పల్లె జన జీవన చిత్రాలే ఆయన నేస్తాలు …

కళ అనేది ఒక వరం. అది సహజంగాను, యత్నపూర్వకంగానూ రెండు రకాలుగా కూడా మనిషికి అలవడుతుంది. అయితే ప్రయత్నంవలన వచ్చిన దానికంటే సహజంగా వచ్చేడి కళలో ఒక స్వచ్చత, ప్రత్యేకతలు కనబడతాయి. అలాంటి స్వచ్చమైన కళకు మరింత సాధన తోడయితే ఏ వ్యక్తైనా తాననుకున్న రంగంలో మంచి కళాకారుడిగా రాణిస్తారు. తద్వారా సమాజంలో ఒక మంచి గుర్తింపును, ప్రత్యేకతను సంపాదించుకుంటారు. అలాంటి విశిష్టమైన కళాకారులలో ఒకరు శ్రీ కొండూరు నాగేశ్వరావు గారు.

గ్రామీణ నేపధ్యాన్నితన చిత్రాలకు ప్రేరణగా ఎంచుకుంటూ స్వచ్చమైన ఆ గ్రామీణ జనావళిని, వారి జీవన రీతిని తనదైన శైలిలో కుంచె తో కాన్వాస్ పై ఆవిష్కరిస్తూముందుకు సాగుతున్న చిత్రకారుడు శ్రీ కొండూరు నాగేశ్వర రావు. పనికి పోతున్న పల్లె జనాలు. సంతకేగుతన్నమహిళలు, పల్లె గోపాలుడు రాధమ్మలు, అరుగుపై అమ్మలక్కల ముచ్చట్లు, ప్రకృతిని ఆస్వాదిస్తున్నపల్లె పడుచుపిల్లలు, పిల్లాడిని భాద్యతతో బడికి పంపిస్తున్న అమ్మలు, పనికిపోయిన భర్త రాక కోసం ఎదురు చూస్తున్న భార్యామణులు, పల్లెల్లో కనిపించే గోవులమందలు, వాటిని కాపుకాసే గోపాలుల్లు, బ్రతుకు పోరులో పోరాడుతున్న వివిధరకాల గ్రామీణ జనావళిని వీరి చిత్రాలలో మనం చూస్తాము .ఈ చిత్రాల్లో మిరుమిట్లు గొలిపే అందం సౌందర్యాలు కనపడవు. సహజత్వం కనబడుతుంది, పల్లె జనాల మోముల్లో కనిపించే ఒక విదమైన మోటుతనం,మొరటుతనం కనబడుతుంది. అచ్చమైన స్వచ్చమైన సహజ సౌందర్యం వుట్టిపడుతుంది. చూసే ప్రేక్షకునికి ఈ చిత్రాల్లోని వ్యక్తులు అచ్చం మన వూరి మనుషులే కదా అన్న భావన కలుగుతుంది. ఇప్పటికే పదకొండు వ్యక్తిగత ప్రదర్శనలు, సామూహికంగా యాబైకి పైగా ప్రదర్శనలు చేసి నేడు తన పన్నెండవ వ్యక్తిగత ప్రదర్శనగా ‘విస్టా ఆర్ట్ గేలరి ‘ హైదరాబాదు నందు ఈ ఆగస్ట్ 11 వ తేది నుండి 20 తేదీ వరకు జరుగుతున్న సందర్భంగా వీరి పరిచయం మీ కోసం.

శ్రీనాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలో గల పెద రావూరు అనే గ్రామంలో చిత్రకళా నేపధ్యం ఏమీ లేని కుటుంభంలో శ్రీ కొండూరు సూర్యారావు శ్రీమతి పార్వతివర్ధనమ్మ అనే దంపతులకు 1955 లో జన్మించారు. సహజంగానే వీరికి చిత్రకళపై ఆసక్తి ఏర్పడడంతో చిన్నతనం నుండే పత్రికలలో వొచ్చే ,వడ్డాది పాపయ్య, బాపు తదితరుల చిత్రాలను చూసి వేస్తూ స్వయంగా కళాసాధన చేయడం ప్రారంబించారు. ఆ తరవాత మద్రాస్ వెళ్లి ఒక సినిమా పబ్లిసిటీ సంస్థలో చేరి మరింత పరిణతిని సాదింఛి కొంతకాలం అక్కడ సినీ పబ్ల్లిసిటి ఆర్టిస్ట్ గా కూడా పనిచేసారు. ఆ కాలంలో వడ్డాది పాపయ్య గారు కూడా మద్రాస్ లో ఉంటూ చందమామ పత్రికకు వేస్తుండే బొమ్మల ప్రేరణతో నాగేశ్వరరావు గారు కూడా చిత్రాలు వేస్తూ వాటిని తరచూ వపా గారికి చూపిస్తూ వుంటుంటే ఎంతకాలం నా బొమ్మలు నాకు చూపిస్తావ్ …? నీదంటూ సొంత బొమ్మలను ఎప్పుడేస్తావు అని నిలదీయడంతో నాటి నుండి తనదైన స్వీయ శైలిలో చిత్ర రచనకు శ్రీ కారం చుట్టారు. తను పుట్టి పెరిగిన పల్లెటూరు జన జీవనాన్ని వస్తువుగా చేసుకుని తనదైన శైలిలో వాటిని గీయడం ప్రారంబించారు. స్వయంగా తాను గ్రామాల్లో చూసే దృశ్యాలు, అనుభవాలు మరియు తన స్మ్రుతులనుండి స్పురణకు వచ్చిన వాటినన్నింటిని నేడు తనదైన రేఖ మరియు రంగుల్లో కాన్వాస్ పై ఆవిష్కరిస్తూ నేడు అందరిని అలరిస్తున్నారు.

మొదట్లో తెలుగులో ప్రముఖ దిన వార మాస పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, స్వాతి, ఆంధ్రభూమి, విపుల చతుర తదితర పత్రికలలోని కధలకు ఎన్నో రేఖాచిత్రాలు గీసారు. 1985 లో మద్రాస్ నుండి హైదరాబాద్ వొచ్చి మల్కాజ్ గిరిలో స్థిరపడిన తర్వాత పూర్తి స్థాయి చిత్రకారునిగా మారి రాష్ట్ర జాతీయ స్తాయిలలో జరిగే అనేక చిత్రకళా ప్రదర్శనలలోను వర్క్ షాపుల్లో కూడా పాల్గొంటూ నేడు పూర్తి స్థాయి కళాకారుడిగా జీవనాన్ని సాగిస్తున్నారు.

వ్యక్తి గతంగా ఇప్పటికే పదకొండు ప్రదర్శనలు విజయవాడ, హైదరాబాద్ ,చెన్నై,బెంగుళూర్ ,పూనే ,బొంబాయ్ ,భువనేశ్వర్,తదితర ప్రదేశాలతో బాటు సౌది అరేబియా మరియు అమెరికా లోని టేక్షాస్ నగరంలో కుడా చేసి నేడు మరలా హైదరాబాదు నందు మరోసారి తన చిత్రాలను ప్రదర్శనకు ఉంచ బోతున్నారు. సామూహికంగా రాష్ట్రంలో అమలాపురం, రాజమండ్రి,గుంటూరు, తెనాలి. రాజోలు,నెల్లూరులతో బాటు రాష్ట్రానికి ఆవల ఇతర ప్రధాన నగరాలలో జరిగిన యాబైకి పైగా ప్రదర్శనలోనూ పోటీలలోను తన చిత్రాలను ప్రదర్శించారు మహారాష్ట్ర నందలి పూణే చిత్ర ప్రదర్శనలో బాలగంగాధర్ తిలక్ పేరున కాష్ అవార్డ్ తో పాటు. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నుండి 10 వేల నగదుబహుమతి కోనసీమ చిత్రకళా పరిషద్, రాజమండ్రి చిత్రకళా నికేతన్ అజంతా కళారామం లాంటి ఎన్నో సంస్థలనుండి కూడా నగదు బహుమతులతో బాటు వివిధ రకాల స్థాయిలలో ఎన్నో బహుమతులను సత్కారాలను అందుకున్నారు. వీరి చిత్రాలు దేశంలోని కొన్ని కళా సంస్థలు మరియు వ్యక్తుల సేకరణలో కూడా వుండడం గొప్ప విషయం.
ఏ కళ అయినా రాణించాలంటే దానిలో ఒక స్వచ్చత వుండాలి. నిజాయితీ వుండాలి. ఈ రూపంలోనైనా చిత్రకారుడు తనదే అయిన ఒక ప్రత్యేకతను తన చిత్రాల్లో కనిపింప జేయాలి. వీటితో పాటు అది ఎంతోకొంత సమాజాన్ని కూడా ప్రతిభిమ్భింప చేసిననాడు అది మరింతగా రాణిస్తుంది. కొండూరు నాగేశ్వరరావు గారి చిత్రాలలో ఇవన్నీ వున్నాయి కనుకనే ఆయన ఒక మంచి కళాకారుడు గా రాణిస్తున్నారు. నేడు విస్టాఆర్ట్ గేలరి హైదరాబాదు నందు జరగుతున్న తన 12 వ వ్యక్తిగత చిత్ర ప్రదర్శనతో బాటు దిగ్విజంగా సాగుతున్న వీరి కళా యానం మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని కోరుకుందాం.

-వెంటపల్లి సత్యనారాయణ

4 thoughts on “పల్లె జన జీవన చిత్రాలే ఆయన నేస్తాలు …

  1. Thank you very much for Publishng beautiful article about mine. But only thing is I have completed “80” shows until now.
    Any way thank you so much.

  2. నాగేశ్వర రావు గారూ, మీరు మరింత ఖ్యాతి గాంచాలని మా అందరి ఆకాంక్ష!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap