‘తానా’ ఆధ్వర్యంలో కొసరాజు సమగ్ర సాహిత్యం

(‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో కొసరాజు రాఘవయ్య గారి సమగ్ర సాహిత్యం పుస్తక రూపం దాల్చనుంది.)
ఉత్తర అమెరికా తెలుగు సంఘం సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీ కవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే స్ఫూర్తితో సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు తెలిపారు. కొసరాజు 37వ వర్ధంతి (అక్టోబర్ 27) సందర్భంగా ఈ విషయాన్ని పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఇది తానా సంస్థ ఒక మహాకవికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన అన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “దాదాపు నాలుగు దశాబ్దాలుగా సాగిన కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి సాహితీ ప్రయాణంలో ‘ఏరువాక సాగాలోరన్న’, ఇల్లరికంలో ఉన్న మజా’, ‘సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు సిగరెట్టు’, ‘రామయతండ్రి, ఓ రామయ తండ్రి, మానోములన్ని పండినాయి రామయ తండ్రీ’, ‘ఆడుతూపాడుతూ పనిజేస్తుంటే అలుపూ సొలుపేమున్నది’ లాంటి పాటలలో అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టు భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు కలం నుంచి రెండు వందల చిత్రాలలో వెయ్యికి పైగా పాటలు జాలువారాయి. కేవలం సినిమా పాటలేగాక కొసరాజు “గండికోట యుద్ధం” అనే ద్విపద కావ్యం, “కడగండ్లు” అనే పద్యసంకలనం, “కొసరాజు విసుర్లు”, “కొండవీటి చూపు”, “నవభారతం”, “భానుగీత” లాంటి గ్రంథాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ల పాటలు, రజకుల పాటలు, పాములోళ్ల పాటలు, గంగిరెద్దుల గీతాలు లాంటివి ఎన్నో రాశారు” అని అన్నారు.

ఈ సందర్భంగా కొసరాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను ఇప్పటికే సేకరించామని డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కొసరాజు కుటుంబసభ్యులకు.. ఈ సమగ్ర సాహిత్యాన్ని త్వరలో తెలుగు ప్రజలకు అందించే సాహితీ మహాయజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించనున్న ప్రముఖ సాహితీవేత్త, పరిశోధకులు అశోక్ కుమార్ పారా (మనసు ఫౌండేషన్)కు కృతజ్ఞతలు తెలియజేశారు.

1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలంలో కొసరాజు రాఘవయ్య గారు జన్మించారు. రాఘవయ్య తొలుత రైతుబిడ్డ (బళ్ళారి రాఘవ కథానాయకుడిగా.. 1939లో విడుదలైన) అనే చిత్రములో నటించి, ఒక పాట కూడా రాశారు. కవిగా రాఘవయ్య ప్రతిభ గుర్తించిన బి.ఎ. సుబ్బారావు, కె.వి. రెడ్డి వారి చిత్రాలకు పాటలు వ్రాయించారు. 1954లో విడుదలైన ‘పెద్ద మనుషులు’ చిత్రానికి రాఘవయ్య వ్రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రెక్షకులను ఉర్రూతలూగించాయి. సుబ్బారావు గారి ‘రాజు పేద’ చిత్రములోని ‘జేబులో బొమ్మ జే జేలబొమ్మ’ బహుళ ప్రాచుర్యం చెందింది. రోజులు మారాయి (వహీదా రెహ్మాన్ నాట్యముతో)లో ‘ఏరువాక సాగారో’, ‘ఇల్లరికములో ఉన్న మజా’, ‘అయయో జేబులో డబ్బులు పోయెనే’, ‘ముద్దబంతి పూలు బెట్టి’ మొదలగు పాటలు కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనసులలో చిరస్మరణీయముగా మిగిలిపోయాయి. అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారతాయి. జేబులో బొమ్మ, కళ్ళు తెరచికనరా, ఏరువాకాసాగారో, జయమ్మునిశ్చయమ్మురా, వినరావినరానరుడా…, సరిగంచు చీరగట్టి… శివగోవింద గోవింద, డబ్బులోనే ఉందిరా, నందామయా గురుడ, శివశివమూర్తివి, తింటానిక్కూడుచాలదే, పల్లెటూరు మన భాగ్యసీమరా, చెంగుచెంగునా గంతులు వేయండి, సరదా సరదా సిగిరెట్టు, ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, ముక్కుచూడు ముక్కందం చూడు… ఇలా మూడున్నర దశాబ్దాల కాలంలో మొత్తము 200 చిత్రాలకు 1000 పాటలు రాశారు.

-కళాసాగర్

SA: