
‘శతాధిక ‘మిత్ర మానసచోరుడు – ఈ చిత్రకారుడు
“ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే కళ ” అంటాడు టాల్ స్టాయ్.
అలాంటి ప్రయత్నమే చేశాడు కూరెళ్ళ శ్రీనివాస్… కూరెళ్ళ మంచి ఉపాధ్యాయుడే కాదు…! గొప్ప చిత్రకారుడు, స్నేహశీలి కూడా !!
నూట ఎనిమిది మంది ప్రముఖుల ముఖచిత్రాలను రోజుకొక్కటి చొప్పున 108 రూపచిత్రాలు చిత్రించి, “చిత్రముఖ ” పేరుతో నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో (జె.ఎన్.టి.యూ. కాలేజీ) ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఈ రోజు సెప్టెంబర్ 9న తెలంగాణా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మాత్యులు వి. శ్రీనివాస గౌడ్ ప్రారంభించారు.
వాటిని వాళ్ళు అపురూపంగా దాచుకొనే విధంగా ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా అందించారు.
ఏదో మొక్కుబడిగా బొమ్మ వేయడం కాదు…ఏ స్వార్థంలేకుండా.. ఎవరూ అడక్కుండానే..
ప్రేమతో… నేర్పుతో … రోజుకు మూడు నుండి నాలుగు గంటల సమయాన్ని వెచ్చించి ఒక్కో చిత్రాన్ని తనదయిన వర్ణసమ్మేళనంతో ఆవిష్కరించారు.
ఈ చిత్రాలకు ఫేస్ బుక్ లో నిత్యం ప్రశంసల జల్లు కురిపించారు కళాభిమానులు…ఇప్పుడు ప్రదర్శన రూపంలో జె.ఎన్.టి.యూ. కాలేజీ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో సందర్శకులను అలరించనున్నాయి. కూరెళ్ళ గారూ… మీ యజ్ఞం ఫలించినందుకు మనసారా అభినందిస్తున్నాను.
మీరు వృత్తిపరంగానూ, ప్రవృత్తిపరంగానూ.. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ…
ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ప్రదర్శనకు గౌరవ అతిథిగా గోరటి వెంకన్న, ఆత్మీయ అతిథులుగా ఎం.వి. రమణారెడ్డి, బి. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
-కళాసాగర్



Great job