నాట్య జంట రాజా రాధా రెడ్డి

1983 లో గణేశ్వరరావు గారు వనిత మాసపత్రిక లో రాజా రాధా రెడ్డి దంపతులను చేసిన ఇంటర్వ్యూ…మీకోసం..!

1983 లో మద్రాస్ కి సెలవుల్లో వెళ్ళినప్పుడు ‘వనిత’ సంపాదకుడు MLN ‘ప్రముఖ దంపతులు’ (ఒకే రంగంలో విశేష కృషిచేస్తున్న వారు) శీర్షిక మొదలుపెడుతున్నాం, ఢిల్లీలో మీకు తెలిసిన వారిని ‘ఇంటర్వ్యూ’ చేసి, 4-5 పేజీల మేటర్ పంపగలరా?’ అని అడిగారు. ‘అలాగే!’ అని వెనక్కి వెళ్ళాక ఢిల్లీ లోని కూచిపూడి నాట్య కళాకారులు రాధా – రాజారెడ్డి లను ఇంటర్వ్యూ చేసాక నేను పంపినది ‘వనిత’ ప్రముఖ దంపతులు శీర్షిక కు మొట్టమొదటిది అయింది. కొన్ని కధలు, నాటికలు రాసిన అనుభవం ఉంది, ఇంటర్వ్యూ తీసుకోవడం తొలిసారి. ఇంటర్వ్యూ సాహిత్య రూపం ఎలా ఉండాలి? ప్రశ్నలు నేనే తయారు చేసుకున్నాను. జవాబులు స్థూలంగా దంపతులు చెప్పినవే! వాటినే ఇంటికి వెళ్ళాక తాపీగా నా పద్ధతిలో రాసాను. కొంత homework అవసరం అయింది. నేపథ్యం క్షుణ్ణంగా తెలుసుకుని ప్రశ్నలు అడిగాను. చదవండి, మీకే తెలుస్తుంది దీనిలో ఉన్న సాధకబాధకాలు.

*దేశ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రసిద్ధ కూచిపూడి నాట్యకారులు రాజా రాధా రెడ్డి దంపతులకు గత సంవత్సరo. పద్మశ్రీ బిరుదు లభించింది. ఒక ప్రముఖ దంపతులిద్దరికీ ఒకేసారి ఒకే రంగంలోని కృషికి ప్రభుత్వ సత్కారం లభించడం అదే మొదటిసారి! అయితే వీరు దంపతులవటం ఎలా సంభవించింది? విడి విడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాక ఒకరికొకరు సన్నిహితులై పెళ్లి చేసుకున్నారా? లేక పెళ్ళయ్యాక ఇద్దరూ కలిసి కృషిచేసి నాట్యరంగంలో రాణించారా?

రాజారెడ్డి: నా 14వ ఏట మా పెళ్లయింది. అప్పుడు రాధకు ఐదేళ్ళు. పెళ్ళంటే ఏమిటో తెలీని వయసులో పెద్దలు చేసిన పెళ్లి మాది! బాల్య వివాహాలు అప్పుడూ, ఇప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. ఆస్తి సంరక్షణ ముఖ్యమైన కారణం అనుకుంటా. మా విషయంలో అచ్చంగా అది కారణం కాదనుకోండి. ‘మీరు బాల్య వివాహాలు ఆమోదిస్తారా?’ అని ఇప్పుడు నన్నడిగితే నా సమాధానం ఒకటే! ఆమోదించిను, కారణం ఆ ‘వయసులో’ తగిన మానసిక పరిణితి వాళ్ళలో ఉండదు. అలా అని ప్రేమ వివాహాలను ప్రోత్సహించను కూడా! ప్రేమ వివాహాలు విఫలం కావటం లేదా? ఒక వివాహం విజయవంతమైంది అంటే దానికి పునాది వేరే వుంటుంది.”మేము ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా, పెళ్ళయాక ప్రేమించుకున్నాం’ మధ్యలో రాధ అందించారు. ‘అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? మొదటినుంచీ రాదవి నావి ఒకే అభిరుచులు. నేను చిన్నతనంలోనే వీధి భాగవతాల్లో వేషాలు వేసేవాడిని. రాధ కూడా నన్ను అనుకరించేది. బూడిద మొహాన్ని పూసుకొని, బొగ్గుముక్కతో కనుబొమ్మలు దిద్దుకుని ఇంట్లో గెంతు లేసేది.. నాట్యంలో ఆసక్తి చూపిoచేది. నేనంటే తనకి మొదటినుంచీ ఆరాధనా భావమే! ఒక ముఖ్య విషయం చెప్పటం మరిచాను, రాధ ఎవరో కాదు, స్వయానా మా మేనమామ కూతురు!’ అన్నారు రాజారెడ్డి. ‘పెళ్ళైతే మా నాన్న చేసారు. కాని మా బావ వేషాలు మా అమ్మకి కిట్టేదికాదు.. ఈ వేళ బూడిద పూసుకునే వాడు, రేపు బిచ్చమెత్తుకుంటాడు.. వీడితో కాపురానికి నా పిల్లను పంపనని పోట్లాట పెట్టుకుంది’ అన్నారు రాధ.

‘నేను నాట్యం నేర్చుకోటానికి వెళ్ళినప్పుడు మా బంధువులంతా నన్ను ఎగతాళి చేసారు, ‘వీడు గజ్జే కట్టి నాట్యం చేయడమా? అంటూ. మా అత్తయ్యా మళ్ళీ నా మీదకి ధ్వజమెత్తింది. నమ్ముతారో, నమ్మరో విషయం విడాకుల వరకు వచ్చింది. రాధకు వేరే మనువు నిర్ణయించేసింది కూడా మా అత్తయ్య. కాని రాధ అభిరుచులు నావి ఒకటే కావటం, అప్పటికే ఆమె నాట్యం పై ఎంతో అభిమానం పెంచుకోవటంతో రాద నన్నే సమర్దించినది.. నాతో పాటు తనూ స్టేజి ఎక్కింది. ఇక మేము వెనక్కి తిరగలేదు. మా ప్రధమ నాట్యాచార్యులు శ్రీ వేదాంతం ప్రహ్లాద శర్మ, పి.వి.జి. కృష్ణ శర్మ. తరువాత రాధకు నేనూ గురువునయ్యాను. ఎన్నో ఏళ్ల సాధన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కాలర్షిప్ తో ’66 లో ఢిల్లీ వచ్చాం. అప్పటినుంచి స్థిర నివాసం ఇక్కడే! మమ్మల్ని ఢిల్లీ స్టేజీకి పరిచయం చేసినవారు శ్రీమతి ఇంద్రాణి రెహమాన్’ అన్నారు రాజారెడ్డి.

*ఎక్కడ ప్రదర్శనలిచ్చినా మీరు ఇద్దరూ కలిసే ఇస్తారా? ఎప్పుడేనా ఎవరికి వారు విడివిడిగా నృత్యం చేసిన సందర్భాలున్నాయా?
‘లేవు. మేమలా ఇవ్వం. ఒక సారి రాష్ట్రపతి భవనంలో ఓ అరగంట మా కార్యక్రమం ఏర్పాటు చేసారు. సమయం తక్కువ కనుక మాలో ఒకర్ని ఏదేనా ‘item’ ఇమ్మని అడిగారు. అయినా అంత తక్కువ వ్యవధిలో కూడా ఇద్దరం కలిసే నృత్య ప్రదర్శన ఇచ్చాం’ అన్నారు.

*ఇలా ఒకే రంగంలో ఇద్దరూ కలిసి పని చేయటం వలన కష్టాలు లేవా? ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం లేదంటారా? బార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు దారి తీయదా?
‘దంపతుల సమాధానం: ‘ఒకే రంగంలో మేమిద్దరం ఉండటం వలన లాభాలే ఎక్కువ ఉన్నాయి. కూచిపూడి నాట్య రీతిలో కధావస్తువు పౌరాణిక గాథలే. పోషించవలసిన పాత్రలు పురాణ దంపతులవి – శివపార్వతులు, రాధా కృష్ణులు, సీతారాములు! నిజ జీవితంలో మేము దంపతులు కావటంతో మా ఇద్దరి నృత్య ప్రదర్శన ఎంతో రక్తి కట్టే అవకాశం ఉంది కదా!’

*ప్రతిభా నైపుణ్యాలు ఇద్దరూ సమానంగా సాధించారు. మరి అదే కళలో ఒకరిని మించి ఒకరు బాగా చేసినప్పుడు ఒకరికన్న ఇంకొకరికి ప్రశంసలు ఎక్కువగా వచ్చినప్పుడు అసూయ తలెత్తదా? ఆ ప్రభావం వైవాహిక జీవితo పై పడదా?
‘స్టేజీ మీద ఒకరిని మించి ఇంకొకరు బాగా చేయాలని ఇద్దరమూ తాపత్రయ పడతాం. నిజమే! అప్పుడప్పుడూ కొన్ని ప్రదర్శనలలో నేను రాధ కన్నా బాగా చేసి ఉండొచ్చు. కొన్నిట్లో రాధ నన్ను మించి ఉండొచ్చు. కాని ఇది ఆరోగ్యవంతమైన పోటీ కదా!”
‘ఇక అసూయ అంటారా? నా వరకు నాకు ఎటువంటి అసూయ లేదు. ఆమె నా కన్నా బాగా చేసినప్పుడు జనం ఆమెను మెచ్చుకున్నప్పుడు నేనెంతో ఆనందిస్తాను. కాని నా నృత్యం బాగుంది, నన్నే ఎవరేనా మెచ్చుకుంటే.. ఎందుకు లెండి.. ఆ తరువాత గ్రీన్ రూమ్ లో రాధ నన్నెలా సాధిస్తుందో, ఎలా పోట్లాట పెట్టుకుంటుందో మీరే ఊహించుకోగలరు. ‘అసూయ ఆడదానికి మారు పేరు’ ఎవరా అన్నది – షేక్స్పియర్ కదూ?’ అంటూ రాజారెడ్డి నవ్వారు.

*ఎవరి మాట నెగ్గాలా అన్న సమస్య ఎదురైనపుడు నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? ఎవరిది పై చేయి అవుతుంది?
నాట్య ప్రదర్శనల విషయంలో నా మాట రాధ వింటుంది. సాధారణంగా ప్రతీ కార్యక్రమం ఇద్దరం కలిసే రూపొందిస్తాం. ఆమె సలహాలకి నేను విలువ ఇస్తాను. అభిప్రాయ బేధం ఎప్పుడైనా వచ్చినప్పుడు తుది నిర్ణయం నాదే – నాట్యం వరకే సుమండీ! మిగిలిన అన్ని విషయాల్లో నిర్ణయాలు రాదే తీసుకుంటుంది.’ అన్నారు రాజా.

*రాధ గారిని అడిగిన ప్రశ్న: ఒక పక్క భర్తతో తరచూ ప్రదర్శనలిస్తూ, ఇంకొక పక్క గృహిణిగా బాధ్యతలు నిర్వహించటానికి తగిన సమయం దొరుకుతుందా? సినీతారలు, కళాకారులు త్వరగా వివాహాలు చేసుకోరు. పిల్లలు పుడితే వారి వృత్తికి నిరోధమనా? మరి అంత చిన్న వయసులోనే మీ పెళ్లి అయిందే… పిల్లలు పుట్ట్టినా వృత్తికి ఆటంకం లేదంటారా?
‘మన పనులు చేసుకోటానికి తగిన సమయం దొరికేదేముంది? మనమే వీలుచూసుకోవాలి. బయట ఎన్ని పనులున్నా అవన్నీ ముందు ఇల్లుచక్కపెట్టాకే! ఇంటి పనులన్నీ స్వయంగా నేనే చూసుకుంటాను. రాజా ఈ విషయాలసలు పట్టించుకోరు. అన్నీ నాకే వదిలేస్తారు. ఒక విధంగా ఇది మంచిదే! ఇంటి విషయాల్లో మగాళ్ళు తలదూర్చటం నాకిష్టం ఉండదు. ఇక్కడ స్వేచ్చ మాకుoడాలి… పిల్లలు మా వృత్తికి ఆటంకమే! మా కాపురం మొదలైన వెంటనే మాకు పిల్లలు పుడితే నాకీ మాత్రం పేరు ప్రఖ్యాతులు వచ్చేవి కాదనుకుంటాను. పిల్లలు పుట్టకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు ఇద్దరమూ తీసుకున్నాం. మా మొదటి సంతానానికి మొన్న రెండేళ్ళు నిండాయి. ఇప్పుడు ఫరవా లేదనుకుంటాను’ అన్నారు రాధ.

*అన్ని విషయాలలో ఏకత్వమే కనిపిస్తోంది. మరి భిన్నత్వం ఎక్కడేనా ఉందా?
రాధ నవ్వుతూ చెప్పిన సమాధానం: ‘ఒకే విషయంలో ఉంది. తదితర నాట్యకళా సంప్రదాయాలు గురించి తెలుసుకుంటే, మేము రూపొందించే నృత్య నాటకాలకు కొంతవరకు పనికి వస్తుందని రాజా కథక్ నేర్చుకున్నారు. నేను మాత్రం ఒడిస్సీ నృత్యం నేర్చుకున్నాను.”

*సిద్ధేంద్ర యోగి సంప్రదాయాల్ని ప్రచారం చేస్తూ కూచిపూడి కళాకారులు తరచూ ఇచ్చే నృత్యప్రదర్షణలు – భామాకలాపం, ఉషాపరిణయం, తరంగం, దశావతారాలు మొదలైనవీ – మీరు ప్రదర్శించేవీ ఇవే కధా వస్తువులా? మార్పులు చేర్పులు ఏమైనా చేసారా? ప్రజాదరణ పొందిన మీ ప్రదర్శనలేమిటి?
“కూచిపూడి సంప్రదాయకమైన కథా వస్తువులు మా ప్రదర్శనల్లో ఎలానూ ఉంటాయి. ఇవి కాక 12 వ శతాబ్దికి చెందిన బోధాన కవి రచనకు నృత్య రూపకం తయారు చేసాం. శివ పంచాక్షరస్తుతి, రామ శబ్దం, కృష్ణ శబ్దం, మన్మధ విజయం నృత్య నాటకాలను అనేక చోట్ల ప్రదర్శించాం. కొన్ని అన్నమాచార్య కృతులకు త్యాగరాజ కృతులకు నృత్య రూపకాలు రూపొందించి ప్రదర్శిస్తున్నాం.”


*పరిమిత వర్గానికే ఆనందం కలిగించడం కంటే, మీ నాట్యకళ అందరినీ ఆహ్లాదపరచి, ఉత్తేజం కలిగించేలా ఉండటానికోసం సామాజిక కదా వస్తువుతో నృత్యరూపకాలను రూపొందించ కూడదా? నాట్యకళను నిజంగా ప్రజాయత్తం చేయగలమా? అది ప్రజా కళారూపం కాగలదా?
దంపతులిచ్చిన సమాధానం: సామాజిక విశేషాలను కళాత్మకంగా నాట్యంలో మలచటం అసాధ్యం కాదు. అయితే దీనికి రచయితల సహకారం కావాలి. తగిన కధావస్తువులు దొరికితే, మా ప్రయత్నం మేము చేస్తాం – కూచిపూడి సంప్రదాయ పద్దతిలోనే! కూచిపూడి నాట్య లక్షణాలు మేము మార్చకపోయినా, ఆ పరిదులలోనే మాకు చాలా స్వాతంత్ర్యం ఉంది. మార్పులు, చేర్పులకు ఎంతో అవకాశం ఉంది. మూడనమ్మకాలూ, సంఘ దురాచారాలు ఎన్నో ఉన్నాయి. వీటిని అరికట్టి, ప్రజా చైతన్యానికి దోహదం చేసే కథా వస్తువులతో నృత్య రూపకాలను తయారు చేసే ప్రదర్శనలను ఇవ్వవచ్చు…. ఇటీవల చాలా మంది కూచిపూడి నృత్యం అంటే ఊరికే నడుము ఊపటం, అదేపనిగా జడను చేతితో తిప్పటం అనుకుని కాబరే డాన్సర్ లని మించి చేస్తున్నారు. ఆ మధ్య సోనాల్ మాన్ సింగ్ కూచిపూడిలో ప్రవేశం అనవసరమనుకుని ఎవరి దగ్గరో కొంత నేర్చుకుని మా అభిప్రాయం కోసం మా దగ్గర చేసి చూపారు. ‘నీలమేఘ శరీరం’ తరంగం అది. మేం సిగ్గుపడుతూనే చెప్పాం – ఆమె చేసింది కూచిపూడి కాదని. నిజానికి కూచిపూడిలో నూటపదహారు నడకలు, విన్యాసాలున్నాయి. అయితే అవి ఒక్కొక్క పాత్ర చిత్రణకి అనుగుణంగా నిర్దేశించిన ఒక్కొక్క రకమైన నడకలు, వేదాంత వారు ఉషాదేవి పాత్రను పోషించే తీరు చూడాలి మీరు!

“నాట్యకళ ప్రజాయత్తం చేయాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ఆ మధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక చక్కని పని చేసింది. మారుమూల కుగ్రామాలలో కూడా వివిధ నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. నాలుగు వీధుల కూడలిలో పెద్ద చెట్టుకింద తారు డ్రమ్ము స్టేజి తయారుచేసి పైన టార్పాలిన్ కప్పారు. ఒక ప్రదర్శన ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం కాని, తీరా ప్రారంభించే ముందు ఏం చేయాలో తోచలేదు, హిందీ కృతులను తీసుకుని వారిని మెప్ప్పించడం సాధ్యమా? ఏమైతే అదే అయిందని అచ్చమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చాం. భాష తెలియకపోయినా ప్రేక్షకుల మధ్యనుంచి ఒక్కడు లేవలేదనoటే నమ్మండి. ‘శంకరాభరణం’ ను రిక్షావాళ్ళు కూడా ఎందుకు మెచ్చుకున్నారో అప్పుడర్ధమయింది. నిజమైన కళారాధనలో కూచిపూడా, కథకా, హిందీయా, తెలుగా అన్న ప్రాంతీయ తత్వాలు, భాషా భేదాలు ఉండవనుకుంటాం. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి ప్రోత్సాహక చర్యలు మిగిలిన ప్రభుత్వాలు కూడా తీసుకుంటే, నాట్యకళ నలుగురుకీ అందుబాటులోకి వస్తుంది.”

*ఇటీవల కొందరు ఏకదాటిగా 24 గంటలు, 36 గంటల పాటు నృత్య ప్రదర్శనలిస్తున్నారు. అటువంటి ప్రదర్శన ఇవ్వదలచుకున్నారా?
ఈ ప్రశ్నకు రాజా చెప్పిన సమాధానం ‘కావాలంటే 48 గంటలు అవిరామంగా నృత్య ప్రదర్శన ఇవ్వగలను. కాని, ఇవ్వను,. చూడండి, కళ వేరు కసరత్తు వేరు. కళ వ్యాయామం ఒకటి కాదు. సైకిలు త్రొక్కే పోటీ ఓ వారం, పదిరోజులంటే అర్ధం ఉంది. ఇది ఇలా కాదు, ఓ చక్కని చిత్రం గీయటం, ఓ కమనీయమైన కవిత చెప్పటం, మనోహర నృత్యం చేయటం – వీటి రసానుభూతి వేరు! అభినయం రక్తి కట్టడానికి, హావ భావ నిశిత ప్రదర్శనకు కొన్ని గంటల సాధన అక్కరలేదు. ఆ ప్రత్యేకత మా కక్కరలేదు.:
కళాత్మక విలువలు వెనుకబడుతున్నాయి. కళల పట్ల గౌరవం తగ్గిపోతోంది. వాటిని నీచ స్థాయిలోకి దింపటం కూడా కద్దు. అవాంఛనీయ ధోరణులు అరికట్టి, ప్రజాభిరుచులలో సంస్కారాన్ని పెంపొందించటానికి, నిజమైన నాట్య కళా అభివ్రుద్ధికి రాజా రాధా రెడ్డి ఏమి చేస్తున్నారు?
“ఒక కళాకారునిగా ఉద్యమాలు నిర్వహించటం కష్టం. నిరసన తెలిపే అవకాశాలు మాకు లేవు. సాధారణంగా ఒకే రంగoలో ఉన్న కళాకారులకి ఒకరంటే ఒకరికి పడదు.. నేనేదేనా సదుద్దేశంతో ఒక విమర్శ చేసాననుకోండి. సాటి కళాకారుడు దాన్ని గ్రహించడు. అయితే నిజమైన విలువలు పరిరక్షించే ఒక మార్గం ఉంది. వీటి కోసం వర్క్ షాప్స్, లెక్చర్ demonstrations తరచూ నిర్వహించాలి. స్పిక్-మీకే అనే సంస్థ ప్రతి సంవత్సరం దేశంలోని ముఖ్య ప్రాంతాల్లో ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రఖ్యాత నాట్యకారులు పాల్గొంటారు. వీరు అభినయిస్తూ, వ్యాఖ్యానం ఇస్తారు. విజ్ఞానం విడమరచి చెప్తారు. వారు అనుసరించిన పద్ధతులను మనం అవగాహన చేసుకునే అవకాశం ఇస్తారు. ఈ అధ్యయనం ఉత్తమాభిరుచులకు తప్పక పెంపొందిస్తుంది” అన్నారు రాజారెడ్డి.

*తమ చుట్టూ గిరి గీసుకుని కళాకారులు అందులోనే ఇరుక్కుని ఉండే రోజులు పోయాయి. చాలామంది తమ సాంఘిక బాధ్యతలను గుర్తించి సమాజానికి తమకి తోచిన సహాయం చేస్తున్నారు, మరి రాజా రాధారెడ్డి ?
దంపతులు చెప్పింది: ప్రజాహిత కార్యాల్లో మేము తరచూ పాల్గొంటునే ఉంటాం. అంధుల సహాయార్ధం మేమిచ్చిన నాట్య ప్రదర్శనలవలన సుమారు నాలుగు లక్షలు. వృద్ధుల సహాయ నిధి కోసం ఇచ్చిన ప్రదర్శన వలన రెండు లక్షలు వసూలైంది. ఇటువంటి మంచి పనులకు మేము ఎప్పుడూ సిద్ధమే!

*రెండు దశాబ్దాలకు పైగా నాట్య ప్రదర్శనలిస్తున్నారు. ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, వారి వృత్తి గురించి ఏమనిపిస్తుంది? ముందు ముందు ఏం చేయదలచుకున్నారు?
‘కళకు చావులేదు. కళాకారుడి కృషికి తగిన ఫలితం ఎప్పుడూ ఉంటుంది. చిత్తశుద్ధి, దృఢ సంకల్పం, దీక్ష, ఆత్మ విశ్వాసమే ; మమ్మల్ని ఇంతవరకు తీసుకు వచ్చాయి.. లేకపోతే వీధి భాగవతాలలో వేషాలు వేసే ఆ పల్లెటూరి బైతు ఎక్కడ – దేశ, విదేశాల్లో ప్రదర్శనలిచ్చి, నలుగురినీ మెప్పించి, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ కళాకారులేక్కడ? అన్నట్లు మా నాట్య ప్రదర్శన, న్యూయార్క్ లో ఈ సెప్టెంబరులో జరిగే ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉంది. మాదొక కోరిక. అది – నాట్యం ప్రధానాంశంగా ఉత్తమ అభిరుచులతో తీసే ఓ చక్కని చిత్రంలో ప్రధాన వేషాలు వేయాలని! ఎంతైనా ఇప్పటికీ అందరూ చూసి ఆనందించడానికి అనువైన ప్రక్రియ సినిమా ఒక్కటే కదా!” అంటూ నవ్వారు రాజా రెడ్డి.

గణేశ్వరరావు

వింతలూ, విశేషాలు: 1. రాజా రెడ్డి – ‘వనిత’ లో ఈ ఇంటర్వ్యూ వేసేటప్పుడు, ఆ నెల – నృత్య భంగిమలో ఉన్న తమ ఫోటో – కవర్ పేజీ గా వేయమని మరీ మరీ కోరారు. నా Role కేవలం వ్యాసం రాసి ఇవ్వటమే అని, కవర్ పేజీ నిర్ణయం సంపాదకుడు ‘విశ్వం’ చేస్తారని. వారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయమని చెప్పాను రాజా రెడ్డి కోరిక తీరలేదు!

  1. ‘గాసిప్’ అందరి బలహీనత.’ మన గోష్టి లో ఆమె ప్రస్తావన ఉండదు, ఆమె మీ రెండో భార్య, అవునా?’ అని అడిగాను. దానికి రాజా ‘అబ్బే, అది నిజం కాదు, ఈ పుకారు ఎవరు లేవదీసారో కాని, ఇది నా వరకు వచ్చింది. ఆమె రాధ చెల్లెలు, కౌసల్య. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి, please!’ అన్నారు. ఆ తర్వాత rumour నిజమైంది.
  2. ‘వనిత’ పాలసీ ప్రకారం – గోష్టి నిర్వహణ కింద నా పేరులో చివరి భాగం తీసేసి ‘ఆర్. సత్య’ అని ఇచ్చాను
Share via
Copy link
Powered by Social Snap