వెయ్యి నామాల వెంకన్నబాబు…!

ప్రముఖ చిత్రకారులు, కోనసీమ చిత్రకళా పరిషత్ వ్యవస్థాపకులు కొరసాల సీతారామస్వామి గారు తన ఏబైయేళ్ళ చిత్రకళాయాణంలోని మధుర స్మృతులను 64కళలు పత్రిక పాఠకులతో పంచుకునే ప్రయత్నమే ఈ “నా జీవనస్మృతులు” ఫీచర్.

ఇక్కడ వున్న బొమ్మలో శ్రీ వేంకటేశ్వర… శ్రీ వెంకటేశ్వర అని వెయ్యి సార్లు వ్రాయబడి వున్నాయి… ఒక్కసారి పూజిస్తే వెయ్యి సార్లు స్వామి వారి నామం జపించినట్లు వుంటుంది అనే ఉద్దేశ్యంతో వెంకటేశ్వరస్వామి ఆకృతిలో చిత్రించడం జరిగింది. ఈ చిత్రం 45 సంవత్సరాల క్రితం తయారుచేసి ఈ ప్రింట్స్ మా ఏజెంట్స్ ద్వారా దక్షిణాది 4 రాష్ట్రాలలో అమ్మకాలు జరిగి లక్షలాది గృహాలలో పూజించబడుతున్నాయి. భక్తితో పూజించబడి ముక్తిని పొందండి…

1000 Naamaala Venkkanna

స్వామి వారితో నా అనుభవం:
కొన్ని సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తూ నేను చిత్రించిన కొన్ని బొమ్మలు నాతో పాటు తీసుకుని వెళ్ళి స్వామి వారి ప్రధాన అర్చకులకు ఇచ్చాను… వారు వెయ్యి నామాలతో వ్రాసి చిత్రించిన ఆ చిత్రాలను చూసి సంతోషిస్తూ…నన్ను ఆశీర్వదించి… స్వామి వారి మూలవిరాట్ దర్శన భాగ్యం కలిగించారు…(VIP దర్శనం కన్నా మిన్నగా నిజరూప దర్శనం జరిగింది).
ఒక చిత్రకారునిగా నాకు ఇంతకన్నా భాగ్యం ఏమి కావాలి…

ఆ ఆనందంలో అక్కడ వున్న అర్చక స్వాములు అందరికీ నేను గీసిన వేంకటేశ్వర స్వామి వారి చిత్రాలను బహుకరించాను.. నేను వద్దు వద్దూ అని అంటున్నా కొంత మొత్తంలో డబ్బుని పసుపు గుడ్డలో కట్టి నాకు బహుకరించారు… నేను గీసిన వెయ్యి నామాల చిత్రాలు కొన్ని స్వామివారి పాదాల చెంత వుంచి నాకు ఇచ్చారు…ఇప్పటికీ నా పూజా మందిరంలో ఆ చిత్రం వున్నది… మరికొన్ని నా చిత్రాలను మిత్రులకి బహుకరించాను…

తిరుగు ప్రయాణంలో బస్సులో తిరుపతి దాటిన తరువాత నా బ్యాగ్ లో అర్చక స్వాములు ఇచ్చిన పసుపు గుడ్డతో కట్టిన ఆ మూటను విప్పి చూడగా స్వామి వారి పూజ అక్షింతలు… పుష్పాలు ఉన్నాయి… వారు ఇచ్చిన డబ్బు కనపడలేదు…
ఇందంతా స్వామి వారి మహత్యమా…ఏదైనా మాయ అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న..? నేను డబ్బు వద్దు..వద్దూ.. తీసుకోను.. అన్న నా మొర ఆలకించిన స్వామి..

స్వామి డబ్బు స్వామికే చేరింది.

ఈ సీతారామ స్వామికి… శ్రీ వేంకటేశ్వర స్వామి లీలా మహత్యంగా నేను అనుభూతిని పొందాను… వెయ్యినామాల వెంకన్నబాబు చిత్రీకరణతో… నా జీవితం ధన్యమైంది..

సర్వం శ్రీ అలివేలుమంగా… పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవతార్పణమస్తు..
-కొరసాల సీతారామ స్వామి

SA: