కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి

రంగస్థల దర్పణం – 2

‘గుంటూరు హిందూ నాటక సమాజము’ అనేది తెలుగుదేశమందు స్థాపించబడ్డ నాటక సమాజాలలో మూడవది, తెలుగు నాటక సమాజాలలో రెండవది, విద్యార్ణేతరులు సభ్యులుగాగల తెలుగు నాటకసమాజాల్లో మొదటిది. దీనినే ఉత్తరకాలములో ‘గుంటూరు ఫస్ట్ కంపెనీ’ పేరుతో వ్యవహరించినారు. స్థానికంగానే కాక మిగిలిన ప్రాంతాలలోనూ ప్రదర్శనలిచ్చిన ‘తొలి సమాజం’గా ఘనచరిత్ర ఈ కంపెనీ సొంతం. అట్టి విశిష్ట సమాజ వ్యవస్థాపకునిగా, నిర్వాహకునిగా, దేశికునిగా, బహు నాటకకర్తగా తన బహుముఖీన ప్రజ్ఞతో తెలుగు ‘నాట’క వికాసానికి పటిష్టమైన పునాది వేసిన కారణజన్ముడు, నాట్యకళాతపస్వి ‘కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి’.

కొండుభొట్లవారు తెలంగాణాలోని మధిర తాలూకు ‘విప్పలమడక అగ్రహారము’లో 1852-53 ప్రాంతాన జన్మించారు. వీరి తల్లిదండ్రులు ‘వీరమ్మ, గోపాలకృష్ణ శాస్త్రి’లు. సతీమణి పేరు ‘అద్వైత బ్రహేశ్వరమ్మ’. పుత్ర సంతతి లేనందున వీరు తన అన్న కుమారులైన ‘గోపాలకృష్ణయ్య’ను దత్తత గైకొన్నారు. తొలితరం నాటకకర్త ‘వావిలాల వాసుదేవశాస్త్రి’ వీరునూ మేనమామ, మేనత్త బిడ్డలు. అంతేకాదు వావిలాలవారి పినతండ్రే వీరి మామగారు. కారణాంతరాలచే వీరి తండ్రి వీరి బాల్యంలోనే వావిలాలవారి జన్మస్థలమౌ రేపల్లె తాలూకాలోని ‘కారుమూరు’ గ్రామానికి వచ్చి స్థిరపడినారు. వీరు స్థానికముగానే మెట్రిక్యులేషన్ వరకు చదివారు. ఆపై గుంటూరులోని ‘American Evengical Luthern Mission School’లో 1884 వరకును, పిదప 1889వరకు ‘Govt. High School’లో తెలుగు పండితులుగ పనిచేశారు. తరువాత 1889 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో చెన్నపురిలోని ‘పచ్చయ్యప్ప కళాశాల’లో ప్రధానోపాధ్యాయులుగా చేరి ట్రిప్లికేనులో కాపురం పెట్టి, కడదాక మదరాసులోనే జీవించారు. గుంటూరు మిషన్ హైస్కూల్ పనిచేయు కాలంలో కొండుభొట్ల వారు పాఠశాల వార్షికోత్సవాలలో తాను వ్రాసిన ‘వినోద సంభాషణలు’ తమ శిష్యులచే చదివిస్తుండేవారు. ఈ దశ (1880-81)లో ‘ధార్వాడ కంపెనీ’ ఆంధ్రావనిలో పర్యటించి హిందుస్థానీ నాటకాలను ప్రదర్శించింది. వాటి స్ఫూర్తితో తెలుగు ‘నాట’క ప్రయోగానికి సంకల్పించిన వారిలో ‘కందుకూరి, కొండుభొట్ల, నాదెళ్ళ’వారు ఆద్యులు. ఐతే వీరిలో ‘కందుకూరి’ వారు తన ‘వివేకవర్ధిని సమాజం’ ద్వారా తమ విద్యార్థులచే కొన్ని నాటక ప్రదర్శనలు వేయించారు. కాని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన తీవ్ర నిరసనతో ఈ సమాజం కార్యకలాపాలను అతిస్వల్పకాలంలోనే నిలిపివేయాల్సివచ్చింది. కొండుభొట్ల వారి సమాజం మాత్రం విద్యార్థుల, విద్యార్ణేతలతో కూడి మూడు దశాబ్దాల పైబడి దిగ్విజయంగా నడిచినది. దీనిద్వారానే ‘హరి ప్రసాదరావు, కొండా వెంకటప్పయ్య, కోపల్లె హనుమంతరావు’ ఇత్యాదులు వెలుగులోకి వచ్చి ఎంతో యెదిగి తమ మాతృ సంస్థకి ఎనలేని కీర్తిప్రతిష్ఠలు సముపార్జించిపెట్టారు. ఐతే యిక్కడో చారిత్రక వివాదానికి పసుమర్తి యజ్ఞ నారాయణశాస్త్రి తమ ‘ఆంధ్ర నటప్రకాశిక’ ద్వారా తెర తీసారు. ఈ గ్రంథంలోని 304, 307 పుటల్లో 1880-82 లలో ‘బందరు హిందూ థియేటర్, 1882-84 లలో ‘గుంటూరు హిందూ నాటకసమాజము’ స్థాపించబడినదని వ్రాసారు. అంటే దీని ప్రకారం ‘గుంటూరు హిందూ నాటకసమాజము’ కన్నా ‘బందరు హిందూ థియేటర్’ ముందు స్థాపించబడినదన్నమాట. ఈ అభిప్రాయం ఎంతమాత్రం సరియైనదికాదు. ఎలా కాదో, చారిత్రక ఘటనల వరుసక్రమాన్ని విశ్లేషిద్దాం. ‘9-11-1883న వావిలాలవారు తన ‘ఉత్తర రామచరితము’కు వ్రాసుకున్న ఆంగ్లపీఠికలో 1883కు పూర్వం ఆంధ్రదేశంలో బయలుదేరిన నాటకసమాజాల గురించి ప్రస్తావించుతూ ‘కందుకూరి, కొండుభొట్లు’ వారి సమాజాలను పేర్కొన్నారే తప్ప ‘బందరు హిందూ థియేటర్’ గురించి ప్రస్తావించనేలేదు. వావిలాలవారికి ‘బందరు, రాజమండ్రి’ పట్టణాలతో వృత్తిరీత్యాను- గుంటూరు నగరముతో బంధుత్వం రీత్యాను అత్యంత సన్నిహిత సంబంధాలు కలవని ఈ సందర్భంలో గమనించాలి. కనుక బందరు హిందూథియేటర్-1883 తర్వాత, గుంటూరు హిందూ నాటక సమాజం-1883కు ముందు స్థాపించబడినదని స్పష్టమౌను. మరో చారిత్రాకాధారాన్ని పరిశీలించుదాం – అది బందరుకే చెందిన ‘నాదెళ్ళ పురుషోత్తమ కవీంద్రులు’ తమ ‘రామదాసు చరిత్రం’ అనే హిందుస్థానీ నాటకానికి వ్రాసిన ‘తెలుగుపీఠిక’లో బందరులో ‘ధార్వాడ కంపెనీ” 1881లో హిందుస్థానీ నాటకాలు ప్రదర్శించినాదని పేర్కొన్నారంటే బందరు హిందూ నాటకసమాజం 1881కి ముందు స్థాపించబడలేదు. దీనికితోడు కొండావారి స్వీయచరిత్ర, ఆచార్య పోణంగివారికి విజయనగరముకు చెందిన వకీలు ‘వసంతరావు బ్రహ్మాజిరావు’ తెలియజెప్పిన విశేషాలలోనూ ‘బందరు హిందూ థియేటర్’ గురించి ఎలాంటి ప్రస్తావనలేదు. కనుక తెలుగునాట నెలకొల్పబడిన నాటకసమాజాల్లో మొదటిది ‘సంస్కృత నాటకాలు’ మాత్రమే ప్రదర్శించిన ‘జగన్నాధ విలాసనీసభ (విజయనగరం). రెండవది విద్యార్థులతో ఏర్పడిన కందుకూరివారి ‘వివేకవర్ధిని సమాజం (రాజమండ్రి)’. దీనినిబట్టి ‘కొండుభొట్ల వారి గుంటూరు హిందూ నాటకసమాజం తెలుగు గడ్డపై స్థాపించబడిన సమాజాల్లో మూడోది, తెలుగు నాటకసమాజాలలో రెండోవది, విద్యార్ణేతరులతో ఏర్పడి ఆంధ్రావనిలో పర్యటించి ప్రదర్శనలిచ్చిన వాటిల్లో మొదటిదనే సత్యం స్పష్టమౌచున్నది.

కొండుభొట్లవారిచే స్థాపించబడిన ఈ సమాజంగురించి దేశభక్త ‘కొండా వెంకటప్పయ్య’ తన స్వీయచరిత్రలో చాలా వివరాలు తెలియజేశారు. ఈ గ్రంథంలోని 21, 23, 24 పుటలలో వీరు ‘అప్పుడు (1880 ప్రాంతాలలో) మాకు ఆంథ్రోపాధ్యాయులగు కొండుభొట్ల వారు కొన్ని నాటకములును తెలుగు వచనశైలిని వ్రాసి, వానిని ప్రద ర్శించవలెనని కూతూహలపడుచు, కొందరు విద్యార్థులతో పాటు నాటకాలయందు ప్రీతిగలవారిని చేర్చి, సొమ్ము సంపాదించవలెనను ఉద్దేశ్యముతోగాక కేవలం ఆత్మానందం నిమిత్తం ప్రజలను ఆనందింపజేయుటకు ఉద్దేశించి ‘గుంటూరు హిందూ నాటక సమాజమను’ నొక సమాజమును స్థాపించిరి. ‘శ్రీరామ జననం, సీతాకల్యాణం, ప్రహ్లాద నాటకం, హరిశ్చంద్రోపాఖ్యానం’ మొదలగు నాటకములు వేసవి శెలవులలో వరుసగ కొన్ని సంవత్సరాలు ప్రదర్శింప జేయుచు వచ్చిరి. వీరి రచనలు రసపూరితములై మిక్కిలి జనరంజకములుగా నుండెను. కొందరు సమర్థలగు నటులు నేర్పడిరి. పాత్రలకు కావలసిన దుస్తులు, అలంకారములు మొ॥గు పనులు సర్కారు కచ్చేరీలలో గుమాస్తాలగు పొత్తూరు కృష్ణయ్య, భువనగిరి హనుమద్దీక్షితులు, భాగవతుల రాఘవయ్యగార్లు – గుంటూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులగు ‘భాగవతుల చెన్నకృష్ణయ్య’ చాలా శ్రద్ధతో జరిపేవారని, ‘మల్లాది సోమయాజులు, ఇవటూరి వియ్యన్నలు విదూషక వేషములను – కలపటపు నరసింహం (ఉత్తరకాలాన బందరులో సెకండ్ గ్రేడు ప్లీడరుగా పనిచేశారు) గారు నాయకభూమికను – కొండా వెంకటప్పయ్య, చెన్నూరు సూర్యప్రకాశరావు, భువనగిరి సూర్యనారాయణలు ‘స్త్రీ’ పాత్రలను నిర్వహించెడి వారనీ, ఇక ‘విశ్వామిత్ర’ వేషం ధరించెడి మంగళపల్లి శాస్త్రి ప్రసంగాలు మిక్కిలి శ్లాఘ్యాలుగ నుండేవని, స్త్రీ పాత్రధారులలో కొంచెం అందము తగ్గినా కథను నడిపించు సామర్థ్యమధికంగా వుండుటచే కొండా వెంకటప్పయ్య ‘స్త్రీ’ పాత్రపోషణ సందర్బోచిత రసపోషణతో ప్రేక్షక హృదయాలను అలరించేదనే ఇత్యాది విశేషాలు వివరంగా తెలియవస్తున్నాయి. ఈ నాటకసమాజం వారు గుంటూరులోనే కాక రాజమండ్రి తదితర ప్రాంతాల్లో పలు ప్రదర్శనలిచ్చారు.

శాస్త్రిగారి రచనా వ్యాసంగానికొస్తే – వీరు మొతం ’32 నాటకాలు’ వ్రాశారు. వానిలో 31 నాటకాలు గుంటూరు హిందూ నాటక సమాజం కొఱకే వ్రాశారు. ఒక్క ‘వస్తాపహరణం’ మాత్రమే మదరాసులోని ‘దీన పోషకసభ’ వారికి వ్రాసియిచ్చారు. ఐతే గుంటూరు సమాజంవారు శాస్త్రిగారి రచనలు కేవలం తమకు మాత్రమే ఉపయుక్తం కావలెనను భావం కలవారౌటచే, వారికిచ్చిన 31-నాటకాలు ముద్రితం కాలేదు. మదరాసు వారికిచ్చిన ‘వస్తాపహరణం (1895) మాత్రం 1896లో ప్రచురింపబడినది. ఐతే వీరి వ్రాతప్రతులూ అలభ్యాలు. 13 నాటకాలను శాస్త్రిగారి దత్తపుత్రులు గోపాలకృష్ణయ్య సేకరించి, రెండు బౌండు పుస్తకాలలో చక్కగా తిరిగి వ్రాయించారు. ఐతే వారి సమీప బంధువులగు ‘చల్లా జగన్నాధశర్మ’ వాటిని ప్రచురించవలెనను ఉద్దేశ్యంతో ‘ఆంధ్రపత్రిక కార్యాలయం’కు తీసుకుని వెళ్ళినారు. వాటి ముద్రణకు శ్రీకారం చుట్టేలోపే వారు ఆకస్మికంగా మృతి చెందటముతో వాటి ఆచూకీ కూడా తెలియరాలేదు. నాటక సాహిత్య చరిత్రలో ఇదొక చారిత్రక విషాదం. ‘శాస్త్రిగారి రచనలన్నీ వచననాటకాలే. అంతమాత్రాన, అందు పాటలుండవని భావింపరాదు. పద్యములు మాత్రం వుండవు. ఒక్కొ ‘వస్త్రాపహరణము’ మాత్రం దీనికి మినహాయింపు. ప్రదర్శనీయ సౌలభ్యతను దృష్టిలో వుంచుకుని ఒక దృశ్యం ప్రదర్శిస్తుంటే వెనుక తదుపరి ‘దృశ్యసజ్జీకరణ’కు వీలుగా వుండేలా రంగాలు వుంటాయని’ వీరి రచనలని విఖ్యాత రచయిత, అభినయ అధ్యాపకులు శ్రీనివాస చక్రవర్తి విశేషించారు. వారి రచనలలో ‘గయోపాఖ్యానం, శ్రీయాళరాజు చరిత్ర, వజ్రదంష్ణోపాఖ్యానం, శుకరంభా సంవాదం, సుభద్రా పరిణయం, హరిశ్చంద్రోపాఖ్యానం, ద్రౌపదీ వస్త్రాపహరణం, శశిరేఖా పరియణం, కీచక వధ, శ్రీరామ జననం, సీతాకళ్యాణం, సీతాపహరణం, సీతాన్వేషణం, సుగ్రీవపట్టాభిషేకం, యుగంధర విజయం, శివాజీ విజయం, వస్త్రాపహరణం’లు ప్రధానమైనవి. వీటి యితివృత్తాలను, పేర్లను పరిశీలించితే – నేడు తెలుగుదేశంలో చిరపరి చితమైన పలు నాటకాల ఇతివృత్తాలను వీరు ఆనాడే (1881-84) ప్రప్రథంగా వెలుగులోకి తెచ్చి పలువురికి మార్గదర్శకంగా నిలిచిన సంగతి ఓ చారిత్రక సత్యంగ మనకు స్పష్టమవుతుంది. ఉదాహరణకు వీరి గయో పాఖ్యాన నాటక ప్రదర్శన చూచియే తాను గయోపాఖ్యానం రచనకుపక్రమించినట్లు చిలకమర్తివారే స్వయంగా వావిలాల సీతారామశాస్త్రి గారితో పేర్కొన్నారన్న విషయం స్ఫురణకు తెచ్చుకుంటే శాస్త్రిగారి రచనలు తెలుగునాట పలువురు రచయితలకు మార్గదర్శకాలుగ నిలిచాయనుటలో సందేహపడనక్కర్లేదు.

వీరు నాటకాలేకాక ‘ప్రళయభైరవము’ అను నవలకూడా వ్రాసారు. ఇది ‘బ్రేవో ఆఫ్ వెనిస్’ అనుదానికి అను సరణయట. వీరు పలు పాటలుకూడా వ్రాసారు. జీవితాంతం నాటకాన్ని ప్రేమించి, ఆరాధించి, దాని వికాసానికి నిరంతరం యోచించి శ్రమించిన కొండుభొట్లవారు మరణించేవరకు నాటకాన్నే పలవరించారు. చివరకు మృత్యుశయ్య మీదనుండి కూడా తనను పరామర్శించ వచ్చిన ‘వావిలాల శివావధాని’ని మదరాసులో ‘పార్శీ కంపెనీ’ నాడు ప్రదర్శిస్తున్నట్టి నాటకాలును చూచివొచ్చి, విశేషాలు తనకు చెప్పమని కోరి, వారిని బలవంతము పెట్టి నాటక ప్రదర్శనకు పంపారు. నాటకమన్న వారికంత వ్యామోహం. ఇలా జరిగిన మఱునాడే అనగా ‘హేవళంబి జ్యేష్ఠ శుద్ధ సప్తమి(06-06-1897)న కొండుభొట్లవారు నటరాజైక్యమొందారు.

ఇలా తన నాటకరచనల వలనకాని, ప్రదర్శనల వలనకాని ఒక్క కానీ కూడా ఆశించక నిస్వార్ధముగ నాటకకళా వికాసానికి కృషి చేసిన కొండుభొట్ల వారు కూడా తన బావగారైన ‘వావిలాల వాసుదేవశాస్త్రి గారి వలనే ‘ఆర్గా యుష్కులు కూడా కాకుండానే నటరాజైక్యమొందుట ఆంధ్రుల దురదృష్టం. వీరికి ‘సుబ్రహ్మణ్యం, సుబ్బారాయుడు’ అను నామాంతరాలు కలవు. ‘వస్త్రాపహరణం’ నాటకంలో ‘సుబ్బారాయుడు’ అనియే కలదు.
-మన్నె శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap