చలనచిత్ర సంగీత యుగపురుషుడు… మహదేవన్

తమిళంలో ఆయన ‘తిరై ఇసై తిలగం’, తెలుగులో ఆయన ‘స్వరబ్రహ్మ’. జాతీయ స్థాయిలో సంగీత దర్శకునికి కూడా బహుమతి ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినప్పుడు తొలి బహుమతి అందజేసింది అతనికే. సంగీత దర్శకునిగా యెంత గొప్పవారో, వ్యక్తిగా అంతకు మించిన మానవతావాది. ఎంతటి సౌమ్యుడంటే, ప్రముఖ వీణావిద్వాంసులు ఎస్. బాలచందర్ ‘శంకరాభరణం’ చిత్ర సంగీతాన్ని విమర్శిస్తే అతడు సమర్ధించుకోలేదు… పల్లెత్తు మాటకూడా అంలేదు. స్పందిచలేదు కూడా. పైగా “అంత పెద్దాయనకు ఎదురు చెప్పడమా? నేను తప్పు చేశాననుకుంటే అలాగే అనుకోనీయండి” అని సమాధానపరచిన సౌజన్యమూర్తి. తనకు తొలిసారి సహాయకునిగా పరిచయమైన శిష్యుణ్ణి చివరిదాకా గౌరవిస్తూ తనవద్ద వుంచుకొని “అప్పూ” అంటూ ఆప్యాయంగా సంబోధించే స్నేహశీలి. సినిమా టైటిల్ కార్డులో తనతో సమానంగా పుహళేంది కి స్థానం కల్పించిన మహామనీషి. ఈ గురుశిష్యులు రికార్డింగ్ రూములో మాట్లాడుకుంటుంటే ప్రక్కవారికి చిన్న మాటకూడా వినిపించనంత సౌమ్యంగా వ్యవహరించే నిజమైన మనీషి. రాసిన సాహిత్యానికి అత్యంత వేగంగా స్వరాలు కట్టి హిట్ చేసిన సంగీత సౌజన్యమూర్తి. ఇన్ని భూషణాలను మూటకట్టుకొని భుజాన మోసిన ఆ సంగీత నిధి “మామా” అని పిలిపించుకున్న కె.వి. మహదేవన్. హిందీలో రామచంద్ర చితాల్కర్ ని, లతా మంగేష్కర్ ని అభిమానించే మహదేవన్ జయంతి మార్చి 14 జరుపుకుంటున్న సందర్భంగా ఆ మహనీయుని జ్ఞాపకాలను గుర్తుచేసుకుందాం…

తొలిరోజుల్లో మామ…

మహదేవన్ అసలుపేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్. పుట్టింది మార్చి 14, 1918. పుట్టిన వూరు కేరళ సరిహద్దులో వుండే కృష్ణన్ కోయిల్. అతని తల్లిదండ్రులు తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన లక్ష్మి అమ్మాళ్, వెంకటాచలం భాగవతార్ అయ్యర్. తండ్రి గోటువాద్య నిపుణుడు. మహదేవన్ తాతగారు తిరువాన్కూర్ రాజాస్థానంలో సంగీత విద్వాంసునిగా వుండేవారు. మహదేవన్ కు నాదస్వరమంటే చాలా ఇష్టం. అతని ఇష్టాన్ని గమనించిన తండ్రి విద్వాన్ రాజారత్నం పిళ్ళై వద్ద శిష్యరికం చేయించి నాదస్వర ప్రవీణునిగా తీర్చిదిద్దారు. తరవాత బూదంపాడి అరుణాచల కవిరాయర్ వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. చిన్నతనంలోనే శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారు. నాటకాలమీద ఆసక్తితో కొన్ని నాటకాల్లో నటించారు. కానీ ఏడవ తరగతితోనే విద్యకు మంగళం పలికారు. మహాదేవన్ పన్నెండేళ్ళ ప్రాయంలో వుండగా తమిళచిత్ర నిర్మాత టి.వి.చారి మహదేవన్ ను వెదుక్కుంటూ కృష్ణన్ కోవిల్ గ్రామానికి వచ్చారు. ‘మాతృభూమి’ అనే సినిమా తీయబోతూ అందులొ మహదేవన్ చేత ఒక పాత్రను పోషింపజేయాలని వచ్చినట్లు చెప్పారు. అలా మహదేవన్ మకాం మద్రాసుకు మారింది. అయితే ‘మాతృభూమి’ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. దాంతో నీరసపడిన మహదేవన్ ‘బాల గాంధర్వ గానసభ’లో సభ్యునిగా చేరారు. వారు ప్రదర్శించే నాటకాల్లో అప్పుడప్పుడు ఆడవేషాలు కూడా వేయాల్సి వస్తుందని ముందుగానే చెప్పడంతో, ఆ షరతుకు మహదేవన్ “సరే” అన్నారు. అలా ఆ సంస్థ తరఫున నాటకాల్లో పాల్గొంటూ రెండేళ్ళు గడిపారు. సినిమాల్లో నటించాలనే ఆశమాత్రం అడుగంటలేదు. ఒకసారి అప్రయత్నంగానే ‘తిరుమంగై ఆళ్వార్’ అనే సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసే అవకాశం వచ్చింది. నెలజీతం పదిహేను రూపాయలు. ఆ చిత్ర నిర్మాణానంతరం మరలా నిరుద్యోగం వెక్కిరించింది. ఒక హోటల్లో సర్వర్ వుద్యోగం వెలగబెట్టారు. నౌకరు వుద్యోగం కూడా చేశారు. ‘తిరుమంగై ఆళ్వార్’ చిత్రంలో పనిచేసినప్పుడు పరిచయమైన కొళత్తుమణి మహదేవన్ కు సంగీత దర్శకత్వ శాఖలో రాణిస్తావని సలహా ఇచ్చాడు. ఆ కొళత్తుమణికి సంగీత దర్శకుడు ఎస్.వి. వెంకట్రామన్ బాగా తెలుసు. ఆయన్ని బతిమాలుకొని మహదేవన్ ను వెంకట్రామన్ వద్ద సహాయకునిగా చేర్చాడు. వెంకట్రామన్ వద్ద టి.ఎ. కల్యాణం అప్పటికే సహాయకుడుగా వున్నారు. అతనికి మహదేవన్ మీద వాత్సల్యం కలిగింది. అప్పట్లో మోడరన్ థియేటర్స్ వారు సేలంలో వున్న సొంత స్టూడియోలో సినిమాలు నిర్మిస్తూ వుండేవారు. వారు ‘మనోన్మణి’ (1942) అనే సినిమా నిర్మిస్తూ టి.ఎ. కల్యాణంను సంగీతదర్శకునిగా నియమించారు. కల్యాణంతో బాటు మహదేవన్ కూడా ఆ చిత్రానికి సహకార సంగీత దర్శకునిగా పనిచేశారు. ద్ఫర్బారి కానడరాగంలో మహదేవన్ “మోహనాంగ వదని” అనే పాటను స్వరపరచారు. ప్రముఖ తమిళ గాయకుడు పి.యు. చిన్నప్ప ఆ పాటను ఆలపించారు. మహదేవన్ కు ఆ పాట మంచి పేరు తెచ్చిపెట్టింది.

దేవదాసి చిత్రంతో సంగీత దర్శకునిగా …

మహదేవన్ కు సంగీతం మీదవున్న పట్టు చూసి సుకుమార్ పిక్చర్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ‘దేవదాసి’ (1948) అనే చిత్రానికి సంగీత దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. హాలీవుడ్ లో శిక్షణపొందిన మాణిక్ లాల్ టాండన్, టి.వి. సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలసుబ్రమనియం, అంగముత్తు ముఖ్య పాత్రలు పోషించారు. అనటోల్ అనే ఫ్రెంచ్ రచయిత రాసిన ‘తాయిస్’ అనే ఫ్రెంచ్ ఒపేరా నాటకం ఈ సినిమాకు ఆధారం. ఇదే నాటకం ఆధారంగా 1941 లో బెంగాలి సమర్పకుడు ‘చిత్రలేఖ’ పేరుతో సినిమా నిర్మించి వున్నాడు. అయితే ఈ తమిళ సినిమా నిర్మాణానికి ఏకంగా మూడేళ్ళుపట్టింది. సినిమా ఆడడం కష్టమని భావించి కృష్ణన్, మధురం తో ప్రత్యేకంగా ఒక కామెడీ ట్రాక్ ను జతచేసి సినిమా విడుదల చేశారు. ఇందులో పాటలన్నీ సుందరి తంబి చేత పాడించారు. అయితే సినిమా ఆశించినంత గొప్పగా ఆడలేదు. దాంతో మహదేవన్ స్వరపరచిన అద్భుతమైన పాటలు కూడా మరుగున పడిపోయాయి. దేవదాసి పరాజయంతో మహదేవన్ కు అవకాశాలు రాలేదు. సంగీత శాఖనుంచి నటన వైపు వెళ్దామని ప్రయత్నించారు కూడా. జరుగుబాటుకోసం గ్రామఫోన్ కంపెనీలో పాటలు పాడుతూ, కొన్ని పాటలకు స్వరాలు కూర్చుతూ రెండేళ్ళు పనిచేశారు. ఆ గ్రామఫోన్ కంపెనీలో పనిచేసేటప్పుడే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్, కె.బి. సుందరంబాళ్, దండపాణి, దేశిగర్ వంటి నిష్ణాతుల గాత్రాలను రికార్డులలో నిక్షిప్తం చేసే అవకాశం కలిగింది. దర్శక నిర్మాత ఆర్. పద్మనాభన్ మహదేవన్ ప్రతిభను గమనించి తను నిర్మించే ‘కుమారి’ (1952) చిత్రంలో సంగీతం సమకూర్చే అవకాశాన్ని కల్పించారు. అందులో ఎం.జి. రామచంద్రన్, జూనియర్ శ్రీరంజని ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రవిజయానంతరం ఈ సినిమాను ఆర్. పద్మనాభన్ ‘రాజేశ్వరి’ (1952) పేరుతో సమాంతరంగా తెలుగులో నిర్మించారు. మంత్రవాది శ్రీరామమూర్తి, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, రేలంగి ముఖ్య తారాగణం కాగా సంగీతాన్ని ఓగిరాల రామచంద్రరావు సమకూర్చారు. తమిళ చిత్రంలో మహదేవన్ స్వరపరచిన పాటలనే రామచంద్రరావు యధాతధంగా వాడుకున్నారు. “ఓహోహో పున్నమ రేయీ ఏమోయి మామా జాబిలిమామా”, “జై పతాక నిల్పరా సోదరా” అనే సైనిక గీతం, “ఆడదానికి తోడు మగాడొక్కడుండాలి”, “ఆహా ఈ లతాంగి ప్రేమ”, “మనోవిహారీ మరులుగొల్పు ఈ మలయపవనమే హాయీ”, “చూడు చూడు నాలో సిగ్గు నీకై తొంగి చూసెనోయి”, “షోకైన టంకు టమా తిల్లానత్తా ధిమిధిమి తా” పాటలు తెలుగులో బాగా పాపులర్ కావడంతో మహదేవన్ అంటే ఎవరో తెలుగు ప్రేక్షకులకు చూచాయగా తెలిసివచ్చింది. అప్పుడే పుహళేంది మహదేవన్ కు పరిచయమయ్యాడు. ఏ ముహూర్తంలో పుహళేంది పరిచయమయ్యాడో, మహదేవన్ తో చివరిదాకా అంటిపెట్టుకుని సహాయకుడిగా ఉండిపోయాడు. 1955లో ఎం.ఎ. వేణు తమిళంలో ‘టౌన్ బస్’ సినిమా నిర్మించాడు. అందులో అంజలీదేవి, స్టేజి నటుడు కన్నప్ప ముఖ్యతారాగణం. కోయంబత్తూరులో నిర్మించిన ఈ బాక్సాఫీస్ సినిమాకు మహదేవన్ అద్భుత సంగీతం సమకూర్చారు. ముఖ్యంగా సంగీత సౌలభ్యంతోనే ఈ చిత్రం కమర్షియల్ గా విజయవంతమైంది. ముఖ్యంగా ఎమ్మెస్ రాజేశ్వరి చిన్నపిల్ల గొంతుతో ఆలపించిన “చిట్టు కురువి చిట్టు కురువి శైతి తెరియుమా”, “లేడా లేడీ అరుగినణిల్ వాడ ఆడి పాడలాం” పాటలు నేటికీ తమిళనాడులో వినిపిస్తూనే వుంటాయి. ఇదే చిత్రాన్ని 1957లో జైరాం ప్రొడక్షన్స్ వారు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తే బాగా ఆడింది. తెలుగులో బైరాగి చౌదరి మాటలు, పాటలు సమకూర్చగా మహదేవన్ సంగీతం ఇచ్చారు. “చిన్ని పిచ్చుకా, చిన్ని పిచ్చుకా జాడ తెలపవే”, “లేడీ లేడీ డార్లింగ్ లేడీ నువ్ నా జోడీ”, ”లేత వలపురా సదా నిన్ను పిలుతురా”(నాట్యగీతం), “వృధా జీవితమ్మికేలా వ్యధాపూరితమ్ము ప్రేమా” (నేపథ్యగీతం), “పాడాయే బ్రతుకు బీడాయే ప్రేమా” పాటలు తెలుగులో కూడా పాపులర్ అయ్యాయి.

దొంగలున్నారు జాగ్రత్త తో తెలుగులో ప్రవేశం…

1958 లో మహదేవన్ కు తెలుగులో స్ట్రెయిట్ సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం వచ్చింది. ప్రతిభా సంస్థ బ్యానర్ మీద ఘంటసాల బలరామయ్య కుమారుడు కృష్ణమూర్తి సమర్పణలో నిర్మించిన ‘దొంగలున్నారు జాగ్రత్త’ సినిమాకు మహదేవన్ సంగీతం సమకూర్చారు. సీనియర్ సంగీత దర్శకుడు భీమవరపు నరసింహారావు దర్శకుడు కాగా జగ్గయ్య, జి.వరలక్ష్మి, సియ్యస్సార్, రాజనాల, గుమ్మడి, రమణారెడ్డి, గిరిజ, హేమలత ప్రధాన పాత్రలు పోషించారు. “వలపే పులకింత సరసాలే గిలిగింత” (శ్రీనివాస్, జానకి), “అలాచూస్తావేమయ్యో ఓరచూపు చూచితే వూరికే పోడయ్యో” (జిక్కి), “కల్లకాదు కలా కాదు కన్నెపిల్ల బాసలు” (జిక్కి), “చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలూ” (రాజేశ్వరి, కస్తూరి), “వినరా నాన్నా, కనరా చిన్నా”(మాధవపెద్ది), ”ఏమనేనోయి ఆమని రేయీ” (ఘంటసాల, జిక్కి), టి.జి. కమల పాడిన ఎరుకలసాని పాట ఆరోజుల్లో ప్రేక్షక జనానికి మంచి వినోదాన్నిచ్చాయి. అదే సంవత్సరం అరుణా ఫిలిమ్స్ వారు ఆర్.కృష్ణస్వామి దర్శకత్వంలో ‘బొమ్మలపెళ్లి’ చిత్రాన్ని నిర్మించారు. శివాజీ గణేశన్, నాగయ్య, ఎస్.వి. రంగారావు, రమణారెడ్డి, జమున, శాంతకుమారి, సూర్యకాంతం ముఖ్యతారాగణం గా నటించిన ఈ చిత్రానికి మహదేవన్ సంగీతదర్శకత్వం వహించగా, పుహళేంది పేరును మహదేవన్ పేరు కింద తొలిసారి వేశారు. ఈ సంప్రదాయాన్ని చివరిదాకా మహదేవన్ కొనసాగించడం విశేషం. “చిక్కావే చినదానా, నక్కావే నెరజాణా (పిఠాపురం), “రారమ్మా రారమ్మా బొమ్మలపెళ్లి నేడమ్మా” (జిక్కి బృందం), “చిట్టిబావా చిట్టిబావా చేసుకుంటావా పెళ్లి” (స్వర్ణలత, పిఠాపురం), “కళ్యాణమే చెలి వైభోగమే” (ఎ.పి. కోమల బృందం), “అనురాగం పండుగ, ఆనందం నిండగా” (రాజా, జిక్కి), “వసంతమింతేనా ఈ వసంత మింతేనా”(సుశీల) పాటలు బాగా జనంలోకి వెళ్ళాయి. 1958లోనే సేలం స్టూడియో వారు ఎం.ఎ.వి. పిక్చర్స్ సంస్థ పేరిట ‘ముందడుగు’ సినిమా నిర్మించారు. కృష్ణారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగ్గయ్య, జానకి, ఆర్. నాగేశ్వరరావు, గిరిజ నటించారు. “కోడెకారు చిన్నవాడా వాడిపోని వన్నెకాడా కోటలోన పాగా వేశావా చల్ నవ్వుల రంగా మాటతోనే మనసు దోచావా” పాట బాగా హిట్టయింది. అందులో “చింతపూల రైక” పదాన్ని ఆత్రేయ వాడడంతో ఆపేరుతో రవిక గుడ్డలు మార్కెట్లోకి వచ్చాయి. “అప్పన్నా తన్నామన్నా మారోరిభైరాన్నా” పాట మరొక హిట్టు. “సంబరమే బలేబలే సంబరమే”, “మాబాబు మామంచి బాబు మనసిచ్చి మమ్మేలు చినబాబు”, “అందాన్నినేను ఆనందాన్ని నేను అందీ అందక నిన్ను ఆడించుతాను“, “ఆనందం ఎందుకో అనుబంధం ఏమిటో” పాటలు జనాన్ని బాగా అలరించాయి. సినిమాకూడా హిట్టయింది.

బాబూ మూవీస్ తో ‘మామ’గా…

1962లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తన స్నేహితులు సి. సుందరం, చక్రవర్తి అయ్యంగార్ లను కలుపుకొని ‘బాబూ మూవీస్’ పేరిట చిత్ర నిర్మాణ సంస్థ నెలకొల్పి తొలి ప్రయత్నంగా మోడరన్ థియేటర్స్ వారు నిర్మించిన ‘కుముదం’ సినిమాకు కొన్ని మార్పులుచేర్పులు చేసి ‘మంచిమనసులు’ పేరుతో సినిమాగా నిర్మించారు. అక్కినేని, సావిత్రి, రంగారావు, జానకి, వాసంతి, సూర్యకాంతం, నాగభూషణం, గుమ్మడి నటించిన ఈ చిత్రానికి మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో మొదలెట్టి బాబూ మూవీస్ నిర్మించిన అన్ని చిత్రాలకూ మహాదేవనే సంగీత దర్శకుడు. ‘కుముదం’ చిత్రానికి మహాదేవన్ సమకూర్చిన సంగీతం తమిళనాట మారుమోగిపోతుంటే, తెలుగులో కూడా దాదాపు అవే బాణీలను ‘మంచిమనసులు’ చిత్రానికి వాడుకున్నారు. సినిమా విడుదలయ్యాక ఎక్కడ విన్నా ‘మంచిమనసులు’ చిత్రంలో పాటలే. ముఖ్యంగా “మామా మామా మామా పట్టుకుంటే కందిపోవు పండువంటి చిన్నదుంటె చుట్టుచుట్టు తిరుగుతారు మరియాదా తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుకాదా” పాట సూపర్ హిట్టయింది. దాంతో తెలుగు పరిశ్రమలోనివారు మహదేవన్ ని ‘మామా’ అని పిలవడం మొదలెట్టారు. మహదేవన్ కు ‘మంచిమనసులు’ కేవలం ఏడవచిత్రమే. ఈ చిత్రంతోనే తెలుగు చలనచిత్ర సీమలో మహదేవన్ అధ్యాయం మొదలైంది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకూ మహాదేవనే ఆస్థాన సంగీత దర్శకులయ్యారు. 1963లో విడుదలైన ‘మూగమనసులు’ చిత్రం మహదేవన్ కు తిరుగులేని స్థానాన్ని సంపాదించిపెట్టింది. మహదేవన్ ఏనాడూ ట్యూనుకు పాట రాయించలేదు. అది ఎంతటి క్లిష్టమైన గీతమైనా వాటికి అర్ధవంతపు స్వరాలు అల్లారు. ఎంతోమంది తెలుగువారికంటే తెలుగు భాషకు వూపిరులూదిన మేధావి మహదేవన్. అలాగని మహదేవన్ తమిళ చిత్రాలకు దూరం కాలేదు. తమిళ తెలుగు చిత్రాలు తనకు రెండు కళ్ళు అనుకుంటూ సంగీత సేద్యం చేశారాయన. ఆయనంత వేగంగా స్వరాలు అల్లిన సంగీత దర్శకులు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన స్వరాలు కూర్చిన వేలాది పాటల్లో ట్యూనుకు చేసిన పాటలు పదికంటే మించవు. అదికూడా నిర్మాతల ఒత్తిడికి కాదనలేక అయిష్టంగా చేసినవే! పాటను వాద్యాలు డామినేట్ చెయ్యడం మామకు అసలు ఇష్టం వుండదు. అందుకే ఆ పాటలన్నీ మేలొడీలుగా నిలిచిపోయాయి.

మామ సినిమాలన్నీ శంకరాభరణాలే…

‘శంకరాభరణం’ సినిమా మామ కిరీటంలో ఒక కలికి తురాయి. ఈ సినిమా రికార్దింగ్ రోజున విశ్వనాథ్ “మీ ఇద్దరినీ నమ్ముకొని ఈ సినిమా ప్రారంభిస్తున్నా” అన్నారు. ఆమాటను నిలబెట్టారు మహదేవన్, వేటూరి సుందరరామమూర్తి. బాలు, వాణీ జయరాంలకు ఉత్తమ గాయకులుగా జాతీయ పురస్కారాన్ని కట్టబెట్టించారు. పండిత పామరుల్ని విశేషంగా ఆకట్టుకున్న సినిమా శంకరాభరణం. అందుకు సగం కారణం అందులోని పాటలే. బాలు గాయకుడిగా ఎదగడానికి దోహదమిచ్చిన చిత్రం కూడా ఇదే! ఈ సినిమాలోని శాస్త్రీయ పోకడులున్న పాటల్ని పాడలేనని బాలు వెనుకంజ వేస్తే, పుహళేంది చేత బాలుకు తర్ఫీదు ఇప్పించి, ధైర్యాన్ని కూడగట్టించి పాటలు పాడించిన మునీశ్వరుడు మహదేవన్. బాలు తొలి సోలో పాట పాడింది మహదేవన్ సంగీత దర్శకత్వంలోనే. ‘ప్రైవేటు మాస్టారు’ చిత్రంలో “పాడుకో పాడుకో పాడుతూ చదువుకో” అనే పాట అది. అలాగే రామకృష్ణను ‘విచిత్రబంధం’ సినిమాలో పరిచయం చేసిన ఘనత కూడా మామదే (చిక్కావు చేతిలో చిలకమ్మా పాట). అలాగే మహదేవన్ సంగీతం సమకూర్చిన ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో “ఝుమ్మంది నాదం” పాటకు సుశీల జాతీయ బహుమతి అందుకుంది. ‘ముత్యాలముగ్గు’‘ చిత్రంలో సజ్జాద్ హుస్సేన్ చేత మ్యాండలిన్ వాద్యాన్ని, ‘సిరివెన్నెల’ చిత్రంలో పండిట్ హరిప్రసాద్ చౌరాసియా చేత వేణువును వాయింపజేసిన ఘనత మహదేవన్ దే! ‘ముత్యాలముగ్గు’లో సజ్జాద్ హుస్సేన్ మ్యాండలిన్ వాద్యం దాదాపు పావుగంట సేపు వుంటుంది. ‘సప్తపది’, ‘సిరిసిరిమువ్వ’ వంటి చిత్రాలకుగాని మామ అందించిన సంగీతం అత్యున్నతమైనది. జగపతి, భార్గవ్ ఆర్ట్స్, యువచిత్ర, సురేష్ సంస్థలకు మహదేవన్ ఆస్థాన సంగీత దర్శకుడు. కాట్రగడ్డ మురారి మహదేవన్ చనిపోయాక సినిమాలు నిర్మించడం మానుకున్నారు. అలాగే ప్రేమనగర్, దసరా బుల్లోడు, తోడూ-నీడా, దాగుడుమూతలు, చెల్లెలి కాపురం, జీవనజ్యోతి, సీతామాలక్ష్మి, గోరింటాకు, త్రిశూలం, అడవిరాముడు, బుద్ధిమంతుడు, సాక్షి, గోరంత దీపం, అందాలరాముడు, పెళ్ళిపుస్తకం, గడుసుపిల్లోడు, శ్రుతిలయలు, శుభలేఖ, శుభోదయం, మంగమ్మగారి మనవడు, మాపల్లెలో గోపాలుడు, మువ్వ గోపాలుడు, మన్నెంలో మొనగాడు, ముద్దుల మామయ్య, సంపూర్ణ రామాయణం, వీరాభిమన్యు, ఏకవీర వంటి చిత్రాల్లో మహదేవన్ సంగీతానికి ఒక ప్రత్యేకత వుంది. మహదేవన్ ప్రయోగాలు చెయ్యడంలో దిట్ట. ‘దసరాబుల్లోడు’ సినిమాలో గ్రామీణ సంగీత చాయాల్లో పాటలకు మట్లు కట్టారు. ‘వీరాభిమన్యు’ చిత్రంలో “చూచి వలచి చెంతకు చేరి” పాటను విషాద గీతాలకు వాడే ‘శహనా’ రాగాన్ని ఉపయోగించారు. ‘ఏకలవ్య’ చిత్రంలో “మ్రోగింది డమరుకం” పాటకు కేరళ సంప్రదాయపు వాద్యపరికరాలను వుపయోగించి హిట్ చేశారు. మహదేవన్ చివరి చిత్రం విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతికిరణం’. నిజానికి మహదేవన్ అస్వస్థుడుగా వుండగా పుహళేంది ఈ చిత్రంలో పాటలకు స్వరాలు అల్లారు. తన గురుభక్తిని చాటుకుంటూ మహదేవన్ పేరు పైన, తనపేరు క్రింద వేయించుకొని గురుదక్షిణ చెల్లించుకున్నారు. తెలుగు భాష తెలియకుండా ‘స్వరబ్రహ్మ’ అనిపించుకున్న సంగీత ఘనాపాటి మహదేవన్.

Balu P. Leela and KV Mahadevan

మామ వ్యక్తిత్వం…

మామకు ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. ఆయన చాలా సౌమ్యుడు. దర్శక నిర్మాతలు అడిగింది విసుక్కోకుండా అందించే స్నేహశీలి మహదేవన్. ఆయనకు ఆడంబరాలు లేవు. సన్మానాలమీద మోజు లేదు. చిన్న నిర్మాతైనా, పెద్ద నిర్మాతైనా పాట విషయంలో ఆయనకు అందరూ ఒక్కటే. సంయపాలనకు కట్టుబడి వుండేవారు. నోట్లో తాంబూలం ఉండాల్సిందే. 1967 లో కేంద్రప్రభుత్వం ఉత్తమ సంగీత దర్శకుడు బహుమతి ప్రవేశపెట్టినప్పుడు తొలి బహుమతి అందుకున్నది ‘కందన్ కరుణై’ చిత్రానికి మహదేవనే. తరవాత 1980 లో ‘శంకరాభరణం’ చిత్రానికి జాతీయ బహుమతి లభించింది. సుమారు ఆరువందల ఎనభై చిత్రాలకు సంగీతం సమకూర్చిన మహదేవన్ జూన్ 21, 2001 న ఈ చిత్రజగత్తును వీడి స్వర్గంలో సంగీత సభలు నిర్వహించేందుకు పయనమై వెళ్లారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap