ఘనంగా కృష్ణంరాజు అభినందన సభ

పాత్రికేయ రంగంలో పక్షపాత ధోరణలు పెరిగిపోతున్నాయని ఫలితంగా ఆ రంగం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీనియర్ పాత్రికేయుడు వివిఆర్. కృష్ణంరాజు 35 సంవత్సరాల పాత్రికేయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను నేడు పలు సంఘాలు ఘనంగా సన్మానించాయి. విజయవాడలో జరిగిన ఈ సభకు ఆంధ్రా ఆర్ట్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ళ నారాయణ రావు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యుడు చందు సాంబశివరావు మాట్లాడుతూ, నిష్పాక్షిక రాజకీయ విశ్లేషకుడిగా కృష్ణంరాజు గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన ఏది చెప్పినా ప్రామాణికంగా ఉంటుందని అన్నారు. పాత్రికేయ రంగంలో పక్షపాత ధోరణులు పెరిగిపోతున్నాయని ఈ పరిణామం ప్రజాస్వామానికి మంచిది కాదన్నారు. ఎ.పి. ఫైబర్ నెట్ ఛైర్మన్ పి. గౌతం రెడ్డి మాట్లాడుతూ, వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణంపై కృష్ణంరాజు రచించిన పరిశోధనాత్మక వ్యాసం వైమానిక రంగ నిపుణుల ప్రశంసలు పొందిందన్నారు. కృష్ణంరాజు తన పాత్రికేయ జీవితంలో ఎప్పుడూ రాజీ పడలేదని, నిజాలు నిర్భయంగా చెప్పడం ఆయన నైజమన్నారు.

ప్రముఖ నటుడు ఎల్.బి. శ్రీరామ్ మాట్లాడుతూ పత్రికా ప్రమాణాలు పడిపోతున్న ప్రస్తుత తరుణంలో కృష్ణంరాజు వంటి ఆదర్శ పాత్రికేయులు ఉండడం మన అదృష్టమన్నారు. ప్రజాశక్తి మాజీ సంపాదకులు వెంకట్రావు మాట్లాడుతూ ప్రస్తుత మీడియాలో అధిక శాతం ఏదో పక్షానికి మద్దతు నిస్తూ నిజాలను మరుగున పడేస్తున్నాయని ఈ ఏకపక్ష పాత్రికేయం ప్రజాస్వామ్య మనుగడుకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. కృష్ణంరాజు లోతుగా అధ్యయనం చేసి అనేక వందల వ్యాసాలు రాశారని అవన్నీ సమాజ చైతన్యానికి ఉ పయోగపడ్డాయని ఆయన అన్నారు. మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి సునీత లఖంరాజు మాట్లాడుతూ, నిజాలు నిర్ణయంగా చెప్పడం కృష్ణంరాజు నైజమన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు చందన మధు మాట్లాడుతూ, విశాఖ బాక్లెట్, నదీజలాలపై ఆంధ్రుల హక్కులు, మచిలీపట్నం పోర్టు భూముల ఆక్రమణపై కృష్ణంరాజు వ్యాసాలు రాయడమే కాకుండా ప్రజల పక్షాన ఉద్యమాలు కూడా నిర్వహించారని అన్నారు. కాపునాడు పత్రికా సంపాదకుడు గాళ్ళ సుబ్రమణ్యం మాట్లాడుతూ కృష్ణంరాజు పాత్రికేయ జీవితం ఆదర్శ ప్రాయమన్నారు. బెటర్ ఆంధ్రప్రదేశ్ కో- కన్వీనర్ డాక్టర్ కె. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, కృష్ణంరాజు పాత్రికేయ విలువలు కాపాడే విషయంలో ఏనాడూ రాజీపడలేదని నేటితరం పాత్రికేయులు ఆయనను చూసి చాలా నేర్చుకోవాలన్నారు.

ఈ సందర్భంగా కృష్ణంరాజు ఆయన సతీమణి శ్రీదేవిని పలు సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. మధుసూధన రాజు, వై.సి.పి. నాయకులు శ్రీనివాస్, రత్నం, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి.ఎస్.ఎం. కృష్ణంరాజు, మహిళా ప్రభ పత్రిక సంపాదకుడు సర్వారావు, బహుగ్రంధ రచయిత వెంకట్ పూలబాల, లోక్ సత్తా నగర అధ్యక్షుడు బి. అశోక్ కుమార్, శారదా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు విజయ్ కుమార్, శ్రీనివాస్, యు. జోషి, సిల్విస్టర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap