వెండితెర కలలరాణి కృష్ణకుమారి

ఆచార్య ఆత్రేయ తన సొంత సినిమా ‘వాగ్దానం’ (1961) లో ఆమెను ‘వన్నెచిన్నెలన్నీ వున్న చిన్నదానివి’ అంటూ కంటిపాపలో నిలిపాడు. నారాయణరెడ్డి ఆ వగలరాణిని ‘దోరవయసు చిన్న’దని, ‘కోరచూపుల నెరజాణ’ అని వర్ణిస్తూ నిందా ప్రస్తావన చేశాడు. మరొకచోట ఆమె అందం శ్రీగంధంతో సరితూగేదని, ఆమె కులుకు నడక రాయంచలకు కూడా సిగ్గు కలిగించేలా వుంటుందని, ఆమెరూపం రతనాలదీపమని శ్లాఘించాడు. మహాకవి శ్రీశ్రీ ఆమెను ‘సజీవ శిల్ప సుందరి’గా, ‘నిలువగలేని వలపులరాణి’గా కీర్తించాడు. కొసరాజు ఆమెను ఒక ‘అద్దాలమేడలోని అందాల భామ’గా ఊహించాడు. ‘నాగమల్లి పూలతో నిండిన ఆమె నల్లని జడ నవ్వుతూ ఉంటుం’దని ఆరుద్ర మురిసిపోయాడు. అలా తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలో ఎందరో సినీవెన్నెల రాజులను కలవరపెట్టిన ఆ కలువ కుమారి బహుభాషా నటి అందాల కృష్ణకుమారి. జానపద చిత్రాల కథానాయికగా, అభిన(వ)య రాజకుమారిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న కృష్ణకుమారిని కదలిపోయే కాలచక్రం బంగరునావలో ఎక్కించుకొని సినీరంగపు అంతఃపురం నుంచి సుదూర తీరాలకు తీసుకెళ్ళింది. జనవరి 24 వ తేదీ కృష్ణకుమారి వర్ధంతి సందర్భంగా ఆ క(ళ)లల రాణి గురించిన కొన్ని జ్ఞాపకాలు…

తొలిరోజులు
కృష్ణకుమారి తండ్రి వెంకోజీరావుది రాజమహేంద్రవరం. ఆయన ‘ఇండియా పేపర్ మిల్స్’ అనే బ్రిటీష్ సంస్థకు పశ్చిమ బెంగాల్ 24 పరగణాల పరిధిలోని నైహతి లో చీఫ్ ఇంజనీర్ గా వుండేవారు. 1933 మార్చి 6 న కృష్ణకుమారి నైహతిలోనే జన్మించింది. ఆమె తల్లి పేరు శచీదేవి. షావుకారు జానకి కృష్ణకుమారికి స్వయానా అక్క. వీరి బాల్యమంతా బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో గడిచింది. తండ్రి విదేశాలలో వుండి రావడంతో ఇంట్లో అంతా పాశ్చాత్య పద్ధతులే అనుసరించేవారు. ఆంధ్రా పేపర్ మిల్స్ లో పనిచేయడానికి నైహతి నుంచి ఆమె తండ్రి రాజమహేంద్రవరానికి మకాం మార్చారు. అక్కడే అక్క చెల్లెళ్ళు ఇద్దరూ వేదాంతం జగన్నాథశర్మ వద్ద కూచిపూడి నాట్యశాస్త్రాన్ని అభ్యసించారు. తండ్రి వెంకోజీరావును మద్రాసు ప్రభుత్వం ‘పేపర్ నిపుణుని’గా నియమించడంతో వారి మకాం మద్రాసుకు మారింది. అప్పుడే జగన్నాథశర్మ కూడా మద్రాసు రావడంతో అక్కచెల్లెళ్లు ఇద్దరూ నాట్యాభ్యాసాన్ని కొనసాగించారు. మద్రాసు గవర్నరు సమక్షంలోను, బెంగుళూరు ఖాదీ స్వదేశీ ప్రదర్శనలోను ఆమె తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించి మన్నన పొందింది. తండ్రిని అస్సాం ప్రభుత్వం టెక్నికల్ అడ్వైజర్ గా నియమించడంతో కృష్ణకుమారి కుటుంబం షిల్లాంగ్ కు వెళ్ళింది. అక్కడే కృష్ణకుమారి మెట్రిక్యులేషన్ పూర్తిచేసింది. 1949లో వారి కుటుంబం తిరిగి మద్రాసుకు వచ్చింది. నాట్యం మీద మక్కువ తో కృష్ణకుమారి మంచి నర్తకిగా గుర్తింపు పొందాలని ఆశపడేది. ముఖ్యంగా సినిమాల్లో నర్తకి వేషం వేయాలని కలలు కనేది. దర్శకరత్నం సి. పుల్లయ్య సిఫారసు మీద కృష్ణకుమారి జెమినీ స్టూడియోలో నర్తకిగా చేరింది. అక్కడ ఎ.కె.ఛోప్రా, దండాయుధపాణి, జయశంకర్ వంటి ప్రఖ్యాత నృత్యదర్శకులవద్ద సినిమాలకు అవసరమైన మెళకువలు నేర్చుకుంది. అలా పదినెలలు గడిచాక జెమినీ స్టూడియో వారు ‘వీరకుమార్’ అనే చిత్రాన్ని ప్రారంభిస్తూ కృష్ణకుమారికి నర్తకి వేషం ఇవ్వజూపారు. అనివార్యకారణాల వలన ఆ సినిమా నిర్మాణం ఆగిపోవడంతో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. దాంతో కృష్ణకుమారి జెమినీ స్టూడియో నుంచి తప్పుకుంది. ఈలోగా హాస్యనటుడు కస్తూరి శివరావు ‘అగ్నిమంత్రం’ అనే సినిమాతీసే ప్రయత్నంలో కృష్ణకుమారికి మేకప్ టెస్టు చేయించారు. అదికూడా ఆగిపోయింది. శివరావు తీయించిన మేకప్ స్టిల్స్ చూసిన జ్ఞానాంబికా పిక్చర్స్ వాళ్ళు ‘మంత్రదండం’ (1951) సినిమా తీస్తూ కృష్ణకుమారికి సోదిచెప్పే చిన్నవేషం ఇచ్చారు. అప్పుడే విజయా వారి ‘పాతాళ భైరవి’ చిత్రంలో గంధర్వకన్యగా ఆమె ఒక చిన్న పాత్రను పోషించింది. కృష్ణకుమారికి అప్పుడు పదిహేడేళ్ళు.

నవ్విన నవరత్నం
కృష్ణకుమారికి హీరోయిన్ అవకాశం విచిత్రంగా దక్కింది. ఒకరోజు కుటుంబ సభ్యులతో కలిసి మద్రాసు రాజకుమారి టాకీస్ లో ‘స్వప్నసుందరి’ సినిమాకు వెళితే, వెనుక వరసలో కూర్చున్నావిడ ఇంటర్వెల్లో కృష్ణకుమారిని చూసి చిరునామా అడిగి తీసుకుంది. ఆమె తమిళనాడు టాకీస్ నిర్మాత ఎస్. సౌందర్ రాజన్ కుమార్తె భూమాదేవి. రెండవరోజే కృష్ణకుమారి సౌందర్ రాజన్ నుంచి పిలుపొచ్చింది. వారు తెలుగులో ‘నవ్వితే నవరత్నాలు’ పేరుతో సిండ్రెల్లా కథను 1951 సినిమాలో అందం, అమాయకత్వం కలబోతగా వుండే పాత్రకోసం వాళ్ళు చాలా రోజులుగా అన్వేషిస్తున్నారు. చూసిన వెంటనే సిండ్రెల్లా పాత్రను పోలిన గౌరి అనే నాయిక వేషానికి కృష్ణకుమారిని ఎంపిక చేశారు. న్యూటోన్ స్టూడియోలో నిర్మించిన ఈ చిత్రంలో రామశర్మ సరసన కృష్ణకుమారి నటించింది. అయితే విచిత్రంగా ఆ సినిమా నవ్వులపాలైంది. తరవాత దోనేపూడి కృష్ణమూర్తి భారతలక్ష్మి బ్యానర్ లో నిర్మించిన ‘ప్రియురాలు’ సినిమాలో జగ్గయ్య సరసన ఆమె రెండవ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా అంతగా విజయవంతం కాలేదు. ఈలోగా ‘తిరుంబి పార్’, ’అళగి’, ‘మణిదన్’ అనే మూడు తమిళ సినిమాలలో నటించే అవకాశం ఒకేసారి దక్కింది. అయితే ఆ సినిమాలు కూడా వెక్కిరించాయి. అప్పుడే ఎన్.టి.రామారావు నేషనల్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి ప్రధమ ప్రయత్నంగా ‘పిచ్చిపుల్లయ్య’ (1953) చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో అక్కచెల్లెళ్ళు ఇద్దరికీ నటించే అవకాశం దొరికింది. ఇందులో కృష్ణకుమారి ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. ఆమెకు ఎన్టీఆర్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉండడానికి ఇది ఒక కారణం. రామశర్మ హీరోగా నటించిన బోళ్ల సుబ్బారావు సినిమా ‘పల్లెపడుచు’(1954) లో కూడా కృష్ణకుమారే హీరోయిన్. అలా తొలి చిత్రంతోనే ఏకంగా 14 సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్న అదృష్టతార కృష్ణకుమారి. అయితే బి.ఎన్.రెడ్డి నిర్మించిన వాహినీ వారి ‘బంగారు పాప’ తో సహా ‘పుదు యుగం’, ‘విడుత్తలై’, ‘తుళి విషం’, ‘కర్కోట్టై’ తమిళ సినిమాలు కూడా ఆశించినంత విజయాలు నమోదు చేయలేదు. దాంతో ఆమెమీద ‘ఫ్లాప్ చిత్రాల నాయిక’గా ముద్ర పడింది. నటనాపరంగా ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది. తరవాత వరసగా ఇలవేలుపు, వీరకంకణం, వినాయక చవితి, దీపావళి సినిమాలు వచ్చినా కృష్ణకుమారికి మంచి పేరు తెచ్చిన చిత్రం శ్రీధర్ దర్శకత్వం వహించిన వీనస్ పిక్చర్స్ వారి ‘పెళ్ళికానుక’ (1960). అప్పుడే ఆశాసుందరి, భక్త కనకదాస వంటి కొన్ని కన్నడ చిత్రాల్లో ఆమె నటించింది.

భార్యాభర్తలు తో బ్రేక్
ఎల్.వి.ప్రసాద్ చిత్రం ‘ఇలవేలుపు’ తో కృష్ణకుమారి నటజీవితం గాడినపడిందని చెప్పవచ్చు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మాత ఎ.వి.సుబ్బారావు ప్రత్యగాత్మ దర్శకత్వంలో నిర్మించిన ‘భార్యాభర్తలు’(1960) సినిమా కృష్ణకుమారి నటజీవితాన్ని మలుపు తిప్పింది. అందులో జూలాయి తిరుగుళ్ళు తిరిగే హీరోకు బలవంతపు భార్యగా రావలసివచ్చిన పాత్రలో కృష్ణకుమారి అద్భుత నటనాపటిమను చూపింది. తరవాత ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పిన మరో చిత్రం ‘కులగోత్రాలు’. అందులో కులాన్ని, గోత్రాన్ని చెప్పుకోలేని మహిళగా కృష్ణకుమారి నటన అపూర్వం. ఆ ఊపులోనే 1963లో ఏకంగా 16 సినిమాల్లో నాయికగా నటించి రికార్డు సృష్టించింది. నేటికీ అది చెరగని రికార్డుగానే నిలిచి వుంది. జానపద హీరోయిన్ గా కాంతారావు తో కలిసి 28 సినిమాల్లో కృష్ణకుమారి నటించింది. ఎన్టీఆర్ తో 25, అక్కినేనితో 18 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఘనత కృష్ణకుమారిది. కన్నడంలో రాజకుమార్, తమిళంలో శివాజీ గణేశన్ తో నటించిన పలుచిత్రాలు ఘనవిజయాన్ని సాధించాయి. ఆమెకు మూడుసార్లు జాతీయ బహుమతులు, రెండు నంది అవార్డులు దక్కాయి. 1969లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాజీ ఎడిటర్, స్క్రీన్ సినీ పత్రిక వ్యవస్థాపకుడు అయిన కర్ణాటకకు చెందిన అజయ్ మోహన్ ఖైతాన్ ను పెద్దల అనుమతితో కృష్ణకుమారి వివాహమాడింది. వారికి సంతానం లేకపోవడంతో దీపిక అనే అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంది. పెళ్ళయ్యాక హీరోయిన్ వేషాలకు స్వస్తి చెప్పి సహాయక పాత్రలవైపు ఆమె మొగ్గు చూపింది. వాటిలో భార్యాబిడ్డలు, మానవుడు దానవుడు, నేరము శిక్ష, యశోదాక్రిష్ణ, జేబుదొంగ, గుణవంతుడు, బంగారుభూమి ముఖమైనవిగా చెప్పవచ్చు. భర్త అజయ్ మోహన్ 2012 లో చనిపోవడంతో కూతురు, అల్లుడు విక్రమ్ మయ్యా, మనవడు పవన్ మయ్యా తో కలిసి బెంగుళూరు శివార్లలోని ఐదెకరాల ఎస్టేట్ లోని గార్డన్ బంగళాలో చివరిదాకా నివసించింది. అల్లుడు విక్రమ్ మయ్యా ప్రసిద్ధ MTR హోటల్, ఆహార ఉత్పత్తుల పరిశ్రమకు వారసుడు. ఎముకల క్యాన్సరుకు గురైన కృష్ణకుమారి చికిత్స పొందుతూ జనవరి 24, 2018 న బెంగుళూరులోనే కాలంచేసింది.

పాటల పందిరిలో వగలరాణి
కృష్ణకుమారి నటించిన సినిమాల్లో ఎన్నో జనరంజకమైన పాటలున్నాయి. ఉయ్యాల జంపాలలో ‘ఓ పోయేపోయే చినదానా,నీ తీయని మనసు నాదేనా’, ‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది’ పాటలకు అందాన్ని, ఆనందాన్ని పండించింది కృష్ణకుమారే. బందిపోటు సినిమాలో ‘వగలరాణివి నీవే సొగసుకాడను నేనే’ పాటకు కేంద్రబిందువు కృష్ణకుమారి అనే విషయాన్ని కాదనలేం. అందులోదే ‘ఊహలు గుసగుసలాడే, నా హృదయము వూగిసలాడే’ ఒక అద్భుత పాట. వాగ్దానం చిత్రంలో ‘నాకంటి పాపలో నిలిచిపోరా, నీవెంట లోకాల గెలువనీరా’ అని దాశరథి రాసిన తొలి పాటకు చెమ్కీలు అద్దిన చెక్కిళ్లతో అందాలను దిద్దిన కృష్ణకుమారిని మరువగలమా! అలంకార ప్రాయంగా అమరిన ‘ఏమో ఏమో ఇది నాకేమో ఏమో ఐనది’ అంటూ సాగే అగ్గిపిడుగు పాటలో కృష్ణకుమారి అందాలు వర్ణించ తగునా!! అంతస్తులు చిత్రంలో కట్టిన తెల్లచీర పాట ఆ చిత్రానికే హైలైట్ కాదని అనలేంకదా. తిక్కశంకరయ్య సినిమాలో ‘కోవెల ఎరుగని దేవుడ’ని ఎన్టీఆర్ ని కీర్తించిన ఘనతకు, ఉమ్మడి కుటుంబం సినిమాలో ధవళ వస్త్రాన్వితయై ‘దేవతయే దిగివచ్చి మనుషులలో కలసినది’ ఆమేనని ఎన్టీఆర్ నుంచి ఘనకీర్తిని సొంతం చేసుకున్నది కూడా కృష్ణకుమారే. చెప్పుకుంటూ పోతే కృష్ణకుమారి స్వర్ణమందసంలో దాగిన గొప్ప పాటలు ఎన్నో, ఎన్నెన్నో. వాటిలో భార్యాభర్తలులో ‘ఏమని పాడెదనో ఈవేళా’, డాక్టర్ చక్రవర్తిలో ‘ఈమౌనం ఈబిడియం’, పుణ్యవతిలో ‘మనసు పాడింది సన్నాయి పాట’, కులగోత్రాలులో ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేర రావేలా’, ‘అంతస్తులు సినిమాలో ‘నువ్వంటే నాకెందుకో అంత ఇది’, జమీందార్ సినిమాలో ‘నీతోటే వుంటాను శేషగిరి బావా’, ‘పెళ్లికానుకలో ‘పులకించని మది పులకించు’, చదువుకున్న అమ్మాయిలులో ‘కిలకిల నవ్వులు చిలికినా’, అభిమానం చిత్రంలో ‘ఓహో బస్తీ దొరసాని’, కానిస్టేబుల్ కూతురు సినిమాలో ‘చిగురాకుల ఊయలలో’ వగైరా పాటలు ఆమె నటించిన 110 తెలుగు సినిమాల్లో కోకొల్లలు.

మరిన్ని విశేషాలు
కృష్ణకుమారి స్నేహశీలి. అంతస్తులు సినిమాతో సీనియర్ నటి భానుమతితో పరిచయం పెరిగి ఆ స్నేహం భానుమతి మరణించేదాకా కొనసాగింది. అలాగే చిలకా గోరింకా సినిమాలో పాట పాడేందుకు వచ్చిన బాలీవుడ్ హీరోయిన్ నూతన్ తో పరిచయమేర్పడిన తరవాత కూడా వారి సాంగత్యం చాలాకాలం కొనసాగింది.

ఎన్టీఆర్-కృష్ణకుమారి మంచి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. పిచ్చిపుల్లయ్య, దేవాంతకుడు, వినాయకచవితి, ఇరుగు పొరుగు, లక్షాధికారి, బందిపోటు, గుడిగంటలు, శ్రీకృష్ణావతారం, ఉమ్మడి కుటుంబం, తిక్క శంకరయ్య, వరకట్నం, అగ్గిపిడుగు వంటి పాతికకు పైగా జనరంజకమైన చిత్రాల్లో కలిసి నటించారు.

లక్షాధికారి సినిమా షూటింగులో కృష్ణకుమారి అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. మబ్బులో ఏముంది’ అనే పాటను సముద్రపు అలల మధ్యన చిత్రీకరిస్తుండగా, ఒక పెద్ద అలవచ్చి కృష్ణకుమారితోబాటు ఎన్టీఆర్ ను కూడా లోపలకు ఈడ్చుకెళ్ళింది. నీళ్ళు తాగేసిన ఆమెను ఎన్టీఆర్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఇవతలకు లాగేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సన్నివేశంలో బికినీ ధరించి నటించిన ధైర్యవంతురాలు కృష్ణకుమారి. అయితే సెన్సారు వారి అభ్యతరంతో ఆ సన్నివేశాన్ని సినిమానుంచి తొలగించారు.

మరో ప్రమాదం కూడా ఎన్టీఆర్ నటించిన బందిపోటు చిత్రంలో సంభవించింది. మద్రాసుకు సమీపంలోని గిండి అడవుల్లో దర్శకుడు విఠలాచార్య గుర్రపుస్వారి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. చెట్టుమీద ‘వగలరాణివి నీవే’ అంటూ పాట పాడుతున్న ఎన్టీఆర్ ను గుర్రంమీద స్వారి చేస్తూ కృష్ణకుమారి తన అనుచరులచేత పట్టించే దృశ్యమది. అయితే కృష్ణకుమారి ఎక్కిన ఆడ గుర్రం ఒక్క వుదుటున వేగం అందుకుంది. అప్పుడు విఠలాచార్య పరుగెత్తుతున్న ఆడగుర్రానికి ముందు నాలుగు మగ గుర్రాలను వదిలి కృష్ణకుమారి ఎక్కిన గుర్రం వేగం తగ్గింపజేచి ఆపారు. అలా గుర్రం ప్రమాదం నుంచి ఆమె బయట పడింది.

With ANR

అక్కినేనితో కృష్ణకుమారి నటించిన మొదటి చిత్రం వీనస్ పిక్చర్స్ వారి పెళ్ళికానుక. అప్పుడు కృష్ణకుమారికి చీరకట్టుకోవడం సరిగా వచ్చేది కాదట. ఆమెకు చీర ఎలా కట్టుకోవాలో, సంభాషణలు ఎలా పలకాలో వంటి మెళకువలు నేర్పింది అక్కినేని అని ఒకానొక సందర్భంలో ఆమే స్వయంగా చెప్పింది.

రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటించిన తొలిచిత్రం ‘చిలకా గోరింక’ లో హీరోయిన్ కృష్ణకుమారి. అప్పటికే ఆమె వంద చిత్రాలను పూర్తి చేసుకున్న సీనియర్ నటిగా గుర్తింపు పొందింది. ఆ సినిమా ప్రత్యగాత్మ సొంతచిత్రం. కథానాయకిగా మంచి బ్రేక్ ఇచ్చిన భార్యాభర్తలు, కులగోత్రాలు సినిమాలకు దర్శకుడు ప్రత్యగాత్మ కావడంతో, ఆతని మీద వుండే గౌరవంతో కృష్ణంరాజు ప్రక్కన నటించేందుకు కృష్ణకుమారి వెనుకాడలేదు.
తొలి చిత్రం నవ్వితే నవరత్నాలు ఫ్లాప్ టాక్ మూటకట్టుకుంది. అయినా వారంరోజులు విజయవాడలో ఆ సినిమా హౌస్ ఫుల్ కలక్షన్లతో నడిచింది. ఒక విలేకరి నిర్మాత వద్ద ఆ విషయాన్ని ప్రస్తావిస్తే “సినిమాకోసం ప్రేక్షకులు వెళ్ళడంలేదు. కేవలం కృష్ణకుమారి అందాన్ని, అమాయకత్వాన్ని చూడడానికే వాళ్లు థియేటర్ కు వెళ్తున్నారు” అని జవాబిచ్చాడట.

కృష్ణకుమారికి వంటచేయడం సరదా. తను వండిన వివిధ రకాల వంటకాలను షూటింగ్ సమయంలో సహచర నటీనటులకు రుచి చూపించేది. గోదావరి, బెంగాలి సాంప్రదాయ వంటకాలను కృష్ణకుమారి బాగా వండేది. ఆమె కుమార్తె దీపిక అమ్మచేతి వంటల పుస్తకాన్ని రచించి కృష్ణకుమారికి అంకితమిచ్చింది. దీపిక రచించిన మరో పుస్తకం ‘మై మదర్’ ని విడుదల చేసినప్పుడు ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది

చదువుకున్న అమ్మాయిలు సినిమాలో ‘కిలకిల నవ్వులు చిలికినా’ పాట షూటింగ్ షెడ్యూలు నాటికి కృష్ణకుమారి జ్ఞానదంతం పెరగడంతో ఆమె దవడ వాచింది. సినిమా విడుదల తేది దగ్గర పడడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. అప్పుడు కృష్ణకుమారి తెలివిగా తలచుట్టూ స్కార్ఫ్ చుట్టుకొని చెంపలు కనపడకుండా ఉండేలా జాగ్రత్తపడుతూ షూటింగు పూర్తి చేసింది. ప్రేక్షకులు దాన్ని ఫ్యాషన్ గా భావించి అనుకరించడం మొదలుపెట్టారు.

ఎన్టీఆర్ తో కృష్ణకుమారికి వివాహేతర సంబంధాలు వున్నాయని తమిళ పత్రిక హిందూనేశన్ సంపాదకుడు వరస కథనాలు రాసి ఆమెను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేశాడు. అందుకు కృష్ణకుమారి ఏమాత్రం చలించలేదు. వాటిని పుకార్లుగా పరిగణించాలని విజయవాడ విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసింది.

కృష్ణకుమారి నటించిన ఒకే ఒక హిందీ చిత్రం ‘కభీ అంధేరా కభీ ఉజాలా’ (1958). అప్పటికే హిందీలో కృష్ణకుమారి పేరుతో ఒక హీరోయిన్ ఉండడంతో, ఈ సినిమాలో కృష్ణకుమారి పేరును ‘రతి’ గా మార్చారు. ఆ సినిమాలో హీరో కిషోర్ కుమార్.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap