహినూర్’ కవితా సంపుటి
Site Icon

డాక్టర్ జల్దీ విద్యాధర్ గారు ఐఆర్ఎస్ ఆఫీసర్ గా మరోపక్క రచయితగా, కవిగా రెండింటికి సమన్యాయం చేకూరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ సాహితీ రంగాన్ని ఏలడం అంటే కత్తి మీద సాములాంటిది. అయినా కూడా అవలీలగా అందిపుచ్చుకుని రైతన్నలు పొలం దున్నినంత తేలికగా రెండు రంగాల్ని అవలీలగా ఏలుతున్నారు. వీరు ఐఆర్ఎస్ ఆఫీసర్ గా సమాజానికి సేవలు అందిస్తూనే మరోపక్క సాహితీమాత వరాల పుత్రునిగా కొనియాడబడుతున్నారు. వీరు కవిత్వాన్ని ఉగ్గుపాలతో అవపోసన పట్టారనే చెప్పాలి. అందుకే కవిత్వం అంటే వీరికి ప్రాణం. వీరి కవిత్వంలో సామాజిక స్పృహ ప్రధాన భూమిక పోషిస్తుంది. “కవులు నిరంతరం ప్రజల పక్షాన ఉండాలి” అన్న వారి ఆశయం వారిని ఓ గొప్ప కవిగా నిలబెట్టింది. శ్రీశ్రీ, శివారెడ్డి వంటి విప్లవకవులు, అభ్యుదయ కవుల ప్రభావం వీరిపై ఉండడం వల్ల సమాజంలోని అసమానతలు మరియు సామాజిక సమస్యలపై వీరి కలం శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ శక్తివంతమైన కలంతోనే డాక్టర్ జల్దీ విద్యాధర్ గారు వజ్రం కన్నా పదులైన కవితల్ని ఏర్చికూర్చి “కోహినూర్ వజ్రం” కవితా సంకలనంలో మనకి అందించారు.

ఇందులోని కవితలన్నీ కోహినూర్ వజ్రంలా దగదగా మెరిసిపోతున్నాయనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి కవిత వజ్రపు తునకల్లా ఉన్నాయి. నీకోసం వస్తాను కవిత ప్రేమైక జీవన సౌందర్యానికి చక్కని భాష్యం చెబుతూ, పాము పామే కవితలో పాలు పోసి పెంచినా కూడా పాము ఎలాకాటు వేస్తుందో మనిషి కూడా అలానే ఉంటాడన్న వైనం, చీకటి వలచిన వెన్నెల కవితలో వెన్నెల చీకట్లో కూడా శ్వేత వర్ణంగా ఎంత అందంగా ఉంటుందో అలానే ప్రేయసి కూడా ఉంటుందని, కోయ పిల్ల కవితలో కోయ పిల్ల ప్రియుడ్ని ‘మాయ పిల్ల’ అంటూ వశం చేసుకున్న తీరు, అలాగే సముద్ర భాషలో సముద్రం యొక్క భాష దాని గొప్పతనం అద్భుతంగా అభివర్ణించారు. ఇలా సాగిపోతున్న ఈ కవితా సంపుటిలోని కవితల మాధుర్యాన్ని వివరంగా చూద్దాం.

మొదటగా “నీకోసం వస్తాను” కవితలో ఒక మనిషి తన మనసును మరొకరికి పూర్తిగా అప్పగించుకున్న ప్రయాణాన్ని చాలా చక్కగా చెప్పారు విద్యాధర్ గారు. ప్రేమ ముందు ఎలాంటి కఠినమైన సిద్ధాంతాలైన కరిగిపోతాయని, కేవలం మాటలకందని ఆత్మీయత మాత్రమే మిగులుతుందని ఈ కవిత చాలా అందంగా చెబుతుంది. పదాల కూర్పు భావుకథ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. “పాము పామే” కవిత సమాజంలోని వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చెబుతుంది. మనుషుల్లోని కుళ్ళు, కుతంత్రాలను పాము విషంతో పోలుస్తూ చాలా అద్భుతంగా అక్షరీకరించి చెప్పారు. పాము విషం శరీరానికి మాత్రమే ప్రమాదం, కానీ మనిషిలోని కుళ్ళు, కుతంత్రాలు కులమతాల విద్వేషాలు మొత్తం సమాజానికి ప్రమాదం అని కవి చెప్పకనే చెప్పారు. అలాగే ఈ కవితలో కవి పాముని ఉద్దేశించి వేసిన ప్రశ్న ఒక పదునైన బాణం లాంటి “ఓ పామా! మనుషులపై నీకెందుకు కోపం? నిన్ను మించిన విషపురుగులు మనుషులే అని నీకు అసూయా?” అనడం ద్వారా మనిషిలోని క్రూరత్వం పాము కంటే వంద రెట్లు ప్రమాదకరమైనదని చెప్పారు. ఈ వాక్యం కవితకు ప్రాణం పోసింది.

“చీకటి వలచిన వెన్నెల” కవిత కేవలం ప్రకృతి వర్ణన మాత్రమే కాదు అందులో ఒక అద్భుతమైన ప్రణయ కావ్యం, తాత్విక కోణం దాగి ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉండే అలకలు, దబాయింపులు, ఒకరిపై ఒకరికి ఉండే ఆదిక్యత, మరియు విడదీయరాని బంధాన్ని ‘చీకటి – వెన్నెల – సూర్యుడు’ అనే ప్రకృతి శక్తుల ద్వారా చాలా చక్కగా ఎంతో లోతుగా ఆలోచించి చెప్పారు కవి. కవిత చివర్లో ఆధిపత్య పోరు తగ్గిపోయి చీకటి తన అమాయకత్వాన్ని, ప్రేమను పూర్తిగా వ్యక్తపరుస్తుంది. వెన్నెల మత్తులో మునిగిపోయిన చీకటి “నన్ను వదిలి వెళ్ళొద్దు, ఈ నిశ్శబ్ద రాత్రిలో నాతోనే ఉండిపో, నన్ను వలచిన కన్నెలా నాలోనే కలిసిపోయి కరిగిపో” అని వేడుకోవడం ద్వారా వారి మధ్య ఉన్న ఘాడమైన ప్రేమను కవి అద్భుతంగా అక్షరీకరించి చెప్పారు. “బాటసారి ప్రార్థన” కవిత అద్భుతంగా, భావగర్భంగా ఉంది. కష్టాలతో అలసిపోయిన ప్రయాణికుడు తనని సేద తీర్చమని ఒక సెలయేరును అంటే ప్రకృతిని ఆవేదనగా అభ్యర్థించిన తీరుని చాలా అందంగా వర్ణించారు జల్దీ విద్యాధర్ గారు. అలాగే ఈ కవితలోని పదజాలం చాలా మృదువుగా ఉండి ప్రవాహానికి ఆపాదించిన కరుణ, ప్రేమ, ఓదార్పు పాఠకుల మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. జీవితపు వైఫల్యాలనుండి, భగ్నమైన ఆశల నుండి విముక్తి కోసం ఒక ఆత్మ సాగించే అన్వేషణే ఈ బాటసారి ప్రార్థన. పదాలకూర్పు, భావోద్వేగాల వ్యక్తీకరణని కవి అద్భుతంగా చెప్పారు.

“జంట సరోవరాలు” కవిత అద్భుతమైన ప్రేమ ఆరాధనల సమ్మేళనం. కవి తన ప్రేయసి కళ్ళను జంట సరోవరాలు అంటే రెండు అందమైన సరస్సులుగా వర్ణిస్తూ ఆమెపై తనకున్న అపారమైన ప్రేమను చాలా సరళమైన పదాలతో వ్యక్తపరిచారు. ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమికుడి ఆరాధన. ప్రేయసి కళ్ళను ప్రపంచంలోని అత్యుత్తమ అందాలతో పోలుస్తూ జీవితాంతం ఆమె కనుల నీడలో ఒక భక్తుడిలా ఆమెను ప్రేమిస్తూ బతకడమే తన ఏకైక లక్ష్యంగా కవి ఈ కవితలో చాలా సున్నితంగా అభివర్ణించారు. “అవేకళ్ళు” కవిత చూడండి ఇందులో విద్యాధర్ గారు కళ్ళను ఎంత అందంగా వివరించి చెప్పారో. ఈ కవితలో కళ్ళ గొప్పతనాన్ని, వాటిలో దాగిన లోతైన భావాలను ముఖ్యంగా కుటుంబ బాధ్యతలను మోసే స్త్రీ మూర్తి కళ్ళను, చూపుల కలయికలోని మాయను చాలా అద్భుతంగా వర్ణించారు. ఇంకా మనిషి కళ్ళల్లో ఉండే ఎన్నో రకాల ఎమోషన్స్, కుటుంబాన్ని నడిపే ధైర్యం, బాధపడితే రాలే కన్నీరు, తప్పించుకోలేని ఆకర్షణ, ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమను వ్యక్తపరిచే విధానం వీటన్నింటిని కవి ‘అవేకళ్ళు’ అనే కవిత ద్వారా చాలా లోతుగా అర్థవంతంగా ఆవిష్కరించారు.

ఇప్పుడు “కోహినూర్” కవితలోని అందచందాలను చూద్దాం. ఈ కవిత నిజంగా అద్భుతమైన ప్రేమ కావ్యం. ఒక ప్రేమికుడు తన ఆరాధనను, విరహాన్ని, తన సర్వస్వ సమర్పణను ఎంత గొప్పగా చెప్పవచ్చో ఈ కవిత ఆవిష్కరించింది. ‘కోహినూర్’ అనే పేరుకు తగ్గట్టుగానే ఈ కవితలోని భావాలు అత్యంత విలువైనవిగా, ప్రకాశవంతంగా ఉన్నాయి. ఇది కేవలం ఒక అందాన్ని పొగిడే కవిత కాదు, ఒక మనిషిని దేవుడిలా ఆరాధిస్తూ తన అహాన్ని సర్వ స్వాన్ని ఆమె పాదాల వద్ద ఉంచి ఆమె స్వచ్ఛమైన ప్రేమతో తన జీవితాన్ని పవిత్రం చేసుకోవాలని ఆరాటపడే ఒక ఉన్నతమైన అలోౌకిక ప్రేమ కావ్యం. ఈ కోహినూర్ కవితకి విద్యాధర్ గారు అద్భుతమైన ముగింపుని ఇచ్చారు. ఇది ఈ కవితకే హైలెట్. తన ప్రేయసిని అత్యంత స్వచ్ఛమైన భగీరధి, మందాకిని నదితోను, తనను తాను ఎన్నో సుడిగుండాలు, అగ్నిపర్వతాలు, ఉప్పు అంటే కష్టాలు కల్మషాలు నిండిన సముద్రంతో పోల్చుకున్నారు. అంతటి స్వచ్ఛమైన నది పరుగు పరుగున వచ్చి తన సముద్రంలో కలిస్తే తనలోని కల్ముషాలన్నీ ప్రక్షాళన అంటే శుభ్రం అవుతాయని ఆ కలయిక కోసం భవసాగరుడిలా ఎదురు చూస్తూ ఉంటున్నానని కవి సంపూర్ణంగా శరణకోరారు. “పతాక శీర్షిక” కవిత బర్రెలక్క రాజకీయ జీవితానికి అద్దం పడుతుంది. బర్రెల శిరీష అంటే బర్రెలక్క అనే సామాన్య యువతి వ్యవస్థపై చేసిన తిరుగుబాటును, ఆమె పోరాటపటిమను ఎంతో శక్తివంతంగా కవి అభివర్ణించారు. ఒక సాదాసీదా అమ్మాయి అగ్ర రాజకీయ నాయకులకు సవాలుగా ఎలా నిలిచిందో ఈ కవితలో అద్భుతంగా అక్షరకరించి చెప్పారు విద్యాధర్ గారు. ఈ కవితలో కవి శిరీషను ఒక పల్లెటూరి అమ్మాయిగా కాకుండా తెలంగాణ వీరనారీమణుల వారసురాలిగా గొప్పగా చెప్పారు. అలాగే అధికారం ముందు అణిగి ఉండాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ప్రశ్నిస్తే ఒక సామాన్యురాలు కూడా చరిత్ర సృష్టించగలదు అన్న సందేశాన్ని కూడా ఇచ్చింది ఈ కవిత.

“నీవు-నేను-ఒక పుస్తకం” కవిత పేరులోనే కొత్తదనాన్ని సంతరించుకొని పుస్తకం, ప్రేమ అనే రెండు అందమైన అంశాల మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది. అక్షరాల సాక్షిగా మొదలైన ఒక పరిచయం ఒక వ్యక్తి జీవితాన్ని పరిపూర్ణం చేసిన వైనాన్ని విద్యాధర్ గారు చాలా చక్కగా తెలియజేశారు. ఇంకా పుస్తకం అనేది కేవలం చదువుకోవడానికి ఉపయోగించే వస్తువు కాదు. అది ఇద్దరు వ్యక్తులను కలిపే వారధి, జీవితానికి వెలుగునిచ్చే జ్యోతి, మరియు సంస్కారాన్ని నేర్పే గురువుగా చెప్పారు. తన ప్రియురాలినే ఒక పుస్తకంగా భావించి ఆమె ద్వారా తాను పొందిన జ్ఞానాన్ని ప్రేమను ఈ కవితలో చాలా చక్కగా చెప్పారు. “అవిశ్రాంత యుద్ధ వీరులు” కవిత మనిషి మస్తిష్కంలోనుంచి వచ్చే పోరాటాన్ని కవి కళ్ళకు కట్టినట్లు చెప్పారు. యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో ఆయుధాలతో చేసేది మాత్రమే కాదు. మన లోపల మనం చేసేది కూడా గొప్ప యుద్ధమే నని కవి చెప్పకనే చెప్పారు. కవి అంటారు మన కోరికలను అదుపులో ఉంచుతూ, కర్తవ్య మార్గంలో నడిచే వారే నిజమైన వీరులని, ఇంకా బయటి ప్రపంచంతో గెలవడం కంటే మన పరిస్థితుల మీద, మన మనసు మీద గెలిచి బాధ్యతగా బ్రతికే సామాన్యుడే ఈ కవితలో అసామాన్య వీరుడు అని చెప్పారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.

“అవన్నీ ఏమయ్యాయి” కవిత నేటి సమాజంలోని చేదు నిజాలను, రాజకీయ మార్పులను చాలా లోతుగా ప్రశ్నించారు కవి. ఈ కవిత ప్రధానంగా నైతిక విలువల పతనాన్ని, అధికార దాహాన్ని తెలియజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కవిత “ఆదర్శ భారతం” నుంచి “అవకాశవాద భారతం” వైపు మనం సాగిస్తున్న ప్రయాణాన్ని నిలదీస్తుంది. రాజ్యాంగం ఆశించిన రాగద్వేషాలకు అతీతమైన పాలన నేడు కరువైందని స్వార్ధ శక్తుల చేతులలో దేశం చిక్కుకుపోయిందని కవి ఆవేదనగా చెప్పారు. “ఆమె రూపం” కవితలో విద్యాధర్ గారు ఆమె అంటే స్త్రీ యొక్క బహుముఖ ప్రజ్ఞను, ఆమెలోని అనంతమైన భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించారు. స్త్రీ అంటే ఒక రూపం, ఆమె ఒక శక్తి స్వరూపం అని స్త్రీలపై ప్రశంసల వర్షం కురిపించారు కవి. ఇంకా స్త్రీలోని కోమలత్వాన్ని, కఠినత్వాన్ని, త్యాగాన్ని మరియు శక్తిని కవితలో అద్భుత మైన పదజాలంతో అభివర్ణించారు. ఆమె లేనిదే జగత్తు లేదని, ఆమె ప్రతీరూపం ఒక అద్భుతం అని తెలియజేశారు కవి. చివరిగా “సముద్ర భాష” కవిత ఇది కేవలం కవిత కాదు, ఇది ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని అంటే ఆచార్య కొలకలూరి ఇనాక్ గారిని ఒక మహాసముద్రంతో పోలుస్తూ సాగిన అద్భుతమైన భావన. కవి తన భక్తి, గౌరవాన్ని చాటుకొని గురువులకు నీరాజనాల అర్పించారు. ఈ కవిత సముద్రమంతటి జ్ఞానాన్ని, శిఖరమంతటి వ్యక్తిత్వాన్ని గౌరవించే గొప్ప ప్రశంస. ఒక గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి, ఆ గురువు నుండి ఏం నేర్చుకోవాలి అనే విషయాలని చాలా అందంగా బావుకత్వంతో చెప్పారు కవి. సముద్రం అస్తిత్వానికి, అభ్యుదయానికి నిదర్శనం అని చెబుతూనే ఆ వ్యక్తిత్వంలోని ప్రేమ, జ్ఞానం, సంస్కారం అనే మూడు బిందువులను కవి అద్భుతంగా ఆవిష్కరించారు.

ఈ కవితా సంపుటిలోని కవితలన్నీ మానవతా విలువలకు అద్దం పడుతూ, రాజకీయాల తీరుతనుల్ని తెలియజేస్తూ, ఇంత గొప్ప కవితా సంపుటి “కోహినూరు వజ్రం”ని పాఠకులకు అందించిన డాక్టర్ జల్దీ విద్యాధర్ గారికి శుభాకాంక్షలు.

పింగళి భాగ్యలక్ష్మి, కాలమిస్టు రచయిత్రి, ఫోన్ నెంబర్. 9704725609

Share via
Copy link
Powered by Social Snap