సురవనంలో స్వరలత…

పాటలకు మణిమకుటంగా ఎదిగి,
అమృత గీతాలకు పునాదిగా ఒదిగి,
దిగ్ధంత సృష్టల పాటలకు ప్రాణం పెట్టి,
సంగీత తరాల అంతరాలకు వారధి కట్టి,
సినీ జీవన ప్రస్థానంలో ‘భారతరత్న’మై ఖ్యాతి తెచ్చిపెట్టి
సంగీత ప్రియుల్ని ఆనందాంబుధిలో ఓలలాడించిన
లతా మంగేష్కర్ గారి మరణం (ఫిబ్రవరి 6, 2022) ప్రపంచ సంగీతానికి తీరని లోటు.

లతా మంగేష్కర్ ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి పాట మహల్ సినిమాలోని ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా.. నేటికీ సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఈమె సోదరి ఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది.

లత 1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా (అయిదు గురిలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా, మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లత తనకు నచ్చిన గాయకుడుగా కె. ఎల్. సైగల్ను పేర్కొంది.

దీనానాథ్ ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ (1948 మొదలైన చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు.

లత గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో మొదలుపెట్టింది. దేశ విభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ప్రోత్సాహమిచ్చారు. సి.రామచంద్ర లత పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చారు. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీలోని పాటలు అద్భుత విజయాలు చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి.

హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, అనంతరం ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. అయితే ఓ.పి.నయ్యర్ మాత్రం లతపాట నాసంగీతానికి పనికిరాదని ఆషాను దాదాపు లతకు దగ్గరగా తీసుకెళ్ళాడు.

లత సినీనిర్మాతగా మరాఠీలో వాదల్ (1953), కాంచన్ గంగా (1954), హిందీలో ఝూంఝుర్ (1954), లేకిన్ (1990) చిత్రాలు నిర్మించింది. ఆమె సంగీత దర్శకురాలిగా రాంరాంపహునా (1950), మొహిత్యాంచి మంజుల (1963), మరాఠా టిటుకమేల్ వాలా (1964), స్వాథూ మాన్ సే (1965) మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేసింది.

గాయకురాలిగా: కెరీర్ మొదట్లో (1940వ దశకం) 1942లో ఆమె తండ్రి గుండెజబ్బుతో చనిపోగా, నవయుగ్ చిత్రపత్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నారు. గాయనిగా, నటిగా లత కెరీర్ మొదలు పెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు.

నాచు య గడే, ఖేలు సారీ మనీ హౌస్ భారీ అనే పాటను మరాఠీ సినిమా కిటీ హాసల్ (1942) కోసం పాడారు లత. ఈ పాట ఆమె మొదటి పాట. సదాశివరావ్ నవరేకర్ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. నవయుగ చిత్రపత్ బ్యానర్ లో తీసిన మరాఠీ సినిమా పహలీ మంగళా-గౌర్ (1942) సినిమాలో ఒక పాత్ర పోషించారు. దాదా చందేకర్ స్వరపరచిన నటాలీ చైత్రాచీ నవలాయీ పాట కూడా పాడారు ఈ సినిమాలో. మరఠీ సినిమా గజబాహు (1943) లో మత ఏక్ సపూత్ కీ దునియా బాదల్ దే తూ ఆమె పాడిన మొదటి హిందీ పాట.

1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారిపోయినపుడు, లతా కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు. హిందుస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ దగ్గర నేర్చుకున్నారు. వసంత్ జొగలేకర్ తీసిన హిందీ సినిమా ఆప్ కీ సేవా మే (1946) లో దత దవ్జేకర్ స్వరపరచిన పా లగూన్ కర్ జోరీ అనే పాట పాడారామె. ఈ సినిమాలో కొరియోగ్రాఫర్గా పనిచేసిన రోహిణి భతె ఆ తరువాత ప్రముఖ సంప్రదాయ నృత్యకళాకారిణిగా ప్రసిద్ధి చెందారు. వినాయక్ నిర్మించిన మొదటి హిందీ చిత్రం బడీ మా (1945) సినిమాలో లతా, అమె చెల్లెలు ఆశా కూడా చిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమాలో లత ఒక భజన పాట పాడుతూ కనిపిస్తారు. మాతే తేరే చరణో మే అనే భజన అది. వినాయక్ రెండవ హిందీ చిత్రం సుభద్ర (1946) సినిమాతో సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ కు పరిచయమయ్యారు లత.

1947లో పాకిస్థాన్ భారతదేశం నుంచి విడిపోయిన తరువాత ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ పాకిస్థాన్ కు వెళ్ళిపోవడంతో అమంత్ ఖాన్ దేవస్వలే వద్ద సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు లత. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ వద్ద కూడా నేర్చుకున్నారు.

1948లో వినాయక్ చనిపోయిన తరువాత గాయనిగా లతకు గులాం హైదర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. నిర్మాత శశధర్ ముఖర్జీకి లతను పరిచయం చేశారు హైదర్. లత గొంతు పీలగా ఉందంటూ ముఖర్జీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన హైదర్ చాలా బాధపడ్డారట. రాబోయే రోజుల్లో లతా గొంతు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తుంది, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాళ్ళావేళ్ళా పడతారని ముఖర్జీతో అన్నారట. దిల్ మేరా తోడా, ముఝే కహీ కా నా చోరా పాటతో లతకు మొదటి హిట్ ఇచ్చారు హైదర్. సెప్టెంబరు 2013లో తన 84వ పుట్టినరోజున, ఒక ఇంటర్వ్యూలో తనలో ఉన్న ప్రతిభను ముందు గుర్తించి, తన ప్రతిభపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి హైదర్ అని తలచుకున్నారు లత.

మొదట్లో లతా ప్రముఖ గాయని నూర్ జహాన్ ను అనుకరించేవారట. కానీ తర్వాత తర్వాత విపరీతమైన సాధనతో తన స్వంత శైలితో శ్రోతల మదిలో తన ముద్ర వేశారామె. అప్పట్లో హిందీ సినిమాలలో ఉర్దూ కవుల ప్రభావం వల్ల ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండేవి. కథానాయకుడు దిలీప్ కుమార్ లత మహారాష్ట్రా యాస వల్ల ఆమె హిందీ భాష సరిగా లేదని ఆరోపించారు. దాంతో ఉర్దూ శిక్షకుడు షఫీతో ఉర్దూ నేర్చుకున్నారామె.

మహల్ (1949) సినిమాలోని ఆయేగా ఆనేవాలా పాటతో మొదటి హిట్ అందుకున్నారు లతా ఈ సినిమాలోని పాటలను సంగీత దర్శకుడు ఖేమ్ చంద్ ప్రకాశ్. ఈ పాటలో నటి మధుబాల నటించారు.

సంగీత సారధిగా: 1955లో రామ్ రామ్ పవ్హనే అనే మరాఠా సినిమాకు మొదటిసారిగా సంగీత సారధ్యం వహించారు లతా. తరువాత 60లలో ఆనంద ఘన్ అనే మారు పేరుతో కొన్ని సినిమాలకు స్వరాలు అందించారు.

పురస్కారాలు:
భారత రత్న (2001)
దాదా సాహెబ్ ఫాల్కే (1989)
మహారాష్ట్ర భూషన్ అవార్డు (1997)
ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999)
శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్
రాజాలక్ష్మీ అవార్డు (1990)
ఎ.ఎన్.ఆర్. జాతీయ అవార్డు (2009)
అప్సరా అవార్డు
కాళిదాస్ సమ్మాన్ అవార్డు
తాన్ సేన్ అవార్డు
నేపాల్ అకాడమీ అవార్డు
సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు.


చిత్రకారిణిగా: లత గాయనిగా బిజీ కాకముందు నుండి సంగీత సాధనతో పాటు, బొమ్మలు కూడా గీస్తుండేవారు. అలా గాయనిగా బిజీ అయిన తర్వాత కూడా చిత్రాలు గీస్తుండేవారు.

Latha painted drawings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap