తెలుగు నేల గర్వించదగ్గ అద్భుతమైన కూచిపూడి నృత్య కళాకారిణి, సృజనాత్మక నృత్యదర్శకురాలు, అంకితభావం గల నాట్యగురువు డాక్టర్ వినీలారావు వుద్దిశెట్టి. దూరదర్శన్‌లో “బి హై” (B High) గ్రేడ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆమె, రెండు దశాబ్దాలుగా కూచిపూడి నాట్య సంప్రదాయాన్ని పరిరక్షించడంలో, భావితరాలకు అందించడంలో విశేష కృషి చేస్తున్నారు. కళాకారుల అపురూప ప్రస్థానాన్ని అక్షరబద్ధం చేసి, 64 కళలు.కాం పాఠకులకు అందించే బృహత్తర క్రమంలో, డా. వినీలారావు గారి కళాప్రయాణం ఒక అద్భుతమైన అధ్యాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
గురు పరంపర: కళారత్న వెంపటి రవిశంకర్ గారు, పద్మశ్రీ డా. శోభానాయుడు గారు, డా. కృష్ణకుమారి గార్ల వంటి ఉద్దండుల వద్ద వినీలారావు గారు కూచిపూడిలో శిక్షణ పొందారు. గురువుల నుంచి నేర్చుకున్న క్రమశిక్షణను, నైపుణ్యాన్ని ఆమె తన ప్రదర్శనల్లో, బోధనలో నిరంతరం కొనసాగిస్తున్నారు.

నాట్య శిక్షణ – ఎస్ఎల్బీ (SLB) కూచిపూడి కళానిలయం:
సాంప్రదాయ కళారూపాన్ని కాపాడాలనే ఉన్నత లక్ష్యంతో 2003లో ‘ఎస్ఎల్బీ కూచిపూడి కళానిలయం’ను (రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ) ఆమె స్థాపించారు. 2001 నుంచి హైదరాబాద్‌లో దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గత 22 ఏళ్లుగా ఆమె చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో మందికి కూచిపూడిలో శిక్షణ ఇస్తూ నాట్యగురువుగా విశేష అనుభవం సంపాదించారు.
1500 మందికి పైగా విద్యార్థులు: భారతదేశంతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, మలేషియా, సింగపూర్ వంటి విదేశాల్లో ఉన్న 1500 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా నాట్య శిక్షణ అందించారు. ఎంతో మందిని ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దారు.
ప్రణాళికాబద్ధమైన బోధన: థియరీ- ప్రాక్టికల్స్ కలగలిపిన ఒక చక్కటి సిలబస్‌ను రూపొందించి విద్యార్థులకు శాస్త్రీయ నృత్యంలో గట్టి పునాది వేస్తున్నారు. జాతీయ స్థాయి పోటీలకు, పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంతో పాటు ప్రతి ఏటా వర్క్‌షాప్‌లు, వార్షిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ప్రదర్శనలు: కళాకారిణిగా ఆమె ప్రస్థానం అనంతమైనది. భారతదేశం నలుమూలలతో పాటు విదేశాల్లోనూ (USA, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, ఫిన్లాండ్ తదితర) 1000కి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

పురస్కారాలు – విజయాలు: వినీలారావు గారి ప్రతిభకు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. ఫైన్ ఆర్ట్స్‌లో విశేష కృషి చేసిన వారికి దక్కే అత్యున్నత “ఉగాది పురస్కారం”తో పాటు పలు జాతీయ అవార్డులు ఆమె అందుకున్నారు:
*2003: కళానిలయం జాతీయ నృత్య పోటీల్లో “నాట్య మయూరి” బిరుదు.
*2007: కళానిలయం జాతీయ పోటీల్లో “రాజ హంస” పురస్కారం.
*2012: లలిత కళా సమితి వారిచే “నాట్య కౌస్తుభ”.
*2015: హైదరాబాద్ యువ కళావాహిని వారిచే “నాట్య కళాప్రవీణ” (ఉగాది పురస్కారం).
*2020: కరూర్ నాట్యాంజలి ఫెస్టివల్లో ఉత్తమ ప్రదర్శన అవార్డు.
*2022: హైదరాబాద్‌లో కోడి రామకృష్ణ జీవన సాఫల్య పురస్కారం.
*2023: హోసూర్ నాట్యాంజలి ఫెస్టివల్లో ‘కళాశ్రీ’ మరియు బెస్ట్ పెర్ఫార్మన్స్ అవార్డు. (చెన్నై మైలాపూర్ వసంతోత్సవ్లో విశేష ప్రదర్శన).
*2024: భువనేశ్వర్‌లో జరిగిన దేవదాసి ఫెస్టివల్లో ‘దేవదాసి అవార్డు’.
*2025: ఢిల్లీలో తాండవ్ అంతర్జాతీయ నృత్యోత్సవంలో ప్రదర్శన.
*2025: ముంబై నృత్య తరంగిణి ఉత్సవ్‌లో “నృత్య తరంగిణి కళా రత్న” పురస్కారం.
సామాజిక మాధ్యమాలలోనూ ‘ఎస్ఎల్బీ కూచిపూడి కళానిలయం’ వీడియోలను, షార్ట్స్ ను అప్లోడ్ చేస్తూ కూచిపూడి నృత్యానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
నృత్యం పట్ల ఆమెకున్న అంకితభావం, విద్యార్థులను తీర్చిదిద్దే విధానం డా. వినీలారావు గారిని ఒక గొప్ప నాట్యగురువుగా నిలబెట్టాయి. భారతీయ సాంప్రదాయ నృత్య వైభవాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేస్తున్న ఆమె ప్రయాణం నేటి యువ కళాకారులందరికీ ఆదర్శనీయం. ఇది మన కళా చరిత్రలో గర్వంగా చెప్పుకోదగ్గ రికార్డు.
–కళాసాగర్ (98852 89995)

