కొంపెల్ల జనార్ధనరావు – జీవితం- సాహిత్యం

(కొంపెల్ల జనార్దనరావు (1907 – 1937) ప్రముఖ భావకవి, నాటక రచయిత. అతడు 1906 ఏప్రిల్‌ 15న తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, మోడేకుర్రులో జన్మించాడు. శ్రీశ్రీ తన మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చారు.)
రచనా ప్రస్థానం:
విశాఖపట్నం లోని ‘కవితా సమితి’ ద్వారా పురిపండా అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రేరణతో భారతి పత్రికలో చేరారు.
భారతి, ఆంధ్రపత్రిక, సుభాషిణి మొదలైన పత్రికలలో దాదాపు 25 కవితా ఖండికలను భావ కవితారీతిలో ప్రచురించారు. 1934 డిసెంబరులో ఉదయిని అనే ద్వైమాసిక సాహిత్య పత్రికను వెలువరించడం ప్రారంభించాడు. ఇతడు ‘తాన్ సేన్’, ‘తెలుగు’ అనే నాటికలు రచించారు. ఉదయిని అనే సాహితీ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఉదయిని సాహిత్య పత్రికను ఆయన ఆరు సంచికల కన్నా వెలువరించలేకపోయారు. సాహిత్యానికి ప్రజాభిమానం సంపాదించాలన్న గొప్ప ఆశయంతో అహర్నిశలు పనిచేసి పత్రికను కొనమని వాడవాడలా బిచ్చమెత్తారు. అప్పటి కొత్త కవులు నవ్యసాహిత్యపరిషత్ తరఫున స్థాపించుకున్న ప్రతిభ అనే సాహిత్య పత్రిక సాహిత్యపరుల అభిమానం చూరగొనడంతో ఉదయిని పత్రిక మరింత దెబ్బతింది. ఈ క్రమంలో ఆయన చేసిన శారీరిక, మానసిక శ్రమ వల్ల అనారోగ్యం దాపురించింది. ముద్రణ ఖర్చులు కొంపెల్ల ఇవ్వలేకపోవడంతో ముద్రాపకుడు ఉదయిని ఏడో సంచికను చిత్తుకాగితాలుగా అమ్మేశారు. ఈ అఘాతం తట్టుకోలేక, అనారోగ్యం తీవ్రమై క్షయ వ్యాధితో దుర్భర దారిద్ర్యంలో దీనస్థితిలో కొంపెల్ల మరణించారు.
శ్రీశ్రీతో సాన్నిహిత్యం:
1928లో శ్రీశ్రీ రచించిన ప్రభవను కొంపెల్ల సమీక్షిస్తూ తీవ్రంగా వ్యతిరేక విమర్శలు చేశారు. విచిత్రంగా ఆ విమర్శల వల్లనే కలిసి వీరిద్దరు మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి 1937లో కొంపెల్ల మరణించేవరకూ వారిద్దరి స్నేహం కొనసాగింది. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని అంకితమిస్తూ ఇతని గురించి కొంపెల్ల జనార్ధనరావు కోసం అనే కవిత రాశారు.

శ్రీశ్రీకి, కొంపెల్లకు ఏ రకమైన భావసారూప్యత లేకున్నా వారి మధ్య స్నేహం మాత్రం చాలా చక్కగా కలిసిపోవడం విశేషం. పైగా మహాప్రస్థాన కావ్యానికి ఏమాత్రం సంబంధం లేని భావాలు కలిగిన కొంపెల్లకు అతని మరణం, అందులోనూ సాహిత్య పత్రికలు వర్థిల్లాలన్న మహదాశయంతో మరణించడం వంటివి శ్రీశ్రీని కదిలించాయి. కొంపెల్ల ఉదయిని దెబ్బతినడానికి కారణమైన ప్రతిభ పత్రిక సంపాదకవర్గంలో ఒకరైన శ్రీశ్రీ పరోక్షంగా తన వల్ల జరిగినదానికి బాధ కూడా కలిసి మహాప్రస్థానం కొంపెల్లకు అంకితం చేయించివుంటుందని శ్రీశ్రీ చరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ అభిప్రాయం.

మహాప్రస్థానం అంకితం చేస్తూ అంకితం కవితను మహాప్రస్థానంలో ప్రచురించారు. అందులో అనాదరణతో అలక్ష్యంతో సాహితీ ప్రపంచం ఒక్కణ్ణీ చేసి వేధించి బాధిస్తే వెక్కివెక్కి ఏడుస్తూ దొంగలంజకొడుకు లసలే మెసలే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక, తలవంచుకుని వెళ్ళిపోయావా నేస్తం అని రాసుకున్నారు. తామిద్దరూ ఎక్కడెక్కడ ఎలా కలిసి తిరిగారో సాహిత్యమే సమస్తమనుకుని ఎలా కష్టాలు పడ్డారో స్మరించుకున్నారు. కొంపెల్ల మరణిస్తే ఆరేడుగురు తప్ప మరెవరూ దు:ఖించలేదన్నారు. నీవేమైపోయినా మా బురఖా మేం తగిలించుకున్నాం. మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి. మా నెత్తికి కొమ్ములలాగే అంటూ నిందించుకున్నారు. నిన్న వదిలిన పోరాటం నేడు, అందుకొనక తప్పదు. నిన్ను ఆవాహన చేసి కదనశంఖం పూరిస్తున్న నాలో ఆవేశించమని ఆయనను కోరారు.

కృష్ణా పత్రిక వీరికి “చండ ప్రచండ శిలాభినవ కొక్కొండ” అనే బిరుదు ప్రసాదించింది. ఈయన జూన్ 23, 1937 సంవత్సరంలో క్షయ వ్యాధితో కాలథర్మం చెందారు.

SA: