నాకు తెలిసిన నారాయణ దాసు.. కోట సచ్చిదానంద శాస్త్రి!
“కూరకు తాలింపు
హరికథ కు చదివింపు
ఓం హరా శంకరా”
ఇది ఆయన నోట వినాలి! ఆయన పాడితేనే చూడాలి. అతనే 92 ఏళ్ళ పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి. గుంటూరులో ఒక వృద్ధాశ్రమంలో రాత్రి 11 గంటలకు పరమ పదించారు. హరికథ కళారంగంలో ఆయన మహా చక్రవర్తి.
హరికథా భాగవతార్ గా ఎనిమిది దశాబ్దాల అనుభవం. మానవత్వం, సమానత్వం ఆయన ధరించే ఆభరణాలు. హరికథా కళారంగానికి తొలి పద్మశ్రీ అంకితం చేసిన మహానుభావులు కోట సచ్చిదానంద శాస్త్రి గారి లేని లోటు ఎన్నటికీ తీరనిదే.
నేను చూసిన శ్రీ మజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు కోట సచ్చిదానంద శాస్త్రి గారే. నాకు హరికథ కళను పరిచయం చేసింది, నేను చూసిన విన్న తొలి హరికథ వారిదే. 2002 లో ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు నారాయణగూడ తాజ్ మహల్ హోటల్ లో వారిని కలిశాను. అక్కడ నుంచి ఆటోలో ఎస్.ఆర్.నగర్ లో వున్న సీనియర్ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి గారి ఇంటికి తీసుకెళ్ళాను. శ్రీహరి గారే నాకు ఈ అద్భుత పరిచయ అవకాశం కల్పించారు.
ఆరోజు నాకింకా గుర్తు వుంది. శ్రీహరి గారు ఆరోజు ఫోన్ చేసి ఒక అద్భుతాన్ని నీకు పరిచయం చేస్తాను, ఇంటర్వ్యూ చేయండి అన్నారు. వివరాలు ఇచ్చి పంపించారు. అలా మొదటిసారి కోట సచ్చిదానంద శాస్త్రి గారిని చూశాను. కాసేపటిలోనే ఆయన కలసిపోయారు. మహ్మద్ రఫీ తన ఫెవరేట్ సింగర్ అంటూ అలా చాలా సేపు కబుర్లలో పడిపోయాం. శ్రీహరి గారి ఇంటికి భోజనానికి వెళ్దాం అంటే ఇద్దరం ఆటోలో వెళ్ళాం.
ఆ రోజు రాత్రి శంకర మఠంలో హరికథ చూశాను, విన్నాను. అదే నేను చూసిన తొలి హరికథ. కోట సచ్చిదానంద శాస్త్రి ఆరోజు “విశ్వ రూపం” చూపించారు. సినిమా పాటలు పాడినా, పిట్ట కథలు చెప్పినా చెప్పే కథ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నృత్యం చేస్తూ సాగిన ఆ హరికథ నా మనసులో బలమైన ముద్ర వేసింది. హరికథ సర్వ కళల సమాహారం అని అర్ధమైంది. నాకు అత్యంత ఇష్టమైన కళా ప్రక్రియగా మారింది. 2007లో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మద్దాలి రఘురాం గారు నెల రోజుల పాటు రోజుకు ఇద్దరు భాగవతార్ల వంతున హరికథ ఉత్సవాలు నిర్వహించారు. ఎన్ని పనులున్నా ప్రతిరోజూ హరికథ వినడానికి వెళ్ళేవాడ్ని. 2010లో సాంస్కృతిక శాఖ లో చేరినప్పుడు మూడు నెలలకోసారి హరికథ వారోత్సవాలు నిర్వహించడం అలవాటు చేసుకున్నాను. ఆర్. వి. రమణమూర్తి గారికి కూడా హరికథలు చాలా ఇష్టం. ఇక అలా కొన్ని వందలాది ఉత్సవాలు నిర్వహించడం వెనుక కోట సచ్చిదానంద శాస్త్రి గారే ప్రేరణ.
కోట సచ్చిదానంద శాస్త్రికి కథ పై సంపూర్ణ పట్టు వుంది. పురాణాల పై సమగ్ర అవగాహన వుంది. ఒక యోగిలా కనిపించేవారు. ఒక్కో కాలానికి ఒక్కో మహానుభావుడు పుడతారంటారు. హరికథ లో ఆదిభట్ల తరువాత కోట వారే పెద్ద కోట. అప్పట్లో ఆయన హరికథ ఉంటే తిలకించడానికి చుట్టూ పక్కల గ్రామాల నుంచి బండ్లు కట్టుకుని వచ్చే వారట. సెకండ్ షో సినిమా టికెట్లు తెగేవి కావట. కోట హరికథ ఉందని తెలిస్తే ఆరోజు సెకండ్ షో క్యాన్సల్ చేసే వారట.
కోట గారు గుంభనంగా ఉంటారు. ఎంత సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తారో అంతకు మించి సమానత్వం, మానవత్వం అంటూ మాటల్లోనే కాదు ఆచరించి చూపించే వారు. డబ్బులు విషయంలో చాలా నిక్కచ్చిగా వుండే వారు. డిమాండ్ చేసి తీసుకునే వారు. ఆ రోజుల్లోనే హరికథ కు లక్ష రూపాయలు తీసుకునే వారు. అలా అని లేని చోట, ఇవ్వలేని చోట ఎంతిస్తే అంత తీసుకునే వారు. ఆయనకు అంతకు మించి చదివింపులు వచ్చేవి.
ఒంటి నిండా బంగారు ఆభరణాలతో మెరిసి పోయేవారు. “మీకేం సార్ బంగారం” అనే వాడ్ని. “అంతేనంటావా” అంటూ ఆయన పక్కనే వున్న బ్యాగ్ తీసి అందులో వున్న అభరణాలను చూపించేవారు. పలనా వారు ఉంగరం బహుమతిగా ఇచ్చారు, హారం బహుమతిగా ఇచ్చే వారని చెబుతుండే వారు. అక్కినేని నాగేశ్వరరావు గారు తొడిగిన స్వర్ణ కంకణం ధరించి వచ్చే వారు. ఇది అక్కినేని స్వర్ణ కంకణం అని గొప్పగా చెప్పేవారు. బంగారం అంటే ఆయనకు అంత ఇష్టం.
నడక, అనుష్టానం వల్ల తీసుకునే మితాహారం తన ఆరోగ్య రహస్యం అని చెప్పేవారు. గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి “గుర్తొచ్చావ్ రఫీ స్వామి” అనే వారు. హాయిగా మాట్లాడే వారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలసినప్పుడల్లా నాలుగు పేజీల బయోడేటా ఇచ్చేవారు. ఏదొక అవార్డుకు పనికి వస్తుందిలే అనే వారు.
పద్మశ్రీ వచ్చినప్పుడు ప్రత్యేకంగా నన్ను గుంటూరు ఆహ్వానించారు. నాకు బాగా గుర్తుంది. ఈ ఇళ్లన్నీ మావేనంటూ చూపించారు. కింద కూర్చుని మరీ “చక్కటి ఆవకాయ పప్పు నెయ్యి కలుపు” అంటూ వాళ్ళింట్లో భోజనం వడ్డించి తినిపించిన రోజు బాగా జ్ఞాపకంగా పదిలంగా వుంది.
సచ్చిదానంద శాస్త్రి భార్య 30 ఏళ్ళ క్రితమే చనిపోయారు. ముగ్గురు కుమారులు వున్నా ఎవరి వంటలు వారివే. ఎవ్వరూ ప్రయోజకులు కాలేదు, అద్దెలతో బతుకుతున్నారు అని చెప్పి బాధ పడే వారు. ఒక కుమారుడు హరికథా భాగవతార్ వారసత్వం అందుకున్నా అంతగా రాణించ లేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేసే వారు. స్వయంగా ఆయనే వంట వండుకునే వారు. ఆచార నియమాలు కఠినంగా పాటించే వారు.
గత ఏడాదిగా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. ఆరు నెలల క్రితం కుమారులు, కోడళ్ళను ఎందుకు ఇబ్బంది పెట్టాలని వృద్దాశ్రమంలో చేరినట్లు తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటలకు శివైక్యం చెందారు. ఒక మంచి మిత్రుడ్ని కోల్పోయాను. కోట సచ్చిదానంద శాస్త్రి గారికి అశ్రు నివాళి.
డా. మహ్మద్ రఫీ
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఆజానుబాహుడైన ఆదిభట్ల నారాయణదాసు హరికథా ప్రక్రియని అంతెత్తుకు తీసుకుపోయారు…ఈ తరం హరికథకులు హరికథల్లో సినిమాపాటలు, అసలుకథ కంచికి నెట్టి పిట్టకథలూ గట్రా చొప్పించారు. మన కాలంలో హరికథని జనరంజకం చేసిన పద్మశ్రీ కోట సచ్చిదానందశాస్త్రి ఊళ్ళకి ఊళ్ళు తరలివచ్చేలా హరికథాగానం చేశారు. హరికథల విభాగంలో తొట్టతొలి పద్మశ్రీ అవార్డు అందుకునే దాకా అప్రతిహతంగా సాగారు. తొమ్మిది పదుల వయసులో గుంటూరులో హరికథా భాగవతార్ కోటవారిగళం మూగబోయింది.
కైమోడ్పు ~ Dr. సశ్రీ, విజయవాడ