క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా

మొగలాయి చక్రవర్తులు బాక్ డ్రాప్ క్రిష్-పవర్‌స్టార్ కాంబినేషన్లో సినిమా …
“దేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవం’ అన్న రాయప్రోలు సుబ్బారావుగారి ఉద్వేగభరితమైన మాటలకు తెర రూపమే అన్నట్టుగా – పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం – క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. ‘ఖుషీ’ వంటి సంచలన విజయం తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం-పవర్‌స్టార్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం రెండు ప్రధానమైన షెడ్యూళ్ళని పూర్తి చేసుకొని ప్రస్తుతానికి విరామం ఇచ్చారు. హైదరాబాద్ లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్లలో చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పై అతి ముఖ్యమైన సన్నివేశాలను రూపొందించారు దర్శకుడు క్రిష్. సమసమాజ నిర్మాణం, సకల జనుల సౌభాగ్యం అన్న శ్రీశ్రీ మాటలే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర సారాంశం.

మొగలాయి చక్రవర్తులు భారత దేశాన్ని పరిపాలిస్తున్న నాటి రోజులు. సమాజం కోసం, సమాజం ద్వారా ప్రభావితుడైన ఓ చాకులాంటి యువకుడు మొగలుల మహాశక్తిని ఎలా ఎదుర్కొన్నాడు, ఎదుర్కొన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో ఉన్న ఔన్నత్యాన్ని, ఘనతని ఏవిధంగా చాటిచెప్పాడన్నది చిత్ర కథా ఇతివృత్తం. ఉత్సాహంగా, ఉల్లాసంగా కథలోకి ప్రవేశించిన పవర్‌స్టార్ పాత్ర క్రమేపి భారతీయతకు, భారతీయ ఘనతకు నడుం కట్టి మొగలులకు కనువిప్పు కలిగించడం అత్యంత రసవత్తరంగా ఈ చిత్రంలో పొందుపరచడమన్నదే ఈ చిత్రకథలో అమోఘమైన ప్రత్యేకతగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మానవ జాతి ఒక్కటై చెడు పైన ఘనవిజయం సాధించే ఎమోషన్ పవర్‌స్టార్ ఈ చిత్రంలో అభినయిస్తున్న పాత్రకు ప్రాణం. మంచిని మట్టుబెట్టి, సమాజ మారణహోమానికి భుజం ఒడ్డుతున్న వర్గాలకి, శక్తులకీ గుండెను ఎదురొడ్డే నైజం, లక్షణాలను పుణికి పుచ్చుకున్న పవన్ కళ్యాణ్ తన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రతిబించించే పాత్రను పోషించడంతోనే సినిమాకి ఎనలేని బలం చేకూరింది. కాగా, అలాగని సీరియస్ గా కాకుండా, వీలైనంత ఎంటర్టైనింగ్ గా ఆద్యంతం సినిమా ఆహ్లాదకరంగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా, అభిమానుల అంచనాల మేరకు పవర్ఫుల్ గా ఉంటుంది. సినిమా ! అఖండ భారతదేశంలో పరిపాలనాధికారంతో తిరుగులేని శక్తిగా పాతుకుపోయిన మొగలులపై పవర్ స్టార్ పాత్ర ఎంత తెలివితేటలతో, చాకచక్యంతో విజయాన్ని సాధించాడో తెరపైన చూస్తున్నప్పుడు ప్రతీ సీనూ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందన్నది రేపటి నిజం. చాణక్యుడి మేధస్సు, తెనాలి రామలింగడు యుక్తి – రెండిటి మేళవింపుతో కత్తికి రెండు వైపులా పదును అన్నట్టుగా పవన్ పాత్ర తళతళాడబోతోంది. సాహసోపేతమైన సన్నివేశాలతో ముడిపడిన వినోదాత్మకమైన కథనం పవర్ స్టార్ కోటానుకోట్ల అభిమానుల్ని ఉర్రూతలూగించబోతోంది. ఆయన చిత్రాలలోనే ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ కమర్షియల్ విలువలతో నిర్మాణమవుతోంది. ‘సైరా’ లాంటి సంచలన విజయాలకి సంభాషణలందించిన బుర్రా సాయిమాధవ్ ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. సీతారామశాస్త్రి గీతాలకు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఎన్నో కమర్షియల్ విజయాలకు స్క్రీన్ ప్లేకి వర్క్ చేసిన ప్రముఖ రచయిత భూపతిరాజా ఈ చిత్రానికి కూడా పనిచేయడం మరో విశేషం.

SA: