ఎల్వీ ప్రసాద్ గారి వల్లే నాకు ఈ స్థాయి – కృష్ణంరాజు

జనవరి 17న హైదరాబాద్ లో ఎల్వీ ప్రసాద్ 112వ జయంతి
ఎల్వీ ప్రసాద్ గారి జయంతి సభలో రెబల్ స్టార్ కృష్ణంరాజు

భారత చలనచిత్ర పితామహుడు, మూకీ యుగం నుండి డిజిటల్ మూవీస్ వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా, ఫిలిం ల్యాబ్ అధినేతగా, భారత సినీ పరిశ్రమ మార్గదర్శకుడుగా నిలిచిన ఎల్వీ ప్రసాద్ 112వ జయంతి జనవరి 17న హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు హాజరవగా, ఆయన సతీమణి శ్యామలాదేవి, తెలంగాణ రాష్ట్ర ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ఎండి కొవ్వూరి సురేష్ రెడ్డి, రమేష్ ప్రసాద్ తనయ శ్రీమతి రాధ పాల్గొన్నారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ “ఎల్వీ ప్రసాద్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సంపాదించినదంతా సినిమా పరిశ్రమ ఎదుగుదలకి, సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం రావడానికి ప్రతి పైసా ఖర్చు చేశారు. అవే కాకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. ఆయనతో నాకున్న అనుబంధంతోనే నేను ఇండస్ట్రీలో నిలబడటానికి కారణం అయ్యారు. ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఆ టైమ్ సినీ పరిశ్రమ వదిలేసి తిరిగి వెళ్లిపోదామనుకున్నాను. అదే సమయంలో ‘నేనంటే నేనే’ సినిమా కోసం డూండీగారు నన్ను సంప్రదించారు. ఆ సినిమాలో మూడు క్యారెక్టర్స్ ఉంటాయి. కృష్ణగారు, నాగభూషణంగారు రెండు పాత్రలు చేస్తున్నారు. మూడో పాత్ర కోసం నన్ను అడిగారు. అది కొంత నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కావడంతో నేను మొదట అంగీకరిం చలేదు. ఆ సమయంలో ఎల్వీ ప్రసాద్ గారిచ్చిన సలహావల్లే ‘నేనంటే నేనే’ చిత్రంలో నటించాను. ఆ చిత్రం విజయవంతం కావడం, ఆ తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డానికి దోహదపడిన ఎల్వీ ప్రసాద్ గారికి రుణపడి ఉంటాను. ఆ రోజు అయన నా వెన్ను తట్టకపోతే ఈ రోజు ఈ స్థాయిలో వుండేవాడిని కాదు” అన్నారు.
ప్రసాద్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ “నా జీవితంలో మా నాన్నగారితో గడిపిన క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలే. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయనకి పని తప్ప మరే ధ్యాస ఉండేది కాదు. ముఖ్యంగా సినిమానే ఆయన జీవితంగా మార్చుకున్నారు. ఆయన కమిట్మెంట్ చాలా గొప్పది. దాంతోనే అన్ని భాషలు మాట్లాడటం నేర్చుకున్నారు. అందరితో చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు. రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, కృష్ణ, కృష్ణంరాజు అంటే చాలా ఇష్టపడేవారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. తనను ఇంత గొప్పవాడిని చేసిన ప్రజలకి మంచి చేయాలని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి సినిమాల ద్వారా వచ్చిన కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ఆ డబ్బుతోనే ‘ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’ స్థాపించారు. ఈరోజు అది వరలోనే బెస్ట్ ఐ హాస్పిటల్ గా ఎంతో పేరు తెచ్చుకుంది. మా నాన్నగారు ఆ హాస్పిటల్ని స్థాపించారు అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 2006లో పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ఇప్పుడు ‘ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్’లో యానిమేషన్, గేమింగ్ వంటి వాటికి శిక్షణ ఇస్తున్నాం. త్వరలోనే ఇది కూడా మంచి స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను. అలాగే ‘బాహుబలి’లాంటి గొప్ప సినిమాలు మరిన్ని రావడానికి మా సపోర్ట్ ను కంటిన్యూ చేస్తాం” అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రసాద్
క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.

-మూర్తి

SA: