భారతీయ నృత్యానికి బడి కూచిపూడి

కూచిపూడి నాట్యం అనే పేరు గ్రామాన్ని బట్టి ఏర్పడింది. కూచిపూడి అనే గ్రామం విజయవాడకు దాదాపు నలభై మైళ్ల దూరంలో కృష్ణాజిల్లాలో ఉన్నది. ఈ ఊళ్లోని భాగవతులు ప్రదర్శించేనాట్యం కూచిపూడి నాట్యం. భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నృత్యమో, నాట్యమో ప్రసిద్ధి కెక్కాయి. తమిళనాడులో తంజావూరి నాట్యం (దీనినే భరతనాట్యం అంటారు.) కేరళలో కథకళి, ఒరిస్సాలో ఒడిస్సీ, ఈశాన్య భారతదేశంలో మణిపురి, ఉత్తర భారతదేశంలో కథక్ ప్రశస్తి కెక్కాయి. అదేవిధంగా ఆంధ్రదేశంలో కూచిపూడి నాట్యం అయిదువందలయేళనుండి ప్రసిధి కెక్కింది. మాచిపల్లి కైఫీయతు (లోకల్ రికార్డు) కూచిపూడి భాగవతులు విజయనగర చక్రవర్తి అయిన వీరనరసింహరాయల (క్రీ.శ. 1502) ఆస్థానంలో నాట్య ప్రదర్శనం చేసినట్లు చాటుతున్నది. వీరు ప్రజలు పడుతున్న బాధలు ఆమహారాజుకు తమనాట్యంద్వారా తెలియచేశారు. ఆనాడు కడప జిల్లాలోని సిద్ధవటం సిమను సంబెట గురవరాజు పరిపాలిస్తున్నాడు. వీడు దుర్మార్గుడు. ప్రజలకు తోకచుక్కలాగా దాపురించాడు. విరనరసింహరాయల ఆస్థానంలో నాట్యం ప్రదర్శించే సమయంలో కూచిపూడి భాగవతుల్లో ఒకడు సంబెటగురవరాజు వేషం ధరించాడు. మరొకడు స్త్రీ పాత్ర ధరించాడు. గురవరాజు పాత్రధారి స్త్రీ పాత్రధారి రొమ్ములకు చిరతలు పట్టిస్తున్నట్లు వారు అభినయించినారు. వీరనరసింహరాయలు ఆదృశ్యాన్ని చూచి, నాట్య ప్రదర్శకులవల్ల నిజం తెలిసికొని సంబెట గురవరాజును చంపి ప్రజల కష్టాలు తొలగించాడు.
కూచిపూడి నాట్యానికి బహుళప్రచారం సమకూర్చిన మహాత్ముడు సిద్ధేంద్రయోగి. పది హేనో శతాబ్దిలో ఉన్న ఈయన “పారిజాతాపహరణము” కథను భామాకలాపంగా రచించి కూచిపూడిలోని పురుషులకు నేర్పారు. అంతేకాకుండా కూచిపూడిలో పుట్టిన ప్రతి బ్రాహ్మణ బాలుడూ ముక్కులు కుట్టించుకొని తనజీవితంలో ఒక్క సారయినా భామవేషం కట్టాలని ఆదేశించారట. అందువల్లనే కూచిపూడిలో పుట్టిన ప్రతి బ్రాహ్మణబాలునికీ పురిటిస్నానం రోజున మొలత్రాడుకు గడ్డకట్టే ఆచారం ఇటీవలి వరకు ఉండేదని సంప్రదాయవేత్తలు అంటున్నారు.
పది హేడో శతాబ్దిలో నారాయణ తీర్థులు శ్రీ కృష్ణలీలా తరంగిణి రచించారు. దానిలోని పాటలకు తరంగములని పేరు. కూచిపూడి భాగవతులు ఈ తరంగములను కూడా అభినయించి అత్యధికంగా ప్రచారం చేశారు.
కూచిపూడి భాగవతులు భరతవిద్యను చీకూ చింతా లేకుండా శాశ్వతంగా ఆరాధించటానికి గోలకొండ సుల్తానులలో ఒకడయిన అబుల్ హసన్ తానీషా కూచిపూడి అగ్రహారాన్ని, దానిక్రింద ఉన్న ఆరు వందల యెకరాల మాగాణినీ ఈనాముగా ఇచ్చాడు.

కూచిపూడి వారు ప్రదర్శించే నాట్యం రెండు రకాలుగా ఉంటుందని చెప్పవచ్చు.
1. వీధి నాటకములు లేక యక్షగానములు ఈ కోవలో భక్త ప్రహ్లాద, రుక్మిణీ కళ్యాణము, ఉషాపరిణయము, రుక్మాంగద మొదలగునవి చేరతాయి.
2. కలాపములు, భామాకలాపం, గొల్లకలాపం మొదలయినవి. కలాపాల్లో నాటకంలో మాదిరిగా కథ ఉండదు. ఒకే పాత్ర వివిధరసాలను అభినయిస్తుంది. భామాకలాపంలో సత్యభామ ప్రధానపాత్ర,. బ్రాహ్మణ పండితునికీ, గొల్లపడుచుకూ జరిగే వేదాంత చర్చయే గొల్లకలాపం. దీన్లో వేదోపనిషత్తులను గూర్చి, ధర్మశాస్త్ర పురాణాలను గూర్చీ, వర్ణ వ్యవస్థను గూర్చీ, పిండోత్పత్తి క్రమాన్ని గూర్చి చర్చలు జరుగుతాయి. భామాకలాపం శృంగార కరుణరస ప్రధానం. గొల్లకలాపం శాంతరస ప్రధానం. కలాపాలు ప్రదర్శించే పద్ధతి ఒక్క ఆంధ్రదేశంలోనే ఉన్నది.

కూచిపూడివారు శివలీలలు విష్ణుకథలు ప్రదర్శిస్తారు. అర్ధనారీశ్వర నాట్యాన్ని భారతదేశం మొత్తంమీద కూచిపూడివారు మాత్రమే ప్రదర్శిస్తారు. విముకథలు ఎక్కువగా ప్రదర్శించటం వల్ల వీరిని కూచిపూడి భాగవతులని పిలుస్తారు. కూచిపూడి వాటాన్ని కూచిపూడి భాగవతనాట్యసంప్రదాయమని అంటారు. ఈ నాట్య సంప్రదాయాన్ని నిలపటం జీవితపరమావధిగా భావించి కృషి చేసిన కూచిపూడి భాగవతులకు ఆంధ్రదేశం ఎంతైనా ఋణపడి ఉన్నది.
కూచిపూడి నాట్యంలో లాస్యమూ తాండవమూ రెండూ ఉంటాయి. లాస్యం సుకుమారం. ఇది శాంత శృంగా పాల ప్రదర్శనకు ఉపయోగపడుతుంది. తాండవం ఉద్గతంగానూ, భీకరంగానూ ఉంటుంది. రౌద్ర భయానక రసాల పదర్శనకు ఇది ఉపయోగపడుతుంది. లాస్యంలోని అడువులు వేరు. తాండవంలోని అడువులు వేరు. స్త్రీ పాత్రల అడువులు కోమలంగా ఉంటాయి. శివుడు, హిరణ్యకశిపుడు మొదలైన పాత్రల అడువులు భీకరంగా ఉంటాయి.
భాగవతుల కుటుంబాలు కూచిపూడిలోనే కాక తమిళనాడులో కూడా ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యం పతనమయిన తర్వాత కూచిపూడి భాగవత నర్తకులు కొందరు తంజావూరు వెళ్లారు. తంజావూరు నాయకరాజయిన అచ్యుతప్పనాయకుడు – (క్రీ.శ. 1561-1614) ఈ కళాకారులకు అచ్యుతపురమనే అగ్రహారాన్ని ఇచ్చారు. వారక్కడే స్థిరపడి ఈనాడు కూడా కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అచ్యుతపురమే మేరటూరు – మేలటూరు -మేలట్టూరు. ఈ పేర్లకు మేళములుండే ఊరని అర్ధము. నృసింహజయంతినాడు మేలట్టూరు భాగవతులు మార్కండేయ చరిత్ర, హరిశ్చంద్ర చరిత్ర, కంసచరిత్ర, రుక్మిణీ కల్యాణం, ఉషాపరిణయం, భక్త ప్రహ్లాద మొదలయిన తెలుగు నృత్యరూపకాలనే ప్రదర్శిస్తున్నారు. వీటిని మేలట్టూరు వేంకట రామశాస్త్రి రచించాడు. ఈయన త్యాగరాజస్వామి సమకాలికుడు.
రెండు వందల సంవత్సరాల నాడు బంగనపల్లినవాబులు కూచిపూడి భాగవతులను ఆహ్వానించి కపట్రాలగ్రామం అగ్రహారంగా ఇచ్చి ఈ నాట్యకళను పోషించారు. ఆ భాగవతుల సంతతివారే ఈనాడు రాయలసీమలోనూ, దక్కనులోను ఈ నాట్యకళను ప్రచారం చేస్తున్నారు.
ఇంత విఖ్యాతిగాంచిన ఈ కూచిపూడి నాట్యం ఒకనాట్యకళ కాదని ఒకానొకప్పుడు ఢిల్లీలో జరిగిన నాట్యకళాగోష్ఠిలో తిరస్కరించారు. అప్పుడు ప్రాజ్ఞులయిన తెలుగువారు కొందరు కూచిపూడి నాట్యకళను గూర్చి వ్యాసాలు రచించి, ప్రదర్శనలిచ్చి ప్రచారం చేశారు. వారిలో బందా కనకలింగేశ్వరరావుగారు ముఖ్యులు.

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం:
తెలంగాణా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో డిసెంబరు 2014 26 నుండి మూడు రోజులపాటు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌  జీ.ఎం.సీ. బాలయోగి స్టేడియంలో 4వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం 6327 మంది కూచిపూడి కళాకారులతో జరిగింది. అపురూప కళ విశ్వ వేదికలమీద ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలను నమోదు చేసింది. ఈ ప్రదర్శన గిన్నిస్ ప్రపంచ రికార్డులో చేర్చబడింది. అంతరించి పోతున్న మన కళను నేటి తరానికి సగర్వంగా పరిచయం చేసే బృహర్తర యజ్ఞంలా ఈ ‘నాట్య సమ్మేళనం ‘ ఒక మైలురాయిగా నిలిచింది. .

పేరొందిన ప్రముఖ కూచిపూడి నర్తకులు:
వెంపటి చినసత్యం
రణి శంకర్
నాట్యాచార్య షేక్ ఖలీల్
వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి
చింతా కృష్ణమూర్తి
పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ
నటరాజ రామకృష్ణ
శోభా నాయుడు
వేదాంతం సత్యనారాయణ శర్మ
యామినీ కృష్ణమూర్తి
రాధారెడ్డి, రాజారెడ్డి
మంజు భార్గవి

-కళాసాగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap