విజయవాడలో 54వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో వాడ్రేవు చినవీరభద్రుడు.
గ్రంథాలయాలను నిర్లక్ష్యం చేస్తే జాతి మనుగడే కష్టమౌతుందన్నారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయవాడ బందరు రోడ్డులో గల ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు సభకు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ తెలుగు అకాడమీ సభ్యులు డా. కప్పగంతు రామకృష్ణ అధ్యక్షత వహించిన ఈ సభలో చినవీరభద్రుడు మాట్లాడుతూ- తనకు ఆహారం కంటే పుస్తకమే ముఖ్యమన్నారు. పుస్తకం చదివీ చదివీ అలసట వస్తే మళ్ళీ ఆ పుస్తక పఠనంతోనే ఆ అలసటను తీర్చుకుంటానన్నారు. పుస్తకమే తనకు జీవితమన్నారు. జీవితమంటే మంచి పుస్తకమేనన్నారు.
చినవీరభద్రుడు మాట్లాడుతూ…
“గతం వారం రోజులుగా గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ఆజాది కా అమృత్ మహోత్సవాన్ని (75 యేళ్ళ స్వాతంత్ర్య సందర్భాన్ని) అనుసంధానం చేసుకుంటూ, స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రల్ని తెలియజేసే క్విజ్ కార్యక్రమాలు, వ్యాసరచన, నృత్యం, చిత్రలేఖనం, కవి సమ్మేళనం లాంటి వినూత్న కార్యక్రమాల్ని జరిపించి, వారోత్సవాల్ని విజయవంతం చేసిన డా. ప్రసన్నకుమార్, ఆయన సిబ్బందిని అభినందిస్తున్నాను. మా వూళ్లో ఒక మాస్టారుండేవారు. నేను ఆయన దగ్గర వుంటూ ఆయన విసిరేసిన అక్షరాల్ని ఏరుకుని జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. అప్పట్లో ఇన్ని పుస్తకాలు నాకు అందుబాటులో వుండేవి కావు. పుస్తకం ఈ ప్రపంచలో మనకు లభించిన విశిష్ట వరం. రకరకాల యానిమల్స్ వున్నప్పటికీ ఈ సమస్త సృష్టిలో బుక్ రీడింగ్ యానిమల్ మనిషి మాత్రమే. కొంతమంది వుంటారు…వాళ్ళని కదిలిస్తే పుస్తకం కంటే వేగంగా జ్ఞానాన్ని మన బుర్రలో పడేస్తారు. వారు నడిచే గ్రంథాలయాలన్నమాట.
ప్రపంచంలోవున్న అన్ని విశ్వవిద్యాలయాలు, అన్ని గ్రంథాలయాలు ఇంటర్నెట్లో అనుసంధానమై వుంటాయి. మీకో పుస్తకం కావాలనుకోండి. ఆ పుస్తకం ఎక్కడో అమెరికాలో ఓ లైబ్రరీలో వుందనుకోండి. మీరు ఓ సంస్థ ద్వారానో, పాఠశాల ద్వారానో ఆ లైబ్రరీని పట్టుకుని అందులో సభ్యులు కాగలిగితే ఆ పుస్తకాన్ని సాధించి చదువుకోవచ్చు. ఇంత విజ్ఞాన విశ్వం..ఎంత పుస్తక విప్లవం..ఇవన్నీ అప్పట్లో నాకు తెలియదు. నేను చాలా నష్టపోయాను. మీరు చాలా అదృష్టవంతులు..మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు, టీచర్లకు నా అభినందనలు.
యూనివర్శల్ డిజిటల్ లైబ్రరీ, డైరెక్టరీ ఆఫ్ ఓపెన్ యాక్సెస్ …నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఇలా ఎన్నో సైట్స్ వున్నాయి. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా సైట్లో మన దగ్గరున్న పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఆ సైట్లో పెట్టారు. అందులో ఇప్పుడు ఆరుకోట్ల పుస్తకాలున్నాయి. మీరు ఒక పుస్తక విప్లవం నడుస్తున్న కాలంలో వున్నారు. రోజుకి రెండు కోట్ల పుస్తకాలతో, రెండు కోట్ల మంది సందర్శకులతో ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయ మూవ్మెంట్ వర్ధిల్లుతోంది. ఈ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలకు తలవంచి నమస్కరిద్దాం. కాలాన్ని వృధా చేయకుండా పుస్తకాల్ని ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగండి..మీ తల్లిదండ్రులకు మీ ఎదుగుదలను ఒక గొప్ప కానుకగా ఇవ్వండి” అంటూ నిండుకుండలాంటి గ్రంథాలయ సెమినార్ హాలులో వున్న చిన్నారులనుద్దేశించి మాట్లాడారు వాడ్రేవు చినవీరభద్రుడు.
పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ- గ్రంథాలయాలంటే కేవలం పౌర గ్రంథాలయాలే కాదు, పాఠశాలల్లో కూడా గ్రంథాలయాలున్నాయి, వాటికి కూడా వారోత్సవాలు జరపాలంటూ ఆదేశమించిన వాడ్రేవు చినవీరభద్రుడు గార్కి ధన్యవాదాలు తెలిపారు.
కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి తహేరా సుల్తానా మాట్లాడుతూ- నేను చినవీరభద్రుడు లాంటి పెద్ద అధికారితో కలిసి ఈ వేదిక పైన కూర్చున్నానంటే అందుకు కారణం పుస్తకమే నన్నారు. ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ బి.ప్రతాపరెడ్డి, కృష్ణాజిల్లా డిప్యూటీ విద్యాశాఖాధికారి కె.రవికుమార్ లైబ్రరీ, పుస్తకాల ఆవశ్యకత గురించి మాట్లాడారు.
చివరలో వారం రోజులుగా విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో విజేతలైన వారికి జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అతిధుల చేతుల మీదుగా అందజేశారు. వారం రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించిన సాహిత్య, కళా, సేవా సంస్థల వారికి జ్ఞాపికలను అందజేశారు. తొలుత కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కంచల నాగరాజు అతిథుల్ని వేదికమీదకు ఆహ్వానించి సభకు స్వాగతం పలికారు. చివరలో ఈ వారం రోజుల వారోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది ఎ.రామచంద్రుడు, కళ్ళేపల్లి మధుసూదనరాజు తదితరులు పాల్గొన్నారు.