చెన్నైలో నాట్యమంటే భరతనాట్యమే అనుకుంటున్న రోజుల్లో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టాన కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం గారి వర్ధంతి జ్ఞాపకం !
వెంపటి చినసత్యం 1929, అక్టోబర్ 15 న కృష్ణా జిల్లా లోని కూచిపూడి వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు. కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, వెంపటి పెదసత్యంల వద్ద అభ్యసించారు. చెన్నైలో భరతనాట్యమే విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు.
కూచిపూడి నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసాడు. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాపించారు. దీని ద్వారా వైజయంతిమాల, ప్రభ, పద్మామీనన్, వాణిశ్రీ, శోభానాయుడు లాంటివారికి కూచిపూడి నేర్పించారు. హేమమాలిని, మంజుభార్గవి, చంద్రకళ, రత్నపాప వంటి వారంతా ఆయన శిష్యులే.
1947లో మద్రాసుకు చేరుకున్న చినసత్యం తన సోదరుడు వెంపటి పెదసత్యం వద్ద సినిమాలో నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. 1984 లో అమెరికా పిట్స్‌బర్గ్‌లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి, గిన్నిస్ రికార్డు వచ్చింది.
వెంపటి చినసత్యం గారికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమారుడు వెంపటి రవిశంకర్ కూడా నాట్యాచార్యుడే. వెంపటి చినసత్యం గారు 2012, జూలై 29 న ఆయన చెన్నై లోని నృత్య క్షేత్రం ‘కూచిపూడి ఆర్ట్ అకాడమీ’లో తుదిశ్వాస విడిచారు.
కూచిపూడి నాట్యంలో సరికొత్త ప్రయోగాలు చేయడానికి తన జీవితమంతా అంకితం చేసిన విదుషీ ధీమణి వెంపటి. రకరకాల జతులనీ, నాట్య ప్రక్రియలనీ విస్పష్టంగా వర్గీకరించి, సనాతన నాట్యశాస్త్ర సమగ్ర విధివిధానాలతో మేళవించి, ఎన్నెన్నో జతి స్వరాలూ, తిల్లానాలూ, వర్ణాలూ సృజించిన నాట్య పరమేష్టి ఆయన. కూచిపూడి నృత్య నాటికలను ఎన్నింటినో రూపొందించి వాటికి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేశారు. శ్రీకృష్ణ పారిజాతం, చండాలిక, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కల్యాణం, కిరాతార్జునీయం, క్షీరసాగర మథనం, పద్మావతీ శ్రీనివాసం, హరవిలాసం లాంటివి పేరెన్నిక గన్నవి.
వీరు రూపొందించిన నృత్యరూపకాలు….
1 ) శ్రీ కృష్ణ పారిజాతం
2 ) మేనకా విశ్వామిత్ర
3 ) రుక్మిణీ కల్యాణం
4 ) కిరాతార్జునీయం
5 ) క్షీరసాగరమధనం
6 ) పద్మావతీ శ్రీనివాసం
7 ) చండాలిక
8 )హరవిలాసం
అందుకున్న పురస్కారాలు….
▪️1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు,
▪️కళాప్రపూర్ణ, నాట్యకళాసాగర్
▪️1967లో సంగీత నాటక అకాడమీచే ఫెలోషిప్
▪️1982లో భరత కళాప్రపూర్ణ
▪️1992లో కాళిదాస్ సమ్మాన్, సర్ సింగర్ అవార్డు, సప్తగిరి సంగీత విద్యాన్‌మణి, నాట్య కళాతపస్వి, నాట్య కళాభూషణ, కళైమామణి
▪️1998 లో పద్మభూషణ్ పురస్కారం
▪️2004 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి నృత్యంలో విశిష్ట పురస్కారం
▪️2011, 12లో జీవన సాఫల్య పురస్కారం.
2012 జూలై 29న మరణించిన వెంపటి జన్మదినమైన అక్టోబర్ 15న ప్రపంచ కూచిపూడి దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఆయన పేరిట 5 లక్షల రూపాయల స్మారక పురస్కారాన్ని ‘యక్షగాన సార్వభౌమ’ చింత సీతారామాంజనేయులుకు ప్రకటించింది. పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు దీన్ని ప్రదానం చేస్తారు.

ఆర్యా ! ఈ వ్యాసం మొత్తం చినసత్యం గారి గురించి చెబుతూ చివరిలో కుటుంబ వివరణలో పెదసత్యం గారిని ఉటంకించారు. ఇది ముద్రా రాక్షమా ? కాదా ? సరి చూడగలరు. ఏది ఏమైనా మంచి సమాచారాన్ని అందించారు . ధన్యవాదాలు.