ఏ.పీ. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, సమావేశాలకు, మన రాష్ట్రం తరపున ఇతర రాష్ట్రాలకు, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లినప్పుడు మర్యాదపూర్వకంగా ఇచ్చే జ్ఞాపికలను ఇక ముందు లేపాక్షి నుంచే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రంలోని హస్తకళాకారులు రూపొందించిన కళాకృతులు మాత్రమే అతిథులకు ఇచ్చి సత్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.
ఇలా చేయడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సంపదకు ప్రచారం అందించడంతోపాటు హస్తకలలను ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమావేశాలకు హాజరయ్యే అతిథులకు లేపాక్షి కళాకృతులు మాత్రమే జ్ఞాపికలుగా ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసానికి లేపాక్షి ప్రతినిధులు కొన్ని కళాకృతులను తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో తయారు చేసిన కళాకృతుల గురించి పవన్ కల్యాణ్ కు వివరించారు. శ్రీకాళహస్తి పెన్ను, కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో చేసిన దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులు, సవర గిరిజనులు వేసిన చిత్రాలు, రత్నం పెన్నులు, దుర్గి రాతి శిల్పాలు, అరకు కాఫీ, మంగళగిరి శాలువాలు వీటిలో ఉన్నాయి.
లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. లేపాక్షి కళాకృతులను పరిశీలించిన పవన్ కల్యాణ్ వాటిని తయారు చేసిన కళాకారులు, వారి వివరాలు తెలుసుకుని ఆ కళాకారుల ప్రతిభను మెచ్చుకున్నారు. లేపాక్షిలో ఉన్న కళాకృతులను ప్యాక్ చేసి అందులో ప్రభుత్వ ముద్ర, ఆ కళాకృతుల వివరాలతో కూడిన కార్డు పెట్టి అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని డీసీఎం పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ కుమార్తె ఆధ్య కలంకారి వస్త్రంతో తయారు చేసిన బ్యాగు, కొయ్య బొమ్మలు చూసి ముచ్చట పడ్డారు. కుమార్తె ఆధ్య ఇష్టపడిన వస్తువులు కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్ వాటి బిల్లులను వెంటనే చెల్లించి ఆ బ్యాగు, బొమ్మలు తన కుమార్తె ఆధ్యకు అందించారు. లేపాక్షి కళాకృతులను ప్రోత్సహించి ఆ కళాకృతులు తయారుచేసిన కళాకారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇదే సందర్భంలో చెప్పారు. లేపాక్షి కళాకృతులు ఇతర రాష్ట్రాల వారితోపాటు దేశ విదేశాల్లోని చాలామంది కళాకారులు, ప్రజలు ఇష్టపడుతున్న విషయం తెలిసిందే.
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ మంచి నిర్ణయమే తీసుకున్నారు కాని… ఆచరణలో ఎంతవరకు పెడతారో చూడాలి.?