నాట్యక్షేత్రంలో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం 50 అడుగుల ఎత్తులో పతాక స్తూపం ఏర్పాటు.
కూచిపూడి వారసత్వ కళా సంస్థ(హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ) ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్ 27, 28, 29 తారీకులలో కూచిపూడి అగ్రహారంలో తొలిసారిగా “అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం” నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు, నాట్యాచార్యులు డాక్టర్ వేదాంతం వెంకట నాగచలపతి (వెంకు) పేర్కొన్నారు. కూచిపూడి నాట్య క్షేత్రమైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూచిపూడి శ్రీ సిద్ధయేంద్రయోగి నాట్య కళాపీఠంలోనాట్య పతాక స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్టు గురువారం విలేకరులతో పేర్కొన్నారు. ఈ సమ్మేళనం కూచిపూడి గ్రామంలో నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ప్రేక్షకులను మైమరిపించే నాట్య ప్రదర్శనలు కూచిపూడి నాట్యకళపై అవగాహన పెంచే సోదాహరణప్రసంగాలు, విజ్ఞులతో అర్థవంతమైన చర్చలు తోపాటు పదివేల మంది కళాకారులతో కూచిపూడి పతాక గీతంతో కూడిన మహాబృందనాట్యం రసజ్ఞులైన ప్రేక్షకులకు కనువిందు చేసే మరొక అద్భుతమైన సన్నివేశమని పేర్కొన్నారు ఈ విశిష్ట వైభవ సమ్మేళనం రసజ్ఞులకు మరపురాని అనుభవంగా మిగులుతుందని ప్రకటించారు. అలాగే సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో 50 అడుగుల ఎత్తులో కూచిపూడి పతాక స్తూపాన్ని కళాపీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఏభైసంవత్సరాలక్రితం ప్రముఖ నాట్యాచార్యులు వేదాంతం పార్వతీశం ఆధ్వర్యంలో ప్రముఖ చిత్రకారుడు భాగవతుల రామకృష్ణ శర్మ ఈ పతాకం రూపొందించినట్లు వివరించారు. అప్పట్లో యక్షగానచక్రవర్తి మహంకాళి సత్యనారాయణ, సంస్కృతాంధ్ర పండితులు మహా కాళి నరసింహం మాస్టర్, ఏ.ఐ.ఆర్. నటుడు బందా కనకలింగేశ్వరరావుల సూచనలతో తుదిమెరుగులు దిద్దుకుందని వివరించారు. అంతటి మహోన్నత చరిత్ర కలిగిన ఈ పతాక స్వర్ణోత్సవ వేడుకలను ప్రముఖ నాట్యాచార్యులు కళారత్న డాక్టర్ వేదాంతం రాదేశ్యాం, కళాపీఠం ప్రధానాచార్యులు కళారత్న డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి ఆశీస్సులతో ఈ కార్యక్రమం కొనసాగిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాట్యాచార్యులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, వెంపటిసత్యప్రసాద్. గ్రంధాలయపాలకులు వై.వి. ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.