కళాకారులకు కేరాఫ్ అడ్రస్ బెజవాడ “కౌతా పూర్ణానంద సత్రం”
మన బెజవాడ నగర నడిబొడ్డయిన గాంధీనగర్లో ఠీవిగా, అప్పటి పెద్దల సేవాతత్పరతకు, గతకాలపు సాంస్కృతిక వైభవానికి నిదర్శనగా నిలచే ఈ భవంతిని మీరు చూసే ఉంటారు. చూపరులను ఇట్టే ఆకట్టుకునే ఈ భవంతి ఒకప్పుడు బెజవాడ వచ్చే అతిధులకు, రాజకీయ,సినీ ప్రముఖులకు సేద తీర్చిన “కౌతాపూర్ణానంద సత్రం”. కౌతా పూర్ణానందం గారిచే 1923 సంవత్సరంలో ప్రారంభించబడి 1926 లో నిర్మాణం పూర్తి చేయబడ్డ ఈ సత్రం చాలామంది కళాకారులకు ఇప్పటికీ కేరాఫ్ అడ్రస్. అరుణోదయ నాట్యమండలి, సుమధుర కళానికేతన్ వంటి కళాసంస్ధలు ఇక్కడే రిహర్సిల్స్ జరుపుకునేవారట. పూర్ణానందం గారి కుమారుడు సుబ్బారావు గారి ఆద్వర్యంలో ఈ సత్రం ఇప్పటకీ నడుస్తూనే ఉంది. కళాకారులకు రిహార్సల్స్ జరుపుకోవడానికి ఇక్కడి రూమ్స్ అద్దెకు ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా అటుగా వెళ్ళినప్పుడు హర్మొనియం శబ్దాలను బయటనుండే వినవచ్చు. లోపల ప్రక్క ఉన్న ఆడిటొరియం నాటక ప్రదర్శనలకు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకోవడానికి వీలుగా నిర్మించారు. ఇప్పటికీ ఇక్కడ ఎదో ఒక కార్యక్రమం జరుగుతుంది. రైల్వే స్టేషన్ కు అతి దగ్గరలో వుంటుందిది. తెలుగువాడికి మద్రాసులోని పాండిబజారు, హైదరాబాదులోని కృష్ణానగర్ ఎలానో మన బెజవాడ పూర్ణానంద సత్రం అలాంటిదని చెప్పవచ్చు. దీనిని ధర్మసత్రంగా రిజిస్టర్ చెయ్యడం వలనో ఏమో ఇప్పుడు ఇక్కడ ఏ షాపింగ్ కాంప్లెక్సో లేక సినిమా థియేటరో కట్టే ఆవకాశం మరి లేదనుకుంటా… ?? దీనిని మన బెజవాడ వారసత్వ కట్టడంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.
-బెజవాడ నాని