చలనచిత్ర వరప్రసాదం… ఎల్.వి. ప్రసాద్

దశాబ్దాల భారతీయ సినిమా చరిత్రకు అందమైన గుర్తుగా నిలిచిన మహనీయుడు ఎల్.వి. ప్రసాద్. ప్రసాద్ పూర్తి పేరు అక్కినేని లక్ష్మి వర ప్రసాద్. సినిమారంగంలో ఆర్జించిన సంపదను సినీరంగ అభివృద్ధికే వెచ్చించి, సినిమా పరిశ్రమను విస్తరింపజేసిన అతి కొద్దిమంది ప్రముఖుల్లో ఎల్.వి. ప్రసాద్ పేరు ముఖ్యంగా చెప్పుకోవాలి. అందుకే ఆయన సినిమా వరప్రసాదిగా కీర్తి గడించారు. ‘కృషి వుంటే మనిషి ఋషి ఔతాడు..మహాపురుషుడౌతాడు’ అనే నానుడికి ప్రత్యక్ష సాక్షి ఎల్.వి. ప్రసాద్. ఆయన ఎదుగుదల వెనుక ఒక ధ్యేయముంది. సినిమారంగానికి వెళ్ళిన తొలిరోజుల్లో చిన్నచిన్న వేషాలు వేశారు. వెట్టి చాకిరీ చేశారు. పస్తులున్నారు. కానీ ధైర్యాన్ని, ఓర్పును మాత్రం వీడలేదు. చివరికి సినిమాహాలు గేటు కీపర్ వుద్యోగం చెయ్యడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ముప్పై రూపాయల జీతానికి ఇంపీరియల్ కంపెనీలో చేరారు. స్టూడియోలో ట్రాలీ ఆపరేటరుగా, నిర్మాణశాఖలో సహాయకుడిగా, చిన్నపాత్రలు పోషించే నటుడిగా, హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, ధార్మికునిగా అంచెలంచెలుగా ఎదిగిన నిత్య సినీ కృషీవలుడు ఎల్వీప్రసాద్. 1931లో విడుదలైన తొలి హిందీ టాకీ చిత్రం ‘ఆలం ఆరా’ లో నాలుగైదు చిన్న వేషాలు వేశారు. అదే సంవత్సరం విడుదలైన తొలి తమిళ టాకీ ‘కాళిదాస’ లో పురోహితుడు వేషాన్ని, 1932లో విడుదలైన తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ లో చండామార్కులు పాత్రను పోషించి, మూడు తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఘనత సాధించిన ఒకే ఒక వ్యక్తిగా చరిత్ర పుటలకెక్కారు ప్రసాద్. ఎన్.టి. రామారావుని ‘మనదేశం’ సినిమాలో తొలిసారి నటింపజేసిన ప్రసాద్ ని చూస్తే రామారావుకు లేచి నిలబడేటంత భక్తి. అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ అందుకు మినహాయింపు కాదు. మూకీ సినిమాలనుంచి సినిమా స్కోపు సినిమాలదాకా ఆయన ప్రస్థానం సాగింది. అటువంటి ఎల్.వి. ప్రసాద్ జయంతి సందర్భంగా వారిని గురించిన కొన్ని విశేషాలు…

కష్టాల బాల్యం… బొంబాయి పయనం…
ఎల్.వి. ప్రసాద్ 17 జనవరి 1908న ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు గ్రామంలో జన్మించారు. ప్రసాద్ తండ్రి అక్కినేని శ్రీరాములు మధ్యతరగతి రైతు. తల్లి బసవమ్మ గృహిణి. బాల్యంలో ప్రసాద్ మంచి తెలివి తేటలు గల విద్యార్థిగా వున్నా, అతనికి చదువుమీద పెద్దగా శ్రద్ధ ఉండేదికాదు. ఎక్కువగా నాటకాల మీద ఆసక్తి చూపేవారు. నాటకాల్లో చిన్నచిన్న వేషాలు వేస్తూ వుండేవారు. ముఖ్యంగా బాగా చదువుకొని పెద్ద ఆఫీసరు అవుతాడని తండ్రి ఆశిస్తే, ప్రసాద్ డ్రామాలు వేస్తూ, మూకీ సినిమాలు చూస్తూ కాలం గడిపేవారు. తండ్రి బలవంతంగా ప్రసాద్ కు చదువు చెప్పించలేదు. మనసుకి నచ్చిన పనిచేసుకోమని సలహా ఇవ్వడంతో ప్రసాద్ అరక దున్నారు. సేద్యం మీద దృష్టి సారించారు. అప్పులుచేసి ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టారు. వ్యవసాయం కలిసిరాలేదు. వ్యధను మిగిల్చింది. కుటుంబం అప్పులపాలయింది. అప్పుల బాధను తట్టుకోలేక తండ్రి ఏలూరు కోర్టులో ఐ.పి పెట్టేశాడు. ఊరువూరంతా ప్రసాద్ కుటుంబాన్ని చిన్నచూపు చూడసాగింది. ఆయనకు ఎక్కువగా ఏలూరు వెళ్ళాల్సిన అవసరం పడేది. పెదవేగికి ఏలూరుకి మధ్యలో వారి మేనమామ ఇల్లుంది. మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను ప్రసాద్ ప్రేమించారు. 1924లో ఆమెను ప్రేమవివాహం చేసుకోవడం ప్రసాద్ చేసిన గొప్ప సాహసం అనిచెప్పాలి. కష్టాల్లోనే కూతురు పుట్టింది. దిక్కు తోచలేదు. 1930 జనవరి 1న 22 ఏళ్ళ ప్రాయంలో ఎవరికీ చెప్పకుండా డబ్బు సంపాదించాలనే మిషతో రైలెక్కి వంద రూపాయలతో బొంబాయి చేరిపోయారు. అదికూడా ప్రసాద్ చేసిన సాహసమనే చెప్పుకోవాలి. ముందు ఒక లాడ్జిలో చిన్న గది తీసుకున్నారు. తీసుకెళ్ళిన డబ్బులు అయిపోగా కోహినూరు స్టూడియో ప్రక్కనే వుండే ఒక దర్జీ వాని కొట్టులో ఆశ్రయం పొందారు. ఆ స్టూడియోకి వచ్చే సినిమాతారలందరూ ఆ టైలర్ వద్ద దుస్తులు కుట్టించుకునేవారు. ఆ టైలర్ ప్రసాద్ ను వీనస్ పిక్చర్స్ వారివద్ద నెలకు 15 రూపాయల జీతానికి కుదిర్చాడు. తెల్లవారే లేచి చీపురుతో దుకాణాన్ని శుభ్రంచేసి పగటిపూటంతా స్టూడియోలో పనిచేసి, రెండు రూపాయల కూలి కోసం రాత్రిపూట రెండు గంటల దాక ఒక కార్నివాల్ లో “కాయ్ రాజా కాయ్” అంటూ అనౌన్సరుగా పనిచేసి, అర్థరాత్రి ఐదు మైళ్ళు నడిచి దర్జీ కొట్టుకు చేరుకునేవారు. మరలా ఉదయాన్నే స్టూడియో పనికి వెళ్ళిపోయేవారు. ఇండియా పిక్చర్స్ వారు నిర్మిస్తున్న’స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ మూకీ చిత్రానికి బాయ్ గా పనిచేస్తూ పెట్టె బేడా, కెమెరా సామాన్లు మోశారు. తరవాత ఆర్దేషిర్ ఇరాని ఆరంభించిన ఇంపీరియల్ ఫిలిం కంపెనీలో నెలకి ముప్పై రూపాయలతో వుద్యోగం దొరికింది. ఆర్దేషిర్ ఇరాని కనుసన్నల్లో మెలిగారు. దాంతో మనదేశంలో నిర్మించిన తొలిచిత్రం ‘ఆలం ఆరా’లో నాలుగు చిన్నచిన్న పాత్రల్లో నటించారు. ఇంపీరియల్ స్టూడియోలో ఉన్నప్పుడే ఆయనపేరు ‘ఎల్వీ ప్రసాద్’ గా మారింది. అలా పేరు మార్చినవాడు ఆ కంపెనీలో రోజూ హాజరుపట్టీ వేసే గుమాస్తా అంటే ఆశ్చర్యం కలుగక మానదు. అంత పొడవుండే పేరును కుదించి ఎల్వీ ప్రసాద్ అని పేరుపెట్టాడు ఆ గుమాస్తా. చివరిదాకా ఆదేపేరు స్థిరపడిపోయింది. ఆ స్టూడియోలోనే ‘మీసాల పులి’ గా పేరుగాంచిన హెచ్.ఎం. రెడ్డి ఇరానీకి సహాయకుడిగా ఉంటూ పృధ్వీరాజ్ కపూర్ తో రెండు మూకీ సినిమాలు నిర్మించారు. ‘ఆలం ఆరా’ విజయంతో హెచ్.ఎం. రెడ్డి అర్దేషిర్ ఇరాని సహకారంతో తమిళంలో ‘కాళిదాస’ అనే టాకీ నిర్మించే ప్రయత్నంలో వుంటూ, శ్రద్ధగా పనులు చేస్తున్న ప్రసాద్ ని గమనించి అందులో నటించే అవకాశాన్ని కలిపించారు. సమాంతరంగా తెలుగులో నిర్మిస్తున్న ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో కూడా ప్రసాద్ చేత నటింపజేశారు. ఈ రెండు చిత్రాలు విడుదలై విజయవంతమయ్యాక తొలిసారి ఏలూరు వెళితే, తనకు పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలిసి బాధపడ్డారు. భార్యను వెంట తీసుకుని బొంబాయి చేరుకున్నారు. భుక్తికోసం హెచ్.ఎం. రెడ్డి తెలుగులో ‘సతీ సావిత్రి’ చిత్రాన్ని మొదలు పెడుతూ అందులో ప్రసాద్ కు వేషమిచ్చారు. పగలు షూటింగులో పాల్గొంటూ రాత్రి డ్రీమ్ ల్యాండ్ సినిమా హాల్లో గేట్ కీపర్ వుద్యోగం చేశారు. తరవాత విజయా మూవిటోన్ వారికోసం హిందీలో నిర్మించ తలపెట్టిన ‘సీతా స్వయంవర్’ లో హెచ్.ఎం. రెడ్డి ప్రసాద్ కు వేషం ఇప్పించారు. అయితే హెచ్.ఎం. రెడ్డికి విజయా మూవిటోన్ వారితో విభేదాలొచ్చి తప్పుకున్నా ప్రసాద్ మాత్రం ఆ సినిమాలో నటించి మన్ననపొంది అదే సంస్థకు ‘రిప్రజెంటేటివ్’ గా పనిచేశారు. తరవాత ఆ కంపెనీ మూత పడడంతో ‘న్యూ ఎరా పిక్చర్స్’ లో చేరి ‘మత్స్యగంది’ సినిమాకు ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేశారు. ఆ సినిమా పూర్తవగానే ప్రసాద్ సమర్ధత తెలుసుకున్న రేణుకా పిక్చర్స్ వారు ‘స్త్రీ’ సినిమా నిర్మిస్తూ ప్రసాద్ ని మేనేజరుగా నియమిస్తూ, అదనంగా అసిస్టెంట్ కెమెరామన్ గా మరో బాధ్యత అప్పజెప్పారు. ఆ సినిమా పూర్తవగానే మరలా నిరుద్యోగపర్వం మొదలైంది. సినిమా పులి హెచ్.ఎం.రెడ్డి మద్రాసు వెళ్ళిపోయి సినిమా నిర్మిస్తూ ప్రసాద్ కు వేషం ఇచ్చేందుకు కబురంపారు.

మద్రాస్ కు ప్రసాద్…
పదేళ్ళ బొంబాయి జీవితానికి స్వస్తి చెప్పి 1940లో ప్రసాద్ మద్రాసులో అడుగు పెట్టారు. మద్రాసు యునైటెడ్ ఆర్టిస్ట్స్ కార్పోరేషన్ వారు నిర్మించిన ‘బొండాం పెళ్లి’+’బారిస్టర్ పార్వతీశం’+‘చదువుకున్నభార్య’ అనే మూడు సినిమాల సమాహారంలో హెచ్.ఎం.రెడ్డి ప్రసాద్ ని నటింపజేశారు. తరవాత 1941లో హెచ్.ఎం.రెడ్డి రోహిణీ పతాకం మీద నిర్మించిన ‘తెనాలి రామకృష్ణ’ లో ప్రసాద్ కు రెండు పాత్రలు లభించాయి. మొదటిది మంత్రి తిమ్మరుసు పాత్ర, రెండవది కరటక శాస్త్రి పాత్ర. అంతే కాకుండా హెచ్.ఎం. రెడ్డికి సహాయ దర్శకుడిగా, స్క్రీన్ ప్లే తయారీలో తంగిరాల హనుమంతరావు, సదాశివబ్రహ్మం లకు సహాయకుడిగా సమర్థవంతంగా ప్రసాద్ పనిచేశారు. మరుసటి సంవత్సరం ‘సత్యమేజయం(లేక) ఘరానా దొంగ (లేక) ఆనెస్ట్ రోగ్’ అనే చిత్రానికి కూడా సహాయ దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచనకు సహాయకుడిగా పనిచేస్తూ ఆ సినిమాలో ప్రధాన దొంగ పాత్ర పోషించారు. అయితే తెలివిగా మద్రాసులోనే ఉంటూ బొంబాయిలో అవకాశాలు వచ్చినప్పుడు వదలుకోకుండా కష్టపడి పనిచేశారు. వాటిలో ‘దర్పణ్’ సినిమా ఒకటి. అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రతరమై మద్రాసు సినిమారంగం ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు బొంబాయిలో ‘దర్పణ్’ సినిమా ప్రసాద్ కు ప్రత్యామ్నాయం కలిపించింది. ఆ వెంటనే గీతాంజలి ఫిలిమ్స్ వారు నిర్మించిన ‘సవాల్’ హిందీ చిత్రానికి బొంబాయిలో వుంటూ సహాయదర్శకత్వం వహించారు. అది పూర్తవగానే హీరోయిన్ ముంతాజ్ శాంతి భర్త వలీసాహెబ్ ‘లేడీ డాక్టర్’ సినిమా నిర్మిస్తూ ఎల్.వి. ప్రసాద్ ని సహాయ దర్శకుడిగా తీసుకున్నారు. ఆరోజుల్లోనే పృద్విరాజ్ కపూర్ ‘పృథ్వి థియేటర్’ అనే నాటక సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ తొలి ప్రదర్శన ‘శకుంతల’ లోను, తరవాత ‘దీవార్’ నాటకంలోను ప్రసాద్ నటించారు. ‘దేవర్’ అనే సినిమాకు స్క్రిప్టు కూడా రాశారు. బొంబాయిలో వుండగా సారథి స్టూడియోస్ అధిపతి చల్లపల్లి రాజా కె.ఎస్. ప్రకాశరావు చేత ప్రసాద్ ను మద్రాస్ కు రావలసిందిగా కబురంపారు. ‘గృహప్రవేశం’ చిత్రానికి దర్శకుడు గోపీచంద్ కు సహాయకారిగా ఉండేందుకే ఆ పిలుపు. అప్పటికే గూడవల్లి రామబ్రహ్మం సారథి నుంచి తప్పుకొని వున్నారు. గోపీచంద్ రాసిన కథకు మలుపుతిప్పే సన్నివేశాలను సూచించడంతో ప్రసాద్ నే ఆ చిత్రానికి దర్శకత్వం వహించమని నిర్మాత తోబాటు గోపీచంద్ కూడా కోరడంతో ఆ బాధ్యతను ప్రసాద్ తీసుకున్నారు. ఆ చిత్రానికి హీరో కూడా అతనే. అయితే ‘గృహప్రవేశం’ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ప్రసాద్ ఒక షరతు పెట్టారు. ఆ సినిమాలో కథానాయకుడిగా తనే నటించాలనేదే ఆ షరతు. అదే తన తొలి చిత్రం కావడంతో ఒకవేళ దర్శకునిగా విఫలమైనా, నటుడిగా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందనే దూరదృష్టితో ఆ షరతు విధించడం జరిగింది. 1946 అక్టోబరు 4 న విడుదలైన ఆ చిత్రం విజయవంతమైంది. సారథి నుంచి విడిపోయిన గూడవల్లి రామబ్రహ్మం శారదా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించి ‘పల్నాటి యుద్ధం’ కథను సినిమాగా తీయాలనే సంకల్పంలో వుండగా, ‘గృహప్రవేశం’ చిత్ర విజయవార్త ఆయన చెవినపడి, ప్రసాద్ కు కబురంపి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. సినిమా ఆరు రీళ్ళు తయారయ్యాక రామబ్రహ్మానికి పక్షవాతం సోకి మంచానపడ్డారు. ఆ తర్వాత చనిపోవడంతో చిత్రనిర్మాణ బాధ్యత ప్రసాద్ భుజస్కందాలపై పడింది. తన అనుభవంతో ‘చందారావు మోరే’ అనే మరాఠీ చిత్రంలోని కొన్ని యుద్ధ సన్నివేశాలను కొనుగోలుచేసి ‘పల్నాటియుద్ధం’లో వాటిని అనుసంధానిచ్చి సినిమా పూర్తిచేశారు. 24 సెప్టెంబరు 1947న విడుదలైన ‘పల్నాటియుద్ధం’ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. తరవాత కె.ఎస్. ప్రకాశరావు నిర్మించిన ‘ద్రోహి’ (1948) చిత్రానికి ప్రసాద్ దర్శకత్వం వహించారు. అందులో రౌడీ రాముడు పాత్రను ప్రసాద్ పోషించగా ప్రకాశరావు హీరోగా, జి.వరలక్ష్మి హీరోయిన్ గా నటించారు. చిత్రవిజయం ప్రసాద్ కు దర్శకుడిగా, మంచి నటుడిగా పేరు సంపాదించి పెట్టింది. తరవాత మీర్జాపురం రాజా సమర్పణలో నాగయ్య, కృష్ణవేణి నటించిన ‘మనదేశం’ (1949) చిత్రానికి ప్రసాద్ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. నటరత్న ఎన్.టి. రామారావుని ఈ చిత్రంలోనే ఇనస్పెక్టర్ పాత్రలో ప్రసాద్ పరిచయం చేశారు. ‘మనదేశం’ సినిమాలో ప్రసాద్ కు మంచి పేరొచ్చింది. వెంటనే విజయాసంస్థ అధిపతులు నాగిరెడ్డి-చక్రపాణి తమ తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ (ట్యాగ్ లైన్… ఇరుగు పొరుగుల కథ-1950) సినిమా నిర్మించనెంచి ప్రసాద్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. చక్రపాణి సమకూర్చిన కథ, సంభాషణలతో సినిమా తయారైంది. ఎన్.టి. రామారావు ను హీరోగా, ఆరోజుల్లో రేడియో నాటికల్లో పాల్గొంటున్న జానకిని హీరోయిన్ పాత్రకు తీసుకున్నారు. ‘మనదేశం’ చిత్రంలో చిన్న పాత్ర పోషించిన ఎస్.వి. రంగారావును ‘సున్నం రంగడు’ పాత్రలో విలన్ గా ప్రవేశపెట్టారు. చిత్రం ఆర్ధికంగా విజయం సాధించకపోయినా దర్శకుడిగా ప్రసాద్ పేరును నిలబెట్టింది. ఆపై సాధనా వారి ‘సంసారం’ (1950) సినిమాకు ప్రసాద్ దర్శకత్వం వహించారు. అందులో రామారావు, నాగేశ్వరరావు ఇద్దరూ హీరోలే. అక్కినేనికి సాంఘిక చిత్రాల హీరోగా పేరుతెచ్చిన చిత్రం ‘సంసారం’. అందులోనే హీరోయిన్ పుష్పలత స్నేహితురాళ్ళలో ఒకరిగా సావిత్రి తెరంగేట్రం చేసింది. సినిమా బాగా ఆడింది. తరవాత విజయా వారు ప్రసాద్ దర్శకత్వంలో ‘పెళ్ళిచేసిచూడు’ (1952) చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఎన్టీఆర్, జి. వరలక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా విజయవంతం కావడంతో తరవాత ప్రసాద్ అంజలి పిక్చర్స్ వారి ‘పరదేశి’ (1953), అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మాతగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు నిర్మించిన ‘పెంపుడు కొడుకు’ (1953) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘పరదేశి’ ద్విభాషా చిత్రంలో అక్కినేనిచేత వయసుమళ్ళిన పాత్ర పోషింపజేయడమే కాకుండా హిందీ చలనచిత్ర పితామహుడు వి. శాంతారాం సహకారంతో శకుంతల నృత్య దృశ్యాన్ని ఇందులో ప్రవేశపెట్టారు. ‘పెంపుడు కొడుకు’ చిత్రంలో శివాజీ గణేశన్ హీరోగా నటించగా పుష్పవల్లి హీరోయిన్ వేషం వేసింది. అందులో ఒక పేదవాడి పాత్రను ప్రసాద్ పోషించారు. ‘పరదేశి’, ‘పెంపుడు కొడుకు’ సినిమాలు గొప్పగా ఆడలేదు. తరవాత వచ్చిన సినిమా ప్రసాద్ పేరును ఆకాశానికి యెత్తేసింది. అదే ‘రాసమణి గరల్స్ స్కూల్’ పేరుతో రవీంద్రనాథ్ టాగూర్ రాసిన కథకు మార్పులుచేసి చక్రపాణి తీర్చిదిద్దిన విజయా వారి హాస్యప్రధాన చిత్రం ‘మిస్సమ్మ’ (1955). తొలుత తెలుగు, తమిళంలో నిర్మించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఎ.వి.ఎం వారు హిందీలో మీనాకుమారి హీరోయిన్ గా ‘మిస్ మేరి’ పేరుతో పునర్నిర్మిస్తే ఆ చిత్రానికి కూడా ప్రసాదే దర్శకత్వం వహించారు. తరవాత నిర్మాత ఆనంద్ నిర్మించతలపెట్టిన ’ఇలవేలుపు’ (1956) చిత్రానికి తన శిష్యుడు యోగానంద్ కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి నిర్మాణ పర్యవేక్షణ గావించారు. ఇదే చిత్రాన్ని రాజకపూర్, మీనాకుమారిలతో ‘శారద’ పేరుతో తొలిసారి హిందీలో నిర్మించి దర్శకత్వం వహించి ప్రసాద్ విజయం సాధించారు. తరవాత విజయా వారి ‘అప్పుచేసి పప్పుకూడు’ (1959) హాస్యరస సినిమాకి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరవాత ప్రసాద్ తెలుగు సినిమాల దర్శకత్వానికి దూరమయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి తెలుగు చిత్రం ఇదే. అయితే తన ఆఖరి తమ్ముడు, ఎడిటర్ అక్కినేని సంజీవికి దర్శకత్వ బాధ్యతలు కట్టబెడుతూ 1965 లో తెలుగులో ‘ఇల్లాలు’ చిత్రాన్ని నిర్మించారు.

ఇంటగెలిచి దర్శకనిర్మాతగా ఇతర భాషల్లోకి…
‘అప్పుచేసి పప్పుకూడు’ చిత్రం తరవాత హిందీలో ‘చోటే బెహన్’ (1959- తెలుగులో ఆడపడుచు), ‘బేటీ బేటా’ (1964-తెలుగులో సంతానం) హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, మధ్యలో ‘తాయిల్లపిళ్ళై’ (1961), ‘ఇరువుర్ ఉళ్ళం’ (1963) తమిళ సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. నిర్మాతగా వ్యవహరిస్తూ తన ప్రధమ శిష్యుడైన తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘ససురాల్’ (1961-తెలుగులో ఇల్లరికం), ‘హమ్ రాహీ’ (1963- తెలుగులో భార్యాభర్తలు ) వంటి హిందీ చిత్రాలను నిర్మించారు. 1966లో తెలుగులో వచ్చిన ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ సినిమాను ‘దాదిమా’ పేరుతో, ‘బ్రతుకుతెరువు’ చిత్రాన్ని ‘జీనేకి రాహ్’ (1969) పేరుతో, ఎన్టీఆర్ చిత్రం ‘తల్లా పెళ్ళామా’ చిత్రాన్ని ‘బిదాయి’ (1974) పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు. అలాగే ‘మూగమనసులు’ చిత్రాన్ని హిందీలో ‘మిలన్’ (1967) పేరుతో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, ‘రాజూ-పేద’ చిత్రాన్ని ‘రాజా అవుర్ రంక్’ (1968) పేరుతో ప్రత్యగాత్మ దర్శకత్వంలో, ‘పునర్జన్మ’ చిత్రాన్ని ‘ఖిలోనా’ (1970 ) పేరుతో చందర్ వోహ్రా దర్శకత్వంలో నిర్మించారు. అలాగే ప్రసాద్ ప్రొడక్షన్స్ నుంచి 1975లో ‘ప్రియవిడై’ అనే చిత్రాన్ని తమిళంలో, ‘మనె బెళగిద సోసే’ అనే చిత్రాన్ని కన్నడంలో నిర్మించారు. అలా 1996 వరకు ఓ డజను సినిమాలను నిర్మించడం జరిగింది. వాటిలో చందర్ వోహ్రా దర్శకత్వంలో ‘ఉదార్ కా సిందూర్’ (1976), స్వీయ దర్శకత్వంలో ‘జయ్-విజయ్’ (1977- తెలుగులో చిక్కడు-దొరకడు), దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘ఏ కైసా ఇన్సాఫ్’ (1980-తెలుగులో న్యాయం కావాలి). కె. బాలచందర్ దర్శకత్వంలో ‘ఏక్ దూజే కేలియే’ (1981-తెలుగులో మరోచరిత్ర), చందర్ వోహ్రా దర్శకత్వంలో ‘మేరా ఘర్ మేరా బచ్చే’ (1985), క్రాంతికుమార్ దర్శకత్వంలో ‘స్వాతి’ (1986-తెలుగులో స్వాతి) హిందీ చిత్రాలను చెప్పుకోవాలి. బెంగాలి, ఒరియా, మలయాళం భాషల్లో కూడా ప్రసాద్ కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది. దర్శకుడిగా ప్రసాద్ చివరి సినిమా ‘జయ్-విజయ్’. అలాగే మూడు లఘుచిత్రాలను కూడా ప్రసాద్ నిర్మించడం జరిగింది. “నేను పడ్డ కష్టాలన్నీ బొంబాయిలోనే పడ్డాను. నేర్చుకోవలసింది కూడా అక్కడే నేర్చుకున్నాను. బొంబాయి నాకు ఓర్మిని నేర్పింది. నా జీవితం అతి సామాన్యం. ఒక ధ్యేయంతో శ్రమించాను, కృషి చేశాను. ఆ అనుభవాలే పాఠాలు నేర్పాయి. నా విజయాలకు ముఖ్య కారణం అదే” అని ప్రసాద్ వినమ్రంగా చెప్పుకునేవారు.

సేవలు… సదుపాయాలు…
1955 ప్రాంతాల్లో ‘సంసారం’ చిత్రాన్ని నిర్మించిన రంగనాథదాస్ మద్రాసులో ఒక సినిమా స్టూడియో కడదామని మొదలుపెట్టి, ఆర్ధిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. దాన్ని ఎల్.వి. ప్రసాద్ కు ఇవ్వజూపారు. అలా ప్రసాద్ స్టూడియో అక్కడ వెలసింది. ప్రసాద్ రెండవ కుమారుడు రమేష్ అమెరికాలో విద్యనభ్యసించి వచ్చి ఆ స్టూడియో బాధ్యతలను నిర్వహిస్తునారు. హైదరాబాదులో ఫిలిం లేబొరేటరీ (ప్రాసెసింగ్ యూనిట్) స్థాపించి విదేశాలలో వున్న ఆధునిక సదుపాయాలతో సినిమా ప్రింట్లు వేయించుకునే అవకాశం కల్పించారు. ఫిలిం & టెలివిజన్ అకాడమీ స్థాపించారు. ఎన్.టి.ఆర్ మార్గ్ లో మల్టిప్లెక్స్ సినిమాహాలు, మాల్ నిర్మించారు. ‘సర్వేంద్రియాణాంనయనం ప్రదానం’ అనే సూక్తికి అనుగుణంగా 1987లో బంజారాహిల్స్ లో ‘ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి’ ని నెలకొల్పారు. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఆ ఆసుపత్రి వుండే రోడ్డుకు ‘ఎల్.వి. ప్రసాద్ మార్గ్’ అని పేరు పెట్టారు. జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రసాద్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. “నేనుకంటి ఆసుపత్రి ఎందుకు స్థాపించానో తెలుసా? ప్రజలకు కళ్ళు బాగావుండి మరిన్ని సినిమాలు చూడాలని” అంటూ ఒకానొక సందర్భంలో ప్రసాద్ చమత్కరించారు.

సత్కారాలు…సన్మానాలు…
భారత ప్రభుత్వం 1983లో ప్రసాద్ కు ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బహుమతి ప్రదానం చేసింది. ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో 1981లో మొదటిసారి ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును ప్రవేశపెట్టినప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా తొలి అవార్డును ఎల్.వి.ప్రసాద్ కు బహూకరించారు. 2006లో భారత తంతి తపాలా శాఖ ఎల్.వి. ప్రసాద్ స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 1992లో ఫిలింఫేర్ సంస్థ ప్రసాద్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. 1987లో ఆంధ్రప్రదేశ్ కళా వేదిక ‘ఆంధ్రరత్న’ పురస్కారాన్ని అందజేసింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం వారు 1985లో ’కళాప్రపూర్ణ’ డాక్టరేట్ ప్రదానం చేశారు. 1983లో ఈనాడు సంస్థ నిర్వహించిన ‘సితార’ అవార్డుల ఉత్సవంలో ఎల్.వి. ప్రసాద్ కు ‘కళాతపస్వి’ బిరుదు ప్రదానంచేసి సత్కరించింది. దక్షిణ భారత టెక్నీషియన్స్ అసోసియేషన్ 1982లో ‘రామనాథ్ అవార్డు’ బహూకరించింది. 1980లో నాటి ఉపరాష్ట్రపతి ఎమ్. హిదయతుల్లా ఎల్.వి. ప్రసాద్ కు ‘ఉద్యోగపత్ర’ అవార్డును ప్రదానం చేశారు. 1979లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ‘రాజా శాండో మెమోరియల్ అవార్డు’ ను బహూకరించారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ చేతులమీదుగా ‘లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్’ అవార్డును అందుకున్నారు. 86 ఏళ్ళ వయసులో 22 జూన్ 1994 న ఎల్వీ ప్రసాద్ సహజ మరణం పొందారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap