వానచుక్క… కన్నీటి చుక్క… కలిస్తే జాలాది!

(ఈరోజు జాలాది జయంతి – 9 ఆగస్టు 1932)
‘‘అందరూ రాయగలిగేవి… ఏ కొందరో రాయగలిగేవి’’ ఇలా సినిమా పాటలు రెండు రకాలనుకుంటే – జాలాది పాటలు – రెండో రకంలోకి వస్తాయి! వెదికి చూడండి.. మచ్చుకి ఒక్క బరువైన మాట కనిపిస్తే ఒట్టు! జాలాది పాట వింటున్నప్పుడు నిఘంటువులు నిద్రపోతాయి. అన్వయాల కోసం ఆలోచించాల్సిన పని తప్పి, మెదళ్లు సేదతీరుతాయి. టెంకకి టెంక… గుజ్జుకు గుజ్జు.. దేనికది వేరేచేసి, నోటికందించిన మామిడి రసాల్లా ఉంటాయా పాటలు!

‘‘మరీ ఇంత తేలిగ్గానా!’’ అనిపిస్తాయిగానీ లోతుగా ఆలోచిస్తే ఇలాంటి పాటలు అందరూ రాయలేరు. దిగుడు బావిలో నీళ్లు పైకి తేవడం ఎంత కష్టమో, మరీ అంతలా కిందకు దిగి జీవద్బాషలో పాట రాయడం అంత కష్టం. కానీ జాలాదికి అదెంతో సులభం. తాను రాసిన ప్రతీ పాటలోనూ తనకు అబ్బిన ఆ ‘సులభ ప్రతిభ’ను చూపించారాయన. అదెంత సులభమంటే ‘గాలి వానకి గాలి, చూరు కింద ఖాళీ చూసి చొరవగా చుట్టేసినంత సులభం’. ‘దీపాన్ని దిగమింగేసి’, ‘నడికొప్పును లేపేసి’, ‘గుండెలో గతుక్కుగతుక్కు’మని కుదిపేసినంత సహజం. 1976లో ‘పల్లెసీమ’లో ‘సూరట్టుకుని సితుక్కు సితుక్కు’మని జారగానే ఎవరీ ‘వానచుక్క’ అని తెలుగు సినిమా పాటల అభిమానులు ఆశ్చర్యపోయారు. ‘ఆడి జిమ్మడిపోను’ అంటూ వాన పోకిరోణ్ణి తిట్టడంలోని జానపద శృంగారాన్ని జనం ఆస్వాదించారు. ‘పడమటేపు పడకేసి సూరిగాడు దొరికినట్లు’ అని రాయాలంటే జనపదాన్ని సిరాగా చేసుకోవాలి. ఆ సిరా జాలాదికే దక్కింది.

ఆ తర్వాత రెండేళ్లకి ప్రాణమంత ఖరీదైన పాటతో జాలాది నిశ్శబ్దంగా విరుచుకుపడ్డారు. మట్టిపొయ్యికి ఎర్రమన్ను అలికినంత సహజంగా, పేదింటి గడపకి పసుపు రాసినంత సుందరంగా ప్రతీ పంక్తిలోనూ జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తూ, చిరకాలం నిలిచిపోయే తాత్వికతను ఆవాహన చేస్తూ ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు’ రాశారు. ఆ పాటలో ఏ పంక్తీ, ఏ పదం పొల్లు కాదు! ఓ పరిశోధన గ్రంథం రాయొచ్చునిపించేంత గొప్ప పాట! ‘‘పలుపుతాడు.. పసుపుతాడు… పాడి ఆవు.. ఆడదాయె’’లాంటి అత్యంత సామాన్యమైన మాటలతో శ్రోతను ‘పొగిలి పొగిలి ఏడ్చే’లా చేసిందా పాట. పరస్పర విరుద్ధమైన పద చిత్రాల్ని ఇరుగుపొరుగుల్లో నిలబెట్టి, శ్రోత ఊపిరి తీసుకునేలోగా గుండె గూడుపట్లను కుదిపేయడం జాలాదికి మాత్రమే తెలిసిన విద్య. అందుకోసం ఆయన భావుకతా వీధుల్లోకి ఎగిరి వెళ్లాడు.

నేల విడిచి సాము చెయ్యకుండా జీవితంలోకి యోగిలాగా తొంగిచూస్తాడు. విరాగిలా నవ్వుతూ, సముద్రపు ఒడ్డున గవ్వలు ఏరుకున్నట్లుగా నలుగురికీ తెలిసిన తేలిక మార్గాల్నే తెలివిగా ఏంచుకుంటాడు. ‘‘చేతి చిటికెన వేళ్లు కలిస్తే కల్యాణం.. కాలి బొటన వేళ్లు కలిస్తే నిర్యాణం’’, ‘‘కళ్లు తెరిస్తే ఉయ్యాల, కళ్లు మూస్తే మొయ్యాల’’లాంటివి రాయడానికి మనిషిలో యోగం ఉండాలి. మనసు నిండా వైరాగ్యం కావాలి. ప్రపంచ సాహిత్యంలోని మరే భాషలో ఇలాంటివి రాసినా – పులిట్జర్లూ, నోబెల్ బహుమతులూ ఇవ్వాలంటూ ప్రశంసలు వెల్లువెత్తుతాయేమోగానీ ఆ భాగ్యం తెలుగువాడికి లేదు. ‘సేసేదీ పట్నవాసం..మేసేదీ పల్లెల గ్రాసం… పట్టపగలు దీపాల ఆ పట్నవాసం’ అంటూ పట్నవాసంలో మారుతున్న జీవనశైలిని కళ్లకు కట్టిన కలం పేరు.. జాలాది. తూర్పు వెళ్తున్న రైలులోంచి సందెపొద్దు అందాలున్న చిన్నదాన్నీ వీక్షించిందా కలం. ‘‘పుణ్యభూమి నా దేశం నమోనమామి’ అని రాసిన జాలాదే మరో భాషలో ఇలాంటి వాక్యాలు రాయడానికి ఏ దేశంలోనో ఈపాటికి జన్మించే ఉంటారు!

అవార్డులు… రివార్డులు…

ఎర్రమందారం సినిమాలో జాలాది రాసిన “యాలో యాల ఉయ్యాలా” పాటకు 1990 సంవత్సరానికి ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం లభించింది. మద్రాసు కళాసాగర్ సంస్థ ఉత్తమ గేయ రచయిత పురస్కారంతో జాలాదిని సత్కరించింది. విజయవాడ కల్చరల్ అసోసియేషన్ వారు 1957లో ‘కారుమేఘాలు’ నాటికకు ఉత్తమ బహుమతి ప్రదానం చేశారు. ఏలూరు ప్రభు చిత్ర అసోసియేషన్ వారు ‘నవరస కవి సామ్రాట్’ బిరుదుతో జాలాదిని సత్కరించారు. జాలాదికి ట్విన్ సిటీస్ కల్చరల్ అవార్డు, హైదరాబాదు ఫిలింఫేర్ అవార్డు లభించింది. 1987లో మద్రాసు కళాసాగర్ సంస్థ అవార్డు ప్రదానం చేసింది. అదే సంవత్సరం సినీ హెరాల్డ్ వారు జాలాదిని ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేశారు. ఆంధ్రావిశ్వవిద్యాలయం యాజమాన్యం 2008లో జాలాదికి ‘కళాప్రపూర్ణ’ బిరుదు ప్రదానం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జాలాదిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో సభ్యునిగా నియమించింది. 1991, 1995 సంవత్సరానికి జాలాది నంది అవార్డుల కమిటీలో సభ్యునిగా వ్యవహరించారు.

వృత్తిరీత్యా డ్రాయింగ్ టీచర్ గా పనిచేసిన జాలాది రాజారావుగారు 14 అక్టోబరు 2011 కన్నుమూశారు.

1 thought on “వానచుక్క… కన్నీటి చుక్క… కలిస్తే జాలాది!

  1. నిజమండీ..
    వానచుక్కలు
    గుమిగూడితే వరదలై పారతాయి.
    అలాగే…
    కన్నీటి చుక్కలూను !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap