డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి కోకా విమలకుమారి విజయవాడలోని స్వగ్రహంలో 3-9-2025, బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో ఇంటివద్దనే వుంటున్నారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. శ్రీమతి విమలకుమారి కృష్ణాజిల్లా పులిగడ్డలో 1943 జులై 15 న జన్మించారు. ఆదిని సుబ్బారావు – శ్రీమతి శేషమ్మ తల్లిదండ్రులు. ఎం.ఏ. తెలుగు లిటరేచర్ చేశారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో వ్యాయామ విద్యా అధ్యాపకురాలిగా పని చేసి 2001లో ఉద్యోగ విరమణ పొందారు. భర్త కోకా నాగేంద్రరావు ఇప్పటికే కన్నుమూశారు. తెలుగు భాషా చైతన్య సమితి కార్యదర్శిగా, డా. ఊటుకూరు లక్ష్మీకాన్తమ్మ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలిగా అటు భాషకూ, సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారు. వివిధ సాహితీ సంస్థలకు ఆమె సేవలందించారు. అక్షర సందేశం, అరుణమి కోసం, నిశ్శబ్ద వేదన, నవ్యపథం కవితా సంపుటాలు, తరుణీ తరంగాలు, విమలభారతి, కనుపర్తి వరలక్ష్మమ్మ జీవితం-సాహిత్యం, శ్రీకృష్ణదేవరాయ ప్రతిభాపుష్పం-వ్యాస సంపుటాలు, పున్నమి నవ్వింది, మనసు కదిలింది కథా సంపుటాలు వెలువరించారు. 2010 నుండి 2014 మధ్యకాలంలో 64కళలు పత్రికలో కూడా కొంతమంది కళాకారుల పరియచయ వ్యాసాలు రాసారు.

1988లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి చేతులమీదుగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉగాది పురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడమీ వారి ఉత్తమ కవయిత్రి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం – హైదరాబాద్ వారి ఉత్తమ కవయిత్రి పురస్కారం, ఫౌండేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ వారిచే ఉత్తమ కవయిత్రి ఉగాది పురస్కారం, నాళం కృష్ణారావు – డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ అవార్డు, వి. ఆర్. నార్ల స్మారక విశిష్ట సేవా అవార్డు, ‘యునెస్కో’ ఇంటర్నేషనల్ -రేపల్లె వారి అవార్డు, వంశీ ఆర్ట్ థియేటర్స్ – ఇంటర్నేషనల్, హైదరాబాద్ వారిచే ఉత్తమ కవయిత్రి పురస్కారం, నెల్లూరి వారిచే నాగభైరవ కోటేశ్వరరావు స్మారక సాహితీ స్ఫూర్తి అవార్డు, పెన్నా రచయితల సంఘం వారి పురస్కారం 2013, ఇన్నర్వీల్ క్లబ్ ఏలూరువారిచే ఉత్తమ రచయిత్రి అవార్డు, తెలుగుభాషోద్యమ సమాఖ్య, గుంటూరు వారి ప్రతిభా పురస్కారం, నల్లూరి బసవ శంకర కళాపీఠం, విజయవాడ వారి పురస్కారం, పి.ఎమ్.కె.ఎమ్. ఫైన్ ఆర్ట్స్ వారి సేవారత్న అవార్డు, సాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ వారి బాలసేవారత్న అవార్డు, ఆకాశవాణి స్వర్ణోత్సవాల సందర్భంగా అప్పటి మంత్రివర్యులు మండలి బుద్ధప్రసాద్ గారిచే ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. డా. ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ గారి చేతుల మీదుగా ‘కవితరంగిణి’ బిరుదు, యునెస్కో రేపల్లె వారి ‘సాహితీ సరస్వతి’ బిరుదు, సాయిమంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారి ‘బాలసేవారత్న’ బిరుదు పొందారు. ఈమెకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె జన్మించారు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు పంచాయతీరాజ్‌లో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.
ఆమె భౌతికంగా దూరం కావడం సాహితీరంగానికి తీరని లోటు. ఆమెకు నివాళి అర్పిస్తుంది 64కళలు.కాం పత్రిక.
-కళాసాగర్
