సాహితీ సుమవల్లి – కొండపల్లి నీహారిణి

తెలుగు సాహితీరంగంలో పరిచయం అవసరం లేని పేరు కొండపల్లి నీహారిణి.
8 డిసెంబర్, 1963లో వరంగల్ జిల్లాలోని చిన్న పెండ్యాల గ్రామంలో పెండ్యాల రాఘవరావు, కౌసల్యాదేవి దంపతులకు జన్మించిన నీహారిణి ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఎం.ఏ తెలుగు, తెలుగు పండిత శిక్షణ, ఉస్మానియాలో 20 ఏళ్ళ బోధనానుభవం, ఒద్దిరాజు సోదరుల జీవితం – సాహిత్యం అనే అంశం పై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. నిత్య విద్యార్థిగా, నిరంతర సాహిత్య పఠనం, పెద్దల మాటలను, కొత్త గొంతుకలను వినడం ఇస్టం.

‘సమాజంలోని దాష్టీకాలను చూస్తే అలజడులు చెలరేగి దు:ఖిస్తూనో, ఎదిరిస్తూనో కలం కాగితంపై కవిత్వమౌతుంది. చదివిన చదువును సార్థకత చేసుకోవడానికి కవయిత్రిగా, రచయిత్రిగా, సాహిత్య పరిశోధకురాలిగా, సాహిత్య విమర్శకురాలిగా కృషి చేస్తున్నాను..’ అని చెప్పుకునే నీహారిణి ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, ఎన్నో సభల్లో ఉపన్యసించారు. ఎన్నో పత్ర సమర్పణలు చేశారు. సమీక్షలు, పీఠికలు రాయడంలో కూడా నీహారిణి అందెవేసిన చేయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘స్త్రీల వచన సాహిత్యం ‘ పై రవీంద్ర భారతి వేదిక మీద ప్రసంగించి శ్రోతల మన్ననలు పొందారు.

నీహారిణి ఇప్పటి వరకు 11 పుస్తకాలు ప్రచురించారు. ఇందులో అర్హతలుపులు, నిర్నిద్రగానం, ఎనిమిదో అడుగు అనే కవితా సంపుటాలు, రాచిప్ప అనే కథా సంపుటి, రెండు సాహిత్య విమర్శ వ్యాస సంపుటులు, ఒకటి జీవిత చరిత్ర, ఒకటి యాత్రా చరిత్ర, ఒకటి పరిశోధనా గ్రంథం, రెండు స్వీయ సంపాదకత్వ పుస్తకాలు ఉన్నాయి.

తెలుగు అకాడెమీ వారి ఆధ్వర్యంలో మూడు జీవిత చరిత్రలు కూడా రచించారు. మదిలోంచి డాట్ కామ్ అనే కవిత్వం, మృత్యుంజయుడు అనే నవలిక, బందూక్ అనే నవలా విశ్లేషణా పుస్తకం అముద్రితాలు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్ వారి గౌరవ పురస్కారం, తిరుమల స్వరాజ్యలక్ష్మి స్మారక సాహితీ పురస్కారం లాంటి అవార్డులెన్నో సాధించారు.
నీహారిణి నాన్నగారు సాయుధ పోరాట వీరుడు, కమ్యూనిస్ట్ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, వరంగల్ జిల్లా ప్రథమ పార్లమెంటేరియన్, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్.పీ.గా ఘన విజయం సాధించిన పెండ్యాల రాఘవరావుగారైతే, ప్రఖ్యాత చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావుగారు నీహారిణి మామగారు కావడం విశేషం.

కొండపల్లి నీహారిణి మున్ముందు మరిన్ని ఉత్తమ గ్రంథాలు రాసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలనీ ఆకాంక్షిద్దాం.

SA: