మేరట్ కు చెందిన మమతా గోయెల్ ప్రదర్శించే సృజనాత్మకతకు ఆకులే కాన్వాసుగా మారుతున్నాయి. అందమైన కళాకృతులన్నీ ఆకుల్లోనే ఒదిగిపోతూ… అందరితో ఔరా అనిపించుకుంటున్నాయి. వినూత్నమైన ఈ చిత్రకళను సొంతంగానే నేర్చుకుందీమె. మందార వంటి దళసరి ఆకులను ఎంపిక చేసుకుని వాటిపై వినాయకుడు, విష్ణు మూర్తి, రాముడు, లక్ష్మి దేవి లాంటి దైవ స్వరూపాలు, ఆలయాలు, జంతువులు, విమానాలు, మహిళాసాధికారతను ప్రతిబింబించే పలు కళాకృతులను ఈమె రూపొందిస్తోంది.
అత్యంత సున్నితమైన ఆకుపై ఇలా బొమ్మలను చెక్కడం కష్టతరమైనా, స్వీయ శిక్షణతో సాధించానంటారీమె. సున్నితమైన ఆకు పై మనసులో అనుకున్న బొమ్మ రూపాన్ని మార్కర్తో గీసుకొని, పదునయిన కట్టర్ తో అనవసర మైన భాగాన్ని తొలగించి చిత్రాన్ని రూపొందిస్తారు, తరువాత ఆ కళాకృతిని నిల్వ ఉండేలా జాగ్రత్త చేసి, పలు చిత్రకళా ప్రదర్శనలలోనూ ప్రదర్శిస్తున్నారీమె. కాదేదీ కళకు అనర్హం అంటున్న ఈమె, తనకు తెలిసిన ఈ చిత్రకళను ఆసక్తి ఉన్నవారికి నేర్పిస్తున్నారు కూడా. వివిధ రకాల కాయకూరలను ఉపయోగించి రకరకాల కళాకృతులను రూపొందించడంలో మమతా నేర్పరి.