సామాజిక, ఆర్థిక, రాజకీయ కథనాల కదంబం కుదురు. 2015-2020 మధ్య జరిగిన పరిణామాలను, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాలకుల పరిణతిని, సామాజిక సంఘటనలను, ఆర్థికంగా పెరిగిపోతున్న అసమానతలను, రాజకీయాల్లో వచ్చిన మార్పులను, దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న వివిధ సంఘటనలను తనదైన శైలిలో విశ్లేషించి గ్రంధస్థం చేశారు. వై .హెచ్ కె. మోహన్‌రావు అనే పేరుతో ప్రసిద్ధులైన కెహెచ్ కె. మోహనరావు. స్వాంతత్ర్యానంతర భారతదేశంలో వచ్చిన పెనుమార్పులు. సైతం ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. 26 వ్యాసాలు చదివితే సామాజిక చిత్రాన్ని చాలా వరకు అవగాహన చేసుకోవచ్చు. 21 వ్యాసాలు ‘వీక్షణం’ మాసపత్రికలో ప్రచురితమై పాదకాదరణ పొందాయి.
వీటిలో కొన్ని జాతీయస్థాయి అంశాలపై విశ్లేషణలు కాగా ఎక్కువ భాగం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు. భారత్- చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, చైనాకు మద్దతుగా పాకిస్తాన్ సైతం భారత్ లో అస్థిరతను సృష్టించే ప్రయత్నం చెయ్యటం, యుద్ధకాంక్ష ఎందరినో బలిగొనడం, ప్రశాంతతను భగ్నం చేయడంపై తనదైన బాధను వ్యక్తం చేశారు. భగవద్గీత గొప్పదనాన్ని, ఆధ్యాత్మిక చింతనను ప్రస్తుత సమాజం అర్థం చేసుకోవాలన్నారు.
నిజాలను నిర్భయంగా వెలువరించే విలేఖరుల పై జాతీయ స్థాయిలో జరుగుతున్న దాడులను, అక్రమ నిర్భంధాలను తద్వారా వార్తావ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని తనదైన రీతిలో ఎండగట్టారు. దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన దిశ అత్యాచారాన్ని ఆటవిక చర్యగా అభివర్ణిస్తూనే, ప్రజాస్వామ్యపు మనుగడను, న్యాయవ్యవస్థ పారదర్శ కతను ప్రశ్నించే విధంగా ‘దిశ నిందితులను పోలీసులు కాల్చి చంపడం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేనని తనదైన అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఒక వర్గపు ఆర్థికావృద్ధికి ప్రణాళిక రచించడాన్ని న్యాయబద్ధంగా ప్రశ్నిస్తారు.
అరవింద్ కేజీవాల్ విద్య, వైద్యం, సాఫ్ట్వేర్ రంగాలకు ప్రాధాన్యత నిచ్చి, డిల్లీ ఓటర్ల అభిమానాన్ని చూరగొనడాన్ని ప్రశంశిస్తూ, గత తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అనాలోచిత నిర్ణయాలను, అపరిపక్వతను ప్రశ్నిస్తాడు. పెద్దనోట్ల రద్దుతో పాకిస్థాన్ నుండి జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల చొరబాటును ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే మత ఛందసవాదుల వ్యూహన్ని దెబ్బతీయడం రాజకీయ ఎత్తుగడే అయినా, సామాన్య ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు బాధాకరమని. పారిశ్రామిక ప్రగతి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇది ఖచ్చితంగా ప్రణాళికా లోపమే! జాతిపిత మహాత్మాగాంధీని చంపడం హేయమైన చర్యగా, గాడ్సేను కీర్తించడం జాతి విద్రోహి చర్యగా ప్రకటిస్తారు.
వితంతు పునర్వివాహాలను, కులాంతర వివాహాలను ప్రోత్సహించిన కందుకూరి వారి దార్శనికతను, నేటి సమాజంలో పెరిగిపోతున్న కులమత తత్వాలను బేరీజావేసి, నేటి రాజకీయ నాయకుల, ధనిక వర్గాల ధన దాహాన్ని, తద్వారా జాతికి జరుగుతున్న నష్టాన్ని కొరవడు తున్న సామ్యవాద దృక్పదాన్ని ప్రశ్నిస్తారు. కులతత్వం, మతతత్వం ముసుగులో జరుగుతున్న అరాచకాలు ప్రగతిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆవేదన చెందుతారు. వేముల రోహిత్ మరణం వెనుక మతం ముసుగులో పెరిగిపోతున్న అణచివేత ధోరణిని, కంచె ఐలయ్య వర్తకులను కించ పరుస్తూ సమాజంలో ఆలజడి రేపడాన్ని ప్రశ్నిస్తూనే, వర్తకులు చేస్తున్న సమాజసేవను గుర్తించాల్సిందిగా అభ్యర్థిస్తారు.
- బండికల్లు జమదగ్ని
ప్రతులకు:
వెల: రూ.160/-
రచయిత – సెల్: 94401 54114