ప్రపంచ కళా దినోత్సవం ప్రతి ఏట (2012 నుండి) ఏప్రిల్ 15న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. సృజనాత్మకతపై ప్రపంచంవ్యాప్తంగా అవగాహన కలిపించడంకోసం ప్రపంచ కళల అసోసియేషన్ ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది. ఇటలీకు చెందిన చిత్రకారుడు లియొనార్డో డావిన్సి గౌరవార్థం ఆయన పుట్టినరోజైన ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం గా ప్రకటించారు.
దాదాపు 523 సంవత్సరాల క్రితం లియోనార్డో దావిన్సీ చిత్రించిన ‘మోనాలిసా’ రూపచిత్రం ప్రపంచం ప్రసిద్ధి చెంది నేటికి వన్నె తరగని అపురూప విశ్వ కళాఖండంగా నిలిచింది. ఎందుకంటే మరే కళాఖండానికి ఇంతటి ప్రఖ్యాతి లభించలేదు. ఆ మోనాలిసా’ చిత్రంలోని యువతి పదనంలో వెల్లివెరిసే చిరుదరహాస రహస్యం ఏమై ఉంటుందోనని ఎందరో కళా విమర్శకులు చర్చలు జరిపారు. ‘మోనాలిసా’ చిత్రాన్ని దావిన్సీ 77×53 సెంటీమీటర్ల సైజులో ఆయిల్ పెయింటింగ్ తో మూడేళ్ళ పాటు చిత్రించి 1503లో పూర్తి చేసారు.
ఈ విశ్వకళాఖండాన్ని సొంతం చేసుకోవాలనే దురాశతో 1913లో చోరీ చేసారు. అదృష్టవశాత్తు కొద్ది రోజులకు ఈ తైల వర్ణ చిత్రం లవ్ రే మ్యూజియం (పారిస్)కు అప్పగించబడింది.
దావిన్సీ తన నలభయ్యి ఐదఏట 1497లో చిత్రించిన ‘లాస్ట్ సప్పర్’ అనే చిత్రం కూడా ఆయనకు అఖండ ఖ్యాతి నార్జించి పెట్టింది. క్రీస్తు తన పన్నెండు మంది సహచర శిష్యులతో కూర్చుని ఉండే ఈ అంశాన్ని చిత్రిలాంశంగా తీసుకొని ప్రముఖ చిత్రకారులనేకులు కూడా పెయింటింగ్స్ వేసారు. అయినా దావిన్సీ చిత్రానికి వచ్చిన ఖ్యాతి మరే చిత్రానికి రాలేదు. ఇందుకు కారణం ఆయా వ్యక్తుల పదనాలలోని భావాలు అత్యంత సహజంగా ప్రతిఫలించేలా చిత్రించటమే.
15 ఏప్రిల్, 1452 ఇటలీ లో జన్మించిన దావిన్సీ చిన్ననాటి నుండి చిత్ర, శిల్పకళలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. 1472లో పెయింటర్స్ గిల్డ్ లో సభ్యత్వం పొందిన దావిన్సీ 18 ఏళ్ళపాటు డ్యూక్ ఆప్ మిలన్ వద్ద చిత్రకారుడిగా పనిచేసారు.
చూడగలవారికి తమ ముందున్న ప్రపంచంకన్నా అత్యంతాసక్తికరమైనదేదీ లేదు. అనేది దావిన్సీ థియరీ! అందరుకే కావచ్చు కేవలం చిత్రశిల్ప కళలకే పరిమితం అయిపోకుండా యుద్ధపు టాంకులు, మీనాలు, టౌన్‌ప్లానింగ్, వాస్తుశాస్త్రం సంగీతం వంటి అనేకాంశాలను లోతుగా ఆధ్యయనం చేసారు. ఆయా రంగాల్లో నూతన ఆవిష్కరణలకు నాందిగా ఎన్నెన్నో డిజైన్లు రూపొందించారు. సమకాలీనులైన మైకేలేంజిలో కన్నా ఇరవై మూడేళ్ళు రాఫీల్ కన్నా మప్పేయ్యేళ్లూ పెద్దవాడైనప్పటికీ వారితో పోటీపడి నిలబడగలిగిన నిర్విరామ కృషీవలుడు దావిన్సీ..
2 మే, 1519లో తన అరవయ్యేడవయేట మరణించేదాకా దావిన్సీ వేసిన చిత్రాలు, డ్రాయింగులు, డిజైన్లు, స్కెచ్లు ఈనాడు యూరప్ లోని అనేక ప్రసిద్ద మ్యూజియంలలో దర్శనమిస్తాయి.
– కళాసాగర్
Nice article on the eve of world art day