
కృష్ణా విశ్వవిద్యాలయం మరియు మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ వారు సంయుక్తంగా దామెర్ల రామారావు 125 వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో మే 6వ తేదీన 2వ జాతీయ చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. ఈ చిత్రకళా ప్రదర్శనను శుక్రవారం ఉదయం 11.00 గంటలకు కేయూ ఉపకులపతి కె.బి.చంద్రశేఖర్ ప్రారంభించారు. ఆర్ట్ ఎగ్జిబిషన్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు నుండి కూడా వచ్చిన సుమారు 62 మంది చిత్రకారులు వైవిధ్యం, నవ్యత గల 80కి పైగా చిత్రాలు ప్రదర్శించారు.
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎన్‌సీసీ, రసాయన శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో ప్రదర్శనను ప్రారంభించిన కేయూ ఉపకులపతి కె.బి.చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ మనసును కదిలించే చిత్రాలకు ఎప్పుడూ ప్రజాదరణ ఉంటుందని అన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలను కళల్లో ప్రోత్సహించాలన్నారు. దురదృష్టవ శాత్తు నేడు పాఠశాలలో కూడా కళలకు ప్రోత్సహాము కరువయ్యిందన్నారు. మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ, విశ్వవిద్యాలయం ఎన్‌సీసీ విభాగం కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఇలాంటి ప్రదర్శనలు చిత్రకారుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. చిత్రకళా ప్రదర్శన కన్వీనర్ డి. రామశేఖరరెడ్డి మాట్లాడుతూ, మునుపెన్నడూ ప్రదర్శించని చిత్రాలను కళాకారులు తమ కుంచెలతో అపురూపంగా తీర్చిదిద్దారన్నారు. రాజమండ్రి చిత్రకళా నికేతన్ కార్యదర్శి మృత్యుంజయరావు మాట్లాడుతూ క్రూల్డ్రే లాంటి మహానుభావులు ప్రొత్సహిస్తేనే దామెర్ల రామారావు లాంటి దేశం గర్వించదగ్గ గొప్ప చిత్రకారుడు మనకు లభించాడన్నారు. 64కళలు.కాం ఎడిటర్ కళాసాగర్ మాట్లాడుతూ చిత్రకారులకు ప్రొత్సహం కరువవుతున్న ఈ రోజుల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చిత్రకళా ప్రదర్శనను నిర్వ్యహించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం యూనివర్శిటీలలో ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు డిమాండు తగ్గిందని, ఆర్ట్ కోర్సులలో మార్పులు చేయాలసిన అవసరం వుందన్నారు. యువత యానిమేషన్, గ్రాఫిక్స్ వంటి కోర్సుల వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. కళాకారులకు అవకాశాలు లేవని, ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగాలు కల్పించి కళాకారులను ఆదుకోవాలన్నారు. డ్రీం ఆర్ట్ అకాడెమి ఫౌండర్ రమేష్ మాట్లాడుతూ ఎంతో దూర ప్రాతాల నుండి వచ్చిన చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులను అభినందించారు. విశ్వవిద్యాలయ రెక్టార్ ఆచార్య డి. సూర్యచంద్రరావు, రిజిష్టార్ ఎం. రామిరెడ్డి, మచిలీపట్నం ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు లలితా మోహన్, కార్యదర్శి బి.ఎస్.వి. రమేష్ పాల్గొన్నారు.
సాయత్రం 4 గంటలకు విశ్వవిద్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ముగింపు సభలో ఉదయం విద్యార్ధులకు నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న చిత్రకారులను కేయూ ఉపకులపతి కె.బి.చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా సత్కరించారు.
-కళాసాగర్ (9885289995)




బావుందండీ.. ఇటువంటి ప్రదర్శన లు విరివిగా జరగాలి.. అప్పుడే చిత్రకారులకి ఒక ఉనికంటూ ఉంటుంది. ఉత్సాహం వస్తుంది.
Nice programme.
Nice sir