క్షేత్రయ్య పదాలలో ప్రేమ, సైన్స్

క్షేత్రయ పదాలు (మువ్వగోపాల పదాలు) మహాకవి క్షేత్రయ్య (1610-1690) కృష్ణాజిల్లా కూచిపూడి దగ్గర మువ్వ గ్రామం వాసి. క్షేత్రయ పదాలు పుస్తకానికి ఆర్. రవి శర్మ సంపాదకత్వం వహించారు. ఈ పుస్తకానికి ముందుమాట అలాగే క్షేత్రయ్య పదాల మనోవిశ్లేషణ చేసిన వారు డాక్టర్ జి వి పూర్ణ చంద్.

‘క్షేత్రయ్యను చదివేందుకు కొత్త కళ్ళజోడు కావాలి’ అంటూ డాక్టర్ పూర్ణచంద్, శరీరంలో నివసించే జీవాత్మను ఎరిగిన వాడు క్షేత్రుడు. అలాంటి క్షేత్రుడు కాబట్టి ప్రజలు గౌరవంగా క్షేత్రయ్య అని ఆయనను పిలుచుకున్నారు భక్తి శృగారాల మేలు కలయికగా ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించే క్షేత్రయ్య పదాలు తెలుగువారి సంగీత సాహిత్య నృత్య కళాదీప్తికి కారణాలు. భౌతిక సౌందర్యాన్ని దాటి ఆత్మ సౌందర్యం వైపు పయనించే ఈ గానాలు భక్తుడు భగవంతుని మధ్య సున్నితమైన మానసిక ఆధ్యాత్మిక మమకారాన్ని ప్రతిఫలించే రస రమ్య దర్పణాలు లాంటివి. భక్తిని పదవ రసంగా భావించినట్లయితే దాని స్థాయి భావం తాదాత్మ్యం. ఆలంకారికులు అంగీకరించకపోతే దాన్ని భక్తి రసాయనం అని పిలవడం సబబు. క్షేత్రయ్య పదాలలో రసాన్ని, భక్తిని వేరువేరు అంశాలుగా వెతకలేం. క్షేత్రయ్య పాడటం మీద కన్నా నృత్యానికి ప్రాధాన్యతని ఇచ్చాడు. భక్తి రసాయనంలోని తదాత్యాన్ని అనుభవించి అభినయించి చూపి భక్తులను భగవంతుడికి చేరువ చేయటం క్షేత్రయ్య లక్ష్యం. కళాభిజ్ఞత కలిగిన దేవదాసీలు ప్రముఖంగా క్షేత్రయ్య పదాలను ఆడి పాడి ప్రచారం చేశారు అయితే భక్తి స్థానంలో కాలక్రమంలో అశ్లీలత,తాదాత్మ్యత స్థానంలో పరవశం ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. మనో విశ్లేషణ శాస్త్రపరమైన దృష్టితో విశ్లేషిస్తే, క్షేత్రయ్య కవి హృదయం ఆవిష్కరణ అవుతుంది. క్షేత్రయ్య తానే నాయికగా మారి తన ప్రేమికుడైన మువ్వగోపాలుని కోసం తపించాడు. ఆయన పొందిన స్పష్టమైన శారీరక ఆధ్యాత్మిక అనుభవాన్ని లోకానికి పంచాడు. దాన్ని ప్రదర్శించి చూపేందుకు వీలుగా పద రచన చేశాడు. క్షేత్రయ్య పదాలలో సాహిత్యం శిల్పం చిత్రకళల పరంగా ‘సున్నిత రసానందం’ అనే దక్షిణాంధ్ర యుగ లక్షణం కనిపిస్తుంది. ఒక ప్రియురాలు ప్రియుడ్ని ఎలా ప్రేమిస్తుందో అలా భగవంతుడిని ప్రేమించడంలోనే దివ్యత్వం దాగి ఉంటుందనేది క్షేత్రయ్య యుగంలో కనిపించే ఆధ్యాత్మిక పరిణతి! మానసిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా ఉన్నతీకరించడం క్షేత్రయ్య పద సాహిత్య అంతరార్థం. గోపికలు- గోపాలుడు మధ్య మధుర భావాన్ని జయదేవుడు గీతగోవిందంలో ఎలా చూపాడో క్షేత్రయ్య అదే భావ స్రవంతిని తెలుగులో తన పదాల ద్వారా జలపాతంలా ప్రవహింప చేశాడు. క్షేత్రయ్యను చదివేందుకు వేరే ఆధ్యాత్మిక కళ్ళజోడు కావాలి. క్షేత్రయ్య పదాలు అన్న గ్రంథం వాగ్గేయకార వైభవాన్ని ఈ తరానికి పరిచయం చేసే గొప్ప ప్రయత్నం అంటారు డాక్టర్ జి వి పూర్ణచంద్. ‘అభినయము సాత్విక ప్రధానము’ అన్న పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారి రచనలో రంగస్థలం గురించి అభినయం గురించిన విశేషాలు ఇప్పటి తరం వారు తప్పక తెలుసుకోతగినవి. కర్ణాటక సంగీతంలో కొన్ని వందల రాగాలున్నప్పటికీ క్షేత్రయ్య సుమారు 40 కంటే ఎక్కువ రాగాలతో పద రచన చేయలేదు. పాడటానికి అనుకూలించే రాగములనే ఆయన ఏరుకున్నాడు. నాయికలు కొన్ని వందల అయినప్పటికీ అష్టవిధ నాయికలు ఎట్లా ప్రాముఖ్యంతో పరిగణింపబడుతున్నారో, ఈ రాగాలను కూడా ఆయన అలాగే ఏరుకున్నాడు. పదములను విలంబిత లయలో పాడితేనే అభినయమును చక్కగా ప్రదర్శించటానికి అవకాశం ఉంటుంది’ అంటారు. అడుగులు- వర్ణములు జావళీలందు ఒప్పును. ఆలయమందు కేవలం తాళము గతి, తెలుపుటకు మాత్రమే అడుగులు ప్రదర్శింపబడతాయి. ఇలా పదాలు అడుగులు నృత్యాభినయం యొక్క విశేషాలని సోదాహరణంగా రామకృష్ణ వివరించారు.

తరువాత క్షేత్రయ్య పదాల మనోవిశ్లేషణ చేస్తూ డాక్టర్ పూర్ణచంద్- పద కవితలకు దక్షిణాంధ్ర యుగం స్వర్ణ యుగం. పద కవితలు శృంగార రస ప్రధానంగా ఉంటాయి. క్షేత్రయ్య సాహిత్యాన్ని మధురభక్తి పరమైనదిగా, నాయక నాయికల క్రీడగా విశ్లేషకులు భావిస్తారు. వెంకటేశ్వరుడు అమ్మవారితో సలిపిన కేళీ విలాసాలను తాను మనో నేత్రంతో దర్శించి కమనీయంగా వర్ణించిన వాడు అన్నమయ్య. తానే నాయికగా మారి భగవంతుని స్పర్శను తన ఆత్మ దృష్టితో ఆస్వాదించి తన అనుభవాన్ని పాటగా మలచినవాడు క్షేత్రయ్య. ఏ తరహా నాయిక గురించి కావాలన్నా క్షేత్రయ్య పదాలలో ఉదాహరణలు కనిపిస్తాయి అన్నారు గిడుగు సీతాపతి. శృంగార రసానికి రతి స్థాయి భావం. స్త్రీ పురుషుల సంయోగ క్రియ అని అర్థం కాదు. ఆ ఆనందానుభవాన్ని కలిగించే అంశాలన్నీ రతి కిందికే వస్తాయి. పాశ్చాత్యలకు భక్తి శృంగారం గురించి అవగాహన లేకపోవడంతో అది ‘లిబిడో’ కి పరిమితమైంది. ఫ్రాయిడ్ కి మన సంప్రదాయం తెలిసి ఉంటే దీన్ని ‘డివోషనల్ లిబిడో’ అని ఉండేవాడు అంటారు. పూర్ణచంద్. నిగ్రహం వలన, నెరవేరని ప్రవృత్తులు శరీరంలో పేర్కొని పోతే మానసిక ఒత్తిడి అశాంతి కలుగుతాయి. ఆ ఉద్రిక్తత తొలగించడానికి మనః శక్తిగా ఉన్నతీకరించుకుంటే అదే ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఆనందసూత్రం- ప్లెజర్ ప్రిన్సిపల్’ అవుతుంది. బహిరంగంగా చెప్పకపోయినా త్రిగుణాల సిద్ధాంతాన్ని ఆధునీకరించి ప్లెజర్ ప్రిన్సిపల్ అనే ఆలోచన ఫ్రాయిడ్ అందించగలిగాడు. చిత్త వృత్తుల నిరోధం ద్వారా మానసిక శక్తిని సబ్లిమేట్ చేసుకొని ఈ మానసిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మళ్లీ సబ్ లిమేట్ చేసుకునే ప్రయత్నం మధుర భక్తి సిద్ధాంతంలో కనిపిస్తుంది అంటారు. దివ్య ప్రేమను మానవ ప్రేమ రూపంలో వ్యక్తపరిచాడు క్షేత్రయ్య. మానవ ప్రేమ పరిభాషలో అది కామమే కానీ దివ్య ప్రేమ పరిభాషలో అది భక్తి అవుతుంది.

ఆంధ్రులకు ఒక నాట్య కళ ఉందని దాని రీతి ఇలా ఉంటుందని లోకానికి చాటినవాడు క్షేత్రయ్య. దక్షిణాంధ్ర యుగం సంగీత సాహిత్యాలకే కాదు నాట్యానికి కూడా పునర్జన్మనిచ్చింది క్షేత్రయ్య. అందుకు కారకుడు ప్రేరకుడు కూడా! సంగీతంలో అభినయంలో సాహిత్యంలో నాదం మాత్రమే ఉంటాయి. నాట్యంలో సంగీతం సాహిత్య అభినయాలు త్రివేణిగా సంగమిస్తాయి. క్షేత్రయ్య పదాలలో నాయిక మానసిక స్థితి మాత్రమే కనిపిస్తుంది కానీ ఎప్పుడో తప్ప ఆ నాయిక పేరు ఎక్కడా కనిపించదు. ఇష్టమైన వాళ్ళకు అది భక్తి వైరాగ్య భావనగా కనిపిస్తుంది. ఇష్టం లేని వాళ్లకు అది పచ్చి శృంగారం అనిపిస్తుంది.

మగవారిలో స్త్రీత్వం ఆడవారిలో పురుషత్వం సహజంగానే కలగలిపి ఉంటాయి. పరమాత్మని తన హృదయంలో నిలుపుకొని తనను నాయికగా భావించుకుని పరమ పురుషుడైన పరమాత్మను సేవించడం ప్రకృతి విరుద్ధమూ, శాస్త్ర విరుద్ధమో కాదు. ఆ భగవంతునితో సంయోగం కోసం తనను నాయికగా చేసుకోవడం, తనను తాను అర్పించుకోవడమే. క్షేత్రయ్య తనలో స్త్రీత్వాన్ని ఆవాహన చేసుకున్నాడంటే అది భారతీయ కళాకారుడి సహజ లక్షణం భారతీయతలోనే ఆ మూలాలు ఉన్నాయి. క్షేత్రయ్య పద సాహిత్యం ప్రేమను పెంచే సాధనంగా, అసూయని చిత్రిస్తుంది. అసూయని ఒక ప్రముఖమైన మనోవృత్తిగా తీసుకున్నారాయన. అసూయ ప్రేమ అమితమైన భక్తి అసంతృప్తి విరహం లాంటి భావాలు అభినయానికి ప్రాణప్రదాలు.

ఫ్రాయిడ్ తర్వాత తరం వారిని నియో ఫ్రాయిడియన్స్’ అంటారు. వారికి భారతీయ ఆలోచన విధానం పైన ఫ్రాయిడ్ కు ఉన్నంత అవగాహన వీరికి లేదు. అసూయను శత్రువుగా, కాక మన అంతర్గత సత్యాన్ని వెల్లడించే సంకేతంగా చూడగలిగితే మనసు నెమ్మది అవుతుంది. జీవితం సులువు అవుతుంది. అసూయ ఒక సహజ భావన.. దానిని అర్థం చేసుకొని స్వీయ జాగ్రత్తతో ఎదుర్కొని అది ఆనందానికి అడ్డుపడకుండా చూసుకోగలిగిన నాయిక. ప్రేమ విజేత అవుతుంది. ప్రేమలో పడినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం ఎలా అనుభూతి చెందుతాం ఎలా ప్రవర్తిస్తాం… ఈ అన్ని కోణాలను పరిశీలిస్తేనే ప్రేమతత్వం క్షేత్రయ్య పదతత్వం కూడా అర్థమవుతుంది.

తనకూ మువ్వగోపాలునికి మధ్య జరిగిన నిగూడమైన ప్రణయ భావాలను ఆత్మీయ ముద్రతో క్షేత్రయ్య వెలిబుచ్చారు. పరమాత్ముడే ఒక ఊహాజనితమైన ఆకృతి అయినప్పుడు ఆయనలో లీనం కావడం కూడా ఊహాత్మకమే! ఆ ఊహ లోంచి పుట్టినది భగవంతుని శృంగార రూపంతో తాను నాయికగా సంగమించటం.క్షేత్రయ్య రసజ్ఞుడు. సంస్కృత సాహిత్యం అలంకార శాస్త్రం సంగీతం భరతనాట్యం కళారీతులలో అభినివేశం కలిగిన మహాకవి దేవుని ఏ కళ్ళతో చూడాలో తెలిసినవాడు అందుకే స్త్రీ అయినా పురుషుడైనా ప్రేమను బలంగా నిలుపుకోవాలి అనుకున్న వారు క్షేత్రయ్యను తప్పక చదవాలి అంటారు డాక్టర్ పూర్ణచంద్.

త్యాగయ్య అన్నమయ్య కీర్తనలతో ఉన్నంత పరిచయం తెలుగు వారికి క్షేత్రయ్య పదాలు అంతగా పరిచయం లేనివి. అదీకాక మానసికంగా ఉన్నతీకరణ చెందిన వారే క్షేత్రయ్య పదాలలోని పురుషుడు భక్తితో, స్త్రీ భావనతో, పరమాత్మని ప్రేమించడం అనేది భౌతికమైన దేహ వాంఛగా కాకుండా ఆధ్యాత్మిక కరుణ సంబంధమైన, జీవుని పరమాత్మునితో సంయోగింపచేసే అద్భుత భక్తి రసాయనం, క్షేత్రయ్య పదాలు.

ఈ గ్రంథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి సౌజన్యంతో కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ వారు ప్రచురించారు.
ప్రతులకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 98665 23918, వెల: 250/- రూపాయలు మొత్తం పేజీలు 300.

మల్లేశ్వరరావు ఆకుల
79818 72655

Share via
Copy link
Powered by Social Snap