ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం పక్షాన 30-11-24, శనివారం సాయంకాలం, విజయవాడ, సిద్ధార్థ ఆడిటోరియంలో తిరుమంగై ఆళ్వార్ దివ్యకథ కూచిపూడి నృత్య రూపకాన్ని రాజమండ్రి కళాకారుల బృందం రసరమ్యంగా ప్రదర్శించింది. తొలుత సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితా ప్రసాద్, కార్యదర్శి బి.వి.ఎస్. ప్రకాష్ జ్యోతి ప్రకాశనం చేశారు. రచయిత వెంకట్ గాడేపల్లి తాను రచించిన నృత్యరూపకాన్ని పరిచయం చేస్తూ పన్నిద్దరు ఆళ్వారులు 5-7 శతాబ్దాల్లో 4 వేల పాశురాలు తమిళంలో రచించి వైష్ణవభక్తిని ప్రతిష్టించారని తెలియచేశారు. చోళరాజ్యంలో దండనాధుడైన పరకాలుడు ఇహలోక క్లేశాలు అనుభవిస్తూనే ఆధ్యాత్మిక చింతనతో శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడిగా మారి తిరుమంగై ఆళ్వార్ గా పేరొందిన వైనాన్ని ఈ నృత్య రూపకం కళ్ళకు కట్టినట్టు వివరించింది. ఈ నృత్యరూపకానికి డి.ఎస్.వి. శాస్త్రి (హైదరాబాద్, సెంట్రల్ వర్సిటీ) సంగీతం సమకూర్చగా, హైదరాబాద్ కళాకారులు గిరీష్ చంద్ర, శ్రీమతి దేవి గిరీష్ చంద్ర నృత్య దర్శకత్వం వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎన్. శివకుమార్ స్వాగతం పలికారు.
తిరుమంగై ఆళ్వార్ దివ్య కథ – నృత్యరూపక సంక్షిప్త సారాంశము:
పూర్వము తమిళనాడుకు చెందిన 12 మంది వైష్ణవ గురువులు శ్రీమహావిష్ణువుని స్తుతిస్తూ 4000 పాశురములు రచించటం జరిగినది. వారిలో ఒకదు తిరుమంగై ఆళ్వార్, చోళరాజు సైన్యంలో దండనాధునిగా పనిచేసిన పరకాలుడు తన జీవితంలో ఎదురైన కష్టనష్టాలను ఏ విధంగా ఎదుర్కొని కాలాంతరంలో తిరుమంగై ఆళ్వార్గా ప్రఖ్యాతి చెందాడు అనే ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించినదే ఈ నృత్యరూపకం.
శ్రీ వెంకట్ గాడేపల్లి – సంక్షిప్త పరిచయం
తిరుమంగై ఆళ్వార్ దివ్య కథ కూచిపూడి నృత్యరూపకమును రచించి, నిర్మించిన శ్రీ వెంకట్ గాడేపల్లి రాజమండ్రిలో ప్రభుత్వ ఉద్యోగం చేయుచున్నారు. వారు నందనార్ చరితం, నమామి గంగే, అల్లూరి సీతారామరాజు నృత్యరూపకాలను కూడా రచించియున్నారు.
ఈ నృత్యరూపకానికి సంగీతం అందించిన కళాకారులు శ్రీ డి.ఎస్.వి. శాస్త్రి, హైదరాబాద్.
నృత్యరీతులు సమకూర్చి, ప్రదర్శించు కళాకారులు శ్రీ గిరీష్ చంద్ర మరియు శ్రీమతి దేవి గిరీష్ చంద్ర, హైదరాబాద్.
– సశ్రీ
రస రమ్యంగా ప్రదర్శించిన రాజమండ్రి కళాకారులకు శుభాకాంక్షలు