జానపద సిరి రాఘవయ్య చౌదరి

(కొసరాజు జయంతి సందర్భంగా…)

కొసరాజు రాఘవయ్య చౌదరి స్వస్థలం గుంటూరు జల్లా అప్పికట్ల. పుట్టింది 23 జూన్ 1905 న. రాఘవయ్య చౌదరి కి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటప్పయ్య. చిన్నతనంలో జబ్బుచేయడంతో, తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి మ్రొక్కుకొని వెంకటప్పయ్య పేరును రాఘవయ్యగా మార్చారు. అప్పట్లో అప్పికట్లలో నాలుగవ తరగతివరకే వుండేది. రాఘవయ్య నాలుగవ తరగతి పూర్తిచేసి ‘బాలరామాయణం’, ‘ఆంధ్రనామ సంగ్రహం’ వంటి గ్రంధాలను ఆపోశన పట్టి, ఆ గ్రామంలో వుండే కొండముది నరసింహం పంతులు గారి శిష్యరికంలో సంసృత, ఆంధ్ర సాహిత్యాల పాండిత్య సాధన చేశారు. పన్నెండవ ఏటనే ఆశుకవిత్వం చెప్పడం, అష్టావధానం చెయ్యడం అలవడింది. ‘బాలకవి’ పేరుతో రాఘవయ్య కవితలు పత్రికల్లో ప్రచురితమవుతూవుండేవి. తర్వాత తెనాలి వెళ్లి ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి వద్ద శిష్యరికం చేసి మరింత పాండిత్యం గడించారు. అక్కడనుండి వెలువడే ‘రైతుపత్రిక’ కు కొంతకాలం సహాయ సంపాదకునిగా వున్నారు. గుంటూరులో జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరికి దగ్గరై ఆయనతో కవితా చర్చలు చెయ్యడం, కవితా గోష్టులలో పాల్గొనటం చేస్తుండేవారు. అక్కడే రాఘవయ్యకు సముద్రాల రాఘవాచార్య, గూడవల్లి రామబ్రహ్మంతో పరిచయమయ్యింది. కొంతకాలం ఆంధ్రపత్రిక విలేఖరిగా కూడా రాఘవయ్య పనిచేశారు. కమ్మవారి చరిత్ర పరిశోధన కోసం కుప్పుస్వామి వీరి ముగ్గురినీ మద్రాసు పంపించారు. ఆ సందర్భంగా నాటి మద్రాసు ముఖ్యమంత్రి మునుస్వామి నాయుడుతో పరిచయం ఏర్పడింది. ‘జమీన్ రైతు’ ఉద్యమ కాలంలో రాఘవయ్య రచించిన ‘కడగండ్లు’ అనే పుస్తకం విడుదలైతే దానికి పీఠిక రాసింది కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు! రైతు ఉద్యమంలో పాటలు రాసి, పాడుతూ ఊరూరా తిరిగినప్పుడు తిరుత్తణిలో జరిగిన రైతుమహాసభలో రాఘవయ్యకు మాడభూషి అనంతశయనం అయ్యంగార్ ‘కవిరత్న’ బిరుదు ప్రసాదించారు. నాజీలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ‘ఎత్తండి మన గెలుపు జెండా.. దుష్ట నాజీల నెదిరించి నాశనము చెయ్యండి’ అనే పాట రాసినందుకు నాటి గవర్నరు ఆర్థర్ హోప్ రాఘవయ్యకు స్వర్ణ పతకం బహూకరించారు.

పండిత నెహ్రూ నాగార్జున సాగర్ ఆనకట్టకు పునాది వెయ్యడానికి వచ్చినప్పుడు గుంటూరులో కొందరు జాతీయ కవులను సత్కరించిన వారిలో రాఘవయ్య కూడా వున్నారు. చరిత్ర పరిశోధన పూర్తిచేశాక రాఘవయ్య తన స్వగ్రామం అప్పికట్లకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటూ వున్న సమయంలో గూడవల్లి రామబ్రహ్మం ‘రైతుబిడ్డ’ (1939) సినిమాలో పాటలు రాయడానికి మద్రాసు పిలిపించారు. అందులో రాఘవయ్య రాసిన తొలి గీతం ‘నిద్ర మేల్కొనరా తమ్ముడా గాఢ నిద్ర మేల్కొనరా తమ్ముడా’ అనే ప్రభాత గీతం. ‘రైతు పైని అనురాగము జూపని రాజులుండగానేలా.. రైతులేనిదే రాజ్యము లేదను నీటిని ఎంచరదేలా’; ‘సై సై రా చిన్నపరెడ్డి నీ పేరే బంగారపు కడ్డి’; ‘ఓటు విలువను తెలుసుకోరన్నా, ఒకపూట తిండికే ఓటునిచ్చుట సిగ్గుచేటన్నా’ వంటి మరికొన్ని పాటలు కూడా ఆ సినిమాకోసం రాఘవయ్య రాశారు. ఈ సినిమాకు పాటలు రాశాక రాఘవయ్య సొంతవూరికి వచ్చేశారు. 1953లొ వాహినీ వారు ‘పెద్దమనుషులు’ సినిమా నిర్మిస్తూ అందులో కొన్ని వ్యంగ్య ధోరణి పాటలు రాసేందుకు డి.వి. నరసరాజు ద్వారా రాఘవయ్యకు కబురంపారు. అప్పటికే కొసరాజు సినిమాపాటలు రాసి 13 ఏళ్ళయింది. అందుకే ‘పెద్దమనుషులు’ సినిమాలో పాటలు రాసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దర్శకుడు కె.వి.రెడ్డి తో మాటలు కలిశాక పాటలు రాసేందుకు కొసరాజు ఒప్పుకొన్నారు. అందులో ‘నందామయా గురుడ నందామయా ఆనందదేవికి నందామయా’; ‘శివశివమూర్తివి గణనాధా నీవు శివునీ కుమారుడవు గణనాధా’; ‘పట్నమెళ్ళగలవా బావా పర్మిట్టు తేగలవా’ అనే మూడు పాటలు రాసి గుంటూరు వెళ్ళిపోయారు. ఆ పాటలు సూపర్ హిట్లుగా నిలిచాయి. భార్య సీతారామమ్మకు ఆపరేషన్ చేయించేందుకు మద్రాసు వెళితే, అది తెలుసుకున్న దర్శక నిర్మాత బి.ఎ. సుబ్బారావు ‘రాజు-పేద’(1954) సినిమా కోసం పాటలు రాయమని కోరారు. ఆ సినిమాకోసం ‘జేబులో బొమ్మ జేజేలా బొమ్మా’; ‘కళ్ళుతెరచి కనరా, సత్యం ఒళ్ళు మరచి వినరా , సర్వం నీకే బోధపడురా’; ‘మారిందీ మారిందీ మన రాజకీయమే మారిందీ’ అనే మూడు పాటలు రాశారు. అవి సూపర్ హిట్లుగా మారుమోగాయి. తర్వాత సారథి వారి ‘రోజులుమారాయి’(1955) సినిమాకు పాటలు రాసేందుకు మద్రాసు వచ్చారు. గ్రామీణ వాతావరణంలో నిర్మించిన ఈ సినిమాలో కొసరాజు రాసిన పాటలు నేటికీ అజరామరాలే. ’ఒలియో ఒలీ పొలియో పొలీ వేయివేలుగలవాడ రారా పొలీ’; ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా’; ‘రండయ్య పోదాము మనము ఇకను కొండలన్నీ పిండి కొట్టిపారేద్దాము’; ‘మారాజ వినవయ్య మాగాణి దాటేసి మానవులకుండేటి చింత’; ‘ఎల్లిపోతుందెల్లి పోతుంది జోడెడ్లబండి…పెళ్లోరిబండి’ వంటి ఏడు పాటలు కొసరాజు రాశారు. మిగిలిన మూడు పాటలు తాపీ ధర్మారావు నాయుడు రాశారు. ఈ సినిమా ఘనవిజయంతో ఇక కొసరాజు మకాం మద్రాసుకు మార్చాల్సి వచ్చింది. తేలిక మాటలతో సామాన్య జనానికి హత్తుకునేలా రాయడం కొసరాజు శైలి. అయితే కొసరాజు సినిమాలకు మాటలు రాసేందుకు దూరంగానే వున్నారు. పాటలు రాసేందుకే ఆయనకు సమయం సరిపోలేనంత బిజీగా గడపడమే దానికి కారణం. సినిమా పాటలే కాకుండా ‘మిత్రనీతి’, ‘కడగండ్లు’ వంటి పుస్తకాలను ప్రచురించారు. ఇవికాక ‘గండికోట యుద్ధం’ అనే ద్విపద కావ్యం, ‘కొండవీటి చూపు’ అనే పద్య కావ్యం, ‘రైతుజన విధేయా రాఘవయ్యా’ అనే పాటల సంకలనం, ‘సినిమా డైరెక్టరూ’ అనే నవల కూడా రాశారు. 1984లో కొసరాజుకు రఘుపతి వెంకయ్య పురస్కారం లభించింది. ఆయనకు ‘జానపద కవిసార్వభౌమ’, ‘కవిరత్న’ అనే బిరుదులున్నాయి. కొసరాజుకు ఒక అబ్బాయి. పేరు భానుప్రసాద్. ‘కాంభోజరాజు కథ’ సినిమాకు అతడు సహనిర్మాత. కొసరాజు 27 అక్టోబర్ 1987 న కాలం చేశారు.

ప్రజలు మెచ్చిన కొన్ని కొసరాజు పాటలు:

ఎక్కడున్నది ధర్మమెక్కడున్నది (చరణదాసి)
వినవోయి బాటసారి కనవోయి ముందు దారి; వస్తుందోయ్ వస్తుంది; చిలకన్న చిలకవే; వీరగంధం తెచ్చినారము (జయం మనదే)
ఓహో బంగరు చిలక ఆహా ఎందుకె అలక; నాణెమైన సరుకుందీ లాహిరి; చీటికి మాటికి చిట్టెమ్మంటే; అందాల రూపమూ ఆనంద దీపమూ (భలే అమ్మాయిలు)
ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా (సువర్ణసుందరి)
ఆడుతు పాడుతు పనిచేస్తుంటే; టౌను పక్కకెళ్లొద్దురో డింగరి; నీ సోకు చూడకుండా నవనీతమ్మో; గాలిపటం గాలిపటం; బస్తీ బతుకేల మనకు (తోడికోడళ్ళు)
నిలువవే వాలుకనులదానా వయారి హంసనడకదానా; భలే చాన్సులే భలే చాన్సులే; అడిగిందానికి చెప్పి(ఇల్లరికం)
తిరుపతి వెంకటేశ్వరా; చెక్కిలిమీద చెయ్యిజేర్చి చిన్నదానా; మై డియర్ మీనా మామంచిదానా; ఔనంటారా లేక కాదంటారా (మాంగల్యబలం)
పదపదవే వయ్యారి గాలిపటమా; ఆర్యులారా (వీధి భాగవతం); కోటు బూటు వేసిన బావ వచ్చాడయ్యా;(కులదైవం)
కొండపల్లి బొమ్మలాగా కులికింది పిల్లా; పిలచిన నా రాజు రాడేలనో (కుంకుమరేఖ)
ఎంతమంచివాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా; రైతు మేడిపట్టి; పొగరుమోతు పోట్లగిత్తరా; తెలతెలవారెను లేవండమ్మా చెలియల్లారా రారండమ్మా; నాజూకు తెచ్చు టోపీ; చెంగు చెంగునా గంతులు వేయండి (నమ్మినబంటు)
విన్నావా నూకాలమ్మా; నీటైన పడుచున్నదోయ్; పల్లెటూరి వాళ్లము(రాణి రత్నప్రభ)
ఓహో వయ్యారి లాహిరి; ఓయ్ అందమైన బావా ఆవు పాలకోవా (రుణానుబంధం)
దయగల తల్లికి మించిన దైవము (అభిమానం)
చీరకట్టి సింగారించి; మారాడు మారాడు (ఆత్మబంధువు)
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి; కనకమా చిట్టి కనకమా (భార్యా భర్తలు)
రిక్షావాలను నేను పక్షిలాగ ఎగిరేను (ఆడపడుచు)
హలో సారూ దొరగారు నా మనసు తెలుసుకోరు; సూర్యవంశము నందునా; ఏడుకొండల వెంకటేశ్వరా (ఆదర్శ కుటుంబం)
కొండపై నెలకొన్న కనకదుర్గా (అగ్ని పరీక్ష)
అల్లా యా అల్లా ; చలాకైన చిన్నది; లేలో దిల్ బహార్ (ఆలి బాబా 40 దొంగలు)
వానల్లు కురవాలి వరిచేలు పండాలి; సుకు సుకు (అల్లుడే మేనల్లుడు)
జామిరే జోరు లంగడి హై లెస్సా ; కొండ దేవతా నన్ను (అల్లూరి సీతారామ రాజు)
జంతర్ మంతర్ ఆటరా ఇది అంతర్మధ్యం ఆటరా (అమరశిల్పి జక్కన)
భజనచేసే విధము తెలియండి జనులార మీరు (అందాల రాముడు)
ఎక్కు మామా బండెక్కు మామా (అన్నదమ్ములు)
మావూళ్లో ఒక పడుచుంది (అవేకళ్ళు)
చెప్పో చెప్పోర్ భాయి చెప్పో చెప్పూ (బాలరాజు కథ)
ఏసుకుందాం బుల్లోడా (బలిపీఠం)
సింగారం చిందులువేసే (బంగారు కలలు)
అడిగావే అక్కడా ఇక చూస్కో ఇక్కడా (భద్రకాళి)
పగటి కలలు కంటున్నా మామయ్యా; అబ్బబ్బబ్బో చలి ఆహువూహు ఆహువూహు గిలి(భలే రంగడు)
వేసుకుంటా వేసుకుంటా చెంపలూ వేసుకుంటా (బొమ్మాబొరుసా)
అల్లరి పెడతారే పిల్లా అల్లరి పెడతారే; బడిలో ఏముంది అంతా గుడిలోనే వుంది (బుద్ధిమంతుడు)
ఏమిటి ఈ అవతారం (చదువుకున్న అమ్మాయిలు)
తాగుతా నియ్యవ్వా తాగుతా (డబ్బుకు లోకం దాసోహం)
మావూరు మదరాసు నా పేరు రామదాసు (దేవత)
ఎవ్వరి కోసం ఎవడొస్తాడు పొండిరా పొండి (ధర్మదాత)
ఒంటిగ సమయం చిక్కింది కంటికి నిద్దుర రాకుంది (డాక్టర్ చక్రవర్తి)
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా (గోవుల గోపన్న)
తకతకతక తాళం తట్టు మామా(ఇల్లాలు)
ముద్దబంతి పూలుబెట్టి మొగలిరేకులు జడను చుట్టి (కలసివుంటే కలదు సుఖం)
సుక్కలాంటి సిన్నోడు సోకుజేసుకున్నాడు (కన్నెమనసులు)
రావేలా దయరాదా (కథానాయకుడు)
అమ్మనురా పెద్దమ్మనురా (కథానాయిక మొల్ల)
ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద; క్లబ్బంటే కొందరికి బలే మోజు (కోడలు దిద్దిన కాపురం)
దంచుకో నాయనా దనియాల పప్పు (కొత్తకాపురం)
అయ్యయ్యో చేతిలో డబ్బులో పోయెనే; రావే రావే బాలా హలో మై డియర్ లీలా ఇటురావే (కులగోత్రాలు)
అద్దాల మేడ వుంది అందాల భామ వుంది (లక్షాధికారి)
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ; అశ్వమేధ యాగానికి జయము జయము జయము; రామన్న రాముడు కోదండరాముడు (లవకుశ)
మామా మామా మామా ఏమే ఏమే భామా; ఎంత టక్కరివాడు నా రాజు ఏమూలనో నక్కినాడు (మంచిమనసులు)
ఏమండీ ఇటు చూడండీ; దోపిడీ దోపిడీ దోపిడీ ఇదంతా దొంగల దోపిడీ (మంచి మనిషి)
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా (మనుషులంతా ఒక్కటే)
గంగా యమునా తరంగాలతో సుందర నందన మధువనాలతో (మరపురాని కథ)
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా (మూగమనసులు)
ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లో ఏటి అలా సూత్తావు; రాజువెడల సభకు (నవరాత్రి)
అంబవో శక్తివో అంకాళ దేవియో మా ఊర వెలసిన జడలమారమ్మవో (నేనంటే నేనే)
ఆడుతూ పాడుతూ ఆనందంగా వసంతమాడాలి (పాడిపంటలు)
ఏవమ్మా జగడాల వదినమ్మో(పండంటి కాపురం)
మొగలీ రేకుల చినదానా (పాండవ వనవాసము)
పరమగురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురా (పరమానందయ్య శిష్యులు కథ)
గలగలగలగల గజ్జెల బండి (పవిత్రబంధం)
నిండు అమాస నిశి రేత్తిరి కాడ ఎక్కడికెల్తవు మామో నువ్వేమైపోతావు మామో (పిడుగురాముడు)
ఏ తల్లి కన్నదిరా రాజా (పిన్ని)
ఓహో బస్తి దొరగారు దిగి వస్తారా మీరు; వస్తావు పోతావు నాకోసం యముడు వచ్చి కూర్చున్నాడు నీకోసం (పూజాఫలము)
చిల్లర రాళ్ళకు మొక్కుతువుంటే చేడిపోదువురా ఒరేఒరే; వినరా భారత [బుర్రకథ]; ఎయిర చిన్నోడెయిరా ఎయిరా నీ సోకుమాడ (పూలరంగడు)
చీకటి విచ్చునులే వెన్నెల వచ్చునులే (పొట్టి ప్లీడరు)
ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల రేడు; ఏటి ఒడ్డున మావూరు (రాజమకుటం)
సరదా సరదా సిగిరెట్టు ఇది దొరల్ తాగు బల్ సిగిరెట్టు; తగునా ఇది మామా; దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్ (రాముడు భీముడు)
వెన్నెల రేయి చందమామ; దేశభక్తులం (రంగులరాట్నం)
లోకాన దొంగలు వేరే లేరయ్యా (శభాష్ రాజా)
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా; ఆశలే అలలాగా ఊగేనే సరదాగా (శభాష్ రాముడు)
అట్టు అట్టు పెసరట్టు ఉల్లిపాయ పెసరట్టు ఉప్మాతోటి పెట్టు చెట్నీతోటి కలేసికొట్టు (శాంత)
కొండమ్మో బంగారపు కొండమ్మా(సిరిసంపదలు)
మత్తువదలరా నిద్దుర మత్తు వదలరా; భళాభళి నా బండి పరుగూ తీసే బండి (శ్రీకృష్ణ పాండవీయం)
బులిబులి ఎర్రని బుగ్గలదానా (శ్రీమంతుడు)
మామయ్యో తిరునాళ్లకు పూడుస్తా (టాక్సీ రాముడు)
బ్రహ్మం తాత చెప్పిందీ (తాతమ్మ కల)
లంకాదహనం నాటకం (ఉమ్మడి కుటుంబం)
సైసై జోడెడ్ల బండి బండి షోకైన దొరల బండి- మహాప్రభో! (వరకట్నం)
శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద , సరిగంచు చీరగట్టి (వెలుగు నీడలు)
కస్తూరి రంగ రంగా (జమీందార్)
మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం (జమీందారుగారి అమ్మాయి)

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap