కోనేటి సుబ్బరాజు పరిషత్ ఆగింది!

“మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది సర్. మీ గురించి నాలుగు మాటలు చెప్పండి రాస్తాను” అని చాలాసార్లు అడిగాను అతన్ని. “అబ్బే నాగురించి రాయడానికి ఏముందండి. చెప్పడానికి ఏమీ లేదు. టీటీడీలో చిన్న ఉద్యోగం. రంగస్థలం అంటే ప్రాణం. నా సంపాదనలో సగం నాటక రంగంలో ఖర్చు అయిపోతుంటుంది. అదొక తుత్తి అంతే” అని నవ్వేవారు. ఆయనే కోనేటి సుబ్బరాజు. తిరుమల తిరుపతి దేవస్థానముల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కోనేటి సుబ్బరాజు కళా పరిషత్ వ్యవస్థాపకులు. 45 ఏళ్ల పాటు పరిషత్ నిర్వహించిన పౌరాణిక, చరిత్రాత్మక నటుడు, దర్శకుడు కోనేటి సుబ్బరాజు. ఇవాళ పరిషత్ శాశ్వతంగా ఆగిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండె ఆగింది. 12 గంటల సమయంలో హఠాత్తుగా గుండె పోటుకు గురై కుప్ప కూలిపోయారు. ఆసుపత్రికి చేర్చిన గంటలోనే కనుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు.

టీటీడలో సూపరింటెండెంట్ గా వున్నప్పుడు సుబ్బరాజు పరిచయం అయ్యారు. ఎంతో ఒదిగి ఉండే తత్వం. ఉద్యోగం ఏం చేసారో ఏమో కానీ, జీవితమంతా నాటకరంగం కోసమే తపించారు. నాటకమే ఊపిరిగా బతికారు. ఎప్పుడు ఫోన్ చేసినా ఇది చేస్తున్న, ఈసారి అది చేస్తున్న, ఇలా చేయాలనుకుంటున్న.. ఇలాగే చెబుతుండే వారు! అలా నాటక వికాసం కోసం తపించే వారు కొందరే ఉంటారు! ఎలాంటి పేరు ప్రఖ్యాతల కోసం కాకుండా తనకు అత్యంత ఆనందం ఇచ్చే రంగంలో ఇష్టంగా పని చేసుకుంటూ వెళ్లే వారిని వేళ్ళ మీద లెక్కపెడితే అందులో సుబ్బరాజు ఉంటారు.

పరిషత్ నిర్వహించడం ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటిది 45 ఏళ్ల పాటు, అందునా పౌరాణిక పరిషత్ నిర్వహించడం సుబ్బరాజుకే చెల్లింది. గంభీరమైన స్వరంతో పద్యం హృద్యంగా పాడే సుబ్బరాజు అనేక పౌరాణిక విలన్ పాత్రలు పోషించి మెప్పించారు. రాయలసీమలో శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను అధికసార్లు ధరించిన నటుడు సుబ్బరాజు.

సుబ్బరాజు ఊరు ఒంటిమిట్ట. టీటీడీ లో చిన్న ఉద్యోగిగా మొదలై AEO స్థాయికి చేరుకున్నారు. అటు ఉద్యోగం ఇటు నాటకం. రెండు పడవల్లో కాలు పెట్టి దిగ్విజయంగా నిన్నటి వరకు కొనసాగారు. చివరి నిమిషం వరకు నాటకం గురించే ఆలోచించారు. ఎప్పటి నుంచి నాటకాలు వేస్తున్నారు అని ఒకసారి అడిగాను తిరుమల వెళ్ళినప్పుడు. “గుర్తు లేదండి చిన్నప్పటి నుంచి వేస్తున్నాను. ఎలా అబ్బిందో ఈ పిచ్చి ఎలా అంటుకుందో తెలియదు కానీ, యమ ఆనందంగా వున్నాను. తృప్తిగా వున్నాను” అని చెప్పారొకసారి.

సినిమా నటులపై ఆయనకు కోపం. రంగస్థలం నుంచి సినిమాకు వెళ్లి నాటక రంగాన్ని మరచిపోయారు. అలాంటి వారు నటులు అని చెప్పుకోకూడదు అని ఆవేదన వ్యక్తం చేసే వారు. సుబ్బరాజు ప్రభుత్వ తొలి బంగారు నంది అవార్డు గ్రహీత. గరుడ పురస్కారాలు పలు మార్లు అందుకున్నారు. వెయ్యికి పైగా అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. బహుశా ఉద్యోగ రీత్యా అనుకుంటా, గుట్టుగా పెద్దగా ప్రచారం లేకుండా ప్రత్యేక అనుమతులతో నాటక రంగానికి విశేష సేవలు అందించారు.

కరోనా తరువాత ఎందుకో కళాకారులు అంతా వరసగా వెళ్లిపోతున్నారు. కొందరు వయసు రీత్యా, మరి కొందరు ఆకస్మిక గుండె పోట్లతో. ఒక మంచి నట దర్శక ప్రయోక్త, పౌరాణిక నాటక నిర్మాత, పరిషత్ అధినేత కోనేటి సుబ్బరాజును కోల్పోయాం. తిరుపతి మహతి ఆడిటోరియం కన్నీరు పెడుతోంది. కళాకారులు దుఃఖంలో మునిగిపోయారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో అంత్యక్రియలు జరుగుతాయని కుమారుడు సునీల్ తెలిపారు. నాటక మిత్రుడికి అశ్రు నివాళి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

డా. మహ్మద్ రఫీ

Share via
Copy link
Powered by Social Snap