Netflix లో “కురుక్షేత్ర” అనే యానిమేటెడ్ సీరియల్ అక్టోబర్ 10 నుండి.
కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహా’ ఊహించని విధంగా విజయవంతమయ్యింది. కేవలం రూ. 40 కోట్లు ఖర్చు పెడితే రూ. 300 కోట్ల పైగా కలెక్షన్ అందుకుని ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే యానిమేటెడ్ ట్రెండ్ మొదలైపోయింది. తెలుగులో ఇటీవలే ‘వాయుపుత్ర’ అనే యానిమేటెడ్ మూవీ ప్రకటించారు.
ఇది సినిమాల వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఓటీటీలోనూ ‘కురుక్షేత్ర’ అనే యానిమేటెడ్ సిరీస్ ప్రారంభమయ్యింది. అయితే 18 రోజుల పాటు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగిందో చూపించబోతున్నారని ట్రైలర్తో చూస్తే అర్థమైంది.
అక్టోబరు 10 నుంచి ఈ సిరీస్.. నెటిక్స్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటితరానికి కురుక్షేత్రం గురించి పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం గురించి చాలామందికి తెలియదు. ఒకవేళ యానిమేషన్ అంతంత మాత్రంగా ఉన్నాసరే మేకర్స్.. కథాంశాన్ని ఇంకా ఆశక్తికరంగా చెప్పగలిగితే ఈ సిరీస్ హిట్ కావొచ్చు. చూడాలి మరి ఏం చేశారో ?
ఇందులో 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధం ఘట్టాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, పద్మవ్యూహం పన్నిన విధానము కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.
ప్రతి సీన్ కి ఫ్లాష్ బ్యాక్ ద్వారా ఆయా వ్యక్తుల కథ చూపించడం ద్వారా మహాభారతం సూక్ష్మంగా..స్థూలంగా అర్థమయ్యేలా చేసారు..
సంభాషణలలో గానీ, పాత్రల ఔచిత్యంలో గానీ మార్పు లేకుండా యథాతథంగా చిత్రీకరించారు. మన తెగులు సినిమ్మాల్లో లాగ దుష్టులను హీరోలను చెయ్యలేదు.. వాళ్ళని దుష్ఠులుగానే చూపించారు.
భగవద్గీత ఘట్టం.. అభిమన్యుని మరణఘట్టం.. ద్రౌపది శపథం.. లాంటి సన్నివేశాలలో సంభాషణలు, దృశ్యాలు, సంగీతం… సమ్మేళనంలో మనం ఆ పక్కనే నిలబడి చూస్తున్నంత సహజంగా ఉన్నాయి. పిల్లలకు ఈ సీరీస్ చూపిస్తే యదార్థమైన మహాభారత కథను కడు మనోహరంగా చూపించినట్లే..
ఒక ఉదాహరణ: శ్రీకృష్ణుని రాయాబారానికి పంపేముందు ధర్మరాజు శాంతి వచనాలు పలుకుతూ ఉంటే.. ద్రౌపది శ్రీకృష్ణునితో “నా భర్తలు చేతకాని వాళ్ళు అయితే చెప్పండి..నాకు నా పిల్లలు, అభిమన్యుడు ఉన్నారు..నా పగ తీర్చుకోవడానికి” అంటుంది. అన్నీ ఇటువంటి ఒరిజినల్ సంభాషణలే ఉంటాయి.
తప్పక చూడండి “కురుక్షేత్ర” NETFLIX లో…
–ఓలేటి శంకర్.
Trailer: https://www.youtube.com/watch?v=AEP84U6ApSI
