ఇంట్లో కూర్చుని టీవీలోనో, పీసీలోనో, చేతిలోని స్మార్ట్ ఫోన్లోనో సినిమాలు చూడటం కొన్ని నెలలుగా కరోనా కారణంగా జనాలకు అలవాటైపోయింది. థియేటర్లు తెరిచినా, జనం రారనే నిర్ణయానికి కొందరు వచ్చేశారు. అయితే… సాధారణ తెలుగు ప్రేక్షకుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మాస్ సినిమాల కోసం ఎంతగా కరువాచిపోయి ఉన్నాడో క్రాక్’ సినిమా ఓపెనింగ్స్ నిరూపించాయి.
శనివారం విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆలస్యంగా జనం ముందుకు వచ్చింది. మొదటి మూడు ఆటలు రద్దు అయ్యాయి. చివరికి సెకండ్ షోతో సినిమా ప్రదర్శన మొదలైంది. చిత్రంగా విడుదలైన అన్ని సెంటర్స్లోనూ యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నిండుకున్నాయి.
కథ : పోతురాజు వీరశంకర్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. అనాథ అయిన ఈ పోలీసు ఎవరైనా బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడితే తిక్కపుడుతుంది. దాంతో అతనేం చేస్తాడో అతనికే తెలియదు. ఆ ఆవేశం ఒకోసారి ఇబ్బందులకు గురిచేస్తుంది. అయినా అతను మాత్రం ఆ బలహీనత నుండి బయటపడ లేకపోతాడు. ఆ ఆవేశం కారణంగానే సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులూ చేస్తాడు. కర్నూల్ లో సలీమ్ భత్కాల్ అనే టెర్రరిస్టుకు, కడపలో కొండారెడ్డి అనే ఫ్యాక్షనిస్టుకు, ఒంగోలులో కటారి కృష్ణ అనే రౌడీ షీటరు వీరశంకర్ చుక్కలు చూపిస్తాడు. చిత్రం ఏమంటే… ఈ ముగ్గురు కూడా తమ గ్రహపాటుతోనూ, తెలియక చేసిన చిన్న పొరపాటుతోనూ వీరశంకర్ కంట్లో పడతారు. అతను వీరి భరతం పడతాడు. నిజానికి ఇది ఓ సాధారణమైన పోలీస్ కధ. ఇలాంటి పాయింట్స్ గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే… మూడు వేర్వేరు ప్రాంతాలలో జరిగిన సంఘటనలను వీరశంకర్ పాత్రతో ముడిపెడుతూ, ప్రతినాయకులను లింక్ చేస్తూ, దర్శకుడు మలినేని గోపీచంద్ ఆసక్తికరంగా క్రాక్’ మూవీని మలిచాడు. లాజిక్కుల జోలికి, సాధ్యాసాధ్యాల జోలికు పోకుండా సినిమాను చూసి ఆనందించాలి తప్పితే, లోతుల్లోకి వెళితే ఎన్నో సందేహాలు కళ్లముందు నిలుస్తాయి.
2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ మూవీ తర్వాత రవితేజకు సరైన హిట్ లేదు. ఆ లోటును ఈ సినిమా తీర్చేసింది. రవితేజ పోలీస్ అనగానే అందరికీ గుర్చొచ్చే సినిమా ‘విక్రమార్కుడు’. ఆ స్థాయిలో కాకపోయినా, పోలీస్ పాత్రలో ఒదిగిపోవడానికి రవితేజ కృషి చేశాడు. శ్రుతిహాసన్ పాత్ర ప్రధమార్థం అంతా సాదాసీదాగా సాగిపోయింది. అయితే ద్వితీయార్థంలో భర్త సస్పెండ్ అయినప్పుడు ఆమె పాత్రను మలిచిన తీరు, ప్రతినాయకుల దాడిని ఆమె ఎదుర్కొన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుల పాత్రలలో కటారి కృష్ణగా తమిళ దర్శకుడు, నటుడు సముతిర ఖని మెప్పించాడు.
వరలక్ష్మి శరత్ కుమార్ నటనా ఆకట్టుకునేలా ఉంది. కొండారెడ్డిగా రవిశంకర్ మొదట్లో భయానక రసాన్ని, పతాక సన్నివేశంలో హాస్యరసాన్ని చక్కగా పండించాడు. సినిమా స్పాన్ పెద్దది కావడంతో చాలామంది నటులే ఉన్నారు. చిరాగ్ జాని, దేవి ప్రసాద్, గోపరాజు రమణ, కత్తి మహేశ్, అలీ, బీవీయస్ రవి, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి, మౌర్యాని, జబర్దస్త్ కమెడియన్ల బ్యాచ్ నుండి చక్కటి నటనను దర్శకుడు రాబట్టుకున్నారు. ఇక రవితేజ, శ్రుతి కొడుకుగా దర్శకుడు గోపీచంద్ మలినేని అబ్బాయే నటించడం విశేషం. ఆ బాల నటుడిలోనూ చక్కని ఈజ్ ఉంది. ‘ఠాగూర్’ మధు ప్రొడక్షన్ నుండి వచ్చిన ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
నేపధ్యం: ఒంగోలులో నలభై యేళ్ల క్రితం జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ఈ కథ తయారైంది. అలానే అండర్ వరల్డ్ డాన్ అబు సలీమ్, నటి మోనిక బేడీకి సంబంధించిన కొన్ని సంఘటనలను, కడపలో జరిగే ఫ్యాక్షనిజాన్ని తమకు అనుగుణంగా దర్శకుడు మలినేని గోపీచంద్ కథలో వాడుకున్నాడు. బుర్రా సాయిమాధవ్ రాసిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. వేటపాలెం బ్యాచ్ పై చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు చూస్తే కార్తీ ‘ఖాకీ’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు గుర్తిస్తాయి. ఇక రవితేజ, గోపీచంద్ మలినేనితో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమను ఎప్పటి నుండో చక్కని అనుబంధం ఉంది. అది ఈ సినిమా సంగీతం విషయంలో కనిపించింది. తగినంత సమయం కూడా చిక్కడంతో తమన్ మంచి నేపథ్య సంగీతం ఇచ్చారు. రెండు పాటలైతే పాత ట్యూన్సే! సినిమాలో చెప్పుకోదగ్గ మరో అంశం జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ, అలానే రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్. రవితేజ అభిమానులు ఆనంద పడే రీతిలో ఫైట్స్ ఉన్నాయి. మాస్ ఆడియెన్స్ ఇష్టపడే సంభాషణలు, పోరాట సన్నివేశాలు, పాటలు ఈ సినిమాకు కుదిరాయి. పైగా సంక్రాంతి సీజన్లో విడుదలయిన మొదటి సినిమా ఇదే కావడంతో మరేదానితోనూ పోల్చటానికి లేకుండా పోయింది. గతంలో రవితేజ, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన ‘డాన్ శీను, బలుపు’ చిత్రాల సరసన క్రాక్ కూడా నిలుస్తుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఓ పండుగ లాంటిది.
-నారాయణ