రంగస్థల దర్పణం – 4
ఓ వ్యక్తి తన సమకాలీన సమాజంచే అందునా తానున్న రంగంలోని వ్యక్తులచే కీర్తింపబడుట చాలా అరుదగా జరిగే సంఘటన. కళారంగాన అట్టి స్థితి దాదాపు మృగ్యం. అట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అరుదైన ప్రతిభాశాలి ‘లక్కరాజు విజయగోపాలరావు’.
కళారంగంలో కొనసాగింది కొలదికాలమే ఐనా ఓ ‘జీవిత కాలపు’ ఎదుగుదలను ఆ కొద్దికాలంలోనే సాధించిన విజయగోపాలరావు ‘రేపల్లె’ తాలుకూ ‘కనగాల’లో ‘ 1903 లో జన్మించారు. బాల్యములోనే పితృవియోగం సంభవించుటచేత మేనమామయింట పెరిగినారు.
విద్యాభ్యాస వేళ నాటి ప్రముఖ నాటకసమాజాలైన ‘గుంటూరు ఫస్ట్ కంపెనీ, సెకండుకంపెనీ, శ్రీ గోవిందరాయ నాట్యమండలి (సురభి)’లు ప్రదర్శించిన నాటకాలనుచూచి ఉత్తేజితులైన వీరు నాట్యకళవైపు ఆకర్షితులైనారు. తొలిదశలో తాను చూచిన నాటకాల్లోని సన్నివేశాలను సహాధ్యాయుల సమక్షంలో అభినయించి వీరు తనలోని కళా తృష్ణ తీర్చుకునేవారు. రంగస్థలప్రవేశానికి తగు సమయానికై వేచియున్న ఈ కళాచకోరానికి వార్షికోత్సవ వేడుకలు వోవరంలా లభించాయి. దాంతో ‘చిత్రనళనీయంలో బాహుకుని’గ రంగస్థల ప్రవేశము చేసారు. అంతే, అంతదనుక నిగూఢముగావున్న వారిలోని నటరాజు ఆనందతాండవం చేసారు. బాల్యదశలోనే ‘బాహుకుడి’ పాత్రలో వీరు చూపిన అభినయ చాతుర్యానికి మంత్రముగ్ధులైన కళాభిమాని, అడ్వొకేట్ పిల్లలమఱ్ఱ ఆంజనేయులుపంతులు నగదు ఓ బంగరుపతకాన్ని బహుకరిస్తూ ‘మున్ముందు ఆంధ్ర నాటక రంగానికి అలంకార మగుదవని’ ఆశీర్వదించారు. ఆఘటనకు సాక్షులుగ వున్న తథాస్తు దేవతలు ‘తథాస్తు’ అన్నారేమో. వారిలో ఉత్సాహమధికమై మిత్రులను కలుపుకుని 1918లో ‘శ్రీ యూనివర్సల్ అసోసియేషన్’ అనే ఎమెచ్యూర్ సంఘమును స్థాపించారు.
ఈ సమాజంవారు తొలుతగ ‘హరిశ్చంద’ను ప్రదర్శించారు. దీనియందు ‘పరిహారం వెంకటేశ్వర్లు (హరిశ్చంద్ర), స్థానం(చంద్రమతి), వీరబ్రహ్మచారి (నక్షత్రకుడు)’ల సరసన వీరు ‘విశ్వామిత్ర’ పాత్రను పోషించి రాణించారు. ఆ ప్రదర్శన తిలకించి పరవశించిన కళాప్రియులు అడ్వకేట్ కూచిభొట్ల రామదాసుపంతులు వీరిని- స్థానంవారిని బంగారుపతకాలతో సత్కరించారు. అలా ద్వితీయ విఘ్నమనేది లేకుండా మలి ప్రదర్శనలోనూ బంగారుపతకం పొందటం – కళారంగాన వీరి స్వర్ణ భవితకు సంకేతంగా నిలిచినదనుటలో అత్యుక్తి లేదు. వీరు విశ్వామిత్రునిగ, స్థానం చంద్రమతిగ కాంబినేషన్లో అనేక నాటకాలాడారు. ఇంకా ఈ సమాజంనుంచి 1921వరకు ‘రసపుత్ర కదనం, రసపుత్ర విజయం ‘వంటి వైవిధ్యభరిత నాటకాలు ప్రదర్శించారు. ‘ఉత్తరకాలంలో గోవిందరాజుల సుబ్బారావు, పెద్దిభొట్ల చలపతిరావు’లు పేద విద్యార్థుల సహాయార్థమై నాటక ప్రదర్శనలిచ్చేందుకు ‘తిలక్ ఎమెచ్యూర్స్’ అనే ఓ తాత్కాలిక సమాజాన్ని ఏర్పరిచారు. వీరు ఆ సత్కార్యములో తనతోపాటు ‘స్థానం’వారు పాల్గొనేలా చేసేరు. ఈ సమాజం ప్రదర్శించిన ‘ప్రతాపరుదీయం, బొబ్బిలి యుద్ధం’లు అమోఘవిజయాన్ని దక్కించుకుని కాసులవర్షం కురిపించి, లక్ష్యసిద్ధి కలుగజేసాయి.
ఈ నాటకాలలో ‘డా. గోవింద రాజుల సుబ్బారావు(యుగంధరుడు, పిచ్చివాడు), పెద్దిభొట్ల చలపతిరావు(పేరిగాడు- హైదర్ జంగ్), సినీగాయకుడు మాధవపెద్ది (వలీఖాన్-నరసరాయుడు), ఏలేశ్వరపు కుటుంబశాస్త్రి (విద్యానాథుడు, రంగారాయుడు), కొడవటిగంటి కుటుంబరావు’ వంటి రంగస్థలదిగ్గజాల సరసన వీరు ‘చెకుముకి శాస్త్రి (ప్రతాపరుద్రీయం), వెంగళరాయుడు (బొబ్బిలి యుద్ధం)’ పాత్రలను అనితరసాధ్యమైన రీతిలో నటించి రసజ్ఞుల హృదయాలను కొల్లగొట్టి వీరు తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. ఉత్తకాలాన ఈ ‘తిలక్ ఎమెచ్యూర్స్’ కొంతమంది పెద్దలసహకారంతో ‘రామవిలాస సభ’గా రూపొందినది. ‘త్రిపురారిభొట్లు’ వారి సారథ్యంలో ఈ సమాజం గాంచిన ఖ్యాతి, తెలుగు ‘నాట’క వికాసానికి సల్పిన కృషి ఓ విశిష్టచరిత్ర. ఈ సమాజం ప్రదర్శించిన నాటకాల్లో వీరు ‘కర్ణుడు (రాయబారం), రుక్మిణి (తులాభారం), సత్యభామ (నరకాసుర వధ)గ నటించి ఆయా పాత్రలకు వన్నె తెచ్చారు. తులాభారం’లో వీరు రుక్మిణిగా, స్థానంవారు సత్యభామగా పోటీపడి నటిస్తుంటే ప్రేక్షకులకు నేత్రపర్వంగ వుండేదట. ఈ సమాజంవారే ప్రదర్శించిన ‘రోషనార’ గురించి చెప్పుకోవాలంటే అదో పెద్ద అధ్యాయమే. అందు శివాజీగా మాధవపెద్ది వెంకటామయ్య, రోషనారగా స్థానం నటిస్తే- ‘రామోజీ’ అనే సేనాని పాత్రతోపాటు ‘రజాక్’ అనే హాస్యపాత్రను ‘లక్కరాజు’ పోషించేవారు. లక్కరాజువారి ‘సుమతి’ పాత్ర నిర్వహణ నాటకచరిత్రలో వీరికి మరో ప్రత్యేక పుట కేటాయించేలా చేసింది. ఆ పాత్రపోషణలో వీరు చూపిన సమయస్ఫూర్తి, అభినయ కౌశలాలు ఆ పాత్రకే వన్నె తెచ్చేవి. ఓసారి రాజమండ్రిలో స్థానంవారు అనసూయగ, వీరు సుమతిగ నటిస్తుండగ తిలకించిన ఆ నాటకకర్త ‘శొంఠి గంగాధరశాస్త్రి’ వీరి నటనాపాండిత్యానికి అబ్బురమొంది ‘నా నాటకం పేరు సతీ అనసూయకాదు. ఇకపై ‘సుమతి అనసూయ’ అని కొనియాడారు. అలా ‘అనసూయ-సుమతి, సత్యభామ – రుక్మిణి, చంద్రమతి – విశ్వామిత్రుడు, రోషనార – రామోజీ, రజాక్’ పాత్రలను ‘స్థానం, లక్కరాజు’ల కాంబినేషన్లో వీక్షించేందుకు ఆనాటి ప్రేక్షకావళి ఓ పండుగ కోసం ఎదురుచూసినట్లు ఎదురుచూసేవారట.
తమ సమాజముకూడా ఆంధ్రదేశంలో ప్రఖ్యాతి పొందాలంటే ‘లక్కరాజు’ లాంటి నటశేఖరులు అవసరమని యెంచి గుంటూరు న్యాయశాఖోద్యోగులకు చెందిన ‘Judicial Department Official Dramatic Club’ వారు తమ సమాజములోకి వీరిని ఆహ్వానించుటేకాక ‘డిస్ట్రిక్టు కోర్టు’లో గుమాస్తా ఉద్యోగంకూడా వేయించారు. ఆపై లక్క రాజు వారు పదర్శించిన ‘రాణీ సంయుక్త’లో ‘సంయుక్త’గా – ‘బొబ్బిలి యుద్ధము’లో ‘వెంగళ రాయుడు’గా -‘విజయనగర సామ్రాజ్యపతనం’లో ‘ఆషాబీ’గా నటించి నమ్మినవారికి కాసులవర్యం కురిపించుటలో కీలక భూమికను నిర్వహించిన సమర్థులు వీరు. ఆ నాటకాలలో వీరి సరసన ‘చోరగుడి దాశరథి (రంగారాయుడు, పృధ్వీరాజ్), సవరం వీరాస్వామినాయుడు (పాపారాయుడు)’ వంటి రంగస్థల దిగ్గజాలు – ‘విజయనగర సామ్రాజ్య పతనం’లో మహానటులు ‘బళ్ళారి రాఘవ (పఠాన్)’ కూడా నటించేవారు.
ఇలా రంగస్థల జీవితం వీరికి ఎనలేని యశస్సును- ఉపాధిని ఆర్జించి పెట్టినా రక్తసంబంధీకులనుంచి మాత్రం తీవ్ర నిరసన చవిచూడల్సి వచ్చింది. దానితో వీరు నటనావ్యాసంగముతోపాటు ఉద్యోగానికి వీడ్కోలు పలికి చదివేందుకు ‘మదరాసు వెళ్ళిపోయారు. ‘ఊరు మారినా ఉనికి మారునా’ అన్న లోకోక్తిని నిజం చేస్తూ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన స్థానిక ‘ఆంధ్ర నాటకసభ’ ఆదుకునే నిమిత్తం ‘లక్కరాజు’ మరల మోమునకు రంగద్దక తప్పింది కాదు. ఈ సమాజం తరుపున వీరు ‘రోషనార’గ – గుండి ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ S.M. కామాక్షిసుందరశాస్త్రి ‘శివాజీ’గ నటించిన ‘రోషనార’ నాటకం కాసులవర్షం కురిపించి ‘ఆంధ్ర నాటక సభ’ వారికి తరగని ఆర్థికపుష్ఠి సమకూర్చింది. ‘రోషనార’గ వీరు చూపిన అభినయ కౌశలానికి ముగ్ధులై న్యాయ మూర్తులు ‘కె.సుందరంశెట్టి, ముత్తా వేంకటసుబ్బారావు’లు వీరిని బంగారుపతకంతో సత్కరించారు.
వీరు నటించిన ఏకైక హిందీ నాటకం ‘ఆంధ్ర నాటక సభ’ తరుపున ప్రదర్శించిన ‘పీష్వా నారాయణరావు వధ’. ఈ నాటకాన్ని ‘1929’లో సాక్షాత్తూ ‘మహాత్మాగాంధీ’ తిలకించి ‘పీష్వా నారాయణరావు’ పాత్రలో ‘లక్కరాజు’ చూపిన నటప్రతిభను బహుధా శ్లాఘించారు. ‘షుమేర్ సింగ్’ పాత్రలో ‘S.M. కామాక్షి సుందరశాస్త్రి’ ప్రతిభకూడా విశేష ప్రశంసలకు నోచుకుంది. మదరాసులో విద్యాభ్యాసం పూర్తికాగానే గుంటూరు జిల్లా ‘చుండూరు’లో మెడికల్ ఆఫీసర్‌గా చేరారు. అచ్చట ‘సీతారామంజనేయ నాటకసమాజాన్ని ప్రారంభించి ‘చంద్రగుప్త’ అనే నాటకాన్ని ‘బాపట్ల, తెనాలి, పొన్నూరు’ పరిసర ప్రాంతాలలో పలు ప్రదర్శనలిచ్చారు. దీనిలో వీరు చంద్రగుప్తునిగా, యన్. చంద్రమౌళి సత్యనారాయణ చాణక్యునిగా, సినీనటి కళ్యాణి మురగా నటించేవారు. ఆపై కొంతకాలానికి మరలా ప్రారంభమైన కుటుంబీకుల వొత్తిడికి పరిస్థితుల ప్రాబల్యం తోడవటంతో జతకూడటంతో ‘నాట్యకళ కి శాశ్వతంగా వీడ్కోలు పల్కి వైద్యవృత్తికే అంకితమైపోయినారు. ఇలా నటజీవితం కొనసాగింది కొద్దికాలమేఐనా ‘స్త్రీ’ పాత్ర నిర్వహణలో అసమాన ప్రతిభగల ‘స్థానం’ వారి సరసన ‘స్త్రీ’ పాత్రలను(పురుష పాత్రలుకూడా)- డా. గోవిందరాజుల సుబ్బారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, బళ్ళారి(టి) రాఘవాచార్య’వంటి నటసింహాల సరసన పురుషపాత్రలను (స్త్రీ పాత్రలనూ) అసమానరీతిలో పోషించి వారికి ధీటుగ పేరుప్రఖ్యాతులు పొందినారీ అనర్హ నటరత్నము.
వీరి నటజీవితానికి మకుటాయమానంగా నిలిచే అంశమేమిటంటే ‘లక్కరాజు వారి వైవిధ్య నటనా వైదుష్యాన్ని గాంచి ‘రాజమండ్రి – చింతామణి థియేటర్’కు చెందిన కథానాయక పాత్రలలో ప్రసిద్ధి గాంచిన బ్రహ్మజ్యోసుల సుబ్బారావు – స్త్రీ పాత్రలలో ఎనలేని ప్రఖ్యాతి గల్గిన ముప్పిడి జగ్గరాజు – పురప్రముఖులౌ శ్రీపాద కామేశ్వరరావు, సత్యనారాయణశాస్త్రుల సంతకాలతో కూడిన ప్రశంసాపత్రాన్ని, ‘ఆల్ రౌండ్ యాక్టర్’ అని లిఖింపబడిన బంగారు పతకంను పొందుట ఆ పత్రమందు ‘స్త్రీ, పురుష పాత్రల బేధమే లేక ఎట్టి పాత్రనైనా పోషించగల మీకు మా ఆనందాన్ని తెలుపుచున్నాం’ అని వారు ప్రశంసించారు.
లక్కరాజువారి నటనా వైదుష్యాన్ని తిలకించే భాగ్యము తదుపరి తరాలు నోచుకోకపోయినా సినీ దర్శకులు పి.పుల్లయ్య వలన Suraj mal Co వారి Broad Cast Company గ్రామ్ ఫోన్ రికార్డులద్వారా వీరి స్వరం వినే భాగ్యం కలిగింది. ఈ కంపెనీవారికి ‘విశ్వనాథ సత్యనారాయణ’ గారి ‘ఆంధ్ర పౌరుషము’ నుంచి కొన్ని పద్యాలు, ‘కృష్ణకర్ణామృతము’ నుంచి కొన్ని శ్లోకాలు వీరు ఆలపించారు. చివరగా ప్రముఖనటులు మందపాటి రామలింగేశ్వరరావు ‘నాట్యకళ’ పత్రికలో వీరి నటజీవితవిశేషాలను పరిచేయం చేస్తూ నటనావ్యాసంగం నుంచి వీరి నిష్కమణ గురించి చేసిన వ్యాఖ్యానముతో వీరి జీవనచిత్రణను ముగిద్దాం. ‘రంగస్థలానికి వెలుగునిచ్చిన ‘లక్కరాజు’ ఆ రంగమునుండి వైదొలుగుట; ఆ భగవంతుడు తాను ప్రసాదించిన ప్రతిభను తానే వొమ్ము చేసుకున్నట్లయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా ఇది చాలా సముచిత వ్యాఖ్యానం.
-మన్నె శ్రీనివాసరావు